పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారాయణుని వైభవం

  •  
  •  
  •  

2-267-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నుత్పత్తిస్థితిలయంబు లెం దగుచుఁ బ్రకాశింపఁబడు నది "యాశ్రయం" బనంబడు; నదియ పరమాత్మ; బ్రహ్మశబ్దవాచ్యంబు నదియ; ప్రత్యక్షానుభవంబున విదితంబుసేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె; నది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి, కాధిదైవి, కాధిభౌతికంబులం ద్రివిధం బయ్యె; నందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తియై యెఱుంగంబడుఁ; జక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవకుం డనందగుఁ; జక్షురాద్యధిష్ఠానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండు నగుచు నెవ్వని యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండును, విరాడ్విగ్రహుండును నగుం; గావున ద్రష్టయు దృక్కును దృశ్యంబు ననందగు నీ మూటి యందు నొకటి లేకున్న నొకటి గానరా దీ త్రితయంబు నెవ్వండెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు; నతండె పరమాత్మయు; నమ్మహాత్ముండు లీలార్థంబైన జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపే క్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె; స్వతః పరిశుద్ధుండు గావున స్వసృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు సేయుటం జేసి "శ్లో| ఆపోనారా ఇతిప్రోక్తా, ఆపోవై నరసూనవః, తా యదస్యాయనం పూర్వం, తేన నారాయణః స్మృతః;" అను ప్రమాణము చొప్పున నారాయణశబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభం; బుపాదానభూతం బయిన ద్రవ్యంబునుఁ ద్రివిధంబయిన కర్మంబును గళాకాష్ఠాద్యుపాధిభిన్నం బయిన కాలంబును, జ్ఞానాదికంబగు జీవస్వభావంబును భోక్త యగు జీవుండును నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తించుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబు గాఁదలంచి యోగ తల్పంబునం బ్రబుద్ధుండై యుండు; నటమీఁద స్వసంకల్పంబునం జేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు నధిదైవతంబును నధ్యాత్మికంబును నధిభూతంబును నను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజియించె.

టీకా:

మఱియున్ = ఇంకను; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయంబులున్ = లయములును; ఎందున్ = దేనిలోనైతే; అగుచుఁన్ = ఉండి; ప్రకాశింపఁబడున్ = ప్రకాశింపబడునో; అదియ = అదే; ఆశ్రయంబున్ = ఆశ్రయము; అనంబడున్ = అనబడును; అదియ = అదే; పరమాత్మ = పరమాత్మ {పరమాత్మ - సమస్త మందును ఉంటూ సమస్తమునకు పరము (పైది) గనుండు తత్త్వము}; బ్రహ్మ = బ్రహ్మ అను; శబ్ద = శబ్దముచే; వాచ్యంబున్ = తెలియబడునది; అదియ = దానినే; ప్రత్యక్ష = ప్రత్యక్షముగ; విదితంబున్ = తెలియునట్లు; చేయున్ = చేయుట; కొఱకున్ = కొరకు; ఆత్మన్ = ఆత్మను; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలగు; విభాగంబులున్ = విభాగములుగ (ఏర్పరచి); చెప్పంబడియెన్ = చెప్పబడినవి; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అంటే; ఆత్మన్ = ఆత్మను; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆధిదైవిక = ఆధిదైవికము; ఆధిభౌతికంబులన్ = ఆధిభౌతికములు అను; త్రి = మూడు; విధంబున్ = విధములు; అయ్యెన్ = ఆయెను; అందున్ = అందులో; ఆధ్యాత్మికంబున్ = ఆధ్యాత్మికము; చక్షుః = కన్నులు {చక్షురాది - ఙ్ఞానేంద్రియములు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము}; ఆది = మొదలగు; గోళకన్ = మండలములు; అంతర = లోపల; వర్తి = వర్తించువాడు; ఐ = అయి; ఎఱుంగంబడుఁన్ = తెలియబడు; చక్షుర = కన్నులు; ఆది = మొదలగు; కరణ = పరికరములు; అభిమాని = అభిమానించు వాడు; ఐ = అయి; ద్రష్ట = ద్రష్ట, చూచువాడు; ఐన = అయిన; జీవుండె = జీవుడే; ఆధిదైవకుండు = ఆధిదైవకుడు; అనన్ = అనుటకు; తగుఁన్ = తగును; చక్షుః = కన్నులు; ఆది = మొదలైన; అధిష్ఠాన = అధిష్ఠించి; అభిమాన = అభిమానముకల; దేవతన్ = దేవత; ఐ = అయి; సూర్య = సూర్యుడు {సూర్యాది అధిష్ఠాన దేవతలు - కంటికి చూపునకు సూర్యుడు, నాలుకకు రుచికి అగ్ని, ముక్కునకు వాసనకు వాయువు, చెవికి శబ్దమునకు ఆకాశము, చర్మమునకు స్పర్శకి భూమి అధిష్ఠాన దేవతలు}; ఆది = మొదలైన; తేజస్ = తేజోరూప; విగ్రహుండున్ = స్వరూపము కలవాడు; అగుచున్ = అగుచు; ఎవ్వని = ఎవని; అందున్ = అందు; ఈ = ఈ; ఉభయ = రెండు; విభాగంబునున్ = విభాగములును; కలుగున్ = కలుగునో; అతండె = అతడె; ఆధిభౌతికుండునున్ = ఆధిభౌతికుడున్; విరాడ్విగ్రహుండునున్ = విరాట్స్వరూపుడును; అగున్ = అగును; కావున = కనుక; ద్రష్టయున్ = చూచువాడును; దృక్కునున్ = దృష్టియును; దృశ్యంబునున్ = దృశ్యమును; అనన్ = అనుటకు; తగున్ = తగును; ఈ = ఈ; మూఁటిన్ = మూడింటి; అందున్ = అందు; ఒకటి = ఒకటి; లేకున్న = లేకపోయిన; ఒకటి = మిగతావానిలో ఒకటి కూడ; కానరాదు = కనబడదు; ఈ = ఈ; త్రితయంబున్ = మూడును, త్రిపుటిని; ఎవ్వండున్ = ఎవరైతే; ఎఱుంగున్ = తెలియునో; అతండు = అతడు; సర్వ = సమస్త; లోక = లోకములకు; ఆశ్రయుండు = ఆశ్రయమైనవాడు, నివాసమైనవాడు; ఐ = అయి; ఉండున్ = ఉండును; అతండె = అతడె; పరమాత్మయునున్ = పరమాత్మ కూడ; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; లీల = తన లీలల; అర్థంబున్ = కోసము; ఐన = అయిన; జగత్ = విశ్వమును; సర్జనంబున్ = సృష్టి; చేయు = చేయు; తలంపునన్ = ఉద్దేశ్యముతో; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; నిర్భేధించి = విడగొట్టి; తనకున్ = తనకు; సుఖ = సుఖమైన; స్థానంబున్ = స్థానమును; అపేక్షించి = కోరి; మొదలన్ = ముందుగ; శుద్ధంబులు = పరిశుద్ధములు; అగు = అయిన; జలంబులన్ = నీటిని; సృజియించెన్ = సృష్టించెను; స్వతః = సహజముగ; పరిశుద్ధుండు = శుద్దమైనవాడు; కావునన్ = కనుక; స్వ = తనచేత; సృష్టంబున్ = సృష్టింపబడినది; ఐ = అయి; ఏక = ఒకే; అర్ణవ = సముద్రపు {అర్ణవము - నీరు కలది - సముద్రము}; ఆకారంబున్ = ఆకారము; ఐనన్ = అయిన; జల = నీటి; రాశిన్ = రాశి; అందున్ = అందు; శయనంబున్ = నివాసము; చేయుటన్ = చేయుట; చేసి = వలన; శ్లో = శ్లోకము -; ఆపః = జలములు; నార = నారములు; ఇతి = అని; ప్రోక్తాః = చెప్పబడినవి; అపః = జలములే; వై = కదా; నరసూనవః = నరునిచే; తాః = అవి; యత్ = ఏ కారణముచేత; అస్య = వీనికి; అయనం = గతి, ఉనికి అయినవో; పూర్వం = మొదట; తేన = ఆ కారణముచేత; నారాయణః = నారాయణుడు అని; స్మృతః = స్మరింప బడినాడు; అను = అనే; ప్రమాణము = ప్రమాణము; చొప్పున = ప్రకారము; నారాయణ = నారాయణ అను; శబ్ద = మాటచే; వాచ్యుండు = తెలియు వాడు; కావునన్ = కనుక; అతని = అతని; ప్రభావంబున్ = ప్రభావమును; వర్ణింపన్ = వర్ణించుట; దుర్లభంబున్ = కష్టమైనది; ఉపాదాన = ఉపాదానము (ప్రధాన కారణము); భూతంబున్ = భూతము (స్వరూపము); అయిన = అయిన; ద్రవ్యంబునున్ = వస్తువు; త్రి = మూడు; విధంబున్ = విధములు; అయిన = అయిన; కర్మంబులునున్ = కర్మములును; కళా = కళలు; కాష్ఠ = కాష్ఠలు; ఆది = మొదలైన; ఉపాధి = ఉపాధులుచే, ఆధారములచే; భిన్నంబున్ = వేరుచేయ బడినవి; అయిన = అయిన; ఙ్ఞాన = ఙ్ఞానము; ఆదికంబున్ = మొదలైనవి; అగు = అయిన; జీవ = జీవుని; స్వభావంబున్ = లక్షణములును; భోక్త = అనుభవించు వాడు; అగు = అయిన; జీవుండునున్ = జీవుడును; ఎవ్వని = ఎవని; అనుగ్రహంబునన్ = అనుగ్రహము; చేసి = వలన; వర్తించున్ = ప్రవర్తింపగలుగుచు; ఉండున్ = ఉండునో; ఎవ్వని = ఎవని; ఉపేక్షన్ = అశ్రద్ద; చేసి = వలన; వర్తింపక = ప్రవర్తింపలేక; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; ప్రభావంబున్ = ప్రభుత్వము, మహిమ; కల = కలిగిన; సర్వేశ్వరుండు = సర్వేశ్వరుడు {సర్వేశ్వరుడు - సర్వమునకు ప్రభువు, భగవంతుడు}; తాన్ = తాను; ఏకము = ఒకటే; అయ్యున్ = అయినప్పటికిని; అనేకంబున్ = అనేకములు; కాన్ = అగుటను; తలంచిన్ = అనుకొని; యోగ = యోగ; తల్పంబునన్ = శయ్య యందు (సమాధి యందు); ప్రబుద్దుండు = మేలుకొని ఉండువాడు; ఐ = అయి; ఉండున్ = ఉండును; అట = ఆ; మీఁదన్ = తరువాత; స్వ = తన; సంకల్పంబునన్ = సంకల్పము; చేసి = వలన; హిరణ్ = బంగారు; మయంబున్ = మయమైనది; ఐనన్ = అయిన; తన = తన; విగ్రహంబున్ = స్వరూపమును; అధిదైవతంబునున్ = అధిదైవతము; అధ్యాత్మికంబునున్ = అధ్యాత్మము; అధిభూతంబునున్ = అధిభూతమును; అను = అనెడి; సంఙ్ఞా = గుర్తులు; ఆయుతంబు = కలిగినది; ఐ = అయి; త్రి = మూడు; విధంబుగాన్ = విధములుగా; సృజియించెన్ = సృష్టించెను.

భావము:

ఇకపోతే, ఈ సృష్టిస్థితిలయాలు సర్వం దేనియందు ప్రకాశిస్తు ఉంటాయో దానిని “ఆశ్రయం” అంటారు. అదే “పరమాత్మ”, “పరబ్రహ్మ” అను పేరులతో కూడ పిలువబడుతుంది. ఇది సమస్తము నందు ఉంటు సమస్తమునకు పరమై ఉండెడిది. దానిని ప్రత్యక్ష అనుభవంగా తెలుపుటకు, అది ఏకమయినను ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మున్నగు విభాగములగా చెప్తుంటారు. అవి ఏవనగా, ఆత్మ ఆధ్యాత్మికము, అధిదైవకము, ఆది భౌతికము అని మూడు విధాలు. నేత్రం మున్నగు గోళకాల యందు తెలియబడుతు ఉండెడివి “ఆధ్యాత్మికం”. నేత్రాది ఇంద్రియాభిమానం కలిగి ద్రష్ట అవుతున్న జీవుడే “ఆధిదైవికుడు”. నేత్రాదులైన అధిష్ఠానలలో అభిమానం కల దేవత యై సూర్యాది తేజస్సులే శరీరంగా కలవాడైన యెవనిలో ఆధ్యాత్మిక, ఆధిదైవికాలు అనే ఈ రెండు విభాగాలు సంభవిస్తాయో అతడే “ఆధిభౌతికుడు”, “విరాట్స్వరూపుడు” కూడ అవుతున్నారు. అందుచేత “చూసేవాడు”. “చూసే సాధనము”, “చూడదగినది” అనబడే ఈ మూడింటిలోను ఏ ఒక్కటి లేకున్నా, మరొకటి కనిపించదు. “త్రిపుటి” అనబడే ఈ మూడింటిని ఎవరు తెలుసుకుంటారో, అతడే సర్వలోకాలకు “ఆశ్రయు”డై ఉంటాడు. “పరమాత్మ” కూడ అతడే. వినోదం కొరకు జగత్తును సృష్టించాలి అనే తలంపు ఆ మహాత్ముడికి కలిగింది. ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించారు. తనకు సుఖస్థానాన్ని కోరి మొదట పవిత్రమైన నీళ్ళను సృష్టించారు. ఆయన సహజంగా పరిశుద్ధుడు. అందువల్ల తాను సృష్టించిన అపారపారావారంలో నున్న జలరాశిలో శయనించాడు. అందుచేతనే,
ఆపో “నారా” ఇతి ప్రోక్తా
ఆపోవై నరసూనవః,
తా యదస్యాయన్మం పూర్వం
తేన “నారయణః” స్మృత
(నరుడనే నామాంతరం కల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీళ్ళకు నారములు అని పేరు. అట్టి నారములు స్థానముగా కలిగి ఉండుటచేత ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది.) ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్దవాచ్యుడు అవుతున్నారు. అటువంటి ఆయన ప్రభావం వర్ణించటం అసాధ్యం. ఉపాధాన కారణ మైన ద్రవ్యం “సంచితం”, “ప్రారబ్దం”, “ఆగామి” అనే మూడు విధాలైన “కర్మము”, “కళ”, “కాష్ఠ” మున్నగు ఉపాధులచే భిన్నమైన “కాలము”, జ్ఞానము మొదలైన జీవుని “స్వభావము”, అనుభించే “జీవుడు”, ఇవన్నీ ఆయన అనుగ్రహం వల్ల ఉనికి కలిగి ఉన్నాయి. ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికిలేదు. అలాంటి మహిమ కలవాడు ఆ సర్వేశ్వరుడు. తాను మొదట ఒకడు అయినా ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగశయనంలో మేలుకొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్నే అధిదైవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేర్లతో మూడు విధాలుగా సృష్టించాడు.