పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వర్షాధిపతుల జన్మంబు

 •  
 •  
 •  

5.1-25-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కుం డిట్లు విరక్తుఁడైనను దదాజ్ఞం జేసి యాగ్నీధ్రుఁ డే
పు ధర్మప్రతిపాలనుం డగుచు జంబూ ద్వీపమున్నేలుచుం
సత్పుత్రులమాడ్కి నెల్ల ప్రజలం దాత్పర్య చిత్తంబునన్
తం బ్రోచె ననేకకాల మిలఁ బ్రఖ్యాతంబుగా భూవరా!

టీకా:

జనకుండు = తండ్రి; ఇట్లు = ఈ విధముగ; విరక్తుండు = వైరాగ్యము గలవాడు; ఐననున్ = కాగా; తత్ = అతని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; చేసి = వలన; ఆగ్నీధ్రుడ = ఆగ్నీధ్రుడు; ఏపున = అతిశయముతో; ధర్మ = ధర్మమును; ప్రతిపాలనుండు = పరిపాలించువాడు; అగుచున్ = అగుచూ; జంబూద్వీపమున్ = జంబూద్వీపమును; ఏలుచున్ = ఏలుతూ; తన = తన యొక్క; సత్పుత్రుల = మంచి కొడుకులను; మాడ్కిన్ = వలె; ఎల్లన్ = అఖిలమైన; ప్రజలన్ = ప్రజలను; తాత్పర్య = వారి యందు లగ్నమైన; చిత్తంబునన్ = మనసుతో; ఘనతన్ = గొప్పదనముతో; ప్రోచెన్ = కాపాడెను; ఏకకాలము = ఒక సమయమున; ఇలన్ = నేలపైన; ప్రఖ్యాతంబుగాన్ = ప్రసిద్ధముగా; భూవరా = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}.

భావము:

“పరీక్షిన్మహారాజా! తండ్రి అయిన ప్రియవ్రతుడు విరక్తుడు కాగా అతని ఆజ్ఞప్రకారం అతని కుమారుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మమార్గంలో పరిపాలిస్తూ ప్రజలందరినీ కన్నబిడ్డల వలె లాలిస్తూ చాలాకాలం రాజ్యం చేసి ప్రఖ్యాతి గడించాడు.

5.1-26-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లగ్నీధ్రుండు రాజ్యంబు చేయుచు నొక్కనాఁడు పుత్రకాముండై మందరాద్రి సమీపంబున నఖిలోపచారంబుల నేకాగ్రచిత్తుండై యర్చించినం గమలసంభవుండు సంతసిల్లి తన సమ్ముఖంబున సంగీతంబు చేయు పూర్వచిత్తి యను నప్సరోంగనం బంపుటయు నా యప్సరాంగన చనుదెంచి రమణీయ వివిధ నిబిడ విటపి విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూఢస్థల విహంగమ మిథునోచ్ఛార్యమాణ షడ్జాది స్వరంబులచే బోధ్యమాన సలిలకుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబు లయిన నిర్మలోదక కమలాకరంబులు గల తదాశ్రమోపవనంబు నందు విహరించుచు విలాస విభ్రమ గతివిశేషంబులం జలనంబు నొందు స్వర్ణ చరణాభరణస్వనం బన్నరదేవకుమారుం డాలించి యోగసమాధిం జేసి ముకుళితనేత్రుండై యుండి యల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మధుకరాంగనయుంబోలెఁ బుష్పాఘ్రాణంబు చేయుచు దేవమానవుల మనోనయనంబుల కాహ్లాదంబు బుట్టించుచున్నగతి విహార వినయావలోకన సుస్వరావయవంబుల మన్మథ శరపరంపరంల నొందించుచు ముఖకమల విగళితామృత సమానహాసభాషణామోదమదాంధంబు లయిన మధుకర మిథునంబుల వంచించి, శీఘ్ర గమనంబునం జలించు కుచ కచమేఖలలు గల దేవిం గనుంగొని చిత్తచలనంబు నొంది మన్మథపరవశుండై జడుని చందంబున నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అగ్నీధ్రుండు = అగ్నీధ్రుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచూ; ఒక్కనాడు = ఒక దినమున; పుత్ర = పుత్ర సంతానమును; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; మందర = మందర యనెడి; అద్రి = పర్వతము; సమీపంబునన్ = దగ్గర; అఖిల = సమస్తమైన; ఉపచారంబులన్ = ఉపచారములను; ఏకాగ్ర = ఏకాగ్రత గల; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; అర్చించినన్ = సేవించగా; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమల సంభవుడు - కమలమున సంభవుడు (జన్మించినవాడు), బ్రహ్మదేవుడు}; సంతసిల్లి = సంతోషించి; తన = తన యొక్క; సమ్ముఖంబునన్ = ఎదుట; సంగీతంబు = సంగీతమును; చేయు = పాడెడి; పూర్వచిత్తి = పూర్వచిత్తి {పూర్వచిత్తి - ముందు జాగ్రత్త}; అను = అనెడి; అప్సర = అప్సరసయైన; అంగనన్ = స్త్రీని; పంపుటయున్ = పంపగా; ఆ = ఆ; అప్సరః = అప్సరసయైన; అంగన = స్త్రీ; చనుదెంచి = వచ్చి; రమణీయ = మనోహరమైన; వివిధ = రకరకముల; నిబిడ = నిండి యున్న; విటపి =వృక్షములు {విటపి – విటపములు (కొమ్మలు) గలది, చెట్టు}; విటప = చిగురించిన కొమ్మలు తోను; సమాక్లిష్ట = అల్లుకుపోయిన; సమీప = దగ్గరలోనున్న; సు = మంచి; వర్ణ = రంగులు గల; లతికా = తీగలతోను; ఆరూఢ = అల్లుకుపోయిన; స్థల = ప్రదేశమున; విహంగమ = పక్షుల యొక్క; మిథున = జంటల; ఉచ్ఛార్యమాణ = పలుకబడుతున్న; షడ్జాది = షడ్జమము మొదలగు సప్త స్వరములవలెనున్న; స్వరంబుల్ = స్వరములు; చేన్ = వలన; బోధ్యమాన = తెలియబడుతున్న; సలిలకుక్కుట = నీటికోళ్ళు; కారండవ = పొట్టిబాతులు; బక = కొంగలు; కలహంస = కలహంసలు; ఆది = మొదలగు; విచిత్ర = చిత్రమైన; కూజిత = కూతలతో; సంకులంబు = సందడిగా ఉన్నది; అయిన = అయినట్టి; నిర్మల = స్వచ్ఛమైన; ఉదక = నీరు గల; కమలాకరంబులు = సరస్సులు; కల = కలిగిన; తత్ = ఆ; ఆశ్రమ = ఆశ్రమముయొక్త; ఉపవనంబున్ = పెరటితోట; అందున్ = లో; విహరించుచున్ = విహరిస్తూ; విలాస = విలాసవంతమైన; విభ్రమ = సంభ్రమము గల; గతి = నడకల; విశేషంబులన్ = విశేషములతో; చలనంబున్ = కదులుతున్న; ఒందు = పొందెడి; స్వర్ణ = బంగారు; చరణా = పాదముల; ఆభరణ = ఆభరణముల; స్వనంబున్ = శబ్దమును; నరదేవ = రాజు యొక్క {నరదేవుడు - నరులకు దేవుడు, రాజు}; కుమారుండు = పుత్రుడు; ఆలించి = విని; యోగసమాధిన్ = యోగసమాధిలో ఉండుట; చేసి = వలన; ముకుళిత = ముకుళించిన; నేత్రుండు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; ఉండి = కలిగి; అల్లన = మెల్లగా; కను = కనులను; విచ్చి = విప్పుకొని; చూచి = చూసి; తన = తనకు; సమీపంబునన్ = దగ్గరలోనున్న; మధుకర = తుమ్మెదలలో; అంగనయున్ = స్త్రీ; పోలెన్ = వలె; పుష్పా = పూలను; ఆఘ్రాణంబు = వాసనచూచుట; చేయుచున్ = చేయుచూ; దేవ = దేవతల; మానవుల = మానవుల యొక్క; మనః = మనసు అనెడి; నయనంబులు = కన్నులకు; ఆహ్లాదంబున్ = సంతోషమును; పుట్టించుచున్న = కలిగిస్తున్న; గతిన్ = నడకలు; విహార = విహరించుటలు; వినయ = వినయముగా; అవలోకన = చూచుట; సు = మంచి; స్వర = స్వరము; అవయవంబులన్ = అవయవములను; మన్మథ = మన్మథుని; శరః = బాణముల; పరంపరలన్ = వరుసలను; ఒందించుచున్ = తగిలించుతూ; ముఖ = మోము యనెడి; కమల = పద్మమునుండి; విగళిత = జాలువారుతున్న; అమృత = అమృతముతో; సమాన = సమానమైన; హాస = నవ్వుల; భాషణ = మాటలు; ఆమోద = స్వీకరించుట వలన; మద = మదించుటచే; అంధంబులు = కన్నుగాననివి; అయిన = అయినట్టి; = మధుకర = తుమ్మెద; మిథునంబులన్ = జంటలను; వంచించి = మించిపోయి; శ్రీఘ్ర = వేగవంతమైన; గమనంబున్ = కదలికతో; చలించు = చలించెడి; కుచ = స్తనముల; కచ = శిరోజములు; మేఖలలున్ = మొలనూలులు; కల = కలిగిన; దేవిన్ = స్త్రీని; కనుంగొని = చూసి; చిత్త = మనసు; చలనంబున్ = చలించుటను; ఒంది = పొంది; మన్మథ = మన్మథ ప్రభావమునకు; పరవశుండు = లొంగిపోయినవాడు; ఐ = అయ్యి; జడుని = తెలివిహీనుని; చందంబునన్ = వలె; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా ఆగ్నీధ్రుడు రాజ్యం చేస్తూ ఒకనాడు పుత్రసంతానం కోసం మందర పర్వత సమీపానికి వెళ్ళి అక్కడ అఖిలోపచారాలతో అచంచలమైన మనస్సుతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. బ్రహ్మదేవుడు సంతోషించి సత్యలోకంలో తన సమక్షంలో సంగీతం ఆలపించే పూర్వచిత్తి అనే అప్సరసను ఆగ్నీధ్రుని దగ్గరకు పంపాడు. ఆమె ఆగ్నీధ్రుడు ఉన్న ఆశ్రమ వాటికకు వచ్చింది. అక్కడ మనోహరంగా రకరకాలుగా నిండి ఉన్న చిగురు కొమ్మలు గల వృక్షాలను రంగురంగుల తీగలు అల్లుకున్నాయి. అటువంటి ప్రదేశంలో పక్షుల జంటలు షడ్జమం మొదలైన స్వరాలతో సందడి చేస్తున్నాయి. ఆ స్వరాలతో మేలుకొన్న నీటికోళ్ళు, బాతులు, కొంగలు, కలహంసలు మొదలైనవి తమ కూతలతో చిత్రమైన ధ్వనులు చేస్తున్నాయి. అటువంటి పక్షులతోను నిర్మలమైన నీటితోను నిండిన సరస్సులు కనువిందు చేస్తున్నాయి. అటువంటి ఆశ్రమ ఉపవనంలో ఆ అప్సరస విహరించడం మొదలుపెట్టింది. వంపుసొంపులతో ఒయ్యారంగా నడిచే ఆ అప్సరస నడకలకు తగినట్టుగా కదులుతున్న ఆమె బంగారు అందియల శబ్దాన్ని ఆగ్నీధ్రుడు విన్నాడు. యోగసమాధిలో కన్నులు మోడ్చి ఉన్న అతడు మెల్లగా కన్నులు విప్పి ఆడుతుమ్మెద వలె పూల సౌరభాన్ని ఆస్వాదిస్తున్న ఆ పూర్వచిత్తిని చూశాడు. ఆమె అందచందాలు దేవతలకు, మానవులకు కనులవిందులై మనస్సులను పరవశింప చేస్తున్నాయి. ఆమె ఒయ్యారపు నడకలు, విభ్రమ విహారాలు, వాలుచూపులు, కంఠ మాధుర్యం, అంగసౌష్ఠవం మన్మథుని శరపరంపరలను కురిపిస్తున్నాయి. ఆమె ముఖపద్మం నుండి మకరందం వంటి మందహాసం చిందుతున్నది. ఆమె పలుకుకు పరిమళాలను విరజిమ్ముతున్నాయి. ఆ సుగంధాలకు ముసురుకొని మై మరచిన తుమ్మెద జంటలను తప్పించికొని ఆ అప్సరస నడుస్తుంటే ఆ గమన వేగానికి ఆమె చనుగవ, జుట్టుముడి, మొలనూలు చలిస్తున్నాయి. అటువంటి పూర్వచిత్తిని చూచి ఆగ్నీధ్రుడు కామ పరవశుడై చలించిన చిత్తంతో మూర్ఖునిలాగా ఆమెతో ఇలా అన్నాడు.

5.1-27-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"సతి నీ వెవ్వతె వీ ప
ర్వమున కేమైనఁ గోరిచ్చిన వనదే
వో? శారదవో? రతి
తి పంచిన మాయవో? తస్సారమవో?

టీకా:

సతి = స్త్రీ; నీవు = నీవు; ఎవ్వతెవు = ఎవరివి; ఈ = ఈ యొక్క; పర్వతమున్ = పర్వతమున; కున్ = కు; ఏమైన = ఎదైన; కోరి = ఆశించి; వచ్చిన = వచ్చిన; వనదేవతవో = వనదేవతవేమో; శారదవో = శారదాదేవివేమో; రతిపతి = మన్మథునిచే; పంచిన = పంపించిన; మాయవో = మాయవేమో; తపస్ = తపస్సు యొక్క; సారమవో = పరమార్థమవేమో.

భావము:

“మగువా! నీ వెవరివి? ఈ పర్వతం దగ్గరికి ఏదైనా పనిమీద వచ్చిన వనదేవతవా? సరస్వతీ దేవివా? మన్మథుడు పంపిన మాయవా? నా తపః ఫలానివా?

5.1-28-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంజుఁ డెక్కుడించిన శరాసనమున్ ధరియించి యంత నా
యంజు వేఁట మానవమృగావళి సూటిగఁ నేచు దానవో?
రంగు నీ నిజాకృతి తెఱం గెఱుఁగంగ నిజంబు పల్కుమా
యంన నిన్నుఁ గన్గొనిన యంత ననంగుఁడు సందడించెడున్.

టీకా:

అంగజుడు = మన్మథుడు; ఎక్కుడించిన = ఎక్కుపెట్టిన; శరాసనమున్ = విల్లు; ధరియించి = ధరించి; అంతన్ = అంతట; ఆ = ఆ; అంగజువేట = మన్మథక్రీడకై {అంగజుడు - ఇంద్రియములందు పుట్టెడివాడు, మన్మథుడు}; మానవ = మానవులుయనెడి; మృగా = జంతువుల; ఆవళిన్ = సమూహమును; సూటిగన్ = గురిచూసి; యేచు = వేటాడెడి; దానవో = ఆమెవేమో; రంగు = మేలు; అగు = అయిన; ఈ = ఈ; నిజ = స్వంత; ఆకృతిన్ = ఆకారము; తెఱంగు = విధానము; ఎఱుగంగ = తెలియునట్లు; నిజంబున్ = నిజమును; పల్కుమా = తెలుపమా; అంగన = స్త్రీ; నిన్నున్ = నిన్ను; కన్గొనిన = చూసిన; అంతన్ = అంతట; అనంగుడు = మన్మథుడు {అనంగుడు – దేహము లేనివాడు, మన్మథుడు}; సందడించెడున్ = గోలచేయుచుండెను.

భావము:

అంగనా! మన్మథుడు ఎక్కుపెట్టిన విల్లును చేత ధరించి మన్మథ వేటలో ఈ అడవిలోని మానవ మృగాలను వేటాడుతున్నావా? నీ అసలు స్వరూపం నాకు స్పష్టంగా తెలిసే విధంగా చెప్పు. నిన్ను చూస్తుంటే మదనుడు నాలో కోలాహలం చేస్తున్నాడు.

5.1-29-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పొలుపగుచున్న విలాసం
బు నంగజు బాణములను బోలెడి నీ చం
సత్కటాక్షవీక్షణ
ము నెవ్వని నింతి చిత్తమునఁ గలఁచెదవే?

టీకా:

పొలుపు = చక్కటిది; అగుచున్న = అగుతున్న; విలాసంబులన్ = విలాసములతో; అంగజు = మన్మథుని; బాణములను = బాణములను; పోలెడిన్ = వంటి; నీ = నీ యొక్క; చంచల = చలిస్తున్న; సత్ = చక్కటి; కటాక్ష = కడగంటి; వీక్షణములన్ = చూపులతో; ఎవ్వనిన్ = ఎవనిని; ఇంతి = స్త్రీ; చిత్తమునన్ = మనసులో; కలచదవే = కలవరపెట్టెదవు.

భావము:

నీ కులుకులతో, తళుకు బెళుకులతో మన్మథుని వాడి తూపులవంటి కడగంటి చూపులతో ఎవరి మనస్సును చీకాకు పరుస్తున్నావే?

5.1-30-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెరఁగ వేదముల్ చదువు శిష్యులపైఁ దగఁ బుష్పవృష్టి స
మ్మమున నంతలోఁ గురియు మాడ్కిని మన్మథసామగానముల్
దివెడు శిష్యులో యనఁగ ట్పదపంక్తులు చేరి మ్రోయఁగాఁ
పడి మీఁద రాలుఁ గచభారము నందుల జాఱు క్రొవ్విరుల్.

టీకా:

చెదరగ = తుళ్లిపడునట్లు; వేదముల్ = వేదములు; చదువు = చదివెడి; శిష్యుల్ = శిష్యుల; పైన్ = పైన; తగ = అవశ్యము; పుష్ప = పూల; వృష్టి = వాన; సమ్మదమునన్ = సంతోషముతో; అంతన్ = అంత; లోన్ = లోపల; కురియు = కురిసెడి; మాడ్కిన్ = విధముగా; మన్మథ = మన్మథ; సామ = వేద; గానముల్ = గానములు; చదివెడు = చదువుతున్న; శిష్యులో = శిష్యులేమో; అనగన్ = అన్నట్లు; షట్పద = తుమ్మెదల {షట్పదము – ఆరుకాళ్ళు గలది, తుమ్మెద}; పంక్తులు = గుంపులు; చేరి = కూడి; మ్రోయగాన్ = ఝంకారము చేస్తుండగా; పదపడి = పూని; మీదన్ = పైన; రాలున్ = రాలుతున్నవి; కచ = శిరోజముల; భారము = ఒత్తు; అందులన్ = నుండి; జాఱు = జారెడి; క్రొవ్విరుల్ = తాజాపూలు.

భావము:

మన్మథ సామగానాలు ఆలపించే శిష్యులేమో అన్నట్టు తుమ్మెదల గుంపులు నీకు వంత పాడుతున్నాయి. వేదాలు చదివే శిష్యులపైన పూల వాన కురిసే విధంగా ఆ తుమ్మెదల మీద నీ వాలుజడ నుండి పూలు రాలుతున్నాయి.

5.1-31-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అందియలు టిట్టిభంబుల
చంమునం బాదపంకజంబుల యందున్
యందంద మ్రోయుచును నా
డెందంబునఁ దగిలి సందడించెడిఁ దరుణీ!

టీకా:

అందియలు = అందెలు; టిట్టిభంబుల = లకుముకి పిట్టల; చందమునన్ = వలె; పాద = పాదములు యనెడి; పంకజంబులన్ = పద్మముల; అందున్ = అందు; అందంద = అక్కడక్కడ; మ్రోయుచున్ = మ్రోగుతూ; నా = నాయొక్క; డెందంబునన్ = మనసునకు; తగిలి = తగిలి; సందడించెడిన్ = గోలచెసెడిని; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసుగలామె, స్త్రీ}.

భావము:

తరుణీ! నీవు నడుస్తుంటే నీ కాలి అందెలు మ్రోగుతున్నాయి. ఆ సవ్వడులు నా మనస్సును తాకి ప్రతిధ్వనిస్తూ సందడి చేస్తున్నాయి.

5.1-32-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాక కదంబ పుష్ప
చ్ఛాయం గల వస్త్రకాంతి ల్లెడుఁ గంటే
యా యెడ నితంబరోచులు
గాయుచు నెడతెగక తఱిమి ప్పెడుఁ దన్వీ!

టీకా:

పాయక = విడువక; కదంబ = కడిమి; పుష్ప = పూల; ఛాయన్ = రంగు; కల = కలిగిన; వస్త్ర = బట్టల; కాంతి = ప్రకాశము; చల్లెడున్ = ప్రసరించెడిని; కంటే = చూసితివా; ఆ = ఆ; ఎడన్ = సమయమున; నితంబ = పిరుదుల; రోచులున్ = వెలుగులు; కాయుచున్ = కాస్తూ; ఎడతెగక = విడువక; తఱిమిన్ = తరముతూ; కప్పెడున్ = కప్పివేయుతున్నవి; తన్వీ = స్త్రీ {తన్వీ - మంచి తనువు (దేహము) కలామె, స్త్రీ}.

భావము:

తన్వీ! కడిమి పూల కాంతులను పుణికి పుచ్చుకొన్న నీ చీర నిగనిగలు ఎడతెగకుండా బయటకు ప్రసరించే నీ కటి కాంతులను కప్పివేస్తున్నవి కదా!

5.1-33-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నితము నీ తనుమధ్యముఁ
మరుదుగ నరసి చూడఁ గానంబడ; దీ
రికుంభంబులఁ బోలెడి
గురు కుచముల నెట్లు నిలుపు కొంటి లతాంగీ!

టీకా:

నిరతమున్ = ఎల్లప్పుడు; నీ = నీ యొక్క; తనుమధ్యమున్ = నడుము; కరము = మిక్కిలి; అరుదు = అపూర్వముగా; అరసి = తరచి; చూడన్ = చూడగా; కానంబడదు = కనపడదు; ఈ = ఈ; కరి = ఏనుగు; కుంభంబులన్ = కుంభములను; పోలెడిన్ = పోలు; గురు = పెద్ద; కుచములన్ = స్తనములను; ఎట్లు = ఏవిధముగ; నిలుపుకొంటి = నిలుపుకొనగలిగితివి; లతాంగి = స్త్రీ {లతాంగి - లతలవంటి అంగములు కలామె, స్త్రీ}.

భావము:

లతాంగీ! నీ నడుము చూద్దామన్నా కనిపించదాయె. మరి అంత సన్నటి నడుంమీద ఏనుగు కుంభస్థలం లాంటి స్తనద్వయాన్ని ఎలా మోస్తున్నావు?

5.1-34-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పొంములగు కుచములపైఁ
గుంకుమ పంకంబుఁ బూసికొని వాసనలం
గొంక వెదచల్లెడు నీ
బింకం బగు చన్నుదోయి పెంపో! సొంపో!

టీకా:

పొంకములు = తీరైనవి; అగు = అయిన; కుచముల్ = స్తనముల; పైన్ = మీద; కుంకుమ = కుంకుమపువ్వు; పంకము = పాలు ముద్ద; పూసుకొని = అలదుకొని; వాసనలన్ = వాసనలతో; కొంకక = జంకగుండగ; వెదచల్లెడు = వెదజల్లుతున్న; నీ = నీ యొక్క; బింకంబు = పట్టుగలవి; అగు = అయిన; చన్ను = స్తనముల; దోయి = జంట; పెంపో = అతిశయమే అతిశయము; సొంపో = అందమే అందము.

భావము:

పొంకమైన నీ స్తనాలమీద కుంకుమ సుగంధం పూసుకున్నావు. పరిమళాలు వెదచల్లే బింకమైన నీ చనుదోయి పెంపును, సొంపును వర్ణించలేక పోతున్నాను.

5.1-35-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోకంబున నుండి వచ్చితివి? నీ విచ్చోటికిన్ మున్ను నే
నే లోకంబునఁ జెప్పఁ జూప నెఱుఁగన్నీ సుందరాకారము
న్నీ లాలిత్యము లీ వినోదములు నీ కిట్లొప్పునే? కామినీ!
భూలోకంబున కెట్లు వచ్చితివి నా పుణ్యం బగణ్యంబుగన్?

టీకా:

ఏ = ఏ; లోకంబున్ = లోకము; నుండి = నుండి; వచ్చితివి = వచ్చినావు; నీవున్ = నీవు; ఇచ్చోటికిన్ = ఈ స్థలమునకు; మున్ను = ఇంతకు పూర్వము; నేన్ = నేను; ఏ = ఏ; లోకంబునన్ = లోకములోను; చెప్పన్ = చెప్పగా; చూపన్ = చూపించగా; ఎఱుగన్ = తెలియను; ఈ = ఈ; సుందర = అందమైన; ఆకారమున్ = స్వరూపము; ఈ = ఈ; లాలిత్యముల్ = మనోహరత్వములు; ఈ = ఈ; వినోదముల్ = వినోదములు; నీకున్ = నీకు మాత్రమే; ఇట్లు = ఈ విధముగ; ఒప్పునే = కుదిరెను; కామినీ = స్త్రీ {కామిని - కామములుగలామె, స్త్రీ}; భూలోకంబున్ = భూలోకమున; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగ; వచ్చితివి = వచ్చినావు; నా = నా యొక్క; పుణ్యంబున = పుణ్యము; అగణ్యంబుగన్ = లెక్కింపరాని దయినట్లు.

భావము:

కామినీ! నీవు ఏలోకంనుండి ఇక్కడికి వచ్చావు? నీవంటి అందగత్తెను గురించి ఎక్కడా చెప్పుకొనడమూ వినలేదు. ఎవరూ చూచినట్టు చెప్పనూలేదు. అందమైన నీ ఆకారం, నీ లాలిత్యం, నీ లీలావిలాసం ఎంత గొప్పగా ఉన్నాయో! నేను చేసుకున్న అంతులేని పుణ్యం ఫలించినట్లు నీవు ఈ భూలోకానికి ఎలా దిగి వచ్చావు?

5.1-36-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హాసావలోకనంబుల
భాసిల్లెడు నీ ముఖంబు లుమఱు నిపుడే
యాలు పుట్టింపఁగ నే
నాగొనెద నిన్నుఁ జూచి యంబుజనేత్రా!

టీకా:

హాస = చిరునవ్వులతో కూడిన; అవలోకనంబులన్ = చూపులతో; భాసిల్లెడున్ = వెలుగుతున్నట్టి; నీ = నీ యొక్క; ముఖంబున్ = మోము; పలుమఱు = మాటిమాటికి; ఇపుడే = ఇప్పుడు; ఆసలు = కోరికలు; పుట్టింపగన్ = కలిగించుతుండగా; నేన్ = నేను; ఆసగొనెదన్ = ఆశపడెదను; నిన్నున్ = నిన్ను; చూచి = చూసి; అంబుజనేత్ర = స్త్రీ {అంబుజనేత్ర - అంబుజము (పద్మములవంటి) నేత్ర (కన్నులుగలామె), స్త్రీ}.

భావము:

పద్మాక్షీ! చిరునవ్వుతో వాల్చూపులతో శోభించే నీ సుందర రూపాన్ని చూస్తున్న కొద్దీ నాలో ఎన్నో కోరికలు చిగురిస్తున్నాయి. నీకోసం ఆశ పడుతున్నాను.

5.1-37-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కందులేని యిందుళ మించి నెమ్మోము
కాంతి యుక్త మగుచుఁ గానుపించెఁ
గాన విష్ణుకళయుఁ గాఁబోలు నని నా మ
నంబునందుఁ దోఁచె ళిననేత్ర!

టీకా:

కందు = మచ్చ; లేని = లేనట్టి; ఇందు = చంద్ర; కళన్ = కళతో; మించి = అతిశయించి; నెఱ = నిండు; మోమున్ = ముఖము; కాంతి = కాంతి; యుక్తమున్ = వంతము; అగుచున్ = అగుచూ; కానుపించె = కనిపించె; కాన = కనుక; విష్ణు = విష్ణువు యొక్క; కళయున్ = కళ; కాబోలు = అయ్యుండవచ్చును; అని = అనుకొని; నా = నా యొక్క; మనంబున్ = మనసు; అందున్ = లో; తోచెన్ = అనిపించెను; నళిననేత్ర = స్త్రీ {నళిననేత్ర - నళినము (పద్మముల) వంటి నేత్రములు గలామె, స్త్రీ}.

భావము:

కమలనేత్రీ! మచ్చలేని చంద్రుని కళ కన్నా అధికంగా నీ ముద్దుమోము వెలుగులు వెదజల్లుతున్నది. అందుకే, దానిని విష్ణుకళ అయ్యుంటుంది అని నా మనస్సులో భావిస్తున్నాను.

5.1-38-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

టుతాటంక రథాంగ యుగ్మమునకుం ల్మాఱు భీతిల్లుచున్
నం బందెడు గండుమీనములతో నాసన్న నీలాలకో
త్క భృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా
కాసారముఁ బోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్.

టీకా:

పటుతాటంక = పట్టెన దుద్ధులు యనెడి; రథాంగ = చక్రవాకముల; యుగ్మమున్ = జంటకు; పల్మాఱు = మాటిమాటికి; భీతిల్లుచున్ = భయముచెందుతూ; నటనంబున్ = నాట్యమాడుట; అందెడున్ = పొందుతున్న; గండుమీనంబుల్ = గండుచేపల; తోన్ = తో; ఆసన్న = సమానమైన; నీల = నల్లని; అలక = ముంగురుల; ఉత్కట = ఉత్సాహముచెందిన; భృంగ = తుమ్మెదల; ఆవళిన్ = గుంపులు; తోన్ = తోటి; ద్విజావళి = పక్షుల సమూహముల, పలువరుస; లసత్ = ప్రకాశించుతున్న; కాంతిన్ = కాంతితోటి; విడంబించు = అనుకరించెడి; మాఱట = రెండవ; కాసారమున్ = సరోవరమును; పోలి = పోలుతూ; నెఱి = నిండు; మొగమున్ = మోము; తాన్ = తను; రంజిల్లున్ = విరాజిల్లుతున్నది; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = అతిశయముతో.

భావము:

నీ చెవుల దుద్దులురెంటిని, చక్రవాకాలు అనుకుని, నీ కన్నులు వాటిని చూసి భయపడుతున్న చేపలవలె కదులుతుండగా, నీ నల్లని ముంగురులు క్రమ్ముకొన్న తుమ్మెదల గుంపులా ఉండగా, ద్విజపంక్తులతో తేజరిల్లుతున్న పలువరస పక్షుల సమూహంలా ఉండగా, నీ ముద్దుల ముఖం చక్కని సరోవరం వలె విరాజిల్లుతూ ఉంది.

5.1-39-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రువలిఁ బాయు వస్త్రమును ట్ట నెఱుంగవు; చూడ్కి దిక్కులం
పుచుఁ జంచరీకముల భాతిఁ జెలంగెడు కంధరంబునం
బొలెడు ముక్తకేశభరముం దుఱుమంగఁ దలంప; విప్పు డి
ట్లరుదుగ రత్నకందుక విహారము సల్పెడు సంభ్రమంబునన్."

టీకా:

కరువలిన్ = గాలికి; పాయు = జారెడి; వస్త్రమున్ = బట్టను; కట్టన్ = కట్టుకొనుట; ఎఱుంగవు = మరచెదవు; చూడ్కిన్ = చూపులను; దిక్కులన్ = దిక్కులమ్మట; పఱపుచున్ = పరుచుచూ; చంచరీకములన్ = తుమ్మెదల; భాతిన్ = వలె; చెలంగెడు = చెలరేగెడు; కంధరంబునన్ = మెడపైన; పొరలెడు = కదలెడి; ముక్త = విరబోసుకొన్న; కేశ = శిరోజముల; భరమున్ = ఒత్తైన సమూహమును; తుఱుమన్ = ముడువవలెనని; తలంపవు = భావింపవు; ఇప్పుడు = ఇప్పుడు; ఇట్లు = ఈ విధముగ; అరుదుగా = అపూర్వముగా; రత్న = రత్నాల; కందుక = బంతితో; విహారము = క్రీడించుట; సల్పెదు = చేసెడి; సంభ్రమంబునన్ = సందడిలో.

భావము:

నవరత్నాల బంతితో ఆడుకొనే సంబరంలో నీవు కట్టుకొన్న చీర గాలికి తొలగినా నీవు పట్టించుకోవడం లేదు. దిక్కులు పరికిస్తున్నపుడు తుమ్మెదల వంటి శిరోజాల ముడి విడిపోయి మెడపై పడుతున్నా నీవు సవరించుకొనడం లేదు”.

5.1-40-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నిట్లనుఁ "దపోధనులగు వారల తపంబులను నీ రూపంబున నపహ్నవించిన దాన; వీ చక్కదనం బేమి తపంబున సంపాదించితివి? నా తోడంగూడి తపంబు చేయుము; సంసారంబు వృద్ధిఁ బొందం జేయుము; పద్మాసనుండు నాకుం బ్రత్యక్షంబై నిన్ను నిచ్చినవాఁడుఁ; గావున నిన్ను విడువంజాలను; నీ సఖీజనంబులు నా వాక్యంబులకు ననుకూలింతురుగాక; నీవు చనుచోటికి నన్నుం దోడ్కొని చను"మని స్త్రీలకు ననుకూలంబుగాఁ బలుకనేర్చిన యాగ్నీధ్రుండు పెక్కుభంగులం బలికిన నా పూర్వచిత్తియు నతని యనునయ వాక్యంబులకు సమ్మతించి వీరశ్రేష్ఠుండగు నా రాజవర్యుని బుద్ధి రూప శీలౌదార్య విద్యా వయశ్శ్రీలచేఁ బరాధీనచిత్త యగుచు జంబూద్వీపాధిపతి యగు నా రాజశ్రేష్ఠుని తోడంగూడి శతసహస్ర సంవత్సరంబులు భూస్వర్గ భోగంబు లనుభవించె; నంత నాగ్నీధ్రుం డా పూర్వచిత్తివలన నాభి కింపురుష హరివర్షేలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞలు గల కుమారులఁ బ్రతిసంవత్సరంబు నొక్కొక్కనిఁగఁ దొమ్మండ్రం గాంచె; నంత నా పూర్వచిత్తి యా యర్భకుల గృహంబున విడిచి యాగ్నీధ్రుం బాసి బ్రహ్మలోకంబునకుం జనిన నా యాగ్నీధ్ర పుత్రులు మాతృసామర్థ్యంబునం జేసి స్వభావంబునన శరీరబలయుక్తు లగుచుఁ దండ్రిచేత ననుజ్ఞాతులై తమ నామంబులఁ బ్రసిద్ధంబు లయిన జంబూద్వీప వర్షంబులం బాలించుచుండి; రంత నాగ్నీధ్రుండు నా పూర్వచిత్తి వలనం గామోపభోగంబులం దృప్తిం బొందక పూర్వచిత్తిం దలంచుచు వేదోక్తంబులగు కర్మంబులంజేసి తత్సలోకంబగు బ్రహ్మ లోకంబునకుం జనియె; నిట్లు దండ్రి పరలోకంబునకుం జనిన నాభి ప్రముఖులగు నాగ్నీధ్రకుమారులు దొమ్మండ్రును మేరుదేవియుఁ, బ్రతిరూపయు, నుగ్రదంష్ట్రయు, లతయు, రమ్యయు, శ్యామయు, నారియు, భద్రయు, దేవవతియు నను నామంబులు గల మేరు పుత్రికలగు తొమ్మండ్రు కన్యకలను వివాహం బై; రంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; తపః = తపస్సు అనెడి; ధనులు = సంపద గలవారు; వారల = వారి యొక్క; తపంబులన్ = తపస్సులను; ఈ = ఈ; రూపంబునన్ = రూపముతో; అపహ్నవించినదానవు = కప్పిపుచ్చెడిదానవు; ఈ = ఈ; చక్కదనంబున్ = అందమును; ఏమి = ఏ విధమైన; తపంబునన్ = తపస్సువలన; సంపాదించితివి = పొందితివి; నా = నా; తోడన్ = తోటి; కూడి = కలిసి; తపంబున్ = తపస్సును; చేయుము = చేయుము; సంసారంబున్ = సంసారమును; వృద్ధిన్ = పెంపు; పొందన్ = పొందునట్లు; చేయుము = చేయుము; పద్మాసనుండు = బ్రహ్మదేవుడు {పద్మాసనుడు - పద్మము ఆసనముగా గలవాడు, బ్రహ్మదేవుడు}; నాకున్ = నాకు; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; ఐ = అయ్యి; నిన్నున్ = నిన్ను; ఇచ్చినవాడు = ఇచ్చినాడు; కావునన్ = అందుచేత; నిన్నున్ = నిన్ను; విడువంజాలను = విడువలేను; నీ = నీ యొక్క; సఖీ = సఖులైన; జనంబులు = వారు; నా = నా యొక్క; వాక్యంబుల్ = మాటల; కున్ = కు; అనుకూలింతురుగాక = అనుకూలముగా ఉండమను; నీవున్ = నీవు; చను = వెళ్ళు; చోటు = ప్రదేశముల; కిన్ = కి; నన్నున్ = నన్ను; తోడ్కొని = తీసుకొని; చనుము = వెళ్ళండి; అని = అని; స్త్రీల్ = స్త్రీలు; కున్ = కు; అనుకూలంబుగాన్ = అనుకూల మగునట్లు; పలుకన్ = మాట్లాడ; నేర్చినన్ = నేర్చుకొనగా; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగా; పలికినన్ = పలుకగా; ఆ = ఆ; పూర్వచిత్తియున్ = పూర్వచిత్తి; అతని = అతని; అనునయ = బుజ్జగింపు; వాక్యంబుల్ = మాటల; కున్ = కు; సమ్మతించి = అంగీకరించి; వీర = వీరులలో; శ్రేష్ఠుండు = గొప్పవాడు; అగు = అయిన; ఆ = ఆ; రాజ = రాజులలో; వర్యుని = ఉత్తముని; బుద్ధి = మంచి బుద్ధులు; రూప = చక్కదనములు; శీల = వర్తనలు; ఔదార్య = ఔదార్యములు; విద్యా = విద్య; వయస్ = యౌవనము; శ్రీలు = సంపదలు; చేన్ = వలన; పరాధీన = లొంగిపోయిన; చిత్త = మనసు కలామె; అగుచున్ = అగుచూ; జంబూద్వీప = జంబూద్వీపమునకు; అధిపతి = ప్రభువు; అగు = అయిన; ఆ = ఆ; రాజ = రాజులలో; శ్రేష్ఠునిన్ = గొప్పవాని; తోడన్ = తోటి; కూడి = కలిసి; శతసహస్ర = నూరువేల; సంవత్సరంబులున్ = సంవత్సరములు; భూ = భూలోకపు; స్వర్గ = స్వర్గ; భోగంబుల్ = సుఖములు; అనుభవించెన్ = అనుభవించెను; అంతన్ = అంతట; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; వలనన్ = వలన; నాభి = నాభి; కింపురుష = కిపురుషుడు; హరివర్ష = హరివర్షుడు; ఇలావృత = ఇలావృతుడు; రమ్యక = రమ్యకుడు; హిరణ్మయ = హిరణ్మయుడు; కురు = కురువు; భధ్రాశ్వ = భధ్రాశ్వుడు; కేతుమాల = కేతుమాలుడు; సంజ్ఞలు = పేర్లు; కల = కలిగిన; కుమారులన్ = పుత్రులను; ప్రతి = ప్రతి; సంవత్సరంబున్ = సంవత్సరమును; ఒక్కొక్కని = ఒకరుచొప్పున; తొమ్మండ్రన్ = తొమ్మిదిమందిని; కాంచె = పొందెను; అంతన్ = అంతట; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; ఆ = ఆ; అర్భకులన్ = పిల్లలను; గృహంబునన్ = ఇంటిలో; విడిచి = వదలివేసి; ఆగ్నీధ్రున్ = ఆగ్నీధ్రుని; పాసి = విడిచిపెట్టి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకము; కున్ = కు; చనిన = వెళ్ళిన; ఆ = ఆ; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుని; పుత్రులు = కుమారులు; మాతృ = తల్లి యొక్క; సామర్థ్యంబునన్ = సమర్థత; చేసి = వలన; స్వభావంబునన్ = స్వభావములోను; శరీర = శారీరక; బల = బలము; యుక్తులు = కలవారు; అగుచున్ = అగుచూ; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; అనుజ్ఞాతులు = అనుమతిపొందినవారు; ఐ = అయ్యి; తమ = తమ యొక్క; నామంబులన్ = పేర్లతో; ప్రసిద్ధంబులు = పేరుపొందినవి; అయిన = అయినట్టి; జంబూద్వీప = జంబూద్వీపము నందలి; వర్షంబులన్ = వర్షములను, భూఖండములను; పాలించుచుండిరి = పరిపాలించుచు ఉండెడివారు; అంతన్ = అంతట; ఆగ్నీధ్రుండున్ = ఆగ్నీధ్రుడు; ఆ = ఆ; పూర్వచిత్తి = పూర్వచిత్తి; వలనన్ = వలన; కామ = సంసారిక; ఉప = సంబంధించిన; భోగంబులన్ = సుఖము లందు; తృప్తిన్ = తృప్తిని; పొందక = తీరక; పూర్వచిత్తిన్ = పూర్వచిత్తిని; తలంచుచున్ = తలచుకొనుచు; వేద = వేదము లందు; ఉక్తంబులు = ఉదహరింపబడిన; అగు = అయిన; కర్మలన్ = కర్మలను; చేసి = ఆచరించి; తత్ = వానికి సమానమైన; లోకంబున్ = లోకము; అగు = అయిన; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఇట్లు = ఈ విధముగ; తండ్రి = నాన్న; పరలోకంబున్ = పైలోకమున; కున్ = కు; చనిన = వెళ్ళగా; నాభి = నాభి; ప్రముఖులు = మొదలగు; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుని; కుమారులు = పుత్రులు; తొమ్మండ్రును = తొమ్మిదిమంది; మేరుదేవి = మేరుదేవి; ప్రతిరూపయును = ప్రతిరూప; ఉగ్రదంష్ట్రయున్ = ఉగ్రదంష్ట్ర; లతయున్ = లత; రమ్యయున్ = రమ్య; శ్యామయున్ = శ్యామ; నారియున్ = నారి; భద్రయున్ = భద్ర; దేవవతియున్ = దేవవతి; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; మేరు = మేరువు యొక్క; పుత్రికలు = కుమార్తెలు; అగు = అయిన; తొమ్మండ్రున్ = తొమ్మిదిమంది; కన్యకలను = స్త్రీలను; వివాహంబున్ = వివాహము; ఐరి = చేసుకొనిరి; అంతన్ = అంతట.

భావము:

ఇంకా ఇలా అన్నాడు “తపస్సు చేస్తున్న తపోధనుల తపస్సునంతా నీ అందచందాలతో కప్పిపుచ్చేస్తున్నావు. ఈ చక్కదనమంతా ఏ తపస్సు వల్ల దక్కించుకున్నావు? నాతోపాటు నీవుకూడా తపస్సు సాగించు. నా సంసారాన్ని పెంచు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను నాకు ప్రసాదించాడు. అందుచేత నిన్ను వదలిపెట్టను. నీ చెలికత్తెలు నేను చెప్పే మాటలకు తప్పక అంగీకరిస్తారు. నీవు వెళ్ళే చోటికి నన్ను కూడా తీసికొని పో” అంటూ స్త్రీల మనస్తత్త్వానికి అనుగుణంగా పలుకనేర్చిన ఆగ్నీధ్రుడు పరిపరివిధాల తన భావాన్ని ప్రకటించాడు. పూర్వచిత్తి కూడా అతని అనునయ వాక్యాలకు సమ్మతించింది. వీరశ్రేష్ఠుడైన ఆ రాజేంద్రుని బుద్ధికి, రూపానికి, శీలానికి, ఔదార్యానికి, విద్యకు, వయస్సుకు, సంపదకు లొంగిపోయింది. జంబూద్వీపాధిపతి అయిన ఆ ఆగ్నీధ్రునితో కూడి నూరువేల సంవత్సరాలు భూలోకంలో స్వర్గసౌఖ్యాలను అనుభవించింది. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వలన వరుసగా నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లు గల తొమ్మిది మంది కొడుకులను కన్నాడు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లలను ఇంటిలోనే వదిలిపెట్టి ఆగ్నీధ్రుని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆగ్నీధ్రుని కుమారులు తల్లి సామర్థ్యం వల్ల స్వభావసిద్ధంగానే గొప్ప బలిష్ఠులయ్యారు. తండ్రి అనుమతితో జంబూద్వీపాన్ని వర్షాలుగా విభజించుకొని పరిపాలించారు. వారు పరిపాలించిన ప్రదేశాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధ మయ్యాయి. పూర్వచిత్తితో ఆగ్నీధ్రుడు ఎంతోకాలం కామ సుఖాలను అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. ఆ తరువాత అతడు భార్యను తలచుకొంటూ వేదోక్తకర్మలను ఆచరిస్తూ చివరకు భార్య ఉన్న లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా తండ్రి పరలోక గతుడు కాగా నాభి మొదలైన ఆగ్నీధ్రుని కుమారులు మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనేవాళ్ళను వరుసగా వివాహమాడారు.