ద్వితీయ స్కంధము : రాజ ప్రశ్నంబు
- ఉపకరణాలు:
ఇట్లు మృత్యుభయంబు నిరసించి, ధర్మార్థకామంబులు సన్యసించి, పురుషోత్తము నందుఁ జిత్తంబు విన్యసించి, హరిలీలా లక్షణంబు లుపన్యసింపు మను తలంపున నరేంద్రుం డిట్లనియె.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; మృత్యు = మరణమందు; భయంబున్ = భయమును; నిరసించిన్ = తిరస్కరించి; ధర్మన్ = ధర్మము; అర్థన్ = అర్థము; కామంబులున్ = కామములును; సన్యసించి = వదలివేసి; పురుషోత్తమున్ = పురుషులలో ఉత్తముడు, విష్ణువు; అందున్ = పైన; చిత్తంబున్ = మనస్సును; విన్యసించి = ఉంచి, లగ్నము చేసికొని; హరిన్ = విష్ణువు యొక్క; లీలా = లీలల; లక్షణంబుల్ = విశేషములను; ఉపన్యసింపుము = విస్తారముగ చెప్పుము; అను = అని అడిగే; తలంపునన్ = ఉద్ధేశ్యముతో; నరేంద్రుండున్ = పరీక్షన్నరేంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:
ఇలా మరణభీతిని నిరాకరించిన, ధర్మార్థకామములనే త్రివర్గాన్ని తిరస్కరించిన పరీక్షిన్మహారాజు, పరమ పురుషునందు మనస్సును ఏకాగ్రంగా కేంద్రీకరించి, శ్రీ మన్నారాయణుని లీలావిశేషాలను అభివర్ణింపగా ఆకర్ణించాలనే సంకల్పంతో ఇలా అడిగాడు.
- ఉపకరణాలు:
"సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుఁడవైన నీవు సంస్తుతి సేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య! మానసోత్సవ మగుచున్.
టీకా:
సర్వ = సమస్తమునకు; ఆత్మున్ = ఆత్మ యైన వాని; వాసుదేవునిన్ = వసుదేవుని పుత్రుని; సర్వ = సర్వమును; అజ్ఞుండవున్ = తెలిసినవాడవు; ఐనన్ = అయినట్టి; నీవు = నీవు; సంస్తుతిన్ = వినుతులు; చేయన్ = చేస్తుండగ; సర్వ = సమస్తమైన; భ్రాంతులున్ = భ్రాంతులను, భ్రమలను; వదలెన్ = వదలినవి; మహా = గొప్ప; ఉర్వీ = భూమికి; సుర = దేవతలలో; వర్య = ఉత్తముడ; మానస = మనస్సునకు; ఉత్సవము = పండుగ; అగుచున్ = అవుతుండగ.
భావము:
"శుకమహర్షి! బ్రాహ్మణోత్తమా! సర్వమూ తెలిసిన నీవు సర్వానికీ ఆత్మయైన వాసుదేవుణ్ణి వినుతించేసరికి నాలోని భ్రమలన్నీ తొలగిపోయి, మనస్సు సంతోషంతో పరవశం పొందింది.
- ఉపకరణాలు:
ఈశుండు హరి విష్ణుఁడీ విశ్వమే రీతిఁ-
బుట్టించుఁ రక్షించుఁ బొలియఁ జూచు?
బహు శక్తి యుతుఁడగు భగవంతుఁ డవ్యయుఁ-
డాది నే శక్తుల నాశ్రయించి
బ్రహ్మ శక్రాది రూపముల వినోదించెఁ?-
గ్రమముననో యేక కాలముననొ
ప్రకృతి గుణంబులఁబట్టి గ్రహించుట?-
నేకత్వముననుండు నీశ్వరుండు
- ఉపకరణాలు:
భిన్నమూర్తి యగుచుఁ బెక్కు విధంబుల
నేల యుండు? నతని కేమి వచ్చె
నుండకున్నఁ? దాపసోత్తమ! తెలుపవే;
వేడ్క నాకు సర్వవేది వీవు."
టీకా:
ఈశుండు = ప్రభువు; హరి = విష్ణువు; విష్ణుఁడు = విష్ణువు; ఈ = ఈ; విశ్వమున్ = విశ్వమును, ప్రపంచం మొత్తమును; ఏ = ఏ; రీతిన్ = విధముగ; పుట్టించున్ = పుట్టించుటను, సృష్టించుటను; రక్షించున్ = రక్షించుటను; పొలియన్ = అంతంచేయుటను, లయించుటను; చూచున్ = చేయును; బహు = మిక్కిలి; శక్తి = శక్తి; యుతుఁడు = కలవాడు; అగు = అయిన; భగవంతున్ = భగవంతుని, మహిమాన్వితుని; అవ్యయుఁడు = నాశములేనివాడు; ఆదిన్ = మొట్టమొదటను, సృష్టికిమొదటను; ఏ = ఏ; శక్తులన్ = శక్తులను; ఆశ్రయించి = సహాయముచే, ఆధారముగ; బ్రహ్మ = బ్రహ్మ; శక్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; రూపములన్ = రూపములలో; వినోదించెన్ = క్రీడించెను, ప్రవర్తించెను; క్రమముననో = క్రమముగననా; ఏక = ఒకే; కాలముననో = సమయములోనేనా, సారిగనా; ప్రకృతిన్ = ప్రకృతి; గుణంబులన్ = గుణముల; పట్టిన్ = అనుసరించుటను; గ్రహించుటన్ = పరిగ్రహించుట, సృష్టి ఏర్పడుట; ఏకత్వంబునన్ = ఏకమైనవాడై; ఉండున్ = ఉండునట్టి; ఈశ్వరుండు = భగవంతుడు;
భిన్న = వివిధములైన; మూర్తిన్ = స్వరూపము కలవాడు; అగుచున్ = అవుతూ; పెక్కు = అనేకమైన; విధములన్ = విధములుగ; ఏలన్ = ఎందులకు; ఉండున్ = ఉండును; అతనికి = అతనికి; ఏమి = ఏమి; వచ్చెన్ = ప్రయోజనము; ఉండక = ఉండకుండగ; ఉన్నన్ = పోయినచో; తాపస = తాపసులలో; ఉత్తమ = ఉత్తముడా; తెలుపవే = తెలియజేయుము; వేడ్కన్ = వేడుకగ, కుతూహలముకలుగ; నాకున్ = నాకు; సర్వ = సమస్తము; వేదివిన్ = తెలిసినవాడవు; ఈవు = నీవు.
భావము:
మునిపుంగావా! శుకముని! సర్వేశ్వరుడు, సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి, పోషించి, సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ పరమాత్మ అనేక శక్తులతో గూడినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు తాల్చి వినోదించాడు? ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా? లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తియైన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాల ఎందుకు ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించక పోతే ఆయననకు వచ్చే నష్టమేమిటి? నీవు అంతా తెలిసినవాడవు. నాకు ఈ విషయములన్నీ వివరించుము".