పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భూసురుని దౌత్యంబు

 •  
 •  
 •  

10.2-642-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ప్రతి = అన్ని; దివసంబునున్ = దినము నందు; ఉండు = ఉంటున్న; అవసరంబునన్ = సమయము నందు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అపూర్వదర్శనుండు = ముందెన్నడు కనబడనివాడు; ఐన = అగు; భూసురుండు = విప్రుడు; ఒక్కరుండు = ఒకడు; చనుదెంచి = వచ్చి; సభా = కొలువుకూటము; మధ్యంబునన్ = నడుమ; కొలువున్న = సభతీరి ఉన్నట్టి; ముకుందునిన్ = కృష్ణుని; పొడగని = చూసి; దండప్రణామంబులు = సాగిలపడి మొక్కుటలు; ఆచరించి = చేసి; వినయంబునన్ = వినయముతో; కరములున్ = చేతులు; మొగిచి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు.

10.2-643-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కంవిలోచన! దానవ
భంన! యోగీంద్రవిమలభావలసద్బో
ధాంన! దీప్తినిదర్శన!
రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా!

టీకా:

కంజవిలోచన = పద్మాక్షా, కృష్ణా; దానవభంజన = రాక్షసులను శిక్షించువాడా; యోగి = ఋషి; ఇంద్ర = శ్రేష్ఠుల; విమల = నిర్మలమైన; భావ = తలపులలో; లసత్ = ప్రకాశవంతమైన; బోధ = తెలివిడి అను; అంజన = అంజనము వంటివాడ; దీప్తి = ప్రకాశమునకు; నిదర్శన = దృష్టాంతమైనవాడ; రంజిత = ప్రకాశిస్తున్న; శుభ = మేలైన; మూర్తి = స్వరూపము కలవాడ; కృష్ణా = కృష్ణా; రాజీవాక్షా = చేపలవంటి కన్నులు కలవాడా.

భావము:

“రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు.

10.2-644-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వధరింపు; జరాసంధుఁ తుల బలుఁడు
నకు మ్రొక్కని ధారుణీవుల నెల్ల
వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ
బెట్టినాఁడు గిరివ్రజట్టణమున.

టీకా:

అవధరింపుము = వినుము; జరాసంధుడు = జరాసంధుడు; అతుల = సాటిలేని; బలుడు = బలములు కలవాడు; తన = అతని; కు = కి; మ్రొక్కని = లొంగని; ధారుణీధవులన్ = రాజులను; ఎల్లన్ = అందరిని; వెదకి = వెతికి; తెప్పించి = తీసుకువచ్చి; ఇరువదివేల = ఇరవైవేలమందిని (20000); ఆకపెట్టినాడు = చెఱబట్టినాడు; గిరివ్రజ = గిరివ్రజము అను; పట్టణమునన్ = పట్టణము నందు.

భావము:

దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు.

10.2-645-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారు పుత్తేర వచ్చినవాఁడ నేను
రవరోత్తమ! నృపుల విన్నపము గాఁగ
విన్నవించెద నామాట వినినమీఁద
నఘ! నీ దయ! వారి భాగ్యంబు కొలఁది. "

టీకా:

వారు = వారు; పుత్తేర = పంపించగా; వచ్చినవాడన్ = వచ్చినవాడిని; ఏనున్ = నేను; నరవరోత్తమ = మహారాజా; నృపుల = రాజుల యొక్క; విన్నపము = మనవి; కాగన్ = ఐనట్లు; విన్నవించెదన్ = చెప్పెదను; నా = నా యొక్క; మాట = మాటను; వినిన = విన్న; మీదన్ = పిమ్మట; అనఘ = పుణ్యుడా; నీ = నీ యొక్క; దయ = కృప; వారి = వారియొక్క; భాగ్యంబు = అదృష్టము యొక్క; కొలది = కలిగినంత.

భావము:

ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.”

10.2-646-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె.

టీకా:

అని = అని; ధరాధిపుల = రాజుల; విన్నపంబుగాన్ = మనవిగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికి, రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈవిధంగా చెప్పసాగాడు

10.2-647-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వారిజనాభ! భక్త జనత్సల! దుష్టమదాసురేంద్ర సం
హా! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సావిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!

టీకా:

వారిజనాభ = కృష్ణా {వారిజ నాభుడు - పద్మనాభుడు, విష్ణువు}; భక్త = భక్తులైన; జన = వారి ఎడ; వత్సల = వాత్సల్యము కలవాడ; దుష్ట = చెడ్డవారై; మదా = కొవ్వెక్కిన; అసుర = రాక్షస; ఇంద్రులన్ = ప్రభువులను; సంహార = చంపువాడ; సరోరుహాసన = బ్రహ్మదేవుడు; పురారి = శివుడు; ముఖ = మొదలగు; అమర = దేవతలచే; వంద్య = నమస్కరింపబడు; పాద = పాదములు అను; పంకేరుహ = పద్మములు కలవాడా {పంకేరుహము - పంకే (బురద)లో రుహము (పుట్టునది), పద్మము}; సర్వ = ఎల్ల; లోక = లోకులచేత; పరికీర్తిత = మిక్కిలి కీర్తింపబడు; దివ్య = దివ్యమైన; మహా = గొప్ప; ప్రభావ = మహిమ కలవాడా; సంసార = సంసారబంధములను; విదూర = మిక్కిలి దూరము చేయువాడా; నంద = నందుని; తనూజాత = కొడుకా; రమాహృదయేశ = కృష్ణా {రమా హృదయేశ - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; మాధవా = కృష్ణా.

భావము:

“శ్రీకృష్ణా! ఓ భక్తవత్సల! దుష్ట రాక్షసేంద్ర సంహార! బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజా! సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు...

10.2-648-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్త జనుల మమ్ము రసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
రణయుగము మాకు రణ మనఘ!

టీకా:

ఆర్త = దుఃఖము నొందిన; జనులన్ = వారము; మమ్మున్ = మమ్ములను; అరసి = విచారించి; రక్షింపు = కాపాడుము; మహాత్మ = గొప్పవాడా; భక్త = భక్తులైన; జన = వారి; భయ = భయమును; అపహరణ = పోగొట్టువాడా; నిన్నున్ = నిన్ను; మదిన్ = మనసులో; నుతించి = స్తుతించి; నీ = నీ; కున్ = కు; మ్రొక్కెదము = నమస్కరింతుము; నీ = నీ యొక్క; చరణ = పాదముల; యుగము = జంట; మా = మా; కున్ = కు; శరణము = రక్షకము; అనఘ = పుణ్యుడా.

భావము:

ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు.

10.2-649-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లియుర దండింపఁగ దు
ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా
లితుఁడవై యుగయుగమున
వడ నుదయింతు కాదె? భవ! యనంతా!

టీకా:

బలియురన్ = ఒళ్ళు బలిసిన వారిని; దండింపంగన్ = శిక్షించుటకు; దుర్బలులను = బలహీనులను; రక్షింపన్ = కాపాడుటకు; జగతి = భూలోకము; పైన్ = అందు; నిజ = స్వకీయమైన; లీలా = లీలలతో; కలితుడవు = కూడినవాడవు; ఐ = అయ్యి; యుగయుగమునన్ = ప్రతి యుగము నందు; అలవడన్ = వాడుకగా; ఉదయింతు = అవతరింతువు; కాదె = కాదా, అవును; అభవ = పుట్టుక లేనివాడా; అనంతా = కృష్ణా.

భావము:

ఓ అనంతా! అభవా! కృష్ణా! బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా.

10.2-650-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీదిఁ దోఁపని యర్థం
బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త
స్తోసురభూజ! త్రిజగ
త్క్షేమంకర! దీనరక్ష సేయు మురారీ!

టీకా:

నీ = నీ యొక్క; మదిన్ = మనసు నందు; తోపని = కనబడని; అర్థంబు = విషయము; ఈ = ఈ; మేదిని = భూలోకము; అందున్ = లో; కలదె = ఉన్నదా, లేదు; ఈశ్వరా = సర్వనియామకా; భక్త = భక్తుల; స్తోమ = సమూహములకు; సురభూజ = కల్పవృక్షమా; త్రిజగత్ = ముల్లోకములకు; క్షేమన్ = మేలు; కర = చేయువాడా; దీన = దీనులము; రక్ష = కాపాడుట; చేయు = చేయుము; మురారీ = కృష్ణా {మురారి - మురాసురుని చంపినవాడు, కృష్ణుడు}.

భావము:

ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. పరమేశ్వరా! ముల్లోకాలకు శుభం కలిగించువాడ! భక్తజన కల్పవృక్షమా! దీనులైన మమ్మల్ని కాపాడు.

10.2-651-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ పంపు సేయకుండఁగ
నా ద్మభవాదిసురులకైనను వశమే?
శ్రీతి! శరణాగతులం
జేట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా!

టీకా:

నీ = నీ యొక్క; పంపున్ = ఆజ్ఞను; చేయకుండగను = నడపకుండా ఉండుట; ఆ = ఆ ప్రసిద్ధులైన; పద్మభవ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలగు; సురుల = దేవతల; కైనను = కి అయినను; వశమే = శక్యమా, కాదు; శ్రీపతి = కృష్ణా {శ్రీపతి - లక్ష్మిభర్త, విష్ణువు}; శరణు = రక్షకము; ఆగతులం = పొందగోరువారము; చేపట్టి = పరిగ్రహించి; నిరోధమున్ = చెరలను; ఉడుగన్ = తొలగునట్లు; చేయుము = చేయుము; కృష్ణా = కృష్ణా.

భావము:

ఓ లక్ష్మీనాథ! శ్రీకృష్ణా! నీ ఆజ్ఞ ఉల్లంఘించటం ఆ బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు.

10.2-652-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వుఁ డవయ్యును జగతిం
బ్రవించుట లీల గాక వమందుటయే
ప్రభువులకుం బ్రభుఁడవు మము
యాత్ముల నరసి కావఁ ను నార్తిహరా!

టీకా:

అభవుడవు = పుట్టుక లేనివాడవు; అయ్యున్ = అయినప్పటికి; జగతిన్ = లోకము నందు; ప్రభవించుట = అవతరించుట; లీల = వేడుకకు; కాక = తప్పించి; భవమున్ = పుట్టుకను; అందుటయే = పొందుటా, కాదు; ప్రభువులు = పాలకుల; కున్ = కు; ప్రభుండవు = పాలకుడవు; మమున్ = మమ్ములను; సభయ = భయముతో కూడిన; ఆత్ములన్ = మనస్సులు కలవారము; అరసి = విచారించి; కావంజనున్ = కాపాడుము; ఆర్తి = దుఃఖములను; హరా = పోగొట్టువాడా.

భావము:

దుఃఖనాశకుడా! శ్రీకృష్ణా! పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు ఇలా లోకంలో అవతరించడం మావంటి భయపీడితులను రక్షించుటకే కదా.

10.2-653-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నమున నీ భుజావలి
కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
సెడఁగ జరాసంధుఁడు
దునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.

టీకా:

కదనమునన్ = యుద్ధములో; నీ = నీ యొక్క; భుజా = భుజబలముల; ఆవలిన్ = సమూహమున; కున్ = కు; ఎదిరింపగన్ = ఎదురునిలిచి పోరాడ; లేక = లేకపోవుటచే; పాఱడే = పారిపోలేదా; విక్రమ = పరాక్రమము; సంపద = కలిమి; చెడగన్ = చెడిపోగా; జరాసంధుడు = జరాసంధుడు; పదునెనిమిది = పద్దెనిమిది; సార్లు = మార్లు; ధరణిపాలురు = రాజులు; నవ్వన్ = పరిహాసము చేయగా.

భావము:

ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా.

10.2-654-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు”మని విన్నవించి" రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = తాను; పడిన = పడిన; బన్నములన్ = భంగపడుటలను; తలపక = తలచక; సింహంబు = సింహము; సమద = మదించిన; దంతావళంబులన్ = ఏనుగులను; అరికట్టి = అడ్డగించి; కావరించు = అహంకరించు; చందంబునన్ = విధముగా; మమ్మున్ = మమ్ములను; చెఱపట్టి = బంధించి; బాధించుచున్న = బాధపెడుతున్న; ఆ = ఆ; పాపాత్ముని = పాపిష్ఠిబుద్ధి కలవానిని; మర్దించి = శిక్షించి; కారాగృహ = చెరసాలలో; బద్దులము = బంధీలము; అగు = ఐన; మా = మా యొక్క; నిర్బంధంబులున్ = నిర్బంధములను; పాపి = పోగొట్టి; సుత = కొడుకులు; దార = భార్యలు; మిత్ర = మిత్రులు; వర్గంబులన్ = సమూహములతో; కూర్చి = కలిపి; అనన్యశరణ్యులము = నీవుతప్పింకే దిక్కులేనివారము; ఐన = అయిన; మమ్మున్ = మమ్ములను; రక్షింపుము = కాపాడుము; అని = అని; విన్నవించిరి = మనవి చేసిరి; అని = అని; బ్రాహ్మణుండు = విప్రుడు; విన్నపంబున్ = మనవి; చేయు = చేస్తున్న; సమయంబునన్ = సమయము నందు.

భావము:

అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో.... (విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.)