ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట
- ఉపకరణాలు:
అనిన నయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు గాక సదుత్తరప్రదాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు దన చిత్తంబున.
టీకా:
అనినన్ = అనగ; ఆ = ఆ; ఉత్తరా = ఉత్తరయొక్క; నందనున్ = పుత్రుని - పరీక్షితు; వచనంబులున్ = మాటలు; కున్ = కి; నిరుత్తరుండుగాక = తెలివిడి లేనివాడు కాక, తెల్లబోక; సదుత్తరన్ = సరియగు సమాధానమును; ప్రదాన = ఇచ్చు; కుతూహలుండు = కుతూహలము కలవాడు; ఐ = అయి; లోకాన్ = లోకములకు; ఉత్తర = ఉత్తమమైన; గుణ = గుణములు కలవారిలో; ఉత్తరుండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; తాపస = తపసులలో; ఉత్తముండు = గొప్పవాడు - శుకుడు; తన = తన యొక్క; చిత్తంబునన్ = ఇష్టాపూర్వకముగ.
భావము:
పరీక్షిన్మహారాజు అలా అడిగేసరికి మౌనం వహింప దలచక, తగు సమాధానం చెప్పాలన్న కుతూహలంతో లోకోత్తరమైన ఉత్తమ గుణములు గలవాడైన శుకయోగి మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్థించాడు.
- ఉపకరణాలు:
"పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.
టీకా:
పరుఁడు = అన్నిటికిని పైనుండు వాడు; ఐ = అయి; ఈశ్వరుఁడు = ప్రభువు, అధిపతి; ఐ = అయి; మహా = గొప్ప; మహిముఁడు = మహిమ కలవాడు; ఐ = అయి; ప్రాదుర్భవ = సృష్టి; స్థాన = స్థితి; సంహరణన్ = లయములు అను; క్రీడనుఁడున్ = ఆటాడుట కలవాడు; ఐ = అయి; త్రి = మూడు; శక్తి = శక్తులు {త్రిశక్తి - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి - 1 ఇచ్చాది - ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది - ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది - సత్వము, రజస్సు, తమస్సు}; యుతుఁడు = కలవాడు; ఐ = అయి; అంతర్గత = (సమస్తమునకు) లోపలన ఉండు; జ్యోతి = ప్రకాశము; ఐ = అయి; పరమేష్టి = మహాయాజ్ఞకుడు, బ్రహ్మ {పరమేష్టి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; ప్రముఖ = మొదలగు ముఖ్య; అమర = దేవతల; అధిపులున్ = ప్రభువులు; కున్ = కిని; ప్రాపింపన్ = పొందుటకు; రాక = సాధ్యముకాక; ఉండున్ = ఉండునట్టి; దుస్తర = తరించలేని, అందుకొనలేని; మార్గంబునన్ = విధముగ; తేజరిల్లు = ప్రకాశించునట్టి; హరి = విష్ణుని; కిన్ = కి; తత్త్వన్ = తత్త్వమును,సత్ స్వరూపమును; అర్థిన్ = తెలిసికొన గోరువాడను; ఐ = అయి; మ్రొక్కెదన్ = ప్రార్థించుచుంటిని.
భావము:
ప్రకృతికంటే జీవునికంటే పరుడు, ఈశ్వరుడు, గొప్ప మహిమ కలవాడు, సృష్టిస్థితిలయాలను ఆటగా సాగించేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు, అందరికి అంతరాత్మగా వెలుగొందేవాడు, బ్రహ్మాదిదేవతలు అందుకోడానికి వీలుకాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్త్వాభిలాషతో నమస్కరిస్తున్నాను.
- ఉపకరణాలు:
మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండునుఁ, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్ఠుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్ఠుండునుఁ, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద.
టీకా:
మఱియున్ = ఇంకనూ; సజ్జనత్ = మంచివారియొక్క; దురిత = కలతలను; సంహారకుండునున్ = పోగొట్టువాడును; దుర్జన = దుర్జనులను; నివారకుండునున్ = నిలువరించువాడును; సర్వ = సమస్తమైన; రూపకుండునున్ = రూపములు తనే అయినవాడును; పరమహంస = ఉన్నతమైన ఆత్మైకస్థితి సన్యాసుల; ఆశ్రమ = ధర్మమార్గమున; ప్రవర్త = నడచు; మాన = లక్షణములు కల; ముని = మునుల; జన = సమూహముల; హృదయ = మనస్సు అను; కమల = పద్మముల; కర్ణికా = బొడ్డుల; మధ్య = నడుమలందు; ప్రదీపకుండునున్ = వెలుగులు ఇచ్చువాడును; సాత్వత = సాత్వత వంశస్థులలో {సాత్వతులు - కృష్ణుడు సాత్వత వంశములో పుట్టెను}; శ్రేష్ఠుండును = శ్రేష్ఠమైనవాడును; నిఖిల = సమస్తమైన; కల్యాణ = శోభనకరమైన; గుణ = లక్షణములు; గరిష్ఠుండునున్ = అత్యధికముగ ఉన్నవాడును; పరమ = గొప్ప; భక్తి = భక్తితో; యుక్త = కూడినవారలకు; సులభుండును = తేలికగా అందువాడును; భక్తి = భక్తి; హీన = లేనట్టి; జన = జనులకు; దుర్లభుండునున్ = అందనివాడును; నిరతిశయ = అతిశయించవీలుకాని; నిరుపమ = సాటిలేని {నిరుపమ - ఉపమానము లేనట్టి, సాటిలేని}; నిరవధిక = అవధి (మేర) లేని; ప్రకారుండునున్ = విధానము కలవాడును; నిజ = స్వ, తనయొక్క; స్వరూప = స్వరూపమైన; బ్రహ్మ = బ్రహ్మగను; విహారుండును = విహరించువాడును; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరున్ = అత్యున్నత ప్రభువు; కున్ = కి; నమస్కరించెదన్ = ప్రణమిల్లుతున్నాను.
భావము:
సత్పురుషుల పాపాలను పరిహరించెడివాడు, దుర్జనులను శిక్షించే వాడు, అసమసత్మైన రూపులు తన రూపమే అయినవాడు, పరమహంసాశ్రమములో ఉండే మునుల హృదయ కమల మధ్యంలో వెలుగొందెడివాడు, సాత్వత వంశస్థులలో శ్రేష్ఠుడు, సమస్తకల్యాణ గుణాలతో శోభిల్లేవాడు, ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు, భక్తి లేనివారికి ప్రాప్తించనివాడు, అత్యుత్తమము, అనుపమానము, అనంతము అయిన ప్రవర్తన గలవాడు, స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను.
- ఉపకరణాలు:
ఏ విభువందనార్చనములే, విభుచింతయు, నామకీర్తనం,
బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు: నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.
టీకా:
ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; వందన = స్తుతించుటలు; అర్చనములున్ = పూజించుటలు; ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; చింతయున్ = స్మరించుటలునున్; నామ = నామములను; కీర్తనంబున్ = కీర్తించుటలు; ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; లీలన్ = లీలలను; అద్భుతములు = అద్భుతమైన కార్యములును; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; సంశ్రవణంబున్ = చక్కగ వినుటలును; చేయన్ = చేయుచుండగ; దోష = దోషముల; ఆవలిన్ = పంక్తులు (సర్వము)ను; పాసి = తొలగి; లోకమున్ = లోకమున; శుభ = క్షేమ; ఆయత = విస్తృతమైన; వృత్తిన్ = విధానములు; చెలంగున్ = వృద్ధి పొందును; అండ్రు = అందురో; నేన్ = నేను; ఆ = ఆ యొక్క; విభున్ = ప్రభువును; ఆశ్రయించెదన్ = ఆశ్రయిస్తాను; అఘ = పాపపు; ఓఘన్ = పరంపరలను; నివర్తనున్ = పోగొట్టువానిని; భద్ర = క్షేమము కలిగించు; కీర్తనున్ = కీర్తనములు కలవానిని.
భావము:
పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారం, పూజ, చింతన, నామసంకీర్తన అమోఘమైనవి అని, అతని కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళకర మౌతుందని పెద్దలు చెప్తారు. పాపనిచయ నివర్తనుడు, మంగళమయ కీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను.
- ఉపకరణాలు:
ఏ పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁ బాసి, యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.
టీకా:
ఏ = ఏ; పరమేశున్ = అత్యుత్తమ ప్రభువు యొక్క; పాద = పాదముల; యుగమున్ = జంటను; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; కోరి = ఇష్టపూర్తిగ; భజించి = పూజించి, కీర్తించి; నేర్పరుల్ = నిపుణులు; లోపలి = అంతర్ముఖ; బుద్ధిన్ = బుద్ధి; తోన్ = తో; ఉభయ = (ఇహపర) రెండు; లోకములు = లోకములు; అందులన్ = అందలి; జడ్డున్ = జాఢ్యములును; పాసి = తొలగి; ఏ = ఏ విధమైన; తాపమున్ = తాపములును {తాపత్రయములు - ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము}; లేకన్ = లేకుండగ {తాపము – తపింప జేయునది}; బ్రహ్మ = పరబ్రహ్మను; గతిన్ = చేరు మార్గమును; తారు = తాము; గత = గతించిన, పోయిన; శ్రములు = శ్రమ కలవారు; ఐ = అయి; చరింతురు = తిరుగుదురో; ఏన్ = నేను; ఆ = ఆ యొక్క; పరమేశున్ = అత్యుత్తమ ప్రభువునకు; మ్రొక్కెదన్ = నమస్కరింతును, మొక్కుదును; అఘ = పాపపు; ఓఘన్ = పరంపరలు; నివర్తనున్ = పోగొట్టువానిని; భద్ర = క్షేమము కలిగించు; కీర్తనున్ = కీర్తనములు కలవానిని.
భావము:
పరమేశ్వరుని పాదాలను ఎల్లవేళలా కోరి సేవించి నిపుణులైవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహ పరలోకాలతోడి తగులం వదలుకొని, ఏ తాపము లేక పరబ్రహ్మను చేరే మార్గంలో ఏ కష్టము లేనివారై సంచరిస్తారు. పాపనిచయ నివర్తనుడు, మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను.
- ఉపకరణాలు:
తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
జపములఁ జేసియైన, ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు; న
య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.
టీకా:
తపములన్ = తపస్సులు {తపస్సు - తపించుట ముఖ్యముగ ఆధ్యాత్మికమైనది}; చేసి = చేయుట వలన; ఐనన్ = అయినప్పటికిని; మఱి = ఇంకను; దానములు = దానములు; ఎన్నియున్ = ఎన్నింటిని; చేసి = చేయుట వలన; ఐనన్ = అయినప్పటికిని; ఏ = ఎంత కష్టసాధ్యమైన; జపములన్ = జపములను {జపము - నియమించుకొని మరల మరల స్మరించుట}; చేసి = చేయుటవలన; ఐనన్ = అయినప్పటికిని; ఫల = (వాటి వల్ల కలిగిన) ఫలితముల; సంచయమున్ = సమూహములను; ఎవ్వనిన్ = ఎవనికైతే; చేర్పక = అంకితము చేయకుండగ; ఉన్నన్ = ఉన్నట్లయితే; హేయన్ = నింద్యమైన, విడువతగిన; పదమున్ = మార్గములు; ఐ = అయి; దురంత = అంతులేని; విపత్ = ఆపదలు; అంచిత = తోకూడిన; రీతిగన్ = విధముగ; ఒప్పుచున్ = అగుతూ; ఉండున్ = ఉండునో; ఆ = ఆ; అపరిమితున్ = పరిమితులులేని వానిని; భజించెదన్ = కీర్తింతును; అఘ = పాపపు; ఓఘన్ = పరంపరలు; నివర్తనున్ = పోగొట్టువానిని; భద్ర = క్షేమముకలిగించు; కీర్తనున్ = కీర్తనములు కలవానిని.
భావము:
ఎన్నేసి తపస్సులు, దానాలు, జపాలు చేసినప్పటికి వాటివల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యాలై ఆపదల క్రింద పరిణమిస్తాయి. పరిమితి లేనివాడు, పాపనిచయ నివర్తనుడు, మంగళమయకీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను.
- ఉపకరణాలు:
యవన, వ్యాధ, పుళింద, హూణ, శక, కంకాభీర, చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి, భా
గవతశ్రేష్ఠులఁ డాసి, శుద్ధతనులై కళ్యాణులై యుందు; రా
యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్.
టీకా:
యవన = యవనులు; వ్యాధ = బోయలు, కిరాతులు; పుళింద = పుళిందులు, మిక్కిలిహింసచేసేవారు; హూణ = హూణులు; శక = శకులు; కంక = కంకులు, కంక పక్షులను తినువారు; ఆభీర = గొల్లలు, చెంచులు; చండాల = చండాలులు; సంభవులు = (గా) పుట్టినవారు; తక్కిన = తతిమా; పాప = పాపపు; వర్తనులున్ = ప్రవర్తన కలవారు కూడ; ఏ = ఏ; భద్ర = శుభము; ఆత్మున్ = తానైన వానిని; సేవించి = కొలిచి; భాగవత = భగవంతునికి చెందినవారలలో; శ్రేష్ఠులన్ = శ్రేష్ఠమైన వారిని; డాసి = చేరి; శుద్ధ = పరిశుద్ధి చెందిన; తనులు = శరీరము కలవారు; ఐ = అయి; కళ్యాణులు = శుభ స్వరూపులు; ఐ = అయి; ఉందురు = ఉంటారో; ఆ = ఆ యొక్క; అవికారున్ = ఏ వికారములు లేని వానిని; ప్రభవిష్ణున్ = సృష్టి కారకుని; నాదు = నా యొక్క; మది = మనస్సు; లోన్ = లోపల; అశ్రాంతమున్ = విరామము లేకుండగ, నిరంతరము; మ్రొక్కెదన్ = కొలిచెదను.
భావము:
యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాలురు-ఇలాంటి జాతుల్లో పుట్టినవారు, ఇతర పాపాత్ములు కూడ పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠుల నాశ్రయించినవారు, పరిశుద్ధ శరీరులు, మంగళాకారులు అయి ఉంటారు. వికారరహితుడు, సర్వసమర్ధుడు అయినట్టి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళల నమస్కరిస్తాను.
- ఉపకరణాలు:
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్ధపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని; న
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్.
టీకా:
తపముల్ = తపస్సులు {తపస్సు - తపించుట ముఖ్యముగ ఆధ్యాత్మికమైనది}; సేసిననో = చేయుట వలననా; మనస్ = మనస్సును; నియతినో = నిగ్రహించుట వలననా; దాన = దానములు చేయుట; వ్రత = వ్రతములు చేయుట; వృత్తినో = పద్ధతి వలననా; జప = జపము చేయబడిన; మంత్రంబులనో = మంత్రముల వలననా; శ్రుతి = వేదములు; స్మృతులనో = ధర్మశాస్త్రములు వలననా; సద్భక్తినో = మంచి భక్తి వలననా; ఎట్లు = ఏ విధముగ; లబ్ధ = పొందబడిన; పదుండు = పదము, సన్నిధి కలవాడు; ఔన్ = అగును; అని = అని; బ్రహ్మ = బ్రహ్మ; రుద్ర = శివుడు; ముఖరుల్ = మొదలగు ముఖ్యులు; భావింతురు = స్మరింతురు, విచారిస్తుంటారో; ఎవ్వనిన్ = ఎవరిని గురించి అయితే; ఆ = ఆ యొక్క; అపవర్గన్ = మోక్షమునకు; అధిపుడు = అధిపతియు; ఆత్మ = పరమాత్మ; మూర్తి = స్వరూపుడు; సులభుండు = మంచిగ అందువాడు; ఔన్ = అగుట; కాక = కావలసినది; నాకు = నాకు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.
భావము:
బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్యసన్నిధికి ఎలా చేరగలం, తపస్సులతోనా, మనోనిగ్రహంతోనా, దానాలతోనా, వ్రతాలతోనా, జపాలతోనా, మంత్రాలతోనా, శ్రుతిస్మృతులను వల్లించడం వల్లానా, లేక ఉత్తమభక్తితోనా అని చింతిస్తు ఉంటారు. ఆట్టి ఆ మోక్షప్రభువు, ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక.
- ఉపకరణాలు:
శ్రీపతియు, యజ్ఞపతియుఁ, బ్ర
జాపతియున్, బుద్ధిపతియు, జగదధిపతియున్,
భూపతియు, యాదవశ్రే
ణీపతియున్, గతియునైన నిపుణు భజింతున్.
టీకా:
శ్రీ = లక్ష్మీదేవికి; పతియున్ = భర్తయును; యజ్ఞ = యజ్ఞమునకు; పతియున్ = రక్షకుడును; ప్రజాపతి = ప్రజలకు ప్రభువు, బ్రహ్మ; బుద్ధి = బుద్ధికి; పతియున్ = అధిదేవతయును; జగత్ = జగత్తునకు; అధిపతియున్ = అధిపతియును; భూ = భూమికి (ద్వారకకు); పతియున్ = రాజుయు; యాదవ = యాదవ కులముల; శ్రేణీపతియున్ = గణపతియును; గతియు = (సర్వులకు) పరమపదమును; ఐనన్ = అయినట్టి; నిపుణున్ = నేర్పరిని; భజింతున్ = కొలుస్తున్నాను.
భావము:
లక్ష్మికి, యజ్ఞానికి, ప్రజలకు, బుద్ధికి, జగత్తుకు, భూమికి, యాదవ వర్గానికి, పతి గతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను.
- ఉపకరణాలు:
అణువో? గాక కడున్ మహావిభవుఁడో? యచ్ఛిన్నుఁడో? ఛిన్నుఁడో?
గుణియో? నిర్గుణుఁడో? యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద; రట్టి విష్ణుఁ, బరమున్, సర్వాత్ము సేవించెదన్.
టీకా:
అణువో = అత్యంత సూక్ష్మరూపుడా; కాక = లేక; కడున్ = అత్యధికమైన; మహా = గొప్ప; విభవుఁడో = వైభవము కలవాడా; అచ్ఛిన్నుడో = విభజింప శక్యము కానివాడా; ఛిన్నుడో = సమస్త మందు తన అంశ కలవాడా; గుణియో = సమస్త గుణములు తానైన వాడా; నిర్గుణుడో = గుణ రహితుడా; అటంచున్ = అనుకొనుచు; విభుధుల్ = మహాజ్ఞానులు; కుంఠీభవత్ = మొక్కపోయిన, కుంటిదైన; తత్త్వ = తత్త్వమును, యథార్థ జ్ఞానమును; మార్గణులు = అన్వేషించువారలు; ఐ = అయి; ఏ = ఏ; విభున్ = ప్రభువు యొక్క; పాద = పాదములు అను; పద్మ = పద్మములను; భజన = కొలుచు; ఉత్కర్షంబులన్ = విశిష్టతలచేత; తత్త్వ = యథార్థ జ్ఞానమును; వీక్షణమున్ = చూచుటను; చేసెదరు = చేయుదురు; అట్టి = అటువంటి; విష్ణున్ = విష్ణుమూర్తిని; పరమున్ = అత్యున్నతుని; సర్వాత్మున్ = సర్వమునకు ఆత్మ యైన వానిని; సేవించెదన్ = కొలిచెదను.
భావము:
ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అణుస్వరూపుడా? లేక విశ్వమంతా వ్యాపించిన మహాస్వరూపుడా? దేశకాలాదులచేత అపరిచ్ఛిన్నుడా? లేక పరిచ్ఛిన్నుడా? ఆయన సగుణుడా? లేక నిర్గుణుడా? అంటు పండితులు వ్యర్థమైన తత్త్వాన్వేషణలు చేసి చేసి చివరకి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్త్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదను.
శుకమహర్షి శ్రీహరి కృత సృష్ట్యాదుల రహస్యాలు మున్నగునవి పరీక్షిత్తునకు వివరించ ఉద్యుక్తుడు అవుతూ దైవ గురు ప్రశంస చేసిన సందర్భంలోది ఈ పద్యం. యద్భావం తత్భవతి అన్నట్లు చూసే దృష్టికి అనుకూలమైన విధంగా దర్శనమిచ్చే ఆ పరమాత్మ భక్తిమార్గంలో చేరిన వారికే ఆయా సర్వ దృష్టులలో దర్శించే సమస్తాన్ని సమన్వయం చేసి సత్యమైన తత్త్వస్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు.
- ఉపకరణాలు:
జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే
భగవంతుండు సరస్వతిం బనుప, నా పద్మాస్య దా నవ్విభున్
మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా
రగుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్.
టీకా:
జగత్ = జగత్తును, లోకములను; ఉత్పాదన = పుట్టించు; బుద్ధిన్ = సంకల్పము, నేర్పు; బ్రహ్మ = బ్రహ్మ; కున్ = కి; మదిన్ = మనస్సులో; సంధింపన్ = కలుగజేయుటను; ఊహించి = తలచి; ఏ = ఏ; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; సరస్వతిన్ = సరస్వతీదేవి {సరస్వతి - జ్ఞానమును ప్రసరించునది, జ్ఞానమై ప్రవహించునది}; పనుపన్ = నియోగించగ; ఆ = ఆ; పద్మాస్య = పద్మము వంటి ముఖము కలామె; తాన్ = తాను; ఆ = ఈ; విభున్ = ప్రభువును, బ్రహ్మను; మగనిన్ = భర్తగ; కాన్ = అగునట్లు; నియమించి = చేసుకొని; తత్ = ఆ యొక్క; భువన = లోకములకు; సామ్రాజ్య = రాజ్యాధికార; స్థితిన్ = పదవి కలవానిగను; సృష్టి = సృష్టించుట యందు; పారగున్ = నేర్పరిగను; చేసెన్ = చేసెను; మును = పూర్వము; బ్రహ్మన్ = బ్రహ్మను; అట్టి = అటువంటి; గుణిన్ = గుణములు కలవానిని; ఆరంభింతున్ = ప్రయత్నింతును; సేవింపగన్ = కొలుచుటను.
భావము:
భగవంతుడు పూర్వం జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో, సరస్వతిని పంపంగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోకసామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుణ్ణి చేసింది. అట్టి గుణవంతుడైన ఆ భగవంతుని భజనకు ఉపక్రమిస్తాను.
- ఉపకరణాలు:
పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ-
మున మేనులను పురములు సృజించి;
పురములలోనుండి పురుషభావంబున-
దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ?
బంచభూతములను పదునొకం డింద్రయ-
ములఁ బ్రకాశింపించి భూరిమహిమ
షోడశాత్మకుఁడన శోభిల్లు, జీవత్వ-
నృత్త వినోదంబు నెఱపుచుండు?
- ఉపకరణాలు:
నట్టి భగవంతుఁ, డవ్యయుం, డచ్యుతుండు
మానసోదిత వాక్పుష్ప మాలికలను
మంజు నవరస మకరంద మహిమ లుట్ట
శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.
టీకా:
పూర్ణుఁడు = పూర్ణుడు, నిత్యసత్యసర్వవ్యాపి; అయ్యున్ = అయినప్పటికిని; మహాభూతపంచక = మహాభూతములైదింటిని {మహాభూతపంచకములు - భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము}; యోగమునన్ = కలియకల వలన; మేనులు = శరీరములు, దేహములు; అను = అనబడు; పురములున్ = నగరములు, వసనములు; సృజించి = సృజించి; పురములున్ = పురములు, వసించునవి; లోన్ = లోపల; ఉండి = ఉండి; పురుష = పురుషుడు, వాసుడు; భావంబునన్ = (అను) భావములో; దీపించున్ = ప్రకాశించువాడు (వాసుదేవుడు); ఎవ్వడున్ = ఎవడో; ధీర = ధీరుని, స్వతంత్ర; వృత్తిన్ = విధముగ; పంచ = ఐదు {పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము}; భూతములనున్ = భూతములను; పదునొకండు = పదకొండు; ఇంద్రియములన్ = ఇంద్రియములను {పదకొండు యింద్రియములు - 5 జ్ఞానేంద్రియములు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. 5 కర్మేంద్రియములు - పాయుము, ఉపస్తు, చేతులు, కాళ్ళు, నోరు మరియు మనస్సు}; ప్రకాశింపించి = ఉద్దీపించి; భూరి = మిక్కిలిగొప్పదైన; మహిమన్ = మహిమతో; షోడశ = పదహారు కళలు/రకములు {షోడశాత్మక - 5 పంచభూతములు, 5 జ్ఞానంద్రియములు, 5 కర్మేంద్రియములు మరియు 1 మనస్సు మొత్తం 16}; ఆత్మకుఁడు = ఆత్మకలవాడు, స్వరూపుడు; అనన్ = అనబడుతూ; శోభిల్లున్ = వెలుగొందునో; జీవత్వ = జీవితలక్షణముల; నృత్త = నృత్యనాటక; వినోదంబున్ = వినోదమును; నెఱపుచున్ = నడుపుతూ; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి;
భగవంతుఁడు = విష్ణువు {భగవంతుడు - మహిమాన్వితుడు}; అవ్యయుండు = విష్ణువు {అవ్యయుడు - వ్యయము లేనివాడు, తరుగుట లేనివాడు}; అచ్యుతుండు = విష్ణువు {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, పతనము, నాశము లేనివాడు}; మానసన్ = మనసునందు; ఉదితన్ = ఉదయించిన; వాక్ = వాక్కులను, పలుకులను; పుష్ప = పువ్వుల; మాలికలనున్ = మాలికలు; అను = అను; మంజు = ఇంపైన; నవ = తొమ్మిది {నవరసములు - శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, భీభత్సము. అద్భుతము, శాంతము}; రస = రసములు అను; మకరంద = తేనె యొక్క; మహిమలున్ = గొప్పఅనుభూతులు; ఉట్టన్ = ఉట్టిపడగ; శిష్ట = మంచివారి; హృత్ = హృదయములందలి; భావ = భావముల, తలపుల; లీలన్ = విలాసములు; చేయున్ = చేయు; కాత = కాక.
భావము:
తాను పరిపూర్ణుడై ఉండికూడ పృథివ్యాది పంచ మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో; పంచభూతాలను, పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడషశకళాత్మకుడై శోభిల్లుతు ఎవడు జీవత్వ మనే నృత్తవిలాసం ప్రదర్శిస్తుంటాడో; ఆ అవ్యయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు, మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాల నలరించుగాక.
- ఉపకరణాలు:
మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ
ధ్యాన మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి, ముక్తులై
లూనత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్, విశంక టా
జ్ఞానతమోనభోమణికి, సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్."
టీకా:
మాన = అభిమానము అను; ధనుల్ = ధనము కలవారు; మహాత్ములు = మహనీయులు; సమాధిన్ = ధ్యాన సమాధి స్థితి; నిరూఢులు = బాగా స్థిరపడిన వారు; యత్ = ఏ; ముఖ = (విష్ణుని) ముఖము అను; అంబుజ = పద్మము; ధ్యాన = ధ్యానించుట అనే; మరంద = తేనెను; పానమునన్ = తాగుట వలన; ఆత్మన్ = మనసులలో; భయంబులన్ = (సమస్త) భయములను; పాసి = తొలగిపోయి; ముక్తులు = ముక్తి పొందినవారలు; ఐ = అయి; లూనతన్ = ఛేదింపబడుటను, వికలత్వమును; ఒందరో = పొందరో; అట్టి = అటువంటి; ముని = మునుల; లోక = సమస్త సమూహమునకు; శిఖా = తల; మణి = మానికమైనవాని; కిన్ = కిని; విశంకట = అధికమైన, విరివి యగు; అజ్ఞాన = అజ్ఞానము అను; తమస్ = తమస్సునకు, చిక్కటి చీకటికి; నభస్ = ఆకశపు; మణి = మణి - సూర్యుడు; కిన్ = కి; సాధు = సాధు, మంచి; జన = జనులలో; అగ్రణి = పెద్దవాడు; కిన్ = కి; ఏను = నేను; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:
మానమే ధనముగా గలవారు, మహనీయులు, సమాధినిష్ఠులు, వ్యాసభగవానుని ముఖపద్మధ్యాన మనే తేనె త్రాగుతూ, భయరహితులై, భవబంధ విముక్తులై ప్రకాశిస్తారు. అట్టి ఆ మునిజన మకుటాయమానుడు, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రభానుడు, శిష్ఠులలో ప్రధానుడు అయిన వ్యాసభగవానునికి వందనములు ఆచరిస్తున్నాను.
- ఉపకరణాలు:
అని యిట్లు హరిగురువందనంబు సేసి, శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె.\
టీకా:
అని = అనుచు; ఇట్లు = ఈ విధముగ; హరి = విష్ణవునకు; గురు = గురువునకు; వందనంబున్ = నమస్కారములు; సేసి = చేసి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడున్ = శ్రేష్ఠుడు; రాజు = రాజులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని, పరీక్షితు; కిన్ = కి; ఇట్లు = ఈ విధమునకు; అనియెన్ = పలికెను.
భావము:
అని ఇలా హరికి, తండ్రి యైన వ్యాసమహర్షికి ప్రణమిల్లి శుక యోగింద్రుడు పరీక్షిన్మహారాజకి ఇలా చెప్పసాగాడు.
- ఉపకరణాలు:
"అవిరోధంబున నీవు నన్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా
ధవుచేతన్ విని నారదుం డడిగినం దథ్యంబుగాఁ జెప్పె; మా
నవలోకేశ్వర! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె; సం
శ్రవణీయంబు, మహాద్భుతంబు వినుమా, సందేహవిచ్ఛేదివై.
టీకా:
అవిరోధంబునన్ = అడ్డదిడ్డములు కానట్టి, స్పష్టమైనట్టి; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడుగున్ = అడుగుతున్న; ఈ = ఈ; అర్థంబున్ = వివరణను; మున్ = పూర్వము; బ్రహ్మ = బ్రహ్మ; మాధవున్ = విష్ణువుని {మాధవుడు - మధు అను రాక్షసుని జయించినవాడు}; చేతన్ = నుండి; విని = విని, తెలుసుకొని; నారదుండు = నారదుడు; అడిగినన్ = అడుగగా; తథ్యంబుగాన్ = నిశ్చయముగా, యథాతథంగ; చెప్పెన్ = చెప్పెను; మానవ = మానవుల; లోక = సమూహములకు; ఈశ్వర = ప్రభువ, పరీక్షిన్మహారాజా; నారదుండు = నారదుడు; వెనుకన్ = ఆ వెనుకను; నాకున్ = నాకు; ప్రసాదించెన్ = దయతో ఇచ్చెను; సంశ్రవణీయంబున్ = చక్కగ వినదగినదియు; మహా = గొప్ప; అద్భుతంబున్ = అద్భుతంబున్; వినుమా = వినుము; సందేహ = సందేహములు; విచ్చేదివి = నివృతమైన వాడవు; ఐ = అయి.
భావము:
“ఓ మహారాజా! నీ విపుడు నన్నడిగిన విషయమునే, పూర్వం బహ్మదేవుడు నారాయణునివల్ల విన్నాడు. నారదుడు అడుగగా దానినే ఆయన వివరించాడు. ఆపైన నారదుడు నాకది తెలియజేశాడు. వినదగినది, మహాద్భుతమైనది, సంశయం తొలగించెడిది ఐన ఆ విషయం నీకు చెపుతాను, విను.
- ఉపకరణాలు:
నారదుండు బ్రహ్మ కిట్లనియె.
టీకా:
నారదుండు = నారదుడు; బ్రహ్మ = బ్రహ్మ; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:
నారదమహర్షి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు.
- ఉపకరణాలు:
"చతురాస్యుండవు; వేల్పు బెద్దవు; జగత్సర్గానుసంధాయి; వీ
శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం
యుతమై, సర్వము నీకరామలకమై యుండుంగదా; భారతీ
సతి యిల్లాలఁట నీకు; నో జనక నా సందేహముం బాపవే.
టీకా:
చతుర = నాలుగు; అస్యుండవున్ = ముఖములు కలవాడవును; వేల్పున్ = దేవతలకి; పెద్దవున్ = పెద్దవాడవును; జగత్ = జగత్తును, లోకములను; సర్గన్ = సృష్టించటను; అనుసంధాయివి = కూర్చువాడవు, చేయువాడవు; ఈ = ఈ; శ్రుతి = వినబడినవి, వేద; సంఘాతమున్ = మొత్త మంతయు; నీ = నీ యొక్క; ముఖా = ముఖములు అను; అంబుజములన్ = పద్మములందు; శోభిల్లున్ = విలసిల్లును; శబ్ద = శబ్దములు; అర్థ = అర్థములు; సంయుతము = చక్కగా కూర్చబడిన; ఐ = అయి; సర్వమున్ = సమస్తమును; నీకున్ = నీకు; కరామలకము = చేత ఉసిరిక వలె, చక్కగ తెలియునది; ఐ = అయి; ఉండున్ = ఉండును; కదా = కదా; భారతీ = భారతీ; సతి = దేవి; ఇల్లాలు = భార్య; అఁట = అట; నీకున్ = నీకు; ఓ = ఓ; జనక = తండ్రీ; నా = నా యొక్క; సందేహమున్ = సందేహమును, అనుమానమును; పాపవే = పోగొట్టవా.
భావము:
“తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. దేవతలలో పెద్దవాడవు. లోకాలకు సృష్టికర్తవు. వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి. శబ్దార్థమయమైన విశ్వమంతా నీకు అరచేతిలోని ఉసిరికాయలా తేటతెల్లమై ఉంటుంది. పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట. ఈ నా సందేహం తీర్చు తండ్రీ!