పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని రాజ్యాభిషేకము
- ఉపకరణాలు:
ధరణీసురులును మంత్రులుఁ
బరివారము హితులుఁ బ్రజలు బాంధవులును సు
స్థిరమతి నా బాలకునిం
గర మనురాగమున రాజుగాఁ జూచి రిలన్.
టీకా:
ధరణీసురులును = బ్రాహ్మణులు; మంత్రులున్ = మంత్రులు; పరివారమున్ = సేవకులు; హితులున్ = స్నేహితులు; ప్రజలున్ = ప్రజలు; బాంధవులునున్ = బంధువులు; సుస్థిరమతిన్ = నిశ్చలమైన మనసుతో; ఆ = ఆ; బాలకునిన్ = పిల్లవానిని; కరము = మిక్కిలి; అనురాగమునన్ = ప్రీతితో; రాజుగా = రాజు అగునట్లు; చూచిరి = చూసిరి; ఇలన్ = నేలపైన.
భావము:
బ్రాహ్మణులు, మంత్రులు, పరివారం, హితులు, ప్రజలు, బంధువులు అనురాగాతిశయంతో చిన్నపిల్లవాడు అయిన ఆ ఋషభుని తమ రాజు గానే భావించారు.
- ఉపకరణాలు:
పురుహూతుఁ డతని మహిమలు
సరగున విని చిత్తమునకు సహ్యము గామిం
బరికించి ఋషభఁ డేలెడి
ధరణి ననావృష్టి మిగుల దట్టము చేసెన్.
టీకా:
పురుహూతుడు = ఇంద్రుడు; అతని = అతని యొక్క; మహిమలున్ = గొప్పదనము; సరగునన్ = శ్రీఘ్రముగా; విని = విని; చిత్తమున్ = మనసున; కున్ = కు; సహ్యము = సహింప గలది; కామిన్ = కాకపోవుట; పరికించి = గమనించుకొని; ఋషభుడు = ఋషభుడు; ఏలెడి = పరిపాలించెడి; ధరణిన్ = భూమిపైన; అనావృష్టిన్ = వానలు లేకపోవుటను; మిగులన్ = మిక్కిలి; దట్టముగా = గట్టిగా; చేసెన్ = చేసెను.
భావము:
ఇంద్రుడు ఋషభుని మహిమలు విని సహింపలేక అతడు పరిపాలించే రాజ్యంలో వానలు పడకుండా చేసాడు.
- ఉపకరణాలు:
అది యెఱింగి ఋషభుఁ డంతట యోగ మా
యా బలంబు కతన నఖిల రాజ్య
మందుఁ గురియఁ జేసె నత్యంత సంపూర్ణ
వృష్టి దినదినంబు వృద్ధిఁ బొంద.
టీకా:
అది = దానిని; ఎఱింగి = తెలిసి; ఋషభుడు = ఋషభుడు; అంతటన్ = అంతట; యోగమాయా = యోగమాయ యొక్క; బలంబున్ = బలము; కతన = వలన; అఖిల = సమస్తమైన; రాజ్యము = రాజ్యము; అందున్ = అంతటను; కురియన్ = కురియునట్లు; చేసెను = చేసెను; అత్యంత = అత్యధికమైన; సంపూర్ణ = నిండు; వృష్టిన్ = వర్షమును; దినదినంబున్ = ప్రతిదినము; వృద్ధి = అధికము; పొందన్ = అగునట్లు.
భావము:
ఇంద్రుని ఆ దౌష్ట్యాన్ని ఋషభుడు గుర్తించి తన యోగమాయతో దినదినాభివృద్ధిగా సర్వ సమృద్ధిగా రాజ్యమంతట వర్షం కురిపించాడు.
- ఉపకరణాలు:
ఇట్లు ఋషభుండు పురందరుండు చేయు దౌష్ట్యంబునకు నవ్వి యజనాభం బను తన మండలంబు సుభిక్షంబుగాఁ జేసె; నాభియుం దన కోరిన చందంబునం బుత్రుండు జనియించి వర్థిల్లుటకు సంతసిల్లి తనచేత నంగీకరింపంబడు నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుని మాయా విలసితంబునం జేసి "బాలకా! నా తండ్రి!" యని మోహంబున నుపలాలించుచుఁ బ్రజానురాగంబున సర్వసమ్మతుం డయిన పుత్రుని సమయసేతు రక్షణంబునకుఁ బూజ్యంబయిన రాజ్యంబునం దభిషిక్తుం జేసి భూసురులకుఁ బ్రధానవర్గంబునకు నప్పగించి మేరుదేవిం గూడి నరనారాయణ స్థానం బయిన బదరికాశ్రమంబునకుం జని యచ్చట మహాయోగసమాధిచే నరనారాయణాఖ్యుండుఁ బురుషోత్తముండు నగు వాసుదేవు నారాధించి క్షీణదేహుండై యా నాభి హరి తాదాత్మ్యంబు నొందె; నంత.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; ఋషభుడు = ఋషభుడు; పురంధరుడు = ఇంద్రుడు; చేయు = చేసెడి; దౌష్ట్యంబున్ = దుష్టత్వమున; కున్ = కు; నవ్వి = హేళనగా నవ్వి; అజనాభంబున్ = అజనాభము {అజనాభము - ఒక రాష్ట్రము పేరు, అజము (మేషము) నాభము (ప్రముఖమైనవి), రాశిచక్రము}; అను = అనెడి; తన = తన యొక్క; మండలము = దేశము; సుభిక్షంబు = సుసంపన్నము {సుభిక్షము - సు (చక్కటి) భిక్షము దొరకునది, సుసంపన్నము}; కాన్ = అగునట్లు; చేసెన్ = చేసెను; నాభియున్ = నాభి కూడ; తన = తను; కోరిన = కోరిన; చందంబునన్ = విధముగా; పుత్రుండు = కుమారుడు; జనియించి = పుట్టి; వర్ధిల్లుట = పెరుగుట; కున్ = కు; సంతసిల్లి = సంతోషించి; తన = తన; చేతన్ = చేత; అంగీకరింపంబడు = సమ్మతింపబడెడి; నరలోక = భూలోకపు; ధర్మంబున్ = ధర్మములు; కల = కలిగిన; పుండరీకాక్షుని = నారాయణుని; మాయా = మాయ యొక్క; విలసితంబునన్ = విలాసము; చేసి = వలన; బాలకా = పిల్లవాడా; నాతండ్రి = నాయనా; అని = అని; మోహంబునన్ = మోహములోపడి; ఉపలాలించుచున్ = బుజ్జగించుచు; ప్రజా = సంతానము ఎడ; అనురాగంబునన్ = అనురాగముతో; సర్వ = అందరకును; సమ్మతుండు = అంగీకారమైనవాడు; అయిన = అయిన; పుత్రుని = కుమారుని; సమయ = ఆచారముల; సేతు = కట్టుబాట్లకు; రక్షణంబున్ = కాపాడుటకు; పూజ్యంబున్ = ఉత్తమమైనది; అయిన = అయినట్టి; రాజ్యంబున్ = రాజ్యము; అందున్ = అందు; అభిషిక్తుంజేసి = పట్టముగట్టి; భూసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ప్రధాన = మంత్రి; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; అప్పగించి = అప్పజెప్పి; మేరుదేవిన్ = మేరుదేవితో; కూడి = కలసి; నరనారాయణ = నరనారాయణుని; స్థానంబున్ = స్థలము; అయిన = అయిన; బదరికా = బదరిక అనెడి; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; చని = వెళ్ళి; అచ్చటన్ = అచ్చట; మహా = గొప్ప; నరనారాయణ = నరనారాయణుడు యనెడి; ఆఖ్యుండ = పేరు గలవాడు; పురుషోత్తముండు = విష్ణువు; అగు = అయిన; వాసుదేవునిన్ = విష్ణుమూర్తిని; ఆరాధించి = సేవించి; క్షీణ = చిక్కిపోయిన; దేహుండు = శరీరము గలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; నాభి = నాభి; హరి = విష్ణుని; తాదాత్మ్యంబున్ = యందు కలసిపోవుటను; ఒందెన్ = పొందెను; అంతన్ = అంతట.
భావము:
ఈవిధంగా దేవేంద్రుని దుర్బుద్ధికి ఋషభుడు నవ్వుకొని అజనాభం అనే పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని సుభిక్షం చేసాడు. నాభి తాను కోరుకొనినట్లు కొడుకు పుట్టడం, పెరగడం చూచి చాల సంబరపడ్డాడు. విష్ణువు మాయ కారణంగాను, భూలోక ధర్మాల కనుగుణంగాను నాభి తన కుమారుణ్ణి “నా తండ్రీ!” అంటూ వ్యామోహంతో ముద్దాడాడు. ప్రజల అభిమానం చూరగొన్నవాడు, అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యుడు అయిన తన కుమారుడు రాజ్యపాలనకు తగినవాడని భావించి పట్టం కట్టాడు. బ్రాహ్మణులకు, మంత్రి వర్గానికి అతణ్ణి అప్పగించి భార్య మేరుదేవితోకూడి నరనారాయణులకు నిలయమైన బదరికాశ్రమం చేరుకున్నాడు. అక్కడ నరనారాయణ స్వరూపుడు, పురుషోత్తముడు అయిన వాసుదేవుని తదేక ధ్యానంతో ఆరాధించాడు. క్రమంగా శరీరం పట్టుతప్పగా చివరకు సతీసమేతుడైన నాభి శ్రీహరితో తాదాత్మ్యం పొందాడు.
- ఉపకరణాలు:
సరసత నే నృపాలకుని జన్నమునందును భూసురోత్తముల్
సరసిజనాభునిం దగఁ బ్రసన్నతఁ బెట్టిన నంత మెచ్చి యీ
శ్వరుఁడు దనంత గర్భమున వచ్చి తనూభవుఁడై జనించె, నా
నరపతి నాభికిన్ సరి యనం దగునే నరనాథ! యన్యులన్.
టీకా:
సరసతన్ = చక్కగా; ఏ = ఏ; నృపాలకుని = రాజు యొక్క {నృపాలకుడు - నృ (నరులను) పాలకుడు (పరిపాలించెడివాడు), రాజు}; జన్నము = యజ్ఞము; అందును = సమయములో; భూసురుల్ = బ్రాహ్మణులలో; ఉత్తముల్ = ఉత్తములు; సరసిజనాభునిన్ = విష్ణుని {సరసిజనాభుడు - సరసిజము (పద్మము) నాభుడు (నాభిన గలవాడు), విష్ణువు}; తగన్ = అవశ్యము; ప్రసన్నతన్ = అనుగ్రహమున; పెట్టిన = కలిగించిన; అంతన్ = అంతట; మెచ్చి = మెచ్చుకొని; ఈశ్వరుడున్ = విష్ణువు; తనంత = తనంతతనే; గర్భమునన్ = గర్భములో; వచ్చి = చేరి; తనూభవుడు = పుత్రుడు {తనూభవుడు - శరీరమున పుట్టినవాడు, పుత్రుడు}; ఐ = అయ్యి; జనించెన్ = పుట్టెను; ఆ = ఆ; నరపతి = రాజు {నరపతి - నరులకు ప్రభువు, రాజు}; నాభి = నాభి; కిన్ = కి; సరి = సాటి; అనన్ = అనుటకు; తగునే = తగునా ఏమి; నరనాథ = రాజ {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; అన్యులన్ = ఇతరులను.
భావము:
ఏ రాజు యజ్ఞంలో బ్రాహ్మణోత్తములైన ఋత్విక్కులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారో, ఏ రాజు భార్య గర్భంలో నుంచి ఈశ్వరుడు తనంత తానుగా కొడుకుగా పుట్టాడో అటువంటి మహారాజు నాభికి సాటి కాగల రాజు లెవరూ భూమండలంలో లేరు.
- ఉపకరణాలు:
అంత.
టీకా:
అంతన్ = అంతట.
భావము:
అప్పుడు…