పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-16-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై,
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై,
పెక్కురూపులు దాల్తు, నీ దగు పెంపు మాకు నుతింపఁగా
క్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

టీకా:

ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అణుమాత్రము = అణువంతవాడవు; ఐ = అయ్యి; ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; స్థూల = మిక్కిలి పెద్ద; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అంతయు = సమస్తము; నీవ = నీవుమాత్రమే; ఐ = అయ్యి; పెక్కు = అనేకమైన; రూపులు = స్వరూపాలు; తాల్తు = ధరించెదవు; నీది = నీదైనట్టిది; అగు = ఐన; పెంపు = అతిశయము; మేము = మా; కున్ = కు; నుతింపగాన్ = స్తుతిస్తుండగా; అక్కజంబు = ఆశ్చర్యము; అగుచున్నది = కలిగిస్తున్నది; ఏమనన్ = ఏమి అనగలము; అంబుజాక్ష = కృష్ణా {అంబుజాక్షుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; రమాపతీ = కృష్ణా {రమాపతి - రమ (లక్ష్మీదేవి యొక్క) పతి (భర్త), విష్ణువు}.

భావము:

పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.