పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని యఙ్ఞకర్మములు

 •  
 •  
 •  

4-508-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని చెప్పి మునినాథుఁ డైన మైత్రేయుఁ డ-
వ్విదురున కిట్లను వేడ్కతోడ
"ననఘాత్మ! రాజర్షి యైన వైన్యుం డశ్వ-
మేధశతంబు సన్మేధతోడఁ
గావింతు నని దీక్ష గైకొని వ్రతనిష్ఠఁ-
దివిరి బ్రహ్మావర్త దేశమందు
లరు మనుక్షేత్ర మందు సరస్వతీ-
ది పొంతఁ దా మహోన్నతి నొనర్చు

4-508.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వన కర్మ క్రియకు నతియ విశేష
లము గలిగెడి నని బుద్ధిఁ లఁచి యచట
రుసఁ గావించు నతిశయాధ్వర మహోత్స
ము సహింపక యుండె న య్యమరవిభుఁడు.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; ముని = మునులలో; నాథుడు = ముఖ్యుడు; ఐన = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; కిన్ = కిని; ఇట్లు = ఈ విధముగ; అను = పలికెను; వేడ్క = కుతూహలము; తోడన్ = తోటి; అనఘాత్మ = పుణ్యాత్మా; రాజ = రాజులలో; ఋషి = ఋషి; ఐన = అయిన; వైన్యుండు = పృథుచక్రవర్తి; అశ్వమేధ = అశ్వమేధయాగములు; శతంబున్ = నూటిని; సత్ = మంచి; మేధ = తెలివితేటల; తోడన్ = తోటి; కావింతున్ = చేసెదను; అని = అని; దీక్షన్ = సంకల్పము; కైకొని = చేపట్టి; వ్రత = వ్రత; నిష్టన్ = దీక్ష; తివిరి = పూని; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము అనెడి; దేశము = దేశము; అందున్ = లో; అలరు = విలసిల్లెడి; మనుక్షేత్రము = మనుక్షేత్రము; అందున్ = లో; సరస్వతీ = సరస్వతీ అనెడి; నది = నది; పొంతన్ = దగ్గర; తాన్ = అతను; మహా = గొప్ప; ఉన్నతిన్ = అతిశయముతో; ఒనర్చు = చేసెడి.
సవనకర్మ = యజ్ఞకర్మలు; క్రియన్ = పని; కున్ = కి; అతిశయ = మిక్కిలి; విశేష = విశేషమైన; ఫలమున్ = ఫలితము; కలిగెడిని = లభించును; అని = అని; బుద్ధిన్ = మనసులో; తలచి = అనుకొని; అచటన్ = అక్కడ; వరుసన్ = వరుసగా; కావించు = చేసెడి; అతిశయ = గొప్ప; అధ్వర = యాగము యొక్క; ఉత్సవమున్ = సందడిని; సహింపక = సహించకుండగ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - అమరుల (దేవతల)కి విభుడు, ఇంద్రుడు}.

భావము:

అని చెప్పి మైత్రేయ మహర్షి విదురునితో ఇలా అన్నాడు “పుణ్యాత్మా! రాజర్షి అయిన పృథుచక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలు చేయటానికి దీక్ష పూనాడు. మహానిష్ఠతో బ్రహ్మావర్త దేశంలోని మనుక్షేత్ర్రంలో సరస్వతీ నదీతీరంలో మహా వైభవంగా యజ్ఞాలు చేయటం వల్ల విశేషఫలం కలుగుతుందని భావించాడు. ఆ విధంగా ఆయన అక్కడ సాగిస్తున్న యాగవైభవాన్ని చూచి ఇంద్రుడు ఓర్వలేకపోయాడు.

4-509-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి యధ్వర కర్మమందు సాక్షాద్భగ-
వంతుఁడు హరి రమేశ్వరుఁడు లోక
గురుఁడును సర్వాత్మకుండును విభుఁడును-
నీరజభవ భవాన్వితుఁడు లోక
పాలక నిఖిల సుర్వానుగుండును-
జ్ఞాంగుఁ డఖిలాధ్వరాది విభుఁడు
గంధర్వ ముని సిద్ధణ సాధ్య విద్యాధ-
రాప్సరో దైత్య గుహ్యాళి దాన

4-509.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వాది జేగీయ మానుఁ డత్యలఘుయశుఁడు
ప్రకట నందసునందాది పార్షదుండు
పిల నారద సనకాదిప్రముఖ్య
హిత యోగీంద్ర సంస్తూయమానుఁ డజుఁడు.

టీకా:

అట్టి = అటువంటి; అధ్వరకర్మము = యజ్ఞకర్మలు; అందున్ = లో; సాక్షాత్ = స్వయముగా; భగవంతుడు = విష్ణుమూర్తి {భగవంతుడు - మహామహిమాన్వితుడు, విష్ణువు}; హరి = విష్ణుమూర్తి; రమేశ్వరుడు = విష్ణుమూర్తి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి)కి ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; లోకగురుడును = విష్ణుమూర్తి {లోకగురుడు - లోక (సమస్తలోకముల)కు గురుడు (పెద్దవాడు), విష్ణువు}; సర్వాత్మకుండును = విష్ణుమూర్తి {సర్వాత్మకుడు - సర్వుల (అందరి)కినిఆత్మయైనవాడు, విష్ణువు}; విభుడును = విష్ణుమూర్తి {విభుడు - ప్రభువు, విష్ణువు}; నీరజభవ = బ్రహ్మదేవుడు {నీరజభవుడు - నీరజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భవ = శివుడు; ఆన్వితుడు = తోకూడినవాడు; లోకపాలక = లోకపాలకులు; నిఖిల = సమస్తమైన; సుపర్వ = దేవతలచే; అనుగుండునున్ = సేవింపబడినవాడును; యజ్ఞాంగుడు = విష్ణుమూర్తి {యజ్ఞాంగుడు - యజ్ఞమేదేహముగాకలవాడు, విష్ణువు}; అఖిలాధ్వరాదివిభుడు = విష్ణుమూర్తి {అఖిలాధ్వరాదివిభుడు - అఖిల (సమస్తమైన) అధ్వర (యజ్ఞము)లకు ఆది (మొదలి) విభుడు (ప్రభువు), విష్ణువు}; గంధర్వ = గంధర్వులు; ముని = మునులు; సిద్ధగణ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; విద్యాధర = విద్యాధరులు; అప్సరస = అప్సరసలు; దైత్య = రాక్షసులు; గుహ్యాళి = గుహ్యకులసమూహము; దానవ = దానవులు; ఆది = మొదలగువారిచే.
జేగీయమానుడు = కీర్తింపబడినవాడు; అతి = మిక్కిలి; అలఘు = గొప్ప; యశుడు = కీర్తికలవాడు; ప్రకటన్ = ప్రసిద్ధముగ; నంద = నందుడు; సునంద = సునందుడు; ఆది = మొదలైన; పార్షదుండు = అనుచరులుకలవాడు; కపిల = కపిలుడు; నారద = నారదుడు; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు}; ఆదిక = మొదలగు; ప్రముఖ్య = అతిముఖ్యమైన; మహిత = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్టులచే; సంస్తూయమానుడు = చక్కగాస్తుతింపబడినవాడు; అజుడు = జన్మములేనివాడు.

భావము:

ఆ అశ్వమేధ యజ్ఞానికి సాక్షాత్తు భగవంతుడు, యజ్ఞస్వరూపుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, విశాల యశోవిరాజితుడు, లక్ష్మీవల్లభుడు అయిన విష్ణుదేవుడు విచ్చేశాడు. గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైన వారు కీర్తిస్తూ ఉండగా; కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు కొనియాడుతూ ఉండగా; నందుడు, సునందుడు మొదలైన పార్షదులతోను; బ్రహ్మతోను, పరమశివునితోను, అష్టదిక్పాలకులతోను కూడి వేంచేశాడు.

4-510-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుం బరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును నైన పృథుచక్రవర్తికి భూమి హవిరాదిదోగ్ధ్రి యయ్యును సర్వకామదుఘయై సమస్త పదార్థంబులం బిదుకుచుండె; మఱియుఁ దరువులు ఘనతరాకారంబులు గలిగి మకరంద స్రావు లగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర పానకాదికంబులును వర్షింప నవి యెల్ల నదులు వహించె; సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల నీనుచుండె; పర్వతంబులు భక్ష్య భోజ్య లేహ్య చోష్యంబు లను చతుర్విధాన్నంబులు గురియుచుండె; లోకపాల సమేతులైన సకల జనంబులు నుపాయానంబులు దెచ్చి యిచ్చుచుండి; రిట్టి పరిపూర్ణ విభవాభిరాముండై యధోక్షజసేవాపరాయణుండగు పృథుచక్రవర్తి యేకోనశతాశ్వమేధంబులు సన్మేధంబునం గావించి నూఱవ యాగంబునందు యజ్ఞపతి యైన పుండరీకాక్షుని యజించుచుండం దదీయ పరమోత్సవంబు సహింపం జాలక.

టీకా:

మఱియున్ = ఇంక; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులచే; సేవితుండును = పూజింపబడువాడు; నారాయణ = విష్ణుమూర్తి; అంశ = అంశతో; ప్రభవుండును = పుట్టినవాడును; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; కిన్ = కి; భూమి = నేల; హవిస్ = హవిస్సు; ఆది = మొదలగునవి; దోగ్ధ్రి = పితుకనిచ్చునది; అయ్యును = అయిననూ; సర్వ = సమస్తమైన; కామ = కామితములను; దుఘ = ఇచ్చునది; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; పదార్థంబులన్ = వస్తువులను; పితుకుచుండెన్ = పితుకుచుండెను; మఱియున్ = ఇంకను; తరువులు = చెట్లు; ఘనతర = అతిపెద్ద {ఘన - ఘనతర - ఘనతమ}; ఆకారంబులున్ = ఆకారములు; కలిగి = కలిగుండి; మకరంద = మకరందము; స్రావులు = స్రవించునవి; అగుచున్ = అవుతూ; ఇక్షు = చెరకు; ద్రాక్ష = ద్రాక్ష; ఆది = మొదలగు; రసంబులును = రసములను; దధి = పెరుగు; క్షీర = పాలు; ఆజ్య = నెయ్యి; తక్ర = మజ్జిగ; పానకా = తాగుట కనువైనవి; ఆదికంబులున్ = మొదలగునవి; వర్షింపన్ = వర్షించగా; అవి = అవి; ఎల్ల = సమస్తమైన; నదులున్ = నదులును; వహించెన్ = ధరించినవి; సముద్రంబులు = సముద్రములు; హీర = వజ్రము; ఆది = మొదలగు; రత్న = రత్నముల; విశేషంబులన్ = విశిష్ట వస్తువులను; ఈనుచుండెన్ = పుట్టించుచుండెను; పర్వతంబులున్ = పర్వతములు; భక్ష్య = భక్షించదగినవి {భక్ష్యములు - కొఱికి తినవలసినవి, అరిసెలు, బూరెలు, పిండివంటలు వంటివి}; భోజ్య = భుజించదగినవి {భోజ్యములు – కొరకనక్కర లేక తినునవి, పాయసము, అన్నము మొదలగునవి}; లేహ్య = నాకుటకు వీలయినవి {లేహ్యములు – నాలుక వాడి తినుటకు వీలైనవి, బెల్లపు పాకము, తేనె మొదలగునవి}; చోష్యంబులు = నమిలి రసము పీల్చదగినవి {చోష్యంబులు – దంతములతో నమిలి రసము పీల్చి పిప్పి పాఱవేయునవి, చెఱకు మొ.వి}; అను = అనెడి; చతుర్ = నాలుగు {చతుర్వి ధాన్నంబులు - భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనెడి నాలుగువిధముల ఆహారములు}; విధ = రకముల; అన్నంబులున్ = ఆహారములు; కురియుచున్ = కురుస్తూ; ఉండెన్ = ఉండెను; లోకపాల = లోకపాలురతో; సమేతులు = కూడియుండినవారు; ఐన = అయిన; సకల = సమస్తమైన; జనంబులున్ = వారును; ఉపాయనంబులు = కానుకలు; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చుచుండిరి = ఇస్తున్నారు; ఇట్టి = ఇటువంటి; పరిపూర్ణ = సంపూర్ణమైన; విభవ = వైభవములతో; అబిరాముండు = చక్కనైనవాడు; ఐ = అయ్యి; అధోక్షజ = నారాయణుని {అధోక్షజుడు - ఇంద్రియ జ్ఞానములతో తెలియరాని వాడు, వ్యు. అక్షజం (ఇంద్రియ జ్ఞానమ్) అధి (అధరమ్), అధి అక్షజం యస్య (అధోక్షజం), వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు (ఆంధ్ర శబ్దరత్నాకరము)}; సేవా = సేవించుట యందు; పరాయణుండు = ఆసక్తి కలవాడు; అగు = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; ఏకోనశత = ఒకటి తక్కువ వంద (99); అశ్వమేధంబులున్ = అశ్వమేధయాగములు; సత్ = మంచి; మేధంబునన్ = తెలివితేటలుతో; కావించి = ఆచరించి; నూఱవ = వందవ (100); యాగంబున్ = యాగము; అందున్ = లో; యజ్ఞపతి = నారాయణుడు {యజ్ఞపతి - యజ్ఞములకు అధిపతి, విష్ణువు}; ఐన = అయిన; పుండరీకాక్షునిన్ = నారాయణుని యెడ; యజించుచుండన్ = యజ్ఞము చేస్తుండగ; తదీయ = ఆ యొక్క; పరమ = గొప్ప; ఉత్సవంబున్ = ఉత్సవమును; సహింపంలేక = సహించలేక.

భావము:

పరమభక్తులచేత సేవింపబడేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు మొదలైనవి సమకూర్చేదై కూడ సర్వకామితాలను పిదికేదై సమస్త పదార్థాలను సమకూర్చింది. చెట్లు తమ ఆకారాలను పెంపొందించి తేనెలను కురుస్తూ చెఱకు ద్రాక్ష మొదలైన రసాలను; పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, పానకం మొదలైన వానిని వర్షింపగా అవి నదులై ప్రవహించాయి. సముద్రాలు వజ్రాలు మొదలైన వివిధ రత్నాలను సమర్పించాయి. పర్వతాలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు అనే నాలుగు విధాలైన భోజన పదార్థాలను సిద్ధపరిచాయి. లోకపాలకులతో కూడి సకల జనులు కానుకలు తెచ్చి సమర్పించారు. ఈ విధంగా విష్ణుభక్తుడైన పృథు చక్రవర్తి మహావైభవంతో తొంబదితొమ్మిది అశ్వమేధ యాగాలను బుద్ధి కౌశలంతో పూర్తి చేసి నూరవ యాగాన్ని ప్రారంభించి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధింపసాగాడు. ఆ మహాయజ్ఞ వైభవాన్ని చూచి అసూయపడి…

4-511-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రేంద్రుఁడు ఘనరోషో
ద్గముఁడై పాషండ వేషలితతిరోభా
మునం దన్మఖపశువుం
గ్రమేది హరించి చనియె గనంబునకున్.

టీకా:

అమరేంద్రుడు = దేవేంద్రుడు; ఘన = మిక్కిలి; రోష = క్రోధము; ఉద్గముడు = ఉద్భవించినవాడు; ఐ = అయ్యి; పాషండ = పాషండునివంటి; వేష = వేషము; కలిత = కలిగిన; తిరోభావమున = అదృశ్యరూపమున; తత్ = ఆ; మఖపశువున్ = యజ్ఞపశువు (అశ్వము)ను; క్రమమున్ = పద్దతిని; ఏది = విడిచి; = హరించి = దొంగిలించుకొని; చనియెన్ = పోయెను; గగనంబున్ = ఆకాశమున; కున్ = కు.

భావము:

దేవేంద్రుడు పట్టలేని రోషంతో పాషండ వేషం ధరించి, ఎవరికీ కనుపించకుండా యజ్ఞశాలకు వచ్చి యజ్ఞపశువును అపహరించి ఆకాశమార్గం పట్టాడు.

4-512-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు చను నప్పుడు.

టీకా:

అట్లు = ఆ విధముగ; చనున్ = వెళ్ళే; అప్పుడు = సమయములో.

భావము:

ఆ విధంగా (యజ్ఞపశువును తీసుకు) వెళ్తున్నప్పుడు…

4-513-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘుం డగు నత్రి మహా
ముని చోదితుఁ డగుచుఁ బృథుని పుత్రుఁడు బాణా
తూణీర ధరుండై
నిమిషపతి వెనుకఁ జనియె తిదర్పమునన్.

టీకా:

అనఘుండు = పుణ్యుడు; అగున్ = అయిన; మహా = గొప్ప; ముని = మునిచే; చోదితుడు = ప్రేరేపించబడు తున్నవాడు; అగుచున్ = అవుతూ; పృథున్ = పృథుచక్రవర్తి; పుత్రుడు = కుమారుడు; బాణాసన = విల్లు; తూణీర = అమ్ములపొది; ధరుండు = ధరించినవాడు; ఐ = అయ్యి; అనిమిషపతి = ఇంద్రుడు {అనిమిషపతి - అనిమిషుల (దేవతల)కి పతి, ఇంద్రుడు}; వెనుకన్ = వెంట; చనియెన్ = పడెను; అతి = మిక్కిలి; దర్పమునన్ = దర్పముతో.

భావము:

అత్రి మహాముని అది గమనించి పృథు చక్రవర్తి కొడుకును హెచ్చరించగా అతడు విల్లు అమ్ములపొది ధరించి దర్పాతిశయంతో దేవేంద్రుని వెంబడించాడు.

4-514-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు చనిచని ముందట.

టీకా:

అట్లు = ఆ విధముగ; చనిచని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగ.

భావము:

అలా (దేవేంద్రుని వెనుక) వెళ్ళి వెళ్ళి ఎదురుగా…

4-515-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ్ఞ సాధన పశురణుని వధియించు-
ర్మంబునందు నర్మ మనెడి
బుద్ధిఁ బుట్టఁగఁ జేయ భూరి మాయా వేష-
ధారియై యరుగు సుత్రాముఁ గదిసి
నిలు నిలు మని యార్చి నిజగుణధ్వని చేసి-
న జటాభస్మాస్థి లిత మయిన
మూర్తిఁ గనుంగొని మూర్తీభవించిన-
ర్మంబ కా బుద్ధిఁ లఁచి యమర

4-515.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాకుని మీఁద సాయక మేయఁ జాల
కున్నఁ గనుఁగొని యత్రి విద్వన్నుతుండు
వైన్యజునకనె వాసవు లను చూపి
నములోపల రోషంబు ల్లడింప.

టీకా:

యజ్ఞ = యజ్ఞమునకు; సాధన = పరికరమైన; పశున్ = బలిపశువు (అశ్వము); హరణుని = ఎత్తుకుపోవువానిని; వధియించు = సంహరించెడి; ధర్మంబు = ధర్మము; అందున్ = లో; అధర్మము = అధర్మము; అనెడి = అనెడి; బుద్ధిన్ = భావమును; పుట్టగన్ = కలుగునట్లు; చేయన్ = చేయుటకు; భూరి = అతిమిక్కిలి; మాయా = మాయతోకూడిన; వేష = వేషమును; ధారి = ధరించినవాడు; ఐ = అయ్యి; అరుగు = వెళ్లెడి; సుత్రామున్ = ఇంద్రుని; కదిసి = దగ్గరకువెళ్ళి; నిలునిలు = ఆగుము; అని = అని; ఆర్చి = అరిచి; నిజ = తన; గుణ = వింటినారిని; ధ్వనిన్ = శబ్దము; చేసి = చేసి; ఘన = గొప్ప; జటా = జటలు; భస్మ = విభూతి; అస్థి = ఎముకలు; కలితము = కలిగినది; అయిన = అయినట్టి; మూర్తిన్ = స్వరూపమును; కనుంగొని = చూసి; మూర్తీభవించిన = రూపుదాల్చిన; ధర్మంబ = ధర్మమే; కాన్ = అయినట్లు; తలచి = అనుకొని; అమరనాయకుని = ఇంద్రుని {అమరనాయకుడు - అమరుల (దేవతల) నాయకుడు, ఇంద్రుడు}; మీదన్ = పైన.
సాయకమున్ = బాణములను; ఏయన్ = వేయ; చాలక = లేకుండగ; ఉన్నన్ = ఉండగ; కనుగొని = చూసి; అత్రి = అత్రి; విద్వత్ = విద్వాంసులచే; నుతుండు = స్తుతింపబడువాడు; వైన్యజున్ = పృథువుపుత్రుని; కిన్ = కి; అనె = చెప్పెను; వాసవున్ = ఇంద్రుని; వలను = వైపు; చూపి = చూపించి; మనము = మనసు; లోపలన్ = లోపలనుండి; రోషంబున్ = రోషము; మల్లడింపన్ = పొడుచుకురాగా.

భావము:

ధర్మంలో అధర్మాన్ని పుట్టించే మాయావేషం ధరించి యజ్ఞపశువును దొంగిలించి తీసుకొని పోతున్న ఇంద్రుని సమీపించి పృథుపుత్రుడు “నిలు! నిలు!” అంటూ నారిని మ్రోగించాడు. కాని జడలు ధరించి, బూడిద పూసికొని, ఎముకలను దాల్చిన ఇంద్రుని రూపాన్ని చూచి ఆకారం ధరించిన ధర్మమేమో అని భ్రమించాడు. యజ్ఞసాధనమైన పశువును దొంగిలించినవానిని చంపటం ధర్మమే అయినా అధర్మం అనిపించింది. అందువల్ల పృథుకుమారుడు ఇంద్రునిపై బాణం వేయలేకపోయాడు. అది చూచి మహాత్ముడైన అత్రిముని కోపంతో ఇంద్రుని చూపిస్తూ పృథుసుతునితో…

4-516-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

“విను మితఁడు యజ్ఞహంతయు
నిమిషనికరాధముండు గు నింద్రుఁడు గా
వు నితని జయింపుము నీ”
ని ముమ్మా ఱుచ్చరింప వ్వైన్యజుఁడున్.

టీకా:

వినుము = వినుము; ఇతడున్ = ఇతడు; యజ్ఞ = యజ్ఞము; హంతయున్ = ధ్వంసము చేసినవాడు; అనిమిష = దేవతల; నికర = సమూహమున, నిశ్ఛయమైన; అధముండు = నీచుడు; కావునన్ = కనుక; ఇతనిన్ = ఇతనిని; = జయింపుము = జయించు; నీవు = నీవు; అని = అని; ముమ్మాఱు = మూడు (3) మార్లు; ఉచ్చరింపన్ = పలుకగా; ఆ = ఆ; వైన్యజుడున్ = పృథుని పుత్రుడు.

భావము:

“ఈ ఇంద్రుడు యజ్ఞ ఘాతకుడు. దేవతలలో పరమ పాతకుడు. కాబట్టి నీవు ఇతణ్ణి జయించు” అని మూడుసార్లు పలికాడు. అప్పుడు పృథుచక్రవర్తి కుమారుడు…

4-517-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విను వీధిం జను దేవవల్లభునిపై వీరుండు గ్రోధాంతరం
నిరూఢిన్ మృగరా ట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీఁ
ను లంఘించు విధంబునం బడిన నాతం డశ్వ చౌర్యైక సా
రూపంబుఁ దదశ్వమున్ విడిచి యంర్ధానముం బొందినన్.

టీకా:

వినువీధిన్ = ఆకాశమార్గమున; చనున్ = పోయెడి; దేవవల్లభునిన్ = ఇంద్రుని; పైన్ = మీద; వీరుండు = శూరుడు; క్రోధ = రోషముతోకూడిన; అంతరంగ = చిత్త; నిరూఢిన్ = స్థైర్యముతో; మృగరాట్ = సింహపు; కిశోరము = పిల్ల; మహా = గొప్ప; గంధ = మదించిన; ద్విప = ఏనుగులలో; ఇంద్రమున్ = శ్రేష్ఠమైనదాని; మీదనున్ = పైకి; లంఘించు = దూకెడి; విధంబునన్ = విధముగ; పడినన్ = ఉరికగా; అతండు = అతడు; అశ్వ = గుఱ్ఱమును; చౌర్య = దొంగిలించుటకు; ఏక = కొరకు; సాధన = సాధనమైన; రూపంబున్ = స్వరూపమును; తత్ = ఆ; అశ్వమున్ = గుఱ్ఱఱ్ఱమును; విడిచి = విడిచిపెట్టి; అంతర్ధానమున్ = అదృశ్యము; పొందినన్ = చెందగా.

భావము:

సింహకిశోరం మదపుటేనుగు మీదికి లంఘించినట్లు ఆకాశంలో వెళ్తున్న ఇంద్రుని పైకి వీరుడైన పృథుకుమారుడు దుమికాడు. ఇంద్రుడు దొంగ వేషాన్ని, యజ్ఞపశువును విడిచిపెట్టి అదృశ్యమయ్యాడు.

4-518-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వీరుఁడు పృథు భూపాలకు
మారుఁడు నిజ యజ్ఞపశువు రలం గొని దు
ర్వాబలుఁ డగుచు జనకుని
భూరి సవనరాజపుణ్యభూమికి వచ్చెన్.

టీకా:

వీరుడు = శూరుడు; పృథు = పృథువు అనెడి; భూపాల = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; నిజ = తమ; యజ్ఞపశువున్ = యజ్ఞపశువుని; మరలంగొని = వెనుకకు మరలించుకొని; దుర్వార = వారింపరాని; బలుడు = బలము కలవాడు; అగుచున్ = అవుతూ; జనకునిన్ = తండ్రి యొక్క; భూరి = అతి పెద్ద; సవన = యాగములలో; రాజ = శ్రేష్ఠముయొక్క; పుణ్య = పుణ్యవంతమైన; భూమి = ప్రదేశమున; కిన్ = కి; వచ్చెన్ = వచ్చెను.

భావము:

వీరుడైన పృథుకుమారుడు దుర్వార పరాక్రమంతో యజ్ఞపశువును మరలించుకొని పుణ్యభూమి అయిన జనకుని యాగశాలకు చేరుకున్నాడు.

4-519-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున నచ్చట నున్న పరమర్షిపుంగవు లతని యద్భుత కర్మంబు గనుంగొని యాశ్చర్యంబు నొంది యతనికి ‘జితాశ్వుం" డను నన్వర్థ నామంబు పెట్టి యున్న సమయంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; అచటన్ = అక్కడ; ఉన్నన్ = ఉన్నటువంటి; పరమ = గొప్ప; ఋషి = ఋషులలో; పుంగవులు = ఉత్తములు; అతని = అతని; అద్భుత = అద్భుతమైన; కర్మంబున్ = కార్యమును, పనిని; కనుంగొని = చూసి; ఆశ్ఛర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; అతని = అతని; కిన్ = కి; జితాశ్వుండు = జితాశ్వుడు {జితాశ్వుడు - జిత (జయించిన) అశ్వము కలవాడు, పృథుని కొడుకు}; అను = అనెడి; అన్వర్థ = సార్థకమైన; నామంబున్ = పేరును; పెట్టి = పెట్టి; ఉన్న = ఉన్నటువంటి; సమయంబునన్ = సమయములో.

భావము:

ఆ సమయంలో అక్కడ ఉన్న మునివరేణ్యులు అతని అద్భుత కృత్యాన్ని చూచి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడు అనే సార్థకమైన పేరు పెట్టారు. ఆ సమయంలో…

4-520-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియును దేవతాపతి తమః పటలంబు జనింపఁ జేసి యె
వ్వరుఁ దనుఁ గానకుండ ననివారణఁ గాంచనపాశ బద్ధ మై
సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుఁ గొంచుఁ జె
చ్చె వినువీధి నేగఁగ ఋషిప్రవరుం డగు నత్రి చెప్పినన్.

టీకా:

మఱియునున్ = మరల; దేవతాపతి = ఇంద్రుడు; తమః = చీకటి; పటలంబున్ = తెరలను; జనింపన్ = కలుగ; చేసి = చేసి; ఎవ్వరున్ = ఎవరు కూడ; తనున్ = తనను; కానకుండన్ = చూడకుండ; అనివారణన్ = అడ్డులేక; కాంచన = బంగారు; పాశ = తాటిచే; బద్దము = కట్టబడినది; ఐ = అయ్యి; = సు = మంచి; రుచిర = అందమైన; యూపదారు = యూపస్తంభమున {యూపదారువు - యజ్ఞము నందు పశుబంధనార్థము నాటిన పైపట్టలేని కొయ్య (స్తంభము)}; పరి = మిక్కిలి; శోభితము = శోభిల్లుతున్నది; ఐన = అయిన; హయంబున్ = గుఱ్ఱమును; కొంచున్ = తీసుకుపోతూ; చెచ్చెర = వేగముగా; వినువీధిన్ = ఆకాశమార్గమున; ఏగగాన్ = వేళుతుండగ; ఋషి = ఋషులలో; ప్రవరుండు = శ్రేష్ఠుడు; అగు = అయిన; అత్రి = అత్రి; చెప్పినన్ = చెప్పగా.

భావము:

ఇంద్రుడు చిమ్మచీకటిని కల్పించి అదృశ్యరూపంలో మళ్ళీ వచ్చి బంగారు త్రాళ్ళతో కట్టివేసి ఉన్నయజ్ఞాశ్వాన్ని దొంగిలించి వేగంగా నింగివైపు వెళ్ళాడు. అది చూచి అత్రిమహర్షి చెప్పగా...

4-521-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విని పృథు భూవర తనయుఁడు
బలమునఁ జని కపాలట్వాంగము లో
లిని ధరియించి రయంబునఁ
ను నింద్రునిఁ గాంచి నొంపఁజాలక యంతన్.

టీకా:

విని = విని; పృథు = పృథువు అనెడి; భూవర = రాజు యొక్క; తనయుడు = పుత్రుడు; ఘన = అత్యధికమైన; బలమునన్ = బలముతో; చని = వెళ్ళి; కపాల = పుఱ్ఱెను; ఖట్వాంగముల్ =శివుని చేతిలో ఉండు గద వంటి ఆయుధము, మంచముకోడు; ఓలిన్ = అవశ్యము; ధరియించి = తాల్చి; రయంబునన్ = శ్రీఘ్రముగా; చనున్ = పోయెడి; ఇంద్రునిన్ = ఇంద్రునిని; కాంచి = చూసి; ఒంపన్ = చంప; చాలక = లేక; అంతన్ = అంతట.

భావము:

రాజపుత్రుడు జితాశ్వుడు ఇంద్రుని వెన్నంటాడు. కాని పుఱ్ఱెను, ఖట్వాంగాన్ని (శివుని చేతిలో ఉండే గద లాంటి ఆయుధము) ధరించి కపటవేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చంపటానికి సందేహించాడు.

4-522-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్రమ్మఱ నత్రిచేఁ దెలుపఁగాఁబడి వైన్యతనూభవుండు రో
మ్మునఁ దోఁకఁ ద్రొక్కిన భుజంగమపుంగవుఁ బోలి యుగ్రుఁడై
మ్మరిఁబోసినం గని సురాధిపుఁ డెప్పటి యట్లఁ బాఱె న
శ్వమ్మును రూపమున్ విడిచి చాలఁ దిరోహితుఁడై రయంబునన్.

టీకా:

క్రమ్మఱన్ = మరల; అత్రి = అత్రి; చేన్ = చేత; తెలుపగాబడి = తెలుపబడి; వైన్య = పృథువు; తనూభవుండు = పుత్రుడు; రోషమునన్ = రోషముతో; తోకన్ = తోకను; తొక్కిన = తొక్కిన; భుజంగమ = సర్ప; పుంగవున్ = శ్రేష్ఠము; పోలి = వలె; ఉగ్రుడు = క్రోధము కలవాడు; ఐ = అయ్యి; అమ్మున్ = బాణమును; అరిన్ = వింటిమధ్యభాగమున; పోసినన్ = సంధించగా; కని = చూసి; సురాధిపుడు = ఇంద్రుడు {సురాధిపుడు - సురలు (దేవతల)కి అదిపతి, ఇంద్రుడు}; ఎప్పటియట్ల = ఎప్పట్లాగే; పాఱెన్ = పారిపోయెను; అశ్వమ్మునున్ = గుఱ్ఱమును; రూపమున్ = (మాయా) స్వరూపమును; విడిచి = వదిలేసి; చాలన్ = చలించిపోయి; తిరోహితుడు = మాయమైనపోయినవాడు; ఐ = అయ్యి; రయంబునన్ = వేగముగా.

భావము:

అత్రి మహర్షి రాజపుత్రుని మళ్ళీ పురికొల్పగా అతడు తోక త్రొక్కిన పామువలె కోపించి బాణాన్ని సంధించాడు. ఇంద్రుడు తన కపట రూపాన్ని, అశ్వాన్ని విడిచి మళ్ళీ అంతర్ధానమయ్యాడు.

4-523-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు చనినం బశువుం గొని మరలి యవ్వీరోత్తముండు పితృ యజ్ఞ శాలకుం జనుదెంచె; నంత.

టీకా:

అట్లు = అలా; చనిన్ = పోగా; పశువున్ = యజ్ఞపశువుని (గుఱ్ఱమును); కొని = తీసుకొని; మరలి = వెనుతిరిగి; ఆ = ఆ; వీర = వీరులలో; ఉత్తముండు = ఉత్తముడు; పితృ = తండ్రి యొక్క; యజ్ఞ = యాగ; శాల = శాల; కున్ = కి; చనుదెంచెన్ = వచ్చెను; అంత = అప్పుడు;

భావము:

ఇంద్రుడు ఆ విధంగా వెళ్ళిపోగా ఉత్తమవీరుడైన పృథుతనయుడు బలిపశువుని తీసికొని తండ్రి యజ్ఞశాలకు వచ్చాడు.

4-524-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిహయుం డధ్వర య హరణార్థమై-
మించి కైకొని విసర్జించి నట్టి
భూరి యమంగళ భూత మాయారూప-
ములను ధరించిరి మూఢజనులు;
పాషండ చిహ్నముల్ ఱఁగుట వారలు-
గతిపై నగ్నవేములు గలుగు
జైనులు భూరి కాషాయ వస్త్రంబులు-
రియించు బౌద్ధులుఁ గ జటాస్థి

4-524.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

స్మధారులు నయిన కాపాలికాదు
నఁగ వెలసిరి లోకంబులందుఁ జాలఁ
లఁప ధర్మోపమం బనఁగు నధర్మ
మందు నభిరతి వొడమిన జ్ఞజనులు.

టీకా:

హరిహయుడు = ఇంద్రుడు {హరిహయుడు - హరి (ఐరావతము అనెడి ఏనుగు) వాహనముగ కలవాడు, ఇంద్రుడు}; అధ్వర = యాగ; హయ = అశ్వమును; హరణ = తీసుకుపోవుట; అర్థము = కోసము; ఐ = అయ్యి; మించి = అతిశయించి; కైకొని = చేపట్టి; విసర్జించినట్టి = వదలివేసినట్టి; భూరి = అతిమిక్కిలి; అమంగళభూత = అశుభమైన; మాయా = మాయా; రూపములనున్ = స్వరూపములను; ధరించిరి = తాల్చిరి; మూఢ = మూర్ఖపు; జనులు = జనములు; పాషండ = వేదధర్మస్పందించనివారి; చిహ్నముల్ = గుర్తులుగ; పఱగుటన్ = ప్రసిద్ధమగుటచే; వారలు = వారు; జగతి = లోకము; పైన్ = మీద; నగ్న = దిగంబర; వేషములున్ = వేషములు యందు; కలుగు = ఉండెడి; జైనులు = జైనులు; భూరి = బహుపెద్ద; కాషాయ = కాషాయపురంగు; వస్త్రంబులున్ = వస్త్రములను; ధరియించు = ధరించెడి; బౌద్ధులున్ = బౌద్ధులు; తగ = తెగ; జటా = జటలు; అస్థి = ఎముకలు.
భస్మ = వీభూది; ధారులు = ధరించెడివారు; అయిన = అయిన; కాపాలిక = కాపాలికులు; ఆదులు = మొదలగువారు; అనగన్ = అని; వెలసిరి = ప్రసిద్ధులైరి; లోకంబునన్ = లోకముల; అందున్ = లో; చాలన్ = ఎక్కువగా; తలపన్ = తరచిచూసిన; ధర్మ = వేదధర్మమునకు; ఉపమంబున్ = పోల్చదగ్గది; అనన్ = అనుటకు; తగు = తగిన; అధర్మము = అధర్మము; అందున్ = ఎడల; అభిరతి = అభిరుచి; ఒడమిన్ = కలిగిన; అయజ్ఞ = తెలిసికొనలేని; జనులు = వారు.

భావము:

ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగిలించటం కోసం ధరించి విడిచిన అమంగళకరాలైన మాయారూపాలను మూర్ఖులైన మానవులు గ్రహించారు. ఆ రూపాలు పాషండ చిహ్నాలు. దిసమొలలతో తిరిగే జైనులు, కావిగుడ్డలు కట్టే బౌద్ధులు, జడలు ఎముకలు భస్మం ధరించే కాపాలికులు మొదలైనవారు పాషండులు. ఈ విధంగా లోకంలో అధర్మమందు ఆసక్తి కలిగిన మూర్ఖులు…

4-525-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరియింపం దొడంగిరి; తద్వృత్తాంతంబు భగవంతుం డయిన పృథుచక్రవర్తి యెఱింగి కుపితుండై యుద్యతకార్ముకుం డగుచు నింద్రుని మీఁద బాణంబుఁ నేయ నుద్యమించిన ఋత్విక్కులు శక్రవధోద్యుక్తుండు నసహ్య రంహుండు నయిన పృథు చక్రవర్తిం గనుంగొని యిట్లనిరి.

టీకా:

తదీయ = ఆయా; చిహ్నంబులున్ = గుర్తులను; పారంపర్యంబుగాన్ = సంప్రదాయముగా; ధరియింపన్ = ధరించుట; తొడంగిరి = మొదలిడిరి; తత్ = ఆ; వృత్తాంతంబున్ = వృత్తాంతమును; భగవంతుండు = మహిమాన్వితుడు; అయిన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; ఎఱింగి = తెలిసి; కుపితుండు = కోపము కలవాడు; ఐ = అయ్యి; ఉద్యత్ = ఎత్తిపట్టిన; కార్ముకుండు = విల్లు కలవాడు; అగుచున్ = అవుతూ; ఇంద్రునిన్ = ఇంద్రుని; మీదన్ = పైన; బాణంబున్ = బాణములను; ఏయన్ = వేయుటకు; ఉద్యమించినన్ = సిద్దపడగా; ఋత్విక్కులు = యజ్ఞము చేసెడివారు; శక్ర = ఇంద్రుని; వధ = వధించుటకు; ఉద్యుక్తుండున్ = సిద్దపడినవాడు; అసహ్య = సహింపరాని; రంహుండున్ = వడి కలవాడు; అయిన = అయినట్టి; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఆ పాషండ చిహ్నాలను పరంపరగా ధరించడం మొదలు పెట్టారు. ఇంద్రుడు హయాన్ని అపహరించిన సంగతి పృథుచక్రవర్తి తెలుసుకొని కోపంతో విల్లెక్కు పెట్టి అపరాధి అయిన అమరేంద్రుని మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋత్విక్కులు ఇంద్ర సంహారానికి పూనుకున్న పృథుచక్రవర్తిని చూచి ఇలా అన్నారు.

4-526-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"జనాయక! యజ్ఞములం
నుపమ విధిచోదితంబు నఁదగు పశు బం
హింసల కా కితరుల
దీక్షితునకు వధింపఁ గాదండ్రు బుధుల్.

టీకా:

జననాయక = రాజా; యజ్ఞముల్ = యాగముల; అందున్ = లో; అనుపమ = సాటిలేని; విధి = విధానములచే; చోదితంబులు = నడపబడునవి; అనన్ = అనుటకు; తగు = తగిన; పశు = యజ్ఞపశువును; బంధన = బంధించుట; హింసలు = సంహారములు; కాక = కాకుండ, తప్పించి; ఇతరులన్ = ఇతరులను; ఘన = గొప్ప; దీక్షితున్ = దీక్షలో యున్నవాని; కున్ = కి; వధింపన్ = సంహరించుట; కాదు = సరికాదు; అండ్రు = అంటారు; బుధుల్ = జ్ఞానులు.

భావము:

“మహారాజా! యజ్ఞాలలో యజ్ఞదీక్షితుడైనవాడు యజ్ఞపశువును తప్ప మరి ఎవ్వరినీ వధింపరాదని విద్వాంసులు అంటారు.

4-527-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున నీ విపు డింద్రవధోద్యోగం బుపసంహరింపుము; భవదీయ ధర్మవిరోధి యైన యట్టి యింద్రుని.

టీకా:

కావునన్ = అందుచేత; నీవున్ = నీవు; ఇంద్ర = ఇంద్రుని; వధ = వధించెడి; ఉద్యోగంబున్ = ప్రయత్నమును; ఉపసంహరింపుము = విడువుము; భవదీయ = నీ యొక్క; ధర్మ = ధర్మబద్ధమైన; విరోధిన్ = శత్రువు; ఐనయట్టి = అయినట్టి; ఇంద్రునిన్ = ఇంద్రుని.

భావము:

కాబట్టి నీవు ఇంద్రుణ్ణి సంహరించే ప్రయత్నాన్ని విరమించు. నీకు ధర్మవిరోధి అయిన ఇంద్రుణ్ణి….

4-528-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాల! వీర్యవంతము
నఁదగు మంత్రములచేత నాహ్వానము చే
సి నతఁ డిచటికి వచ్చును
నుదెంచిన యమరవిభుని రభసత దగన్.

టీకా:

జనపాల = రాజా {జనపాలుడు - జనులను పరిపాలించెడివాడు, రాజు}; వీర్యవంతములు = శక్తిమంతములు; అనన్ = అనుటకు; తగు = తగిన; మంత్రములన్ = మంత్రముల; చేతన్ = చేత; ఆహ్వానము = పిలుచుట; చేసినన్ = చేసినచో; అతడున్ = అతడు; ఇచటి = ఇక్కడ; కిన్ = కి; వచ్చును = వచ్చును; చనుదెంచిన = వచ్చిన; అమరవిభునిన్ = ఇంద్రుని; సరభసతన్ = తొందరగా; తగన్ = తగినట్లు.

భావము:

రాజా! శక్తివంతాలైన మంత్రాలచేత ఆహ్వానిస్తే అత డిక్కడికి వస్తాడు. అలా వచ్చిన ఇంద్రుని వెంటనే…

4-529-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ధృతి చెదరఁ బట్టి శిఖి కా
హుతిఁగా వేల్చెదము; దాన నుర్వీవర! నీ
విత మహో హత వీర్యో
న్నతుఁడై చెడిపోవు నమరనాథుం డంతన్."

టీకా:

ధృతి = ధైర్యము; చెదరన్ = చెదిరిపోవునట్లుగా; పట్టి = పట్టుకొని; శిఖి = అగ్ని; కిన్ = కి; ఆహుతి = ఆహుతి, కాలిపోవునట్లు; కాన్ = అగునట్లు; వేల్చెదము = హోమము చేసెదము, కాల్చెదము; దానన్ = దానివలన; ఉర్వీవర = రాజా {ఉర్వీవరుడు - ఉర్వి (భూమి)కి వరుడు, రాజు}; నీ = నీ యొక్క; వితత = విస్తారమైన; మహస్ = తేజస్సుచే; హత = కొట్టబడిన; వీర్య = శౌర్యము యొక్క; ఉన్నతుడు = అతిశయము కలవాడు; ఐ = అయ్యి; చెడిపోవున్ = చెడిపోవును; అమరనాథుడున్ = ఇంద్రుడు; అంతన్ = అప్పుడు.

భావము:

అతని ధైర్యం చెదరిపోగా పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తాము. రాజా! దానితో అతడు తన బలాన్ని కోల్పోయి పతనమౌతాడు.”

4-530-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పృథుని వారించి ఋత్విగ్జనంబులు గుపితస్వాంతులై హస్తంబుల స్రుక్సువంబులు ధరియించి వేల్చు సమయంబునం జతుర్ముఖుండు చనుదెంచి ఋత్విజులం గనుంగొని యిట్లనియె “యజ్ఞంబు లందు యజింపంబడు దేవత లెవ్వని యంశంబు; లెవ్వండు యజ్ఞ నామకంబగు భగవదంశంబగు, నట్టి యింద్రుండు మీచేత వధార్హుండు గాఁ డితండు భగవదంశ సంభవుం డగుట నీ యజ్ఞకర్మవిధ్వంసనేచ్చుం డయి కావించు ధర్మవ్యతికరంబులు చూచుచుండవలయుం గాని ప్రతీకారంబులు గర్తవ్యంబులు గా; వీ పృథుకీర్తి యగు నీ పృథునకు నేకోనశతంబగు నధ్వరప్రయోగ ఫలంబు సిద్ధించుం గాక" యని పృథు చక్రవర్తి కిట్లనియె.

టీకా:

అని = అని; పృథునిన్ = పృథుచక్రవర్తిని; వారించి = ఆపి; ఋత్విక్ = యజ్ఞముచేయువారైన; జనంబులు = వారు; కుపిత = కోపించిన; స్వాంతులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; హస్తంబులన్ = చేతులందు; స్రుక్ = హోమమునకు నేతిని తీసెడి తెడ్డు; స్రువంబులున్ = హోమమున నేతిని వేల్చెడి తెడ్డు; ధరియించి = దాల్చి; వేల్చు = వేల్చెడి; సమయంబునన్ = సమయములో; చతుర్ముఖుండు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు}; చనుదెంచి = వచ్చి; ఋత్విజులన్ = యజ్ఞము చేయువారిని; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; యజ్ఞముల్ = యాగముల; అందున్ = లో; యజింపంబడు = యాగము చేయబడు; దేవతలు = దేవతలు; ఎవ్వని = ఎవని; అంశంబుల్ = అంశలు కలవారు; ఎవ్వండు = ఎవడు; యజ్ఞ = యజ్ఞము అనెడి; నామకంబున్ = పేరు కలిగినది; అగు = అయిన; భగవత్ = భగవంతుని; అంశంబున్ = అంశము; అగును = అగును; అట్టి = అటువంటి; ఇంద్రుండు = ఇంద్రుడు; మీ = మీ; చేతన్ = చేత; వధ = వధింపబడుటకు; అర్హుండు = తగినవాడు; కాడు = కాడు; ఇతండున్ = ఇతడు; భగవత్ = భగవంతుని; అంశ = అంశచే; సంభవుండు = పుట్టునవాడు; అగుటన్ = అగుటచేత; ఈ = ఈ; యజ్ఞ = యజ్ఞము యొక్క; కర్మ = కర్మలను; విధ్వంసన = నాశనము చేసెడి; ఇచ్ఛుండు = కోరువాడు; అయి = అయ్యి; కావించు = చేసెడి; ధర్మ = వేదధర్మమునకు; వ్యతికరంబులు = వ్యతిరేకమైనవి; చూచుచున్ = చూస్తూ; ఉండవలయున్ = ఉండవలెను; కాని = అంతేకాని; ప్రతీకారంబులు = ప్రతీకారములు చేయుట; కర్తవ్యంబులు = తగిన పనులు; కావు = కావు; ఈ = ఈ; పృథు = మిక్కిలి; కీర్తి = కీర్తి కలవాడు; అగు = అయిన; ఈ = ఈ; పృథున్ = పృథువున; కున్ = కు; ఏకోనశతంబున్ = ఒకటితక్కువనూరు (99); అగు = అయిన; అధ్వర = యాగములను; ప్రయోగ = చేసిన; ఫలంబున్ = ఫలితము; సిద్ధించుంగాక = పొందునుగాక; అని = అని; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను.

భావము:

అని ఋత్విక్కులు పృథువును ఆపి, కోపంతో చేతులలో స్రుక్కులు, స్రువాలు ధరించి వేల్చడానికి పూనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఋత్విక్కులను చూచి ఇలా అన్నాడు “యజ్ఞాలలో పూజింపబడే దేవతలు ఇంద్రుని అంశాలు. ఈ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు కలిగిన భగవంతుని అంశం కాబట్టి ఇతడు చంపదగినవాడు కాదు. భగవంతుని అంశం వల్ల పుట్టటం వలన యజ్ఞాన్ని పాడు చేయాలనే కోరికతో ఇతడు చేసిన ధర్మవ్యతికరాన్ని ఉపేక్షించి చూస్తూ ఉండవలసిందే కాని ప్రతీకారం చేయరాదు. ఈ పృథుచక్రవర్తికి తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసిన ఫలం సిద్ధిస్తుంది” అని చెప్పి బ్రహ్మదేవుడు పృథువుతో ఇలా అన్నాడు.

4-531-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుజేంద్ర! మోక్షధర్మము నెఱింగిన నీకు-
వనముల్ చేయుట చాలు మఱియు
నే విధంబున నైన దేవేంద్రు మనమునఁ-
గైకొని రోషంబు దురకుండ
ర్తింప వలయును; వాసవుండును నీవుఁ-
బూని సుశ్లోకులు గా మీకు
మంగళం బగుఁ గాక; మానవనాథ! నీ-
చిత్తంబులోపలఁ జింతఁ దొఱఁగి

4-531.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మించి మద్వాక్యముల నాదరించి వినుము
దైవ హతమగు యజ్ఞంబుఁ గిలి చేయు
కొఱకు భవదీయ చిత్తంబు గుంది రోష
లుషితంబైన నజ్ఞాన లిత మగును.

టీకా:

మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మనుజులకి ఇంద్రుడు వంటివాడు, రాజు}; మోక్ష = మోక్షము యొక్క; ధర్మమున్ = ధర్మమును; ఎఱింగిన = తెలిసిన; నీకున్ = నీకు; సవనముల్ = యజ్ఞములు; చేయుట = చేయుట; చాలు = ఇంకచాలు; మఱియున్ = ఇంకను; ఏవిధంబునన్ = ఏవిధముగాను; ఐనన్ = అయినప్పటికిని; దేవేంద్రున్ = ఇంద్రునియెడల; మనమునన్ = మనసులో; కైకొని = చేపట్టి; రోషంబున్ = రోషమును; కదురకుండగన్ = స్థిరపడకుండగా; వర్తింపవలయును = నడవవలెను; వాసవుండును = ఇంద్రుడును; నీవున్ = నీవు; పూని = ధరించిన; సుశ్లోకులు = విష్ణుమూర్తులే; కాన = కావున; మీకున్ = మీకు; మంగళంబున్ = శుభములు; అగుగాక = అగునుగాక; మానవనాథ = రాజా; నీ = నీ యొక్క; చిత్తంబు = మనసు; లోపలన్ = లోపల; చింతన్ = వ్యాకులమును; తొఱగి = తొలగించుకొని.
మించి = మిక్కిలిగ; మత్ = నా యొక్క; వాక్యంబులన్ = మాటలను; ఆదరించి = కూర్మితో; వినుము = వినుము; దైవ = దేవునిచేత; హతము = దెబ్బతిన్నది; అగు = అయిన; యజ్ఞంబున్ = యజ్ఞమును; తగిలి = కోరి; చేయు = చేయుట; కొఱకున్ = కోసము; భవదీయ = నీ యొక్క; చిత్తంబున్ = మనసున; కుంది = దుఃఖపడి; రోష = రోషముచేత; కలుషితంబున్ = కలుషితము; ఐనన్ = అయినచో; అజ్ఞాన = అజ్ఞానముతో; కలితము = కూడినది; అగును = అగును.

భావము:

“రాజా! నీకు మోక్షధర్మం తెలుసుకదా! ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం విరమించు. ఇంతవరకు చేసిన యజ్ఞాలు చాలు. మోక్షధర్మం తెలిసినవాడవు కనుక శతయజ్ఞాలు చేయటం వలన కలిగే ఫలం నీవు కోరరానిది. ఏ విధంగానైనా సరే.. ఇంద్రుడు నిన్ను ద్వేషించకుండా చూడు. నీవు ఇంద్రునిపై కోపాన్ని విడిచిపెట్టు. ఇంద్రుడు, నీవు శ్రీహరి అంశంవల్ల పుట్టినవారు. కాబట్టి మీరు కలిసి ఉండాలి కాని కలహింపకూడదు. మీకు శుభం కలుగుతుంది. రాజా! నీవు యజ్ఞం భంగమయిందని చింతింపవద్దు. నా మాటలు జాగ్రత్తగా విను. దైవోపహతమైన యజ్ఞాన్ని చేయటానికి నీవు పూనుకున్నావు. అది నెరవేరలేదు. అందుకని నీవు కోపంతో ఉడికిపోరాదు. కోపం వల్ల అజ్ఞానం పెంపొందుతుంది.

4-532-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భవదీయ యజ్ఞహననార్థం బశ్వహరణుం డైన యింద్రుండు దేవతల లోనన్ దురాగ్రహుం డగుటం జేసి యతనిచేత నిర్మింపంబడి చిత్తాకర్షకంబులైన యీ పాషాండ ధర్మంబుల చేత ధర్మ వ్యతికరంబు గలుగుం గాన యీ యజ్ఞంబు చాలింపు;” మని మఱియు నిట్లనియె.

టీకా:

భవదీయ = నీ యొక్క; యజ్ఞ = యజ్ఞమును; హనన = నాశనముచేయుట; అర్థంబు = కొరకు; అశ్వ = గుఱ్ఱమును; హరణుండు = దొంగిలించినవాడు; ఐనన్ = అయినట్టి; ఇంద్రుండు = ఇంద్రుడు; దేవతల = దేవతల; లోనన్ = లో; దురాగ్రహుండు = బాగ పట్టుదల కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; అతని = అతని; చేతన్ = చే; నిర్మింపంబడి = సృష్టింపబడి; చిత్త = మనసునకు; ఆకర్షకంబులు = ఆకర్షించునవి; ఐన = అయిన; ఈ = ఈ; పాషాండ = వేద స్పందన లేని; ధర్మంబుల్ = ధర్మముల; చేతన్ = వలన; ధర్మ = ధర్మము; వ్యతికరంబున్ = చెదరుట; కలుగున్ = ఏర్పడును; కాన = కావున; ఈ = ఈ; యజ్ఞంబున్ = యాగమును; చాలింపుము = ఆపివేయుము; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

నీ యజ్ఞాన్ని చెడగొట్టటం కోసం ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు. ఇంద్రుడు దేవతలలో చాల పట్టుదల కలవాడు. అతనివల్ల నిర్మింపబడిన పాషండ ధర్మాలవల్ల ధర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి నీ యజ్ఞాన్ని చాలించు” అని మళ్ళీ ఇలా అన్నాడు.

4-533-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ది గాక వినుము; వేనాపచారంబునఁ-
బూని విలుప్తంబు లై యట్టి
లఘు నానా సమయానుధర్మంబులఁ-
రిపాలనము చేయఁ రఁగి వేను
దేహంబు వలనను దివిరి జనించి యు-
న్నాడవు; నారాయణాంశజుఁడవు;
గావున నీ నరలితలోకంబునఁ-
బుట్టిన తెఱఁగు నీ బుద్ధిఁ దలఁచి

4-533.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యెవరిచే నేమిటికి సృజియింప బడితి
ట్టి యా బ్రహ్మసంకల్ప వనినాథ!
ప్పకుండంగఁ బాలింపు ర్మగతినిఁ
జారుశుభమూర్తి! యో! పృథుక్రవర్తి! "

టీకా:

అది = అదే; కాక = కాకుండగ; వినుము = వినుము; వేనా = వేనుని యొక్క; అపచారంబునన్ = అపచారమును; పూని = ధరించి; విలుప్తంబులు = నశించిపోయినవి; ఐనయట్టి = అయినట్టి; అలఘు = గొప్ప; నానా = వివిధ; సమయా = కాలముము; అను = అనుసరించెడి; ధర్మంబులన్ = ధర్మములను; పరిపాలనము = రక్షించుట; చేయన్ = చేయుటకై; పరగి = ప్రసిద్ధముగను; వేను = వేనుని యొక్క; దేహంబు = శరీరము; వలనను = నుండి; తివిరి = కోరి; జనించియున్నాడవు = పుట్టినావు; నారాయణ = హరి యొక్క; అంశజుడవు = అంశతోపుట్టినవాడవు; కావునన్ = అందుచేత; ఈ = ఈ; నర = మానవులతో; కలిత = నిండిన; లోకంబునన్ = లోకములో; పుట్టిన = పుట్టినట్టి; తెఱగున్ = విధమును; నీ = నీ యొక్క; బుద్ధిన్ = మనసులో; తలచి = తరచిచూసి.
ఎవరి = ఎవరి; చేన్ = చేత; ఏమిటి = ఎందుల; కిన్ = కు; సృజియింపబడితివి = సృష్టింపబడితివి; అట్టి = అటువంటి; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుని; సంకల్పమున్ = ఉద్దేశ్యమును; అవనినాథ = రాజా; తప్పకుండగ = తప్పిపోకుండగ; పాలింపు = అనుసరించుము; ధర్మ = ధర్మబద్దమైన; గతినిన్ = విధానముగ; చారు = చక్కటి; శుభమూర్తి = శుభకర స్వరూపముకలవాడ; ఓ = ఓ; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి.

భావము:

అంతేకాదు… నీ తండ్రి వేనుడు చేసిన అత్యాచారాల వల్ల నశించిన ధర్మాలను తిరిగి రక్షించడానికి విష్ణుదేవుని అంశం వల్ల వేనుని శరీరం నుండి నీవు జన్మించావు. ఈ విశ్వం ఎవరివల్ల పుట్టింధో ఆలోచించు. ఈ విశ్వంలో ఎవరు ఎందుకు నిన్ను సృష్టించారో విచారించు. నిన్ను సృజించిన ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చు. భువనకల్యాణమూర్తీ! ధర్మాన్ని రక్షించు.”

4-534-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు నిట్లనియె “నుపధర్మ మాతయుం బ్రచండ పాషండ మార్గంబు నైన యీ యింద్రకృతం బగు మాయను జయింపు” మని వనజసంభవుం డానతిచ్చినం బృథుచక్రవర్తియుఁ దదాజ్ఞాపితుండై దేవేంద్రునితోడ బద్ధ సఖ్యుం డయ్యె; నంత నవభృథానంతరంబున.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉపధర్మ = అప్రధానధర్మమును; మాతయున్ = పుట్టించినది; ప్రచండ = భయంకరమైన; పాషండ = వేద బాహ్యమైన; మార్గంబునున్ = విధానము; ఐన = అయినట్టి; ఈ = ఈ; ఇంద్ర = ఇంద్రునిచేత; కృతంబున్ = చేయబడినది; అగు = అయిన; మాయనున్ = మాయను; జయింపుము = నిరోధించుము; అని = అని; వనజసంభవుండు = బ్రహ్మదేవుడు; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; పృథుచక్రవర్తియున్ = పృథుచక్రవర్తి; తత్ = అతనిచే; ఆజ్ఞాపితుండు = ఆజ్ఞపింబడినవాడు; ఐ = అయ్యి; దేవేంద్రుని = ఇంద్రుని; తోడన్ = తోటి; బద్ద = గట్టి; సఖ్యుండు = స్నేహము కలవాడు; అయ్యెన్ = ఆయెను; అంతన్ = తరువాత; అవభృథ = అవభృథస్నానము {అవభృథము - యజ్ఞదీక్షాంతంబునచేసెడి స్నానము}; అనంతరంబునన్ = తరువాత.

భావము:

అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “అధర్మాన్ని పుట్టిచేది, వేదబాహ్యమైన భయంకర మార్గం పట్టించేది అయిన ఈ ఇంద్రుని మాయను నిరోధించు” అని బ్రహ్మ ఆజ్ఞాపించగా పృథుచక్రవర్తి ఆ ఆజ్ఞను తలదాల్చి ఇంద్రునితో స్నేహం చేసాడు. యజ్ఞం పరిసమాప్తమైనట్లుగా అవబృథ స్నానం చేసాడు.

4-535-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సురుచిర లబ్ధ దక్షిణల సొంపునఁ బొంపిరిపోయి భూసురుల్
రుసను బెక్కు దీవన లవారణ నిచ్చిరి; సర్వదేవతల్
రిత ముదంతరంగములఁ బాయనివేడ్క వరంబు లిచ్చి రా
వరుఁ డైన వైన్యునకు నందిత కీర్తికిఁ బుణ్యమూర్తికిన్.

టీకా:

సు = మిక్కిలి; రుచిర = చక్కగా; లబ్ధ = లభించిన; దక్షిణల = దక్షిణల; సొంపునన్ = సొంపువలన; పొంపిరిపోయి = ఉబ్బిపోయి; భూసురుల్ = బ్రాహ్మణులు; వరుసన్ = వరుసగా; పెక్కు = అనేకమైన; దీవనలన్ = దీవెనలను; అవారణన్ = అడ్డు లేని విధమున; ఇచ్చిరి = చేసిరి; సర్వ = సమస్తమైన; దేవతల్ = దేవతలు; భరిత = సంతృప్తి చెందిన; ముద = సంతోషించిన; అంతరంగములన్ = మనసులతో; పాయని = విడువని; వేడ్కన్ = కుతూహలముతో; వరంబుల్ = వరములను; ఇచ్చిరి = ఇచ్చిరి; ఆ = ఆ; నరవరుడు = రాజు; ఐన = అయిన; వైన్యున్ = పృథువున; కున్ = కు; నందిత = పొగడబడిన; కీర్తి = కీర్తి కలవాని; కిన్ = కి; పుణ్య = పుణ్యవంతమైన; మూర్తి = స్వరూపము కలవాని; కిన్ = కి.

భావము:

ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు భూరి దక్షిణలు పొంది మిక్కిలి తృప్తి చెంది పెక్కు దీవెన లిచ్చారు. దేవత లందరు ప్రీతి చెంది పుణ్యమూర్తియైన పృథువుకు అనేక వరాలను ప్రసాధించారు.

4-536-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నచ్చటి జనంబు లిట్లనిరి.

టీకా:

అంతన్ = అంతట; అచ్చటి = అక్కడి; జనంబుల్ = వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అప్పుడు అక్కడి ప్రజలు ఇలా అన్నారు.

4-537-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నఘ! నీ చేత నాదృతు లైరి సర్వ
నులు మఱి దానమానోపచారములను
బితృ సుదేవర్షి మానవ వితతి పూజ
నొంది సంచిత మోదంబు నొందె నయ్య!

టీకా:

అనఘ = పుణ్యుడా; నీ = నీ; చేతన్ = వలన; ఆదృతులు = ఆదరిపబడినవారు; ఐరి = అయిరి; సర్వ = సమస్తమైన; జనులున్ = వారును; మఱి = మఱి; దాన = దానములు; మాన = గౌరవించుటలు; ఉపచారములను = సేవించుటలతోను; పితృ = పితరులు; దేవ = దేవతలు; ఋషి = ఋషులు; మానవ = మనుష్య; వితతి = సమూహములు; పూజన్ = పూజనములను; ఒంది = పొంది; సంచిత = మిక్కిలి, పోగుపడ్డ; మోదంబున్ = సంతోషమును; ఒందెన్ = పొందెను; అయ్య = తండ్రీ.

భావము:

“పుణ్యాత్మా! నీచేత సర్వజనులు సత్కరింపబడ్డారు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు దానమానోపచారాల చేత పూజింపబడ్డారు. సంతోషించారు.”

4-538-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞవిభుండును భగవంతుండును నైన సర్వేశ్వరుం డింద్ర సమేతుండై యచ్చటికిం జనుదెంచి యా పృథున కిట్లనియె.

టీకా:

అని = అని; పలుకు = పలికెడి; సమయంబునన్ = సమయములో; యజ్ఞ = యజ్ఞమును; భోక్తయున్ = అనుభవించువాడును; యజ్ఞ = యజ్ఞమునకు; విభుండునున్ = ప్రభువు; భగవంతుడున్ = భగవంతుడును; ఐన = అయినట్టి; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి; ఇంద్ర = ఇంద్రునితో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అచ్చటి = అక్కడి; కిన్ = కి; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; పృథున్ = పృథువున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని చెప్తుండగా యజ్ఞభోక్త, యజ్ఞేశ్వరుడు, భగవంతుడు అయిన శ్రీహరి ఇంద్రునితో కూడి అక్కడికి వచ్చి పృథుచక్రవర్తితో, , ,

4-539-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

“జవర! భవదీయంబై
నుతమగు నశ్వమేధ తమున కిపు డీ
నిమిషపతి భంగము చే
సి కతన క్షమాపణంబు చేసెడిఁ గంటే.

టీకా:

జనవర = రాజా; భవదీయంబు = నీది; ఐ = అయ్యి; జన = జనులచే; నుతము = స్తుతింపబడెడివి; అగు = అయిన; అశ్వమేధ = అశ్వమేధయాగములు; శతమున్ = నూరింటి (100); కిన్ = కి; ఇపుడున్ = ఇప్పుడు; ఈ = ఈ; అనిమిషపతి = ఇంద్రుడు {అనిమిషపతి - అనిమిష (దేవతల)కి పతి, ఇంద్రుడు}; భంగము = భగ్నము; చేసిన = చేసిన; కతనన్ = కారణముచేత; క్షమాపణంబున్ = క్షమాపణ లడుగుట; చేసెడిన్ = చేయుచుండెను; కంటే = చూశావా.

భావము:

“రాజా! నీ శతాశ్వమేధ దీక్షను భంగం చేసినందుకు నీముందు క్షమాపణం చెప్పుకొనడానికి ఇంద్రుడు వచ్చాడు. చూశావా?”

4-540-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున నితని క్షమింపుము; సత్పురుషు లగువారు దేహాభిమానులు గాకుండుటం జేసి భూతంబుల యెడ ద్రోహం బాచరింప; రట్లగుటం జేసి నీ వంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజనసేవ వ్యర్థంబు గాదె; యదియునుం గాక, యీ శరీరం బవిద్యా కామకర్మంబుల చేత నారబ్ధం బని తెలిసిన పరమజ్ఞాని యీ దేహంబు నందు ననుషక్తుండు గాకుండుట సహజం బన, దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం జెప్ప నేల? యిట్టి దేహంబు నందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మకంబును నగు; దీని దేహంబుకంటె వేఱుగా నెవ్వండు తెలియు వాఁడు మత్పరుడగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు; మఱియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును, నిష్కాముండును, శ్రద్ధాయుక్తుండునై నన్నెల్లప్పుడు భజియించు నట్టివాని మనంబు క్రమంబునం బ్రసన్నంబగు; నట్లు ప్రసన్న మనస్కుండును, ద్రిగుణాతీతుండును, సమ్యగ్దర్శనుండును నైన యతండు మదీయ సమవస్థాన రూపశాంతి నొందు; నదియ కైవల్యపదంబనంబడు; కూటస్థం బైన యీ యాత్మ యుదాసీన భూతం బైనను దీని ద్రవ్యజ్ఞాన క్రియామనంబులకు నీశ్వరుంగా నెవ్వండు దెలియు, వాఁడు భవంబు నొందకుండు; నీ సంసారంబు ద్రవ్య క్రియా కారక చేతనాత్మకం బగుటంజేసి ప్రభిన్న దేహోపాధికంబు; గావునఁ బ్రాప్తంబు లైన యాపత్సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు; కావున నీవు సుఖదుఃఖంబుల యందు సమచిత్తుండవును, సమానోత్తమ మధ్యమాధముండవును, జితేంద్రియాశయుండవునునై వినిష్పాదితాఖి లామాత్యాది సంయుతుండవై, యఖిలలోక రక్షణంబు చేయు” మని వెండియు నిట్లనియె.

టీకా:

కావునన్ = అందుచేత; ఇతనిన్ = ఇతనిని; క్షమింపుము = క్షమించుము; సత్ = మంచివారైనట్టి; పురుషులు = పురుషులు; అగు = అయిన; వారు = వారు; దేహాబిమానులు = స్వార్థము కలవారు; కాకుండుటన్ = కాకపోవుట; చేసి = వలన; భూతంబుల = జీవుల; ఎడ = అందు; ద్రోహంబున్ = ద్రోహమును; ఆచరింపరు = చేయరు; అట్లు = ఆ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; నీ = నీ; వంటి = వంటి; మహాత్ములు = గొప్పవారు; దేవ = దేవుని; మాయా = మాయచేత; మోహితులు = మోహములో పడినవారు; ఐ = అయ్యి; పర = ఇతరులకు; ఉపతాపంబులున్ = సంతాపములు; చేసిరేని = కలుగచేసినచో; దీర్ఘతరంబు = మిక్కిలి దీర్ఘకాలము చేసినది {దీర్ఘము - దీర్ఘతరము - దీర్ఘతమము}; ఐన = అయిన; వృద్ధ = పెద్ద; జన = వారి; సేవ = సేవించుటలు; వ్యర్థంబున్ = వ్యర్థము; కాదే = కాదా; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; శరీరంబు = దేహము; అవిద్యా = అవిద్యతో కూడిన {అవిద్య - విద్య (తత్త్వజ్ఞానమున)కు ఇతరమైనది}; కామ = కోరికలు; కర్మంబుల్ = కర్మములు; చేతన్ = వలన; ఆరబ్ధబున్ = కలిగినది; అని = అని; తెలిసిన = తెలిసికొన్నట్టి; పరమ = మహాగొప్ప; జ్ఞాని = జ్ఞాని; ఈ = ఈ; దేహంబున్ = శరీరము; అందున్ = ఎడల; అనుషక్తుండు = అంటుకొనినవాడు, తగులము కలవాడు; కాకుండుట = కాకపోవుట; సహజంబున్ = స్వభావసిద్దమైనది; అనన్ = అనగా; దేహ = దేహమునందు; ఉత్పాదితంబులు = ఏర్పడినవి; ఐన = అయిన; గృహ = ఇల్లు; దార = భార్య; ఆదులు = మొదలగువైరి; అందున్ = ఎడల; మమత్వంబులున్ = మమకారములు; లేకుండుటన్ = లేకపోవుటను; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; ఇట్టి = ఇటువంటి; దేహంబున్ = శరీరము; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; ఆత్మ = ఆత్మ; ఏకంబునున్ = ఒకటై యున్నది; శుద్ధ = పరిశుద్ధమైన; స్వరూపంబునున్ = స్వరూపము; స్వయంజ్యోతియున్ = స్వయంప్రకాశమైనది; నిర్గుణంబునున్ = త్రిగుణాతీతమైనది; గుణాశ్రయంబున్ = త్రిగుణములకు ఆధారమై యుండెడిది; వ్యాప్య = వ్యాప్యమును {వ్యాప్యము - వ్యాపించుటకు అనువగు అవకాశము}; వ్యాపకంబునున్ = వ్యాపకమును {వ్యాపకము - వ్యాపించెడిది}; అసంవృతంబును = నిరావరణమును, మూయబడనిది; సాక్షీభూతంబును = సర్వమునకు సాక్షిమాత్రమై యుండెడిది; నిరాత్మకంబును = దేహము లేనిది; అగు = అయిన; దీనిన్ = దీనిని; దేహంబున్ = శరీరము; కంటెన్ = కంటె; వేఱుగా = ఇతరమైనదిగ; ఎవ్వండు = ఎవడు; తెలియున్ = తెలిసికొన్నట్టి; వాడు = వాడు; మత్ = నా యందు; పరుండున్ = లగ్నమైన మనసు కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దేహ = శరీరమును; ధారి = ధరించినవాడు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; తత్ = ఆ; గుణంబులన్ = త్రిగుణములను; పొరయకన్ = పొందక; వర్తించున్ = ప్రవర్తించును; మఱియున్ = ఇంకను; ఎవ్వండు = ఎవడు; ఏని = అయితే; స్వ = తన; ధర్మ = ధర్మమును; ఆచార = ఆచరిచుట యందు; పరుండునున్ = లగ్నమైనవాడు; నిష్కాముండును = కోరికలు లేనివాడు; శ్రద్ధా = శ్రద్ధతో; ఆయుక్తుండునున్ = కూడినవాడు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; ఎల్లప్పుడున్ = సతతము; భజియించునట్టి = సేవించెడి; వాని = వాని యొక్క; మనంబున్ = మనసు; క్రమంబునన్ = క్రమముగా; ప్రసన్నంబు = ప్రసన్నము; అగున్ = అగును; అట్లు = ఆ విధముగ; ప్రసన్న = ప్రసన్నమైన; మనస్కుండును = మనసు కలవాడును; త్రిగుణ = త్రిగుణములకు; అతీతుండును = అతీతమైనవాడు; సమ్యగ్దర్శనుండును = ఆత్మ దర్శనము పొందినవాడు; అయిన = ఐన; అతండున్ = అతడు; మదీయ = నా యొక్క; సమ = పరిపూర్ణమైన; అవస్థాన = అస్థిత్వము; రూప = రూపమును; శాంతిన్ = శాంతిని; ఒందును = పొందును; అదియ = అదే; కైవల్యపదంబున్ = కైవల్యపదము {కైవల్యపదము - కేవలము తానే యైన పరమ స్థితి}; అనంబడు = అనబడును; కూటస్థంబున్ = కూటస్థము {కూటస్థము - దేహము అనెడి గూటిలో ఉండెడిది, ఆత్మ}; ఐన = అయిన; ఈ = ఈ; ఆత్మ = ఆత్మ; ఉదాసీనభూతంబున్ = కల్పించుకొనక యుండినది; ఐనను = అయినప్పటికిని; దీని = దీనిని; ద్రవ్య = పదార్థములు, వస్తువు; జ్ఞాన = జ్ఞానము; క్రియ = క్రియలు; మనంబుల్ = మనసుల; కున్ = కు; ఈశ్వరుండు = ప్రభువు; కాన్ = అగునట్లు; ఎవ్వండున్ = ఎవడు; తెలియున్ = తెలియునో; వాడు = వాడు; భవంబున్ = జన్మమును; ఒందకుండున్ = పొందడు; ఈ = ఈ; సంసారంబు = ప్రపంచము; ద్రవ్య = వస్తువు; క్రియా = పని; కారక = పనిచేయువాడు; చేతనా = పనిచేయుమెలకువ; ఆత్మకంబున్ = కూడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; ప్రభిన్న = వేరువేరైన; దేహ = దేహమనెడి; ఉపాదికంబున్ = ఆధారములు కలది; కావునన్ = కనుక; ప్రాప్తంబులు = లభించినట్టివి; ఐన = అయిన; ఆపత్ = ఆపదలు; సంపదల = సంపదలు; అందున్ = ఎడల; మత్ = నాయందు; పరులు = భక్తి కలవారు; ఐన = అయిన; మహాత్ములు = గొప్పవారు; వికారంబున్ = మార్పునకు లోనగుటను; ఒందరు = పొందరు; కావునన్ = అందుచేత; నీవున్ = నీవు; సుఖ = సుఖము; దుఃఖంబుల = దుఃఖములు; అందున్ = ఎడల; సమ = సమానమైన; చిత్తుండవును = భావము కలవాడవు; సమాన = సమానముగా చూడబడెడి; ఉత్తమ = ఉత్తములు; మధ్యమ = మధ్యములు; అధముండవు = అధములు కలవాడవు; జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియముల; ఆశయుండవును = కోరికలు గలవాడవు; ఐ = అయ్యి; వినిష్పాదిత = విశిష్టముగా సిధ్దపరుపబడిన; అఖిల = సమస్త; అమాత్య = మంత్రులు; ఆది = మొదలగువారితో; సంయుతుండవు = కలిసున్నవాడవు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; రక్షణంబున్ = రక్షించుట; చేయుము = చేయుము; అని = అని; వెండియున్ = మరియును; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందువల్ల ఇతనిని క్షమించు. సత్పురుషులకు దేహాభిమానం ఉండదు. కాబట్టి వారు జీవులకు ద్రోహం చేయరు. అందువల్ల నీవంటి మహాత్ములు దేవమాయకు వశులై ఇతరులకు బాధ కలిగింపకూడదు. అంతేకాక ‘ఈ శరీరం అవిద్యవల్ల పుట్టింది’ అని తెలిసిన పరమజ్ఞాని దేహంపై ఆసక్తిని పెంచుకోడు. దేహంపై ఆసక్తి లేనివానికి ఇంటిమీద, భార్యాపుత్రులమీద మమకారం ఉండదని చెప్పనక్కరలేదు కదా! దేహంలోని ఆత్మ పరిశుద్ధమైనది. స్వయంగా ప్రకాశిస్తుంది. సాక్షీభూతమైనది. కాబట్టి ఆత్మను దేహంకంటె వేరు అయినదని తెలిసికొన్న వాడు నాయందు భక్తిని పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు. స్వధర్మాచారాలలో ఆసక్తి కలిగి నిష్కాముడై శ్రద్ధతో నన్ను సేవించేవాని మనస్సు క్రమంగా నిర్మలం అవుతుంది. ఆ విధంగా నిర్మల మనస్కుడు అయినవాడు మోక్షాన్ని పొందుతాడు. కూటస్థమైన ఆత్మ ఉదాసీన మైనప్పటికీ దానిని ద్రవ్యజ్ఞాన క్రియా మనస్సులకు ఈశ్వరునిగా తెలుసుకొనేవాడు సంసార బంధాలలో చిక్కుకొనడు. ఈ సంసారం ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం కాబట్టి వేరువేరు దేహాలు ఉపాధులు కలిగి ఉంటుంది. అందువల్ల ఆపదలు, సంపదలు ప్రాప్తించినప్పుడు మహాత్ములైన నా భక్తులు వికారం పొందరు. కాబట్టి నీవు సుఖదుఃఖాలను సమంగా చూడు. ఉత్తమ, మధ్యమ, అధమ విషయాలలో సమానుడవై ప్రవర్తించి ఇంద్రియాలను జయించి మంత్రులు మొదలైనవారి సాయంతో సమస్త ప్రజలను సంరక్షించు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

4-541-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పార్థివోత్తములఁకుఁ బ్రజల రక్షించుట-
రమ ధర్మం బగు రవరేణ్య!
రణీశులకుఁ బ్రజారిపాలనంబునఁ-
బూని లోకులు చేయు పుణ్యమందు
ష్ఠాంశ మర్థిని సంప్రాప్త మగు నట్లు-
ప్రజలఁ బ్రోవని రాజు ప్రజలచేత
పహృత సత్పుణ్యుఁడై వారు గావించు-
నపాప ఫలముఁ దా నుభవించు

4-541.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాన నీవును విప్రవరానుమతము
సాంప్రదాయిక విధమునై రగు ధర్మ
హిమఁ జేపట్టి యర్థకాముల యందు
మత నమ్మూఁటి యందు నాక్తి లేక.

టీకా:

పార్థివోత్తముల్ = రాజుల {పార్థివోత్తముడు - పార్థివులు (పృథివి (మట్టి)నుండి పుట్టినవారి)లో ఉత్తముడు, రాజు}; కున్ = కు; ప్రజలన్ = ప్రజలను; రక్షించుట = పాలించుట; పరమ = అత్యుత్తమమైన; ధర్మంబున్ = ధర్మము, విధి; అగున్ = అగును; నరవరేణ్య = రాజా; ధరణీశుల్ = రాజుల; కున్ = కు; ప్రజా = ప్రజలను; పరిపాలనంబునన్ = పరిపాలించుటలో; పూని = అవశ్యము; లోకులు = ప్రజలు; చేయు = చేసెడి; పుణ్యము = పుణ్యము; అందున్ = లో; షష్టాంశము = ఎనిమిదోవంతు (1/8); అర్థిన్ = కోరి; సంప్రాప్తము = లభించుట; అగున్ = అయ్యెడి; అట్లు = విధముగా; ప్రజలన్ = లోకులను; ప్రోవని = పాలించని; రాజు = రాజు; ప్రజల్ = లోకులను; చేతన్ = చేత; అపహృత = అపహరింపబడిన; సత్ = సత్కార్యముల; పుణ్యుడు = పుణ్యఫలముకలవాడు; ఐ = అయ్యి; వారు = ఆ ప్రజలు; కావించు = చేసెడి; ఘన = మిక్కిలి; పాప = పాపముల; ఫలమున్ = ఫలితమును; తాన్ = తను; అనుభవించు = అనుభవించును.
కాన = కావున; నీవును = నీవుకూడ; విప్ర = బ్రహ్మణ; వర = ఉత్తములచే; అనుమతము = అంగీకరింపబడినది; సాంప్రదాయిక = సంప్రదాయానుసారమైన; విధమున్ = విధముగా; ఐ = అయ్యి; జరుగు = వర్తింపుము; ధర్మ = ధర్మము యొక్క; మహిమన్ = మహిమను; చేపట్టి = కైకొని; అర్థ = సంపదలు; కామముల = కామితంబులు; అందున్ = ఎడల; సమతన్ = సమత్వముతో; మూటి = ధర్మార్థకామములనెడి మూడింటి (3); అందున్ = లోను; ఆసక్తి = తగులము; లేక = లేకుండగా.

భావము:

“ఓ రాజేంద్రా! ప్రజలను రక్షించటం రాజుల పరమ ధర్మం. ప్రజలు చేసే పుణ్యంలో రాజులకు ఆరవ పాలు లభిస్తుంది. ప్రజలను రక్షింపని రాజుల పుణ్యాలను ప్రజలు హరిస్తారు. ఆ ప్రజల పాపాన్ని రాజు అనుభవిస్తాడు. కాబట్టి నీవు బ్రాహ్మణులు సమ్మతించిన ధర్మాన్ని ప్రధానంగా చేసుకో. అర్థ కామాలను ఆనుషంగికంగా భావించు. ధర్మార్థ కామాలు మూడింటిలోను ఆసక్తిని వీడు.

4-542-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున.

టీకా:

ఇవ్విధంబునన్ = ఈ విధముగ.

భావము:

ఈ విధంగా…

4-543-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నులకు ననురక్తుఁడవై
నాయక! నీవు ధరణి మచిత్తుఁడవై
యముఁ బరిపాలించిన
కాదులఁ గాంతు వాత్మ దనము నందున్.


4-543/1-వ.
అని వెండియు ని ట్లని యాన తిచ్చె.
తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

జనుల్ = లోకులకు; అనురక్తుండవు = కూర్మి కలవాడవు; ఐ = అయ్యి; జననాయక = రాజా; నీవు = నీవు; ధరణిన్ = రాజ్యమును; సమ = సమత్వ; చిత్తుండవు = భావము కలవాడవు; ఐ = అయ్యి; అనయమున్ = సతతము, ఎల్లప్పుడు; పరిపాలించినన్ = పరిపాలించినచో; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు}; ఆదులన్ = మొదలగువారిని; కాంతువు = చూసెదవు; ఆత్మ = స్వంత; సదనమున్ = నివాసము; అందున్ = లో.

భావము:

నీవు ప్రజల అనురాగాన్ని పొంది సమచిత్తంతో పరిపాలించు. రాజా! అలా చేస్తే నీవు నీ ఇంటిలోనే సనకాది మునీంద్రులను సందర్శిస్తావు.

4-544-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూవర! యోగ తపో మఖంబుల చేతఁ-
గైకొని సులభుండఁ గాని యేను
మచిత్తు లైన సజ్జనుల చిత్తంబుల-
ర్తించుచుండెడివాఁడ నగుటఁ
జేసి తావక శమ శీల విమత్సర-
కీర్తనముల వశీకృతుఁడ నైతి;
నే నీకు నొక వరం బిచ్చెద వేఁడుము”-
నావుడు విని మేదినీ రుండు

4-544.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోగురుఁ డైన యప్పుండరీ నయనుఁ
డానతిచ్చిన మృదులలితామృతోప
మానవాక్యము లాత్మీయ స్తకమునఁ
దాల్చి సమ్మోదితాత్ముఁడై రణి విభుఁడు.

టీకా:

భూవర = రాజా; యోగ = యోగము; తపస్ = తపస్సు; మఖంబులున్ = యాగముల; చేతన్ = వలన; కైకొని = పూని; సులభుండన్ = సులువుగాలభించువాడను; కాని = కానట్టి; ఏను = నేను; సమ = సమత్వ; చిత్తులు = భావముకలవారు; ఐన = అయిన; సత్ = మంచి; జనుల = వారి; చిత్తంబులన్ = మనసులలో; వర్తించుచుండెడి = తిరిగెడి; వాడను = వాడిని; అగుటన్ = అగుట; చేసి = వలన; తావక = నీ యొక్క; శమ = ఓర్పు; శీల = మంచినడవడిక; విమత్సర = మాత్సర్యములేకపోవుట; కీర్తనములన్ = సంకీర్తనములచే; వశీకృతుండను = (నీకు) వశుడను; ఐతిన్ = అయితిని; నేన్ = నేను; నీవు = నీవు; కున్ = కు; వరంబున్ = వరములను; ఇచ్చెదన్ = అనుగ్రహించెదను; వేడుము = కోరుకొనుము; నావుడు = అనగా; విని = విని; మేదినీవరుండు = రాజు {మేదినీవరుడు - మేదిని (భూమి)కి వరుడు (పతి), రాజు}.
లోక = లోకములకు; గురుడు = పెద్దవాడు; ఐన = అయిన; ఆ = ఆ; పుండరీకనయనుడు = విష్ణుమూర్తి; ఆనతిచ్చిన = చెప్పిన; మృదు = మెత్తని; లలిత = సుకుమారమైన; అమృత = అమృతముతో; ఉపమాన = సమానమైన; వాక్యముల్ = మాటలను; ఆత్మీయ = తన యొక్క; మస్తకమునన్ = శిరమున; తాల్చి = ధరించి; సమ = మిక్కలి; మోదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; ధరణివిభుడు = రాజు {ధరణివిభుడు - ధరణి (భూమి)కి విభుడు, రాజు}.

భావము:

రాజేంద్రా! తపోయోగ జ్ఞానాల చేత నేను సులభంగా లభించను. కాని సమచిత్తులైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను. కాబట్టి నీ శమశీలాలకు, అసూయారాహిత్యానికి, నీ స్తుతులకు వశుడనయ్యాను. నీకొక వరం ప్రసాదిస్తాను. కోరుకో” అని అన్నాడు. పృథుచక్రవర్తి భగవంతుడైన కమలాక్షుడు అందంగా సున్నితంగా పలికిన అమృతం వంటి తీయని పలుకులను తలపై ధరించి మనస్సులో మహానందం పొందాడు. . .

4-545-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాదములకు భక్తిన్
వితుండై యాత్మకర్మ వితతికి లజ్జం
రుచు నున్న సురేంద్రునిఁ
నుఁగొని సత్ప్రేమ మొదవఁ గౌఁగిటఁ జేర్చెన్.

టీకా:

తన = అతని; పాదముల్ = పాదముల; కున్ = కు; భక్తిన్ = భక్తితో; వినతుండు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; ఆత్మ = తను చేసిన; కర్మ = పనుల; వితతి = సమూహమున; కిన్ = కి; లజ్జన్ = సిగ్గు; తనరుచున్ = విజృంభిస్తుండగా; ఉన్న = ఉన్నట్టి; సురేంద్రునిన్ = ఇంద్రుని; కనుంగొని = చూసి; సత్ = మంచి; ప్రేమము = కూర్మి; ఒదవన్ = పుట్టగా; కౌగిటన్ = కౌగలింతలతో; చేర్చెన్ = చేరదీసెను.

భావము:

తన పాదాలకు భక్తితో నమస్కరించి తాను చేసిన నీచపు పనులకు సిగ్గుపడుతున్న సురేంద్రుణ్ణి పృథువు ప్రేమతో కౌగిలించుకొన్నాడు.

4-546-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు గౌఁగిటం జేర్చి గతద్వేషుండై యున్న యనంతరంబ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కౌగిటంజేర్చి = కౌగిలించుకొని; గత = పోయిన; ద్వేషుండు = ద్వేషము కలవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; అనంతరంబ = తరువాత.

భావము:

ఈ విధంగా కౌగిలించి ద్వేషం మాని ఉన్న తరువాత…

4-547-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వంతుండును విశ్వరూపకుఁడునై భాసిల్లు నవ్విష్ణుఁ డా
తీనాథకృతార్చనా నతులచే సంప్రీత చేతస్కుఁడున్
నిగృహీతాంఘ్రి సరోరుహద్వయుఁడునై నిల్చెం బ్రయాణాభిము
ఖ్యరిష్ఠాత్మకుఁ డయ్యు నా పృథునిపైఁ గారుణ్య మేపారఁగన్.

టీకా:

భగవంతుండును = గొప్ప మహాత్యము కలవాడు, పూజ్యుడు; విశ్వరూపకుండున్ = విశ్వమే స్వరూప మైనవాడు; ఐ = అయ్యి; భాసిల్లున్ = విలసిల్లెడి; ఆ = ఆ; విష్ణుడు = విష్ణుమూర్తి; ఆ = ఆ; జగతీనాథ = పృథుచక్రవర్తిచే; కృత = చేయబడిన; అర్చన = పూజలు; నతులు = స్తోత్రములు; చేన్ = వలన; సంప్రీత = మిక్కిలి ప్రీతి చెందిన; చేతస్కుడును = మనసు కలవాడు; నిగృహీత = చక్కగా గ్రహించ బడిన; అంఘ్రి = పాదములు అనెడి; సరోరరుహ = పద్మముల; ద్వయుడున్ = జంట కలవాడు; ఐ = అయ్యి; నిల్చెన్ = నిలబడెను; ప్రయాణ = బయలుదేరుటకు; అభిముఖ్య = సిద్ధపడెడి; గరిష్ఠ = అధికమైన, గట్టిదైన; ఆత్మకుండు = భావన కలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; ఆ = ఆ; పృథుని = పృథుచక్రవర్తి; పైన = మీద; కారుణ్యము = కృప; ఏపారగన్ = పొంగుతుండగ.

భావము:

భగవంతుడైన విష్ణుదేవుడు పృథుచక్రవర్తి చేసిన పూజా నమస్కారాలను గ్రహించి సంతుష్టి చెందాడు. పృథువు యొక్క భక్తిబంధాలు తన పాదాలను చుట్టుకొని కదలనీయకుండా పట్టుకొనటం వల్ల కనికరంతో ఆగిపోయాడు.

4-548-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు దనమీఁది యనుగ్రహంబునం జేసి విలంబితుం డగుటయు నయ్యాదిరాజన్యుం డైన పృథుచక్రవర్తి యమ్ముకుంద సందర్శనానంద బాష్పజలబిందు సందోహ కందళిత నయనారవిందుండై యవ్విభుమూర్తిం గనుంగొని కనుంగొన లేక గద్గదకంఠుండై పలుకలేక యుండియు నెట్టకేలకుఁ దన హృదయంబున నద్దేవుని నుపగూహనంబు గావించి తన్మూర్తి ధరియించి కన్నులం దొరఁగు నానంద బాష్పంబులు దుడిచికొని విలోకనంబు చేయుచు, నతృప్తదృగ్గోచరుండును, గరుడ స్కంధ విన్యస్త హస్తుండును, వసుధాతలస్థిత పాదకమలుండును నై యొప్పు నద్దివ్యపురుషున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = తన; మీది = పైన గల; అనుగ్రహంబునన్ = అనుగ్రహము; చేసి = వలన; విలంబితుడు = ఆలస్యము చేయుచున్నవాడు; అగుటయున్ = అయ్యెను; ఆ = ఆ; ఆది = మొదటి; రాజన్యుండు = రాజు; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; ఆ = ఆ; ముకుంద = విష్ణుని; సందర్శన = చక్కగ దర్శించెడి; ఆనంద = ఆనందపు; బాష్పజల = కన్నీటి; బిందు = చుక్కల; సందోహ = సమూహముతో; కందళిత = గంత వలె కప్పబడిన; నయన = కన్నులు అనెడి; అరవిందుడు = పద్మములు కలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; విభు = ప్రభువు యొక్క; మూర్తిన్ = స్వరూపమును; కనుంగొనిన్ = చూసియు; కనుంగొనలేక = కానలేక; గద్గద = బొంగురుపోయిన; కంఠుండు = కంఠము కలవాడు; ఐ = అయ్యి; పలుకలేక = మాట్లాడలేక; ఉండియున్ = ఉండికూడ; ఎట్టకేలకున్ = చిట్టచివరకి; తన = తన యొక్క; హృదయంబునన్ = హృదయములో; ఆ = ఆ; దేవునిన్ = దేవుడిని; ఉపగూహనంబున్ = కౌగిలించుకొనుట; కావించి = చేసి; తత్ = అతని; మూర్తిన్ = స్వరూపమును; ధరియించి = నిలుపుకొని; కన్నులన్ = కళ్ళమ్మట; తొరగు = జారెడు; ఆనందబాష్పంబులున్ = సంతోషాశ్రువులను; తుడిచుకొని = తుడుచుకొని; విలోకనంబున్ = బాగా దర్శించుట; చేయుచున్ = చేస్తూ; అతృప్త = సంతృప్తి చెందని విధముగ; దృక్ = కన్నులకు; గోచరుండును = కనిపించెడివాడు; గరుడ = గరుత్మంతుని; స్కంధ = రెక్కపైన; విన్యస్త = ఉంచబడిన; హస్తుండును = చేయి కలవాడును; వసుధాతల = నేలపైన; స్థిత = ఉంచబడిన; పాద = పాదములు అనెడి; కమలుండును = పద్మములు కలవాడు; ఐ = అయ్యి; ఒప్పున్ = చక్కగనున్న; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; పురుషున్ = వాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

తనపై గల అనుగ్రహంతో శ్రీహరి జాగు చేస్తున్నాడని పృథువు గ్రహించాడు. ఆ రాజు కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. కన్నులను బాగుగా విప్పి శ్రీహరిని చూడాలనుకున్నాడు. కాని పొంగి పొరలే కన్నీళ్ళవల్ల తనివి తీరా చూడలేకపోయాడు. డగ్గుత్తికతో పలుకలేకపోయాడు. చివరకు మనస్సులోనే ఆ దేవదేవుని కౌగిలించుకొని కన్నీటిని తుడుచుకున్నాడు. పాద పద్మాలను నేలపై ఉంచి గరుడుని మూపుపై కేలూది నిలుచున్న ఆ పురాణ పురుషునితో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు.