పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మ అధిపత్యం బొడయుట

  •  
  •  
  •  

2-80-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రారా బుధులు; విరక్తులు
గారా; యీ రీతి నడుగఁగా నేరరు; వి
స్మేరావహము భవన్మత
మౌరా! నా విభుని మర్మడిగితి వత్సా!

టీకా:

రారా = పుట్టలేదా; బుధులున్ = బుధులు (ఎంత మందో); విరక్తులున్ = వైరాగ్యము కలవారు (ఎందరో); కారా = కాలేదా; ఈ = ఈ; రీతిన్ = విధముగ; అడుగఁగన్ = అడుగు; నేరరు = నేర్పరులు కారు (ఎవరును); విస్మేరన్ = విస్మయమును; ఆవహము = కలిగించునది; భవత్ = నీ యొక్క; మతము = పద్ధతి; ఔరా = ఔరా; నా = నా; విభునిన్ = ప్రభువు యొక్క; మర్మము = రహస్యములు, తెలియు కిటుకు; అడిగితివి = అడిగినావు; వత్సా = పుత్రా.

భావము:

“కుమారా! నారదా! ఎందరో పండితులు నిత్యం నా వద్దకు వస్తుంటారు. వారందరు విరక్తులే. అయినా వాళ్లెవరూ నీలాగా నన్ను ప్రశ్నించలేదు. నీ యభిప్రాయం నాకెంతో ఆనందం కలిగిస్తున్నది. ఆశ్చర్యం నా ప్రభువు యొక్క మర్మమే అడిగావు.

2-81-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నానా స్థావరజంగమప్రకరముల్ నా యంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబు గా నిచ్చె ము
న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?```

టీకా:

నానా = వివిధములైన; స్థావర = కదలని ప్రాణులు; జంగమ = కదుల ప్రాణులు; ప్రకరముల్ = సమూహములను; నా = నా; అంతన్ = అంతట (నేనే); నిర్మింపన్ = సృష్టించుటకు; విజ్ఞానంబున్ = నైపుణ్యము; ఏమియున్ = ఏ మాత్రమును; లేకన్ = లేక పోవుటచే; తొట్రుపడన్ = తడబాటు పడగ; ఇచ్చన్ = తన ఇష్టప్రకారము; నాకున్ = నాకు; సర్వ = సమస్తమైన; అనుసంధాన = జతపరచే; ఆరంభ = ప్రయత్నము యొక్క; విచక్షణత్వమున్ = వివేకమును, నేర్పరితనమును; మహా = గొప్ప; ఉదారంబుగాన్ = దయతో; ఇచ్చెన్ = ఇచ్చెను; మున్ను = పూర్వము; నేన్ = నేను; ఆ = ఆ; ఈశ్వరున్ = ప్రభువు యొక్క; ఆజ్ఞన్ = ఆనతిని; కాక = కాకుండగ; జగముల్ = లోకములను; నిర్మింపన్ = నిర్మించుటకు; శక్తుండనే = శక్తి కలవాడనా ఏమిటి.

భావము:

ఓ నారదా! విను. నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేనే సృజించటానికి చాలిన తెలివి ఏ కొంచెము లేక పూర్వం తబ్భిబ్బు పడుతున్నాను. ఆ స్థితిలో సమస్త సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నా కా ప్రభువు ఎంతో ఉదారబుద్ధితో అనుగ్రహించాడు. అలాంటి పరమేశ్వరుని ఆనతి లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకెక్కడిది నాయనా

2-82-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?
యి చంద్రానల తారకా గ్రహగణం బే రీతి నా రీతి నె
వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు దద్ధీప్తిచే
నుదీప్తం బగునట్టి యీశ్వరున కే శ్రాంతమున్ మ్రొక్కెదన్.

టీకా:

అనఘా = పాప విరహితుడా; విశ్వమున్ = విశ్వమును, జగత్తును; ఎల్లన్ = అంతటను; దీప్తముగన్ = ప్రకాశము అగునట్లు; చేయగన్ = చేయుటకు; నేన్ = నేను; సమర్థుండనే = సామర్థ్యము కలవాడనా ఏమిటి; ఇనన్ = సూర్యుడు; చంద్రన్ = చంద్రుడు; అనలన్ = అగ్ని; తారకన్ = తారలు, నక్షత్రములు; గ్రహగణంబున్ = గ్రహముల గుంపులని; ఏ = ఏ; రీతిన్ = విధమో; ఆ = ఆ; రీతిన్ = విధముగ; ఎవ్వని = ఎవని వలన మాత్రమే; దీప్తిన్ = వెలుగ వలన, ప్రకాశము వలన; ప్రతిదీప్తము = ప్రతిబింబించునవి; అయ్యెన్ = అయినవో; భువన = లోకములు; వ్రాతంబున్ = సమూహములును; తత్ = అతని; దీప్తి = ప్రకాశము, వెలుగు; చేన్ = చేత; అనుదీప్తంబున్ = ప్రతిఫలించునవి; అగున్ = అగునో; అట్టి = అటువంటి; ఈశ్వరున్ = భగవంతుని, విష్ణుని; కిన్ = కి; ఏన్ = నేను; అశ్రాంతమున్ = అవిరామముగ, నిరంతరముగ; మ్రొక్కెదన్ = కొలచెదను.

భావము:

పాపరహితుడా! ఈ ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవని దివ్య ప్రకాశం వల్ల సూర్యుడు, చంద్రుడు, అగ్నీ, నక్షత్రాలు, గ్రహాలు ఆలాగే ఈ లోకాలన్నీ కూడ సముజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయో, అట్టి దివ్యదీప్తితో తేజరిల్లుతున్న పరమేశ్వరునకు నే నెల్ల వేళలా ప్రణమిల్లుతున్నాను.

2-83-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుమీ; యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గు సంకోచము నొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
ను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీవ్రాతముం జూచి నే
నిశంబున్ నగి ధిక్కరింతు హరిమాయాకృత్య మంచున్ సుతా!

టీకా:

వినుము = ఆలోకించుము; ఈ = ఈ; ఈశ్వరున్ = భగవంతుని, విష్ణుని; దృష్టిన్ = దృష్టి యొక్క; మార్గమునన్ = దారిలో; ఆవేశింపన్ = ఆవేశించుటకు, చొచ్చుటకు; శంకించి = శంకించి, సందేహించి; సిగ్గునన్ = సిగ్గుతో; సంకోచము = కుంచించుకొనిపోవుటను; ఒందున్ = పొందునట్టి; మాయ = మాయ; వలనన్ = మూలమున; కుంఠీభవత్ = కుంటుపడిన, మొక్కవోయిన; ప్రజ్ఞ = తెలివి; చేన్ = చేత; ననున్ = నన్ను; లోక = లోకములకు; ఈశ్వరుఁడు = అధికారి, ప్రభువు; అంచున్ = అనుచు; మ్రొక్కు = నమస్కరించు; మతి = తెలివి; హీన = తక్కువ వారి; వ్రాతమున్ = సమూహమును; చూచి = చూసి; నేన్ = నేను; అనిశంబున్ = ఎల్లప్పుడును; నగి = నవ్వుకొని; ధిక్కరింతున్ = వ్యతిరేకిస్తాను, తిరస్కరిస్తాను; హరి = హరి యొక్క, విష్ణువు యొక్క; మాయా = మాయ వలన; కృతము = జరుగుతున్నది; అంచున్ = అనుకొనుచు; సుతా = పుత్రుడా.

భావము:

ఈ విషయం ఇంకా విశదంగా వినిపిస్తాను, నారదా! విను. మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచించుకపోతుంది. ఈ మాయవల్ల తమ ప్రజ్ఞ కుంఠితం కాగా బుద్ధిలేని వాళ్లు నన్నే లోకవిభుడని భావించి నాకు నమస్కరిస్తుంటారు. వత్సా! అలాంటి మూర్ఖులను చూసి ఇది శ్రీహరి మాయవల్ల జరిగే పని కదా అని నాలో నేను నవ్వుకొని వాళ్లను త్రోసిపుచ్చుతాను.

2-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును జన్మనిమిత్తంబులైన కర్మంబులునుఁ, గర్మక్షోభకంబైన కాలంబునుఁ, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్త యైన జీవుండును, వాసుదేవుండ కా నెఱుంగుము; వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు; సిద్ధంబు నారాయణ నియమ్యంబులు లోకంబులు దేవతలు నారాయణశరీరసంభూతులు; వేద యాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణు నధీనంబు; కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు నయిన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు; నిర్గుణుండైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితిలయంబులకుం బాలుపడి కార్య కారణ కర్తృత్వ భావంబు లందు ద్రవ్యంబులైన మహాభూతంబులును జ్ఞానమూర్తు లయిన దేవతలును గ్రియారూపంబు లయిన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుం డయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు; జీవునకు నావరణంబులయి యుపాధిభూతంబు లయిన మూఁడు లింగంబులు సేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబుగల యీశ్వరుం డివ్విధంబున గ్రీడించుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; దేహంబున్ = శరీరము; కున్ = కి; ద్రవ్యంబులున్ = మూలపదార్థములు, ఖనిజములు {నవద్రవ్యములు - పృథివి, అప్పు (నీరు), తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు (ప్రదేశము), ఆత్మ, మనస్సు}; ఐన = అయినట్టి; మహాభూతంబులును = మహాభూతములును {మహాభూతములు - భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశము, మనస్సు}; జన్మ = జన్మలకు; నిమిత్తంబులున్ = కారణభూతములు; ఐన = అయినట్టి; కర్మంబులునున్ = కర్మలును; కర్మ = కర్మలుకు; క్షోభకంబు = ప్రవృత్తికారణము; ఐనన్ = అయినట్టి; కాలంబునున్ = కాలమును; కాల = కాలానుగుణ; పరిమాణ = మార్పులకు; హేతువు = కారణభూతములు; ఐనన్ = అయినట్టి; స్వభావంబునున్ = స్వభావములును; భోక్త = అనుభవించువాడు; ఐనన్ = అయినట్టి; జీవుండునున్ = జీవుడును; వాసుదేవుండ = వాసుదేవుడే, భగవంతుడే {వాసుదేవుడు - సర్వాత్మల వసించు దేవుడు}; కాన్ = అగును అని; ఎఱుంగుము = తెలియుము; వాసుదేవ = వాసుదేవునికి, భగవంతునికి; వ్యతిరిక్తము = కానిది; లేదు = లేదు; సిద్ధంబున్ = నిశ్చయముగా; నారాయణ = భగవంతుని {నారాయణ – నీట నుండు వాడు}; నియమ్యంబులున్ = ఏర్పాటు చేయబడివి; లోకంబులున్ = లోకములు; దేవతలు = దేవతలు; నారాయణ = భగవంతుడు; శరీర = దేహము నుండి; సంభూతులు = పుట్టినవారు {సంభూతులు - సంభవించినవారు, భూతకాలము కలవారు}; వేద = వేదములు; యాగ = యజ్ఞములు; తపస్ = తపస్సు; యోగ = యోగమార్గములు; విజ్ఞానంబులు = విజ్ఞానములు; నారాయణ = భగవంతుని; పరంబులు = చెందునవి, ఉద్దేశించినవి; జ్ఞాన = జ్ఞనము వలన; సాధ్యంబున్ = సాధ్యము; అగున్ = అయ్యే; ఫలంబున్ = ఫలితము; నారాయణున్ = భగవంతుని; ఆధీనంబున్ = ఆధీనమున ఉండును; కూటస్థుండునున్ = నిర్వికారుడు {కూటస్థుడు - కూటస్థుడై ఉండి వికారముల కతీతముగ ఉండువాడు, నిర్వికారుడు}; సర్వాత్మకుండునున్ = సర్వాంతర్యామి {సర్వాత్మకుడు - సమస్తమునందు ఆత్మగ ఉండువాడు - సర్వాంతర్యామి}; సర్వద్రష్టయున్ = సర్వదర్శనుడును {సర్వద్రష్ట - సర్వమును సరిగ చూచువాడు}; అయిన = అయిన; ఈశ్వరునిన్ = భగవంతుని; కటాక్ష = దయాదృష్టి; విశేషంబునన్ = గొప్పతనమువలన; సృజియింపంబడి = సృష్టిచేయబడి; ప్రేరితుండను = ప్రేరణ పొందినవాడను; ఐ = అయి; సృజ్యంబున్ = సృష్టింపబడవలసినవి; ఐన = అయినట్టి; ప్రపంచంబున్ = విశ్వమంతటిని; సృజించుచున్ = సృష్టిస్తూ; ఉండుదున్ = ఉంటాను; నిర్గుణుండు = గుణములులేనివాడు, గుణాతీతుడు; ఐన = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; వలనన్ = వలననే; రజస్ = రజస్సు; సత్త్వ = సత్వ; తమస్ = తమస్సు; గుణంబులున్ = గుణములును; ప్రభూతంబులున్ = పుట్టిపెరుగునవి; ఐ = అయి; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయంబులున్ = లయములకు; పాలుపడి = పాల్పడి, పూనుకొని; కార్య = కార్యభావము; కారణ = కారణభావము; కర్తృత్వ = కర్తృత్వభావము; భావంబులున్ = అను భావములు; అందున్ = లోపల; ద్రవ్యంబులు = మూలపదార్థములు; ఐన = అయినట్టి; మహాభూతంబులును = పృథివ్యాది మహాభూతములును {మహాభూతములు - పంచభూతములు, మనస్సు}; జ్ఞాన = జ్ఞానము యొక్క; మూర్తులు = స్వరూపములు; అయిన = అయినట్టి; దేవతలును = దేవతలును; క్రియా = క్రియ యొక్క; రూపంబులు = రూపములు; అయిన = అయినట్టి; ఇంద్రియంబులునున్ = ఇంద్రియములును; ఆశ్రయంబులు = ఆశ్రయించునవి; కాన్ = వలె; నిత్య = నిత్యమైన, ఎల్లప్పుడును; ముక్తుండు = ముక్తుడు, నిర్భంధనుడు; అయ్యును = అయినప్పటికిని; మాయా = మాయతో; సమన్వితుండు = కూడి ఉండువాడు; ఐన = అయిన; జీవునిన్ = జీవుడుని; బంధించున్ = బంధిస్తాయి; జీవున్ = జీవున; కున్ = కి; ఆవరణంబులు = ఆవరణలు, పొరలు; అయి = అయి, కమ్మి; ఉపాధిభూతంబులున్ = ఆధారమైనవి, కారణమైనవి; అయిన = అయినట్టి; మూఁడు = మూడు; లింగంబులున్ = శరీరములు, రూపాలు {త్రిలింగములు - స్థూల సూక్ష్మ కారణ అను మూడు శరీరములు, త్రిగుణములు పంచభూతములు ఇంద్రియాదులు}; సేసి = వలన; పరులకున్ = ఇతరులకు; లక్షితంబులు = అందునవి, గోచరించునవి; కాక = కాకుండగ; తనకున్ = తనకు (మాత్రము); లక్షితంబున్ = గోచరించునవి; ఐన = అయినట్టి; తత్త్వంబున్ = తత్వము, లక్షణము; కల = కలిగిన; ఈశ్వరుండు = భగవంతుడు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; క్రీడించుచున్ = క్రీడించుచు, వినోదిస్తూ; ఉండున్ = ఉండును.

భావము:

ఇంకా ఆ పైన. శరీరనిర్మాణానికి ఉపయోగపడే పృథివ్యాది పంచ మహాభూతాలు, పుట్టుకకు హేతువులైన కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము, కాల మార్పులకు కారణమైన స్వభావము, వీటిన అనుభవించే జీవుడు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడే. అన్యమైనది ఏది లేదు. ఇది నిజం. ఈ లోకాన్ని నియమించే వాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరంనుండి పుట్టినవారే; వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తం నారాయణుని ఆరాధనా రూపమైనవే; జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణుని అధీనంలోనే వుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంటిచూపుచే ప్రేరేపింపబడి, గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువు లవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణభావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచ మహాభూతాలనూ, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్ద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్త్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.

2-85-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యీశుఁడ నంతుఁడు హరి
నాకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్,
మాకుఁ బ్రాణివ్రాతము
కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా!

టీకా:

ఆ = ఆ; ఈశుఁడు = భగవంతుడు; అనంతుఁడు = అంతము లేనివాడు; హరి = పాపములను హరించువాడు; నాయకుఁడు = నియామకుడు, ప్రభువు; ఈ = ఈ; భువనముల = లోకముల; కున్ = కి; నాకున్ = నాకును; నీకున్ = నీకును; మాయ = మాయ; కున్ = కిని; ప్రాణి = ప్రాణుల; వ్రాతమున్ = సమూహముల; కిన్ = కిని; ఈ = ఈ, ఇక్కడ; ఎడలన్ = తావులలో, ఎక్కడ కూడ; లేద = లేదు+ఆ, లేనేలేదు; ఈశ్వర = భగవంతునికి; ఇతరమున్ = ఇతరమైనది, వేరైనది; సుతా = పుత్రుడా.

భావము:

నారదా! కుమారా! ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నాకు, నీకు, మాయకు, ప్రాణికోటికి ప్రభువు. ఆయన కంటే అన్యమైనది ఏది ఈ జగత్తులో లేనే లేదు.

2-86-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయం జేసి దైవయోగంబునం బ్రాప్తంబులయిన కాలజీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియె; నీశ్వరాధిష్ఠితం బైన మహత్తత్త్వంబు వలన నగు కాలంబున గుణవ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును జీవాదృష్టభూతంబయిన కర్మంబున జన్మంబును నయ్యె; రజస్సత్త్వంబులచే నుపబృంహితంబై వికారంబు నొందిన మహత్తత్త్వంబు వలనం దమఃప్రధానంబై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె; నదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తి యైన తామసంబునుఁ గ్రియాశక్తి యైన రాజసంబును జ్ఞానశక్తి యైన సాత్వికంబును నన మూఁడు విధంబు లయ్యె; నందు భూతాది యైన తామసాహంకారంబు వలన నభంబు కలిగె; నభంబునకు సూక్ష్మరూపంబు ద్రష్టృదృశ్యములకు బోధకంబైన శబ్దంబు గుణంబగు; నభంబువలన వాయువు గలిగె; వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండు; నది దేహంబు లం దుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మనశ్శరీరపాటవంబునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు; వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబులుఁ మూఁటితోడఁ తేజంబుఁ గలిగె; దేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె; జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబు లయిదింటితోడం బృథివి గలిగె; వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్రదైవతంబయిన మనంబు గలిగె; మఱియు దిక్కులును వాయువును నర్కుండును బ్రచేతసుండును నాశ్వినులును వహ్నియు నింద్రుండు నుపేంద్రుండును మిత్రుండునుఁ బ్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి; తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును, వాయుదైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబును, నశ్విదైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్నిదైవతంబైన వాగింద్రియంబును, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబును నుపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును ననియెడి దశేంద్రియంబులును బోధజనకాంతఃకరణైక భాగంబయిన బుద్ధియుఁ గ్రియాజనకాంతఃకరణంబయిన ప్రాణంబునుం గలిగె; నిట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనో గుణంబులు వేర్వేఱుగఁ బ్రహ్మాండ శరీరనిర్మాణంబునం దసమర్థంబు లగునపుడు గృహ నిర్మాణంబునకుం బెక్కు పదార్థంబులు సంపాదించినంగాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వలన గృహంబు కైవడి భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించిన సమిష్టి వ్యష్టాత్మకత్వంబు నంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండంబు కల్పితం బయ్యె; నట్టి యండంబు వర్షాయుత సహస్రాంతంబు దనుక జలంబు నందుండెఁ; గాల కర్మ స్వభావంబులం దగులువడక సమస్తంబును జీవయుక్తంబుగఁ జేయు నీశ్వరుం డచేతనంబును సచేతనంబునుగ నొనర్చె; నంతఁ గాల కర్మ స్వభావ ప్రేరకుండయిన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబయిన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి యట్టి యండంబు భేదించి నిర్గమించె; నెట్లంటేని.

టీకా:

వినుము = వినుము; మాయా = మాయకు; విభుండు = ప్రభువు; ఐన = అయినట్టి; ఈశ్వరుండున్ = ప్రభువు, భగవంతుడు; తన = తన యొక్క; మాయన్ = మాయ యొక్క; చేసి = కారణము వలన; దైవయోగంబునన్ = దైవయత్నమున, దివ్యమైన యోగము వలన; ప్రాప్తంబులు = పొందబడినవి; అయిన = అయినట్టి; కాల = కాలము; జీవ = జీవము, జీవుడు; అదృష్ట = కనిపించని, గమనించ వీలుకానిది; స్వభావంబులున్ = స్వభావములు, నేననే భావములు,; వివిధంబులున్ = అనేక విధములైనవి; సేయన్ = చేయవలెనని; నిశ్చయించి = నిశ్చయించుకొని, సంకల్పించి; కైకొనియెన్ = చేపట్టెను; ఈశ్వరున్ = భగవంతుని; అధిష్ఠితంబున్ = అధీనములో ఉన్నవి, ఆశ్రయించినవి; ఐన = అయినట్టి; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వవము; వలనన్ = చేత; అగు = అయ్యే; కాలంబునన్ = కాలమువలన; గుణ = (త్రి) గుణములు; వ్యతికరంబును = పరస్పర సమ్మేళనమును; స్వభావంబునన్ = స్వభావము వలన; పరిణామంబునున్ = మార్పులును; జీవ = జీవుని; అదృష్ట = కనబడని; భూతంబునన్ = లక్షణము; అయిన = అయిన; కర్మంబునన్ = కర్మవలన; జన్మంబునున్ = జన్మము, సృష్టి; అయ్యెన్ = కలిగెను; రజస్ = రజస్సు; సత్త్వంబులన్ = సత్వములు; చేన్ = వలన; ఉపబృంహితంబున్ = పెంపొందబడినది, సంవృద్ధితము; ఐ = అయి; వికారంబున్ = మార్పులు; ఒందిన = పొందిన, చెందిన; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వము; వలనన్ = వలన; తమస్ = తమస్సు; ప్రధానంబు = ప్రధానమైనది, ముఖ్యమైనది; ఐ = అయి; ద్రవ్య = ద్రవ్యము యొక్క, పృథువ్యాదుల {నవద్రవ్యములు - పృథువ్యాదులు - పృథ్వి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు}; జ్ఞాన = జ్ఞానము కలది; క్రియా = క్రియ; ఆత్మకంబున్ = లక్షణము కలది; అగు = అయిన; అహంకారంబున్ = అహంకారమును; కలిగెన్ = కలిగినది; అదియున్ = అదికూడ; రూపాంతరంబున్ = మార్పులు; ఒందుచున్ = పొందుచూ, చెందుతూ; ద్రవ్య = ద్రవ్యరూప; శక్తి = శక్తి; ఐన = అయిన; తామసంబునున్ = తమోగుణమును, తమస్సును; క్రియా = క్రియ యొక్క, కర్మల; శక్తి = శక్తి; ఐన = అయిన; రాజసంబునున్ = రజోగుణము, రాజసము; జ్ఞాన = జ్ఞానము యొక్క; శక్తి = శక్తి; ఐన = అయిన; సాత్వికంబునున్ = సత్త్వ గుణము, సాత్త్వికము; అనన్ = అను; మూఁడు = మూడు; విధంబులున్ = రకములు; అయ్యెన్ = కలిగినవి; అందున్ = అందులో, వానిలో; భూత = భూతములకు (పంచ); ఆది = మొదలు; ఐన = అయినట్టి; తామస = తామసముయొక్క , తమస్సుకూడిన; అహంకారంబున్ = అహంకారము; వలనన్ = వలన; అభంబున్ = ఆకాశము; కలిగెన్ = సంభవించెను; అభంబున్ = ఆకాశము; కున్ = కి; సూక్ష్మ = సూక్ష్మ; రూపంబు = రూపమైన; ద్రష్టృ = ద్రష్ట ఐన ఆత్మ; దృశ్యములున్ = చూడబడునవాని; కున్ = కిని; బోధకంబు = తెలియునది; ఐన = అయిన; శబ్దంబున్ = శబ్దము; గుణంబు = గుణము; అగున్ = అగును; అభంబున్ = ఆకాశము; వలనన్ = వలన; వాయువు = వాయువు, గాలి; కలిగెన్ = పుట్టినది; వాయువునకున్ = వాయువునకు, గాలికి; పర = బయటకు; అన్వయంబున్ = వ్యక్తములై; శబ్దంబున్ = శబ్దము; స్పర్శంబున్ = స్పర్శయును; అను = అనే; రెండు = రెండు; గుణంబులు = గుణములు; కలిగి = కలిగినదై; ఉండున్ = ఉండును; అది = అది; దేహంబులు = శరీరములు; అందున్ = లోపల; ఉండుటన్ = ఉండుట; చేసి = చేత; ప్రాణ = ప్రాణము యొక్క; రూపంబున్ = రూపము కలది; ఐ = అయి; ఇంద్రియ = ఇంద్రియముల; మనస్ = మనస్సు; శరీర = శరీరము లయొక్క; పాటవంబున్ = సామర్థ్యము, పాటవ, బల, శక్తులు; ఐ = అయి; ఓజస్ = తేజము, గ్రహణశక్తి; సహస్ = సహనము, కూడిఉండుశక్తి; బలంబులున్ = బలములు, సత్తువశక్తులు; కున్ = కు; హేతువు = కారణము; ఐ = అయి; వర్తించున్ = ప్రవర్తించును; వాయువు = (ప్రాణ) వాయువు; వలనన్ = వలన; రూప = రూపము; స్పర్శ = స్పర్శ; శబ్దంబులు = శబ్దములు; అనియెడి = అనబడు; గుణములున్ = గుణములు; మూఁటి = మూడింటి; తోడన్ = తోను; తేజంబున్ = తేజస్సు; కలిగెన్ = పుట్టినది; తేజంబున్ = తేజస్సు; వలనన్ = వలన; రస = రుచి; రూప = రూపము; స్పర్శ = స్పర్శ; శబ్దంబున్ = శబ్దములు; అనియెడి = అను; నాలుగు = నాలుగు; గుణంబులన్ = గుణములు; తోడన్ = తోను; జలంబున్ = జలము, నీరు; కలిగెన్ = పుట్టినది; జలంబున్ = జలము; వలనన్ = వలన; గంధ = వాసన; రస = రుచి; రూప = రూపము; స్పర్శ = స్పర్శ; శబ్దంబున్ = శబ్దములు; అనియెడి = అను; గుణంబున్ = గుణములు; అయిదింటిన్ = అయిదింటి; తోడన్ = తోను; పృథివి = పృథ్వి, భూమి; కలిగెన్ = సంభవించెను; వైకారికంబున్ = వికారము పొందినది, పరిణామమైనది; ఐన = అయినట్టి; సాత్త్విక = సత్త్వగుణరూపక; అహంకారంబున్ = అహంకారము; వలనన్ = వలన; చంద్ర = చంద్రుడు; దైవతంబు = అధిదేవతగా కలది; అయిన = అయినట్టి; మనంబున్ = మనస్సు; కలిగెన్ = పుట్టినది; మఱియున్ = ఇంకనూ; దిక్కులునున్ = దిగ్దేవతలు; వాయువునున్ = వాయువును; అర్కుండునున్ = అర్కుడును, సూర్యుడును {అర్కుడు - ఋక్కులకు అధిదేవత ఐన సూర్యబింబము}; ప్రచేతసుండునున్ = ప్రచేతసుడు, వరుణుడు; ఆశ్వినులునున్ = అశ్వినీదేవతలును {ఆశ్వినులు - నాసత్యుడు, దస్రుడు అను పేర్లు కల అశ్వనీదేవతలు}; వహ్నియున్ = అగ్నియును {వహ్ని - అగ్ని}; ఇంద్రుండునున్ = ఇంద్రుడును; ఉపేంద్రుడునున్ = ఉపేంద్రుడును {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, ఆదిత్యుడైన విష్ణుమూర్తి, వామనుడు, ఇంద్రుని మీద ప్రభువు, విష్ణుసహస్రనామ భాష్యములో 151వ నామం}; మిత్రుండునున్ = మిత్రుడు, మితికి దేవుడు {మిత్రుడు - మితము అను దేశ, కాల, ద్రవ్యముల కొలతలకు అధిదేవత}; ప్రజాపతి = ప్రజాపతి, ప్రజోత్పత్తికి పతి {ప్రజాపతి - జీవుల ఉత్పత్తికి అధిపతి}; అనియెడి = అను; దశ = పదిమంది; దేవతలు = దేవతలు; కలిగిరి = సంభవించిరి; తైజసంబు = తేజస్సు వలనైనది; ఐన = అయినట్టి; రాజస = రజోగుణరూపకమైన; అహంకారంబు = అహంకారము; వలనన్ = వలన; దిక్ = దిక్కులు; దైవతంబున్ = అధిదేవతలు గా కలిగినది; ఐన = అయినట్టి; శ్రవణేంద్రియమును = విను చెవులు అను ఇంద్రియములు {శ్రవణేంద్రియములు - వినుటకైన సాధనములు, చెవులు}; వాయు = వాయువు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; త్వక్ = స్పర్శకైన, చర్మమము అను; ఇంద్రియంబున్ = ఇంద్రియమును, సాధనమును; సూర్య = సూర్యుడు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; నయన = నయనము అను, కళ్ళు అను; ఇంద్రియంబున్ = ఇంద్రియమును, సాధనమును; ప్రచేతో = ప్రచేతసుడు, వరుణుడు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; రసన = రుచికైన, నాలుక అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; అశ్వి = అశ్వినీ దేవతలు; దైవతంబున్ = అధిదేవతలు గా కలిగినది; ఐన = అయినట్టి; ఘ్రాణ = వాసనకైన, ముక్కు అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; వహ్ని = అగ్ని; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; వాక్ = పలుకునదైన, నోరు అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; ఇంద్ర = ఇంద్రుడు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; హస్త = హస్తము అను, చేతులు అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; ఉపేంద్ర = ఉపేంద్రుడు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; పాద = పాదములు అను, కాళ్ళు అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; మిత్ర = మిత్రుడు; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; గుద = మలవిసర్జనకైనది, గుదము అను; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును, సాధనమును; ప్రజాపతి = ప్రజాపతి; దైవతంబున్ = అధిదేవతగా కలిగినది; ఐన = అయినట్టి; గుహ్య = పురుష లేదా స్త్రీ మర్మ; ఇంద్రియంబునున్ = ఇంద్రియమును; అనియెడి = అను; దశ = పది; ఇంద్రియంబులునున్ = ఇంద్రియములును; బోధజనక = బోధపడునట్లు చేయగల; అంతఃకరణైక = లోపలనేఉండునట్టి; భాగంబున్ = భాగము; అయిన = అయిన; బుద్ధియున్ = బుద్ధియును; క్రియాజనక = పనులుచేయించగల; అంతఃకరణంబున్ = లోపల ఉండునది; అయిన = అయిన; ప్రాణంబునున్ = ప్రాణవాయువులు; కలిగెన్ = సంభవించినవి; ఇట్టి = ఇటువంటి; శ్రోత = చేవులు; ఆదులు = మొదలైనవి; అగు = అయిన; దశ = పది; ఇంద్రియంబులు = ఇంద్రియములు; తోన్ = తోను; కూడిన = కూడిన; భూత = భూతములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనస్ = మనస్సు; గుణంబులు = గుణములు; వేర్వేఱుగన్ = వేరవేరుగ; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; శరీర = దేహమును; నిర్మాణంబున్ = నిర్మాణమును; అందన్ = పొందుటకు; అసమర్థంబున్ = శక్తిలేనివి; అగున్ = అగును; అపుడు = అప్పుడు; గృహ = గృహమును; నిర్మాణంబున్ = నిర్మించుట; కున్ = కు; పెక్కు = పెక్కు; పదార్థంబులున్ = సామాగ్రిని; సంపాదించినన్ = సంపాదించిన; కాని = కాని; చాలని = సరిపడని; చందంబునన్ = విధముగ; భూత = భూతములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనస్ = మనస్సు; గుణంబులన్ = గుణముల; వలన = వలన; గృహంబున్ = గృహము; కైవడిన్ = వలె; భగవత్ = భగవంతుని; శక్తి = శక్తిచే; ప్రేరితంబున్ = ప్రేరింపబడుతున్నది; అగుచున్ = అగుచు; ఏకీభవించిన = ఏకోన్ముఖమైన; సమిష్టి = పరస్పరసహకార; వ్యష్టా = విడివిడి; ఆత్మకత్వంబున్ = లక్షణములు; అంగీకరించి = సమ్మతించి, సమ్మేళవించి; చేతన = చేతనత్వము; అచేతనంబులన్ = అచేతనత్వములును; కల = కలిగిన; బ్రహ్మ = పెద్ద; అండంబున్ = అండము, గుడ్డు; కల్పితంబున్ = సంభవము, తయారు; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటువంటి; అండంబున్ = అండము; వర్ష = సంవత్సరములు; అయుతసహస్ర = పదివేల వేలు; అంతంబున్ = పూర్తి అగు; దనుక = వరకు; జలంబున్ = నీటి; అందున్ = లోపల; ఉండెన్ = ఉండెను; కాల = కాలము; కర్మ = కర్మము; స్వభావంబులన్ = స్వ భావములకు; తగులు = చిక్కు; పడకన్ = కొనకుండగ; సమస్తంబున్ = సమస్తమును; జీవ = జీవముతో; యుక్తంబున్ = కూడి ఉండునట్లు; చేయు = చేయునట్టి; ఈశ్వరుండున్ = ప్రభువు, భగవంతుడు; అచేతనంబున్ = చేతనము లేనిదానిని; సచేతనంబున్ = చేతనముకలదానిగ; ఒనర్చెన్ = చేసెను; అంతన్ = అంతట; కాల = కాలము; కర్మ = కర్మము; స్వభావ = స్వభావముల; ప్రేరకుండు = ప్రేరేపించువాడు; అయిన = అయిన; పరమేశ్వరుండు = పరమేశ్వరుడు, భగవంతుడు; జీవ = జీవము యొక్క; రూపంబునన్ = రూపములో; మహా = గొప్ప, పెద్ద; ఆవరణ = ఆవరణమైన, పొరయైన; జల = నీటి; మధ్య = మధ్యన; స్థితంబున్ = ఉన్నట్టిది; అయిన = అయిన; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండము; లోన్ = అందున; చొచ్చి = ప్రవేశించి, దూరి; సవిస్తారంబున్ = వృద్ధి, పెద్దదిగ; కావించి = చేసి; అట్టి = అటువంటి; అండంబున్ = అండమును; భేదించి = బద్దలుకొట్టి; నిర్గమించెన్ = బయల్పడెను, వెలువడెను; ఎట్లు = ఏ విధముగ; అంటేనిన్ = అంటే.

భావము:

మాయకు నియామకుడు ఈశ్వరుడు, ఆ ప్రభువుకు తన మాయవలన, దివ్యమైన యోగము వలన కాలము, జీవదృష్టము, స్వభావము అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టి కార్యానికి సహకారులూగ స్వీకరించాడు. ఈశ్వరునిచే అధిష్ఠింపబడ్డ మహత్తత్త్వం కారణంగా కాలంనుండి జన్మములు సిద్ధించాయి. రజోగుణం చేతా, సత్త్వగుణం చేతా, వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుంచే తమోగుణ ప్రధానమైనదీ, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదీ అయిన అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్లీ వికారానికి లోనై ద్రవ్యశక్తి యైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియైన సాత్త్వికమనీ మూడు రూపాలుగా పంచభూతాలకూ మూలకారణమైన తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమూ, సూక్ష్మరూపమైన వున్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశం నుండి స్పర్శ గుణప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణనైన ఆకాశమందలి శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు వాయువున కున్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో వుంటుంది. అది ఇంద్రియ పాటవానకీ, మనోబలానికీ, శారీరక శక్తికీ హేతువవుతున్నది. వికారం పొందిన వాయువు నుండే రూపం, స్పర్శం, శబ్దం అనే మూడు గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణములతో జలము పుట్టినది. జలమువలన గంధ, రసం, రూపం, స్పర్శం, శబ్దంబులు అనెడి అయిదు గుణాలతో పృథ్వి పుట్టింది. పై జెప్పినవనన్నీ తామసాహంకారంనుండి కల్గినవే. వికారానికి లోనైన సాత్త్వికాహంకారం నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత, అంతేకాక ఆ సాత్త్వికాహంకారం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసాహంకారం నుండి శ్రవణం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మొదలైన ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పది యింద్రియాల అధిదేవతల వివరమిలా ఉన్నాయి; శ్రవణేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయూవూ, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీదేవతలూ, వాగింద్రియానికి అగ్నీ, హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానకి ప్రజాపతీ దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానం కలిగించే అంతకరణంలో ఒక భాగం ప్రాణం క్రియను కల్గించే అంతకరణం. శ్రోత్రం మొదలైన పది యింద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్దస్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేక పోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒక్కచోట చేర్చితే కాని సాధ్యం కాదు గదా అదే రీతిగా పైన జెప్పిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు. గుణాలు భగవంతుని శక్తివల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ కల్పించాయి. అలా యీ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మింపబడ్డ అండం కోటి సంవత్సరాల వరకూ నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పైన కాలకర్మస్వభావాలకు లోను గానివాడూ, అన్నిటినీ ప్రాణవంతాలుగా చేయగలవాడూ అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైన దానిని ప్రాణ సహితం చేసాడు. కాలకర్మస్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావరణ జలమధ్యంలో జీవరూపంలో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతం చేసాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో విను.