పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సకలరాజుల శిక్షించుట

 •  
 •  
 •  

10.2-1105-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్టియెడ సకలరాజ లోకంబును గృష్ణుని విభవంబునకుం జూపోపక యసంఖ్యంబులగు మూఁకలు గట్టి యమ్మహాత్ముని మాహాత్మ్యంబు దెలియక దర్పాంధులై కడంగి

టీకా:

అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; సకల = ఎల్ల; రాజ = రాజుల; లోకంబునున్ = అందరు; కృష్ణుని = కృష్ణుని; విభవంబున్ = వైభవమున; కున్ = కు; చూపోపక = చూడలేక; అసంఖ్యంబులు = లెక్కపెట్టలే నంతవి; అగు = ఐన; మూకలు = సేనలను; కట్టి = జతకూర్చుకొని; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని యొక్క; మహాత్మ్యంబున్ = గొప్పదనము; తెలియక = తెలిసికొనలేక; దర్ప = గర్వముచేత; అంధులు = కళ్ళు కనిపించనివారు; ఐ = అయ్యి; కడంగి = పూని.

భావము:

అది చూసిన అక్కడ ఉన్న లెక్కపెట్టలేనంత మంది రాజులు అందరూ శ్రీకృష్ణుడి సౌభాగ్య వైభవాన్ని చూసి ఓర్వలేకపోయారు. శ్రీకృష్ణుని అసమాన తేజోవిశేషాలను తెలుసుకోలేక గర్వాంధులైన ఆ రాజులు అందరూ గుంపు కట్టి విజృంభించారు.

10.2-1106-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భాభవప్రసూన శరబాధిత మానసులై సమస్త ధా
త్రీరనందనుల్‌ బలుపుఁ దెంపునుఁ బెంపును సొంపు నేర్పడన్
దేకిరీటరత్న రుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీదళాక్షుఁ దాఁకిరి విశృంఖల వృత్తి నతిప్రయత్నులై.

టీకా:

భావభవ = మన్మథుని; ప్రసూన = పూల; శర = బాణములచే; బాధిత = బాధింపబడిన; మానసులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; సమస్త = ఎల్ల; ధాత్రీవరనందనుల్ = రాకుమారులు; బలుపు = బలములు; తెంపునున్ = పరాక్రమమును; పెంపును = గౌరవమును; సొంపున్ = ఉత్సాహమును; ఏర్పడన్ = తెలియబడునట్లుగ; దేవ = దేవతల; కిరీట = కిరీటముల; రత్న = మణుల; రుచిన్ = ప్రకాశముతో; దీపిత = ప్రకాశించునట్టి; పాద = పాదములు అను; సరోజుడు = పద్మములు కలవాడు; ఐన =; రాజీవదళాక్షుడు = కృష్ణుని; తాకిరి = ఎదిరించిరి; విశృంఖల = అడ్డులేని; వృత్తిని = విధముగ; అతి = మిక్కిలి; ప్రయత్నులు = పూనిక కలవారు; ఐ = అయ్యి.

భావము:

శ్రీకృష్ణుడు దేవతల కిరీటాలలోని రత్నాలచే దీపిత పాదాలు కలిగిన మహానుభావుడు అని ఎరుగక, మదనుని పూలతూపుల తాపాన్ని సైపలేక స్వయంవరానికి వచ్చిన ఆ అసంఖ్యాక రాకుమార సమూహం కోపించి ధైర్యసాహస పరాక్రమాలతో రెచ్చిపోయి శ్రీకృష్ణుని ఎదిరించారు.

10.2-1107-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత.

టీకా:

అంతన్ = అంతట.

భావము:

అంతట......

10.2-1108-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సిజలోచనుండు నిజశార్‌ఙ్గశరాసనముక్త హేమ పుం
రుచిరశాతసాయక నికాయములన్ రిపుకోటి నేసి సిం
ధురిపు విక్రమప్రకట దోర్బలుఁడై విలసిల్లి యొత్తె దు
స్త చలితాన్యసైన్యమును జ్జనమాన్యముఁ బాంచజన్యమున్.

టీకా:

సరసిజలోచనుండు = కృష్ణుడు; నిజ = తన; శార్ఙ్గ = శార్ఙ్గము అను; శరాసన = ధనుస్సునుండి; ముక్త = వేయబడిన; హేమ = బంగారు; పుంఖ = పింజలుగల; రుచిర = కాంతివంతమైన; శాత = వాడియైన; సాయక = బాణముల; నికాయములన్ = సమూహములను; రిపు = శత్రువుల; కోటిన్ = సమూహములను; ఏసి = వేసి; సింధురరిపు = సింహమువంటి; విక్రమ = పరాక్రమము; ప్రకట = కనబరచెడి; దోర్బలుడు = భుజబలము కలవాడు; ఐ = అయ్యి; విలసిల్లి = ప్రకాశించి; ఒత్తెన్ = ఊదెను; దుస్తర = దాటరాని; చలిత = చలించిన, బెదరిపోయిన; అన్య = శత్రు; సైన్యమున్ = సైన్యములు కలదానిని; సజ్జన = సత్పురుషులచేత; మాన్యమున్ = మన్నింపబడుదానిని; పాంచజన్యమున్ = పాంచజన్యమును {పాంచజన్యము - విష్ణుని శంఖము}.

భావము:

శార్ఙ్గ్యము అనే తన ధనుస్సునుండి వెలువడుతున్న వాడి బంగారు బాణాలను శత్రు సైన్యంపై వేసి, తామర రేకుల వంటి కన్నులున్న కృష్ణయ్య సింహపరాక్రముడై విలసిల్లి, శత్రువులు భయభ్రాంతులు అయ్యేలా పాంచజన్యము అనే విజయశంఖం పూరించాడు.

10.2-1109-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్‌ మృగ
వ్రాము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న
ట్లాతురులై చతుర్విధ సగ్ర బలంబులతోడఁ గూడి ని
ర్ధూ కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్.

టీకా:

ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; భూరి = మిక్కుటమైన; బాహుబల = భుజబలము కలవారు; ఐన = అయిన; విరోధి = శత్రు; నరేశ్వరుల్ = రాజులు; మృగ = జంతు; వ్రాతములు = జాలములు; ఒక్క = ఒక్క; పెట్టన్ = సారిగా; మృగరాజ = సింహపు {మృగరాజు - మృగములలో మిక్కిలి పరాక్రమము కలది, సింహము}; కిశోరము = పిల్ల; పైన్ = మీదకి; ఎదిర్చిన = దాడిచేసిన; అట్ల = విధముగా; ఆతురులు = ఆతురత కలవారు; ఐ = అయ్యి; చతుర్విధ = చతురంగములతో; సమగ్ర = సంపూర్ణమైన; బలంబుల్ = సైన్యములతో; తోడన్ = తోటి; కూడి = కలిసి; నిర్ధూత = పూర్తిగాతొలగిన; కళంకుడు = దోషములు కలవాడు; ఐన = అయిన; నవతోయజనేత్రునిఁ = కృష్ణుని {నవ తోయజ నేత్రునడు - నవ (అప్పుడే పూసిన) తోయజ (పద్మములవంటి) నేత్రుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; చుట్టుముట్టినన్ = తాకి కమ్ముకోగా.

భావము:

ఆ తరుణంలో మహా బాహుబల విక్రములు అయిన ఆ రాజులందరూ చతురంగబలాలతో కూడి ఒక్కపెట్టున వనమృగాలు మృగేంద్రుని ఎదిరించిన రీతిగా నిర్మలుడు అయిన శ్రీకృష్ణుడిని చుట్టుముట్టారు.

10.2-1110-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం
ములతో శిరంబులు, రన్మణినూపురరాజితోఁ బదం
బులుఁ, గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే
తులు, నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్

టీకా:

అలిగి = కోపగించి; మురాంతకుండు = కృష్ణుడు; కులిశ = వజ్రాయుధము; ఆభ = పోలు; శరంబులన్ = బాణములతో; నూత్న = సరికొత్త; రత్న = రత్నాల; కుండలముల = చెవికుండలముల; తోన్ = తోటి; శిరంబులున్ = తలలు; రణత్ = మోగుచున్న; మణి = రత్నాల; నూపుర = కాలి అందెల; రాజి = సమూహము; తోన్ = తోటి; పదంబులున్ = కాళ్ళు; కటక = చేతి కడియాలు; అంగుళీయక = వేళ్ళ ఉంగరాలు; విభూషణ = ఆలంకారములు; చాప = ధనుస్సు; శర = బాణములు; ఆలి = సమూహము; తోడన్ = తోటి; చేతులున్ = చేతులు; ఇలన్ = నేలపై; కూలగా = పడిపోగా; విజయ = గెలుపుకైన; దోహలి = సమర్థత కలవాడు; ఐ = అయ్యి; తునుమాడెన్ = సంహరించెను; వెండియున్ = పిమ్మట.

భావము:

అది చూసి కృష్ణునికి మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆయన వజ్రాయుధానికి సాటివచ్చే వాడిబాణాలను ప్రయోగించాడు. కర్ణకుండలాలతో కూడిన శత్రురాజుల శిరస్సులూ, నూపురాలతో పాటూ పాదాలూ కంకణాలతో పాటు చేతులూ తెగి నేలపై కూలేలా చేసి శత్రువు లయిన సకల రాజులను నిర్మూలించాడు.

10.2-1111-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శేషులు సొక్కాకుల
తిఁ దూల నిశాతపవనకాండముల సము
ద్ధతి నేసి తోలి విజయో
న్నతుఁడై నిజనగరి కేగె గధరుఁ డంతన్.

టీకా:

హత = చావగా; శేషులు = మిగిలినవారు; చొక్కాకుల = ఎండుటాకుల, రాలుటాకుల; గతిన్ = వలె; తూలన్ = పడిపోగా; నిశాత = వాడియైన; పవనకాండములన్ = వాయవ్యాస్త్రములను; సమ = మిక్కిలి; ఉద్ధతిన్ = దూకుడుతో; ఏసి = వేసి; తోలి = తఱిమి; విజయ = గెలుపువలని; ఉన్నతుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; నిజ = తన; నగరి = పట్టణమున; కిన్ = కి; ఏగెన్ = వెళ్ళెను; నగధరుడు = కృష్ణుడు; అంతన్ = అంతట.

భావము:

చావుతప్పి బ్రతికిపోయినవారు ఎండుటాకుల్లాగా ఎగిరి నలుదిక్కులకూ పారిపోయేలా శ్రీకృష్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ విధంగా నాతోపాటు విజయాన్ని వరించి గిరిధారి నన్ను తీసుకుని ద్వారకకు చేరుకున్నాడు.

10.2-1112-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు మహిత మంగళాలంకృతంబును, నతిమనోహర విభవాభిరామంబు నగు ద్వారకానగరంబున కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునఁ దోడన చనుదెంచి.

టీకా:

అట్లు = ఆ విధముగా; మహిత = గొప్ప; మంగళ = శుభకరముగా; అలంకృతంబును = అలంకరింపబడినది; అతి = మిక్కిలి; మనోహర = మనోజ్ఞమైన; విభవ = వైభవములతో; అభిరామంబున్ = చక్కనైనది; అగు = ఐన; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; అరుగుదెంచినన్ = వచ్చిన; మత్ = నా యొక్క; జనకుండును = తండ్రి; ప్రియంబునన్ = ఇష్టము; తోడనన్ = తోటి; చనుదెంచి = వచ్చి.

భావము:

ఆ విధంగా మేము సాటిలేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరించబడిన ద్వారకానగరానికి వస్తుంటే, మా వెనువెంట మా తండ్రి గారు బృహత్సేనుడు కూడా వచ్చారు.

10.2-1113-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణిత వినూత్న రత్న రుచిస్ఫుట నూపుర, హార, కర్ణభూ
ణ, కటకాంగుళీయక, లత్పరిధాన, కిరీట, తల్ప, వా
ణ, రథ, వాజి, హేతినికరంబులనుం, బరిచారికాతతిం
బ్రణుతగుణోత్తరుం డయిన ద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్.

టీకా:

రణిత = మోగుచున్న; వినూత్న = సరికొత్త; రత్న = మణుల; రుచిర = కాంతులు; స్ఫుట = బాగా కనబడుతున్న; నూపుర = కాలి అందెలు; హార = ముత్యాలపేరులు; కర్ణభూషణ = చెవి ఆభరణములు; కటక = చేతి కడియాలు; అంగుళీయక = వేళ్ళ ఉంగరాలు; లసత్ = చక్కటి; పరిధాన = కట్టుబట్టలు; కిరీట = కిరీటములు; తల్ప = పాన్పులు; వారణ = ఏనుగులు; రథ = రథములు; వాజి = గుఱ్ఱములు; హేతి = ఆయుధములు; నికరంబులనున్ = సమూహములను; పరిచారికా = సేవకురాండ్ర; తతిన్ = సమూహమును; ప్రణుత = కొనియాడబడిన; గుణ = సుగుణములచేత; ఉత్తరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐనట్టి; పద్మదళాక్షున్ = కృష్ణుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; నెమ్మి = ప్రీతి; తోన్ = తోటి.

భావము:

అలా ద్వారకకు వచ్చిన మాతండ్రి వినుతింప తగిన ఉత్తమగుణనిథి అయిన శ్రీకృష్ణునికి ప్రీతితో రకరకాలైన రత్నాభరణాలను, కిరీటాలను, హారాలను, నూపుర కేయూరాలను, అంగుళీయకాలను, పట్టుపాన్పులను, రథగజతురగాలను, ఖడ్గాది ఆయుధాలను, వేలాది పరిచారికలను బహుమానంగా ఇచ్చాడు.

10.2-1114-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మహనీయ = గొప్ప; తేజస్ = తేజస్సునకు; నిధి = ఉనికిపట్టు; ఐన = అయిన; మాధవున్ = కృష్ణుని; దయా = కృపచేత; పరిలబ్ధ = చక్కగా లభించిన; నిఖిల = సర్వ; వస్తు = పదార్థముల; విస్తారుండు = సమృద్ధి కలవాడు; అయ్యునున్ = అయినప్పటికి; నిజ = తన; అధికార = యోగ్య బాధ్యత; శుద్ధి = పవిత్రముగా చేయుట; కొఱకు = కోసము; మరలన్ = తిరిగి; కన్యా = యువతులలో; రత్నంబును = ఉత్తమురాలను; వినూత్న = సరికొత్త; రత్న = మణుల; వ్రాతంబును = సమూహమును; సమర్పించెను = ఇచ్చెను; అని = అని చెప్పి; భూసుర = విప్ర; విసరంబులు = సమూహములు; వినుతింపన్ = స్తుతించగా; మా = మా; తండ్రి = నాన్నగారు; ఐన = అయిన; బృహత్సేనుండు = బృహత్సేనుడు; నన్నును = నన్ను; సమస్త = ఎల్ల; వస్తువులనున్ = వస్తువులను; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; సమర్పించి = ఇచ్చి; క్రమంబునన్ = పద్ధతి ప్రకారముగా; సకల = ఎల్ల; యాదవులన్ = యాదవులను; పూజించి = సన్మానించి; మరలి = వెనుదిరిగి; నిజ = తన; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; కుంతియున్ = కుంతీదేవి; గాంధారియున్ = గాంధారీదేవి; కృష్ణయున్ = ద్రౌపది; అఖిల = ఎల్ల; నృపాలకాంతా = రాణులు {నృపాలకాంతలు - రాజుల భార్యలు, రాణులు}; జనంబులును = సమూహములు; గోపికలున్ = గొల్లస్త్రీలు; తమతమ = వారివారి; మనంబులన్ = మనస్సులలో; సర్వ = ఎల్ల; భూతా = జీవుల; అంతర్యామి = లోపల వ్యాపించు వానిని; లీలా = క్రీడార్థము; మానుష = మానవ; విగ్రహుండును = స్వరూపము కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్ష = కృష్ణుని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములను; స్మరణ = స్మరించుట యందలి; ఆనంద = ఆనందముతో; పరవశలు = చొక్కినవారు; ఐ = అయ్యి; కృష్ణున్ = కృష్ణుని; ప్రశంసించిరి = శ్లాఘించిరి; అంత = అంతట;

భావము:

మహా తేజోనిథి అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం వలననే గొప్ప వైభవ సంపత్తులు మా నాన్నగారికి ప్రాప్తించాయి. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతోపాటు అనేక అనర్ఘరత్నాలను మాతండ్రి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. బ్రాహ్మణోత్తములు ఆశీస్సులతో కొనియాడుతుండగా, మా తండ్రి బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి తిరిగి వెళ్ళాడు." అంటూ లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అంతట, గాంధారీ, కుంతీ, ద్రౌపదీ, తక్కిన రాజపత్నులూ గోపికలూ తమ తమ హృదయాలలో సర్వాంతర్యామి, లీలామానుష రూపుడు అయిన శ్రీకృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. అటు పిమ్మట కొంతకాలానికి....