పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షప్రజాపతి వంశ విస్తారము

  •  
  •  
  •  

4-31-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గనస్థలిం దోఁచు గంధర్వనగరాది-
రూప భేదము లట్లు రూఢి మెఱసి
యే యాత్మయందేని యేపార మాయచే-
నీ విశ్వ మిటు రచియింపఁబడియె
ట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప-
ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
రమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ-
గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి

4-31.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రగనీకుండు కొఱకునై త్త్వగుణము
చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ పహసించు
నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు."

టీకా:

గగనస్థలి = ఆకాశము నందు; తోచు = కనబడు ( మేఘములు); గంధర్వనగర = గంధర్వుల నగరములు, మేఘములు; ఆది = మొదలైన; రూప = ఆకారముల; భేదములు = రకములు; అట్లు = వలె; రూఢిన్ = చక్కగ; మెఱసి = ప్రకాశించి; ఏ = ఏ; ఆత్మ = పరమాత్మ; అందు = లో; ఏని = అయితే; ఏపారు = విస్తరిల్లు; మాయ = మాయ; చేన్ = చేత; ఈ = ఈ; విశ్వమున్ = జగము; ఇటు = ఈవిధముగ; రచియింపన్ = ఏర్పరుప; పడియెన్ = చేయబడినదో; అట్టి = అటువంటి; ఆత్మ = ఆత్మ; ప్రకాశార్థము = ప్రసిద్ధము చేయుట కొరకు; ఐ = అయ్యి; ముని = మునుల; రూపములన్ = రూపములతో; ధర్ము = ధర్ముని యొక్క; గృహమునన్ = ఇంట; పుట్టిన = జన్మంచిన; అట్టి = అటువంటి; పరమపురుష = మహాపురుషుడ; నీకున్ = నీకు; ప్రణమిల్లెదము = నమస్కరించెదము; ఈ = ఈ; సృష్టిన్ = సృష్టిలో; దుష్కర్మ = చెడుపనుల, పాపముల; వృత్తి = విస్తారము.
జరగనీకుండు = పెరగకుండుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; సత్త్వగుణము = సత్త్వగుణము; చేన్ = తో; సృజించిన = సృష్టించిన; మమ్ము = మమ్ములను; ఇట్లు = ఈవిధముగ; శ్రీ = సంపదలకు; నివాసము = నిలయము; ఐన = అయిన; సరసీరుహ = పద్మముల {సరసీరుహము - సరసునందు ఈరుహము(పుట్టునది), పద్మము}; ప్రభన్ = శోభను; అపహసించు = పరిహసించు; నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; ఆలోకనంబులన్ = చూపులతో; నెమ్మిన్ = ప్రేమగా; చూడు = చూడుము.

భావము:

ఆకాశంలో గంధర్వనగరం పెక్కురూపాలను పొందినట్లు ఈ విశ్వం నీ మాయచేత సృష్టింపబడింది. నిన్ను నీవు లోకానికి తెలియజేయడానికి నరనారాయణుల రూపాలతో ధర్ముని ఇంట అవతరించావు. అటువంటి మహాపురుషుడ వయిన నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మలు జరుగకుండా ఉండటానికి సత్త్వగుణంతో నీవే మమ్ము సృజించావు. అటువంటి మమ్ము శ్రీదేవికి నివాసమైన పద్మశోభను పరిహసించే నీ దయాదృష్టులతో మమ్ము చూడు.