పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సత్పురుష వృత్తి

  •  
  •  
  •  

2-28-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; పరమాత్మ యైన బ్రహ్మంబునకుఁ దక్క కాల దేవ సత్త్వ రజస్తమోగుణాహంకార మహత్తత్త్వ ప్రధానంబులకుఁ బ్రభుత్వంబు లేదు; కావునం బరమాత్మ వ్యతిరిక్తంబు లేదు; దేహాదుల యం దాత్మత్వంబు విసర్జించి యన్య సౌహృదంబు మాని, పూజ్యంబైన హరిపదంబుం బ్రతిక్షణంబును హృదయంబున నాలింగనంబు సేసి, వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమం బని సత్పురుషులు దెలియుదు; రివ్విధంబున విజ్ఞానదృగ్వీర్యజ్వలనంబున నిర్దగ్ధవిషయవాసనుండయి; క్రమంబున నిరపేక్షత్వంబున.

టీకా:

వినుము = విను; పరమాత్మ = పరమాత్మ {పరమాత్మ - అత్యున్నతమైన ఆత్మ, విశ్వము అంతటకిని ఐన జీవుడు}; ఐన = అయినట్టి; బ్రహ్మంబున్ = బ్రహ్మమున; కున్ = కు; తక్క = తప్పించి; కాల = కాలము; దేవ = దేవతలు; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమో = తమస్సు అను; గుణా = గుణములు; అహంకార = అహంకారము; మహత్తత్త్వ = మహత్తత్త్వము; ప్రధానంబులు = సృష్టి హేతుభూతమైన ప్రధానములు; కున్ = కు; ప్రభుత్వంబు = సామర్థ్యము, అధికారము; లేదు = లేదు; కావునన్ = అందువలన; పరమాత్మ = పరమాత్మ; వ్యతిరిక్తంబు = పరాయిది, కానిది; లేదు = లేదు; దేహ = దేహము; ఆదులు = మొదలగు వారు; అందు = లోపల; ఆత్మత్త్వంబున్ = తన దను భావము; విసర్జించి = వదలివేసి; అన్య = ఇతరము లందును; సౌహృదంబున్ = స్నేహము, ఆసక్తి; మాని = విడిచిపెట్టి; పూజ్యంబున్ = పూజింపదగినది; అయిన = అయినట్టి; హరి = భగవంతుని; పదంబున్ = పాదములను; ప్రతి = ప్రతి ఒక్క; క్షణంబునున్ = క్షణమునందును; హృదయంబునన్ = మనస్సులోను; ఆలింగనంబున్ = నిండి నిలుచునట్లుగ; చేసి = చేసుకొని; వైష్ణవంబు = విష్ణువుది; అయిన = అయినట్టి; పరమ = పరములకే పరమైన, అత్యున్నమైన; పదంబున్ = పదమును, స్థితిని; సర్వ = అన్నికంటెను; ఉత్తమంబున్ = ఉత్కృష్టంబు; అని = అని; సత్ = సత్యము తెలిసిన, మంచి; పురుషులున్ = మానవులు; తెలియుదురు = తెలిసికొని ఉందురు; ఈ = ఈ; విధంబునన్ = ప్రకారమైన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము తోకూడిన; దృక్ = దృష్టి యొక్క; వీర్యన్ = శక్తి అను; జ్వలనంబునన్ = జ్వలింపజేయుదానితో, మంటతో; నిర్దగ్ధ = పూర్తిగ కాల్చివేయబడిన; విషయ = ఇంద్రియ విషయముల; వాసనుండు = వాసన మాత్రమైనను కలవాడు; ఐ = అయి; క్రమంబున = క్రమముగ; నిరపేక్షత్త్వంబునన్ = (దేని యందును) అసల్లేని ఆసక్తితో.

భావము:

రాజశేఖరుడా! విను. పరమాత్మయైన బ్రహ్మమునకు తప్ప కాలానికి, కాలప్రభావానికీ లోబడ్డ బ్రహ్మాది దేవతలకూ, సత్త్వరజస్తమస్సులనే త్రిగుణాలకూ, అహంకారానికీ, మహత్తత్త్వానికి, సమస్త సృష్టికీ హేతు భూతమై ప్రధాన మనబడే ప్రకృతికీ ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటు ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయములైన మాధవుని చరణారవిందాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకుంటారు. విష్ణుసంబంధ మగు పరమపదమే అన్నింటికంటె ఉత్తమస్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేని మీదా అపేక్ష లేకుండా ఉంటారు.

2-29-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ-
బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి,
నాభితలముఁ జేర్చి, యముతో మెల్లన-
హృత్సరోజము మీఁది కెగయఁ బట్టి,
టమీఁద నురమందు త్తించి, క్రమ్మఱఁ-
దాలు మూలమునకుఁ ఱిమి నిలిపి,
మతతో భ్రూయుగధ్యంబు సేర్చి దృ-
క్కర్ణ నాసాస్య మార్గములు మూసి,

2-29.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యిచ్చలేని యోగి యెలమి ముహర్తార్థ
మింద్రి యానుషంగ మింత లేక,
ప్రాణములను వంచి, బ్రహ్మరంధ్రము చించి,
బ్రహ్మ మందుఁ గలయుఁ బౌరవేంద్ర!

టీకా:

అంఘ్రి మూలమునన్ = పాదము మొదలుతో, మడమతో; మూల = మొదలు; ఆధార = ఆధారమైన; చక్రంబున్ = చక్రమును {గుదస్థానమున ఉండునది మూలాధార చక్రము}; పీడించి = ఒత్తుతూ; ప్రాణంబున్ = ప్రాణమును, ప్రాణవాయువుని; బిగియన్ = బిగించి; పట్టి = పట్టుకొని; నాభి = బొడ్డు {నాభితలమున ఉండునది - మణిపూరక చక్రము}; తలమున్ = స్థానమునకు; చేర్చి = తీసుకొని వచ్చి; నయము = నేర్పు; తోన్ = తో; మెల్లన = మెల్లగ, జాగ్రత్తగ; హృత్ = హృదయ {హృదయస్థానమందు ఉండునది - అనాహత చక్రము}; సరోజము = పద్మమము; మీఁదికిన్ = పైకి; ఎగయన్ = ఎక్కించి; పట్టి = పట్టుకొని; అటమీదన్ = ఆ తరువాత; ఉరము = వక్షము {వక్షస్థానమున ఉండునది - విశుద్ధ చక్రము}; అందున్ = లోపల; హత్తించి = నొక్కిపెట్టి; క్రమ్మఱన్ = మరల; తాలు = అంగిలి; మూలమున్ = మొదలు; కున్ = నకు; తఱిమి = తోసి; నిలిపి = ఉంచి; మమత = ప్రేమ, ఇష్టము; తోన్ = తో; భ్రూ = కనుబొమల; యుగ = జంట; మధ్యంబున్ = మధ్యప్రదేశమునకు, భృకుటికి {కనుబొమల మధ్యస్థానమున, భృకుటి వద్ద ఉండునది - ఆజ్ఞాచక్రము}; చేర్చి = తరలించి; దృక్ = కళ్ళు; కర్ణ = చెవులు; నాసా = ముక్కు; అస్య = నోరు; మార్గములున్ = దారులను; మూసి = మూసిపెట్టి;
ఇచ్చ = కోరికన్నదే, ప్రాణేచ్చ; లేని = లేనట్టి, నిష్కామ; యోగి = యోగీశ్వరుడు; ఎలమిన్ = వికాసముతో, సంతోషముతో; ముహూర్త = ముహూర్తకాలము, 48 నిమిషాలలో; అర్థము = సగకాలము, గడియ, 24 నిమిషాలు; ఇంద్రియ = ఇంద్రియములతో; అనుషంగము = సంబంధము; ఇంతన్ = కొంచముకూడ; లేక = లేకుండా; ప్రాణములనున్ = ప్రాణములను; వంచి = నిగ్రహించి; బ్రహ్మరంధ్రమున్ = (నడినెత్తిన ఉండు) బ్రహ్మరంధ్రమును {నడినెత్తిన మాడుపట్టు వద్ద ఉండునది - బ్రహ్మరంధ్రము}; చించి = చీల్చుకొని; బ్రహ్మము = పరబ్రహ్మము; అందున్ = లో; కలయున్ = కలసిపోవును; పౌరవేంద్ర = పరీక్షిన్మహారాజా {పౌరవేంద్ర - పురువంశస్థులలోశ్రేష్ఠుడ, పరీక్షిన్మహారాజా, శరీరమనే పురాలలో వసించువారిలో శ్రేష్ఠుడ}.

భావము:

ఓ పురువంశపు రాజా! యోగి పాదమూలంతో గుదస్థానంలో ఉండే మూలాధారచక్రాన్ని అదిమి పడతాడు. ఆ పైన ప్రాణవాయువును బిగబట్టి నాభిస్థానంవద్ద ఉండే మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడనుండి హృదయంలోని అనాహతచక్రానికీ, అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికి, అటునుండి ఆ చక్రాగ్రముండే తాలుమూలానికీ, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మలమధ్య నున్న ఆజ్ఞా చక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్ధముహూర్తకాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మ రంధ్రం భేదించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు.

2-30-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగమంబు విడువని వాఁడు వానితోడన గుణసముదాయ రూపంబగు బ్రహ్మాండంబు నందు ఖేచర, సిద్ధ, విహార, యోగ్యంబును, నణిమాదిక సకలైశ్వర్య సమేతంబును నైన పరమేష్ఠి పదంబుఁ జేరు; విద్యాతపోయోగ సమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పుదురు; రేరికిం గర్మంబుల నట్టి గతిఁబొంద శక్యంబుగాదు; యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశ పథంబునం బోవుచు, సుషుమ్నానాడివెంట నగ్ని యను దేవతం జేరి, జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై యెందునుం దగులువడక, తారామండలంబుమీఁద సూర్యాది ధ్రువాంత పదంబులఁ గ్రమక్రమంబున నతిక్రమించి, హరిసంబంధం బయిన శింశుమారచక్రంబుఁ జేరి, యొంటరి యగుచుఁ బరమాణుభూతం బైన లింగశరీరంబుతోడ బ్రహ్మవిదులకు నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి, మహాకల్పకాలంబు క్రీడించుఁ గల్పాంతంబైన ననంతముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచుఁ, దన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపజాలక.

టీకా:

మఱియున్ = ఇంకను; దేహ = దేహమును; త్యాగ = త్యజించు, విడుచు; కాలంబునన్ = సమయములో; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; తోడిన్ = తో; సంగమంబున్ = సంగమమును, బంధనములను; విడువని = వదలని; వాఁడు = వాడు; వాని = వాటి; తోడన్ = తోపాటు; గుణ = గుణముల యొక్క; సముదాయ = సమూహముల; రూపంబున్ = స్వరూపమును; అగున్ = పొందును; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండము; అందున్ = లోపల; ఖేచర = ఖేచరులు, ఆకాశగమనులు; సిద్ధ = సిద్ధులు {సిద్ధులు - మాతృ గర్భస్థ శిశువును సిద్ధ పరచు దేవతల వంటివారు,}; విహార = విహరించుటకు; యోగ్యంబునున్ = అనువైనదియును, అర్హమైనదియు; అణిమ = అణిమ {అణిమాది - అష్టైశ్వర్యములు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, వశిత్వము, ఈశత్వము}; ఆదిక = మొదలగు; సకల = సమస్త; ఐశ్వర్య = ఐశ్వర్యములు; సమేతంబును = కూడి ఉన్నదియును; ఐన = అయినట్టి; పరమేష్టి = చతుర్ముఖ బ్రహ్మ {పరమేష్టి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; పదంబున్ = లోకమును, స్థితిని; చేరున్ = చేరును, పొందును; విద్యా = నేర్పరత్వము కల; తపస్ = తపస్సు అను; యోగ = యోగము వలని; సమాధిన్ = సమాధిని; భజనంబున్ = సాధనను; చేయుచున్ = చేయుచు; పవన = ప్రాణవాయువు, ప్రాణాయామమున; అంతర్గత = లోపల ఇమిడిన, శరీరములోపల; లింగ = లింగ, వాయువులను; శరీరులు = శరీరముకలవారు, ధరించువారు; ఐన = అయినట్టి; యోగీ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; కున్ = కు; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; బహిర్ = బయటను; అంతరాళంబులున్ = లోపటను ఉండు స్థానములు; గతి = మార్గము, ప్రాప్తించునది; అని = అని; చెప్పుదురు = (పెద్ధలు) చెప్పుతారు; ఏరికిన్ = ఎవరికైనసరే; కర్మంబులన్ = (ఎట్టి) కర్మకాండలతోనైను; అట్టి = అటువంటి; గతిన్ = మార్గము, ప్రాప్తించునది; పొందన్ = పొండుట, చేరుట; శక్యంబున్ = వీలగునది; కాదు = కాదు; యోగి = యోగి; అగు = అయినట్టి; వాఁడు = వాడు; బ్రహ్మ = బ్రహ్మ; లోకంబున్ = లోకమును, స్థానమును; కున్ = కు; ఆకాశ = ఆకాశపు, నిరామయ; పథంబునన్ = మార్గములో; పోవుచున్ = వెళ్ళుతూ; సుషుమ్నా = సుషుమ్న అను {సుషుమ్న, మనోజ్ఞమును ఇచ్చునది}; నాడి = నాడి, ఊర్థ్వగతాత్మక నాడి {నాడి - నరముల కూడలి స్థానము}; వెంటన్ = కూడా; అగ్ని = అగ్ని; అను = అనబడు; దేవతన్ = దేవుని; చేరి = చేరి, పొంది; జ్యోతిర్ = జ్యోతితో, వెలుగుతో; మయంబున్ = కూడినట్టిది; ఐన = అయినట్టి; తేజంబునన్ = తేజస్సు వలన; నిర్మలుండు = మలములు లేనివాడు; ఐ = అయి; ఎందునున్ = దేనికిని; తగులున్ = తగుల్కొనుటలో, బంధనములో; పడక = పడకుండగ, చిక్కుకొనక; తారా = తారల యొక్క; మండలంబున్ = మండలము, లోకము; మీఁదన్ = మీది, లోపలి; సూర్య = సూర్యమండలము; ఆది = మొదలు; ధ్రువ = ధ్రువుని; అంతన్ = వరకు; పదంబులన్ = లోకములను, స్థానములను; క్రమక్రమంబునన్ = వరుసగా; అతిక్రమించి = దాటి; హరిన్ = విష్ణువునకు {హరి - హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము - ఓంకారము}; సంబంధంబున్ = సంబంధిచినట్టి,; అయిన = అయినట్టి; శింశుమార = మొసలి రూప, సూర్యాదులు తిరుగు జ్యోతిర్మండల {శింశుమారచక్రము - హరిపథము, ఓంకారపథము}; చక్రంబున్ = నక్షత్రమండలం, నాభి, ఆధారభూతం; చేరి = చేరి, అందుకొని; ఒంటరిన్ = ఒంటరిగ, ఏకత్త్వమును; అగుచున్ = అగుతూ, పొంది; పరమాణు = పరమాణవు, అతిసూక్ష్మము; భూతంబున్ = వంటిది; ఐన = అయినట్టి; లింగ = లింగ, రూపముకల; శరీరంబున్ = శరీరము; తోడన్ = తో; బ్రహ్మ = పరబ్రహ్మము; విదులున్ = తెలిసినవారు; కున్ = కి; నెలవు = స్థానము, లోకము; ఐన = అయినట్టి; మహర్లోకంబున్ = మహర్లోకము, వెలుగులలోకము; చొచ్చి = ప్రవేశించి; మహాకల్ప = మహాకల్పాంత {మహాకల్పము - బ్రహ్మాండము సృష్టి నుండి ప్రళయము వరకు కల కాలము}; కాలంబున్ = సమయము వరకును; క్రీడించున్ = ఆనందముగ సంచరించును; కల్పాంతంబున్ = కల్పాంతము; ఐనన్ = అయిన తరువాత; అనంత = అనేకమైన, అనంతుడగు శేషుని; ముఖ = కీలలు కల ముఖముల నుండి వెడలు; అనల = అగ్ని; జ్వాలా = జ్వాలలలో; దందహ్య = దహింప; మానంబు = పడుతున్నవి; అగు = అయినట్టి; లోక = లోకముల; త్రయంబున్ = మూటిని, భూ భువ స్సువర్లోకంబులు; ఈక్షించుచున్ = చూచుచు; తత్ = ఆ; నిమిత్త = కారణముగ; సంజాత = పుట్టిన; అనల = అగ్ని; దాహంబు = దహించునది, వేడిమిని; సహింపన్ = భరించుటకు; చాలక = శక్తిలేక.

భావము:

శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్ధులు, విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధులను అనుష్ఠించి లింగశరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల, వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట. కర్మలతో ఎవ్వరు అలాంటి స్థానం పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నానాడీ ద్వారం నుండి బయలుదేరి ఆకాశమార్గంలో పయనిస్తూ అగ్ని దేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకొని నిర్ములుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగుల్కొనడు. నక్షత్రపథం గడచిపోతాడు. ఆ పై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు. తుదకు విష్ణు సంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగశరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు. కల్పాంతంలో అనంతుని వదనమునుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమయి పోతున్న త్రిలోకాలను చూస్తాడు. అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు, అక్కడే నివసిస్తాడు.

2-31-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లమీఁద మనువు లీరేడ్వురుఁ జనువేళ-
దివసమై యెచ్చోటఁ దిరుగుచుండు,
హనీయ సిద్ధవిమాన సంఘము లెందు-
దినకరప్రభములై తేజరిల్లు,
శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ-
నివహంబు లెందు జనింపకుండు,
విష్ణుపదధ్యాన విజ్ఞాన రహితుల-
శోకంబు లెందుండి చూడవచ్చు,

2-31.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమసిద్ధయోగి భాషణామృత మెందు
శ్రవణ పర్వమగుచు రుగుచుండు,
ట్టి బ్రహ్మలోకమందు వసించును
రాజవర్య! మరల రాఁడు వాఁడు.

టీకా:

ఇలన్ = భూమి; మీఁదన్ = పైన; మనువులు = మనువులు; ఈరేడ్వురు = రెండు ఏడులు, పద్నాలుగురు; చనున్ = పోయిన; వేళన్ = సమయమునకు; దివసము = ఒక పగలు; ఐ = అగునట్టి; ఎచ్చోటన్ = ఎక్కడైతే; తిరుగుచున్ = జరుగుతూ; ఉండున్ = ఉండునో; మహనీయ = మహిమకలవారి, గొప్పవారి; సిద్ధ = సిద్ధుల యొక్క; విమాన = ఆకాశ యాన సాధన; సంఘములు = సమూహములు; ఎందున్ = ఎక్కడైతే; దినకర = సూర్యుని {దినకరుడు - దినమునకుకారణుడు, సూర్యుడు}; ప్రభములు = కాంతులు; ఐ = అయ్యి; తేజరిల్లున్ = ప్రకాశించునో; శోక = శోకము; జర = ముసలితనము; మృత్యు = మరణము; శోషణ = శుష్కించుట; భయ = భయము; దుఃఖ = దుఃఖముల; నివహంబులు = సమూహములు; ఎందున్ = ఎక్కడైతే; జనింపకుండున్ = పుట్టకనే; ఉండున్ = ఉండునో; విష్ణు = విష్ణుమూర్తియొక్క; పద = పాదముల; ధ్యాన = ధ్యానించు; విజ్ఞాన = నేర్పులు; రహితుల = లేనివారి; శోకంబులు = దుఃఖములు; ఎందున్ = ఎక్కడ; ఉండి = ఉండి; చూడన్ = చూచుటకు; వచ్చున్ = అవకాశమున్నదో;
పరమ = మహోన్నత; సిద్ధ = సిద్ధిపొందిన; యోగి = యోగుల; భాషణ = భాషణముల, ప్రవచనముల; అమృతము = అమృతము; ఎందున్ = ఎక్కడైతే; శ్రవణ = చెవులకు; పర్వము = పండుగలు; అగుచున్ = అయ్యి; జరుగు = జరుగుచు; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; బ్రహ్మ = బ్రహ్మయొక్క; లోకము = లోకము, పథము; అందున్ = లోపల; వసించును = నివసించును; రాజ = రాజులలో; వర్య = వరుడా, శ్రేష్ఠుడా; మరలన్ = (వెనుకకు) మరలి; రాఁడు = రాడు; వాఁడు = వాడు.

భావము:

నరేంద్రోత్తమా! భూలోకంలో పదునల్గురు మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక పగలు అవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, మృత్యువు, కృశత్వం, భయం, దుఖం – ఇలాంటి బాధ లక్కడలేవు. హరిచరణాలను ధ్యానించాలనే తెలివి లేక మూఢులైన వారి శోకస్థితిని బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులూ, యోగులూ అమృతాప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండువుగా అక్కడ వినవచ్చు. అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకంనుండి తిరిగి రానేరాడు.