పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : హస్తిన గంగం ద్రోయబోవుట

 •  
 •  
 •  

10.2-588-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు పూని కౌరవరాజధాని యైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి యప్పుటభేదనవిస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగాప్రవాహంబునం బడఁద్రోయ గమకించిన నప్పుడు, మహాజలమధ్య విలోలంబగు నావ చందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్ర ప్రాకార సౌధా ట్టాలక తోరణ ధ్వజ ద్వార కవాట కుడ్య వీథీ యుతంబుగా నొడ్డ గెడవైనఁ బౌరజనంబులు పుడమి నడుగులిడంగరాక తడంబడుచు, నార్తులై కుయ్యిడుచుండి; రట్టియెడ నమ్మహోత్పాతంబులు గనుంగొని; తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెఱింగి; దానికిఁ బ్రతీకారంబు లేమిని; గళవళంబున భయాకులమానసు లై పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగాఁ దలంచి, సాంబునిఁ గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబుతోఁ గొనివచ్చి; దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; పూని = సిద్ధమై; కౌరవ = కౌరవుల; రాజధాని = ముఖ్యపట్టణము; ఐన = అయిన; కరినగరంబున్ = హస్తినాపురమును; కడతల = చివరికొన నందు; హల = నాగేటి ఆయుధము యొక్క; అగ్రంబున్ = కొనను; చొనిపి = దూర్చి; ఆ = ఆ; పుటభేదన = పట్టణము అంత; విస్తారంబు = విస్తరించినది; అగు = ఐన; గడ్డన్ = నేలపలకను, నేలపెళ్ళను; భుజా = భుజబలము యొక్క; గర్వ = అధిక్యముచేత; దుర్వారుండు = వారింపరానివాడు; ఐ = అయ్యి; పెకలించి = పెళ్ళగించి; తిగిచి = లాగి; గంగా = గంగానదీ; ప్రవాహంబునన్ = ప్రవాహము నందు; పడ = పడునట్లు; త్రోయన్ = తోయుటకు; గమకించినన్ = ప్రయత్నిస్తుండగా; అప్పుడు = ఆ సమయము నందు; మహాజల = సముద్రపునీటి; మధ్యన్ = నడుమ; విలోలంబు = తూగునది; అగు = అయ్యెడి; నావ = పడవ; చందంబునన్ = వలె; ఆ = ఆ; నగరంబు = పట్టణము; వడవడ = వడవడ అనుచు; వడంకుచున్ = వణకిపోతూ; గోపుర = గోపురములు; వప్ర = కోట; ప్రాకార = ప్రహారీగోడలు; సౌధా = భవంతులు; అట్టాలక = మేడలు; తోరణ = తలవాకిళ్ళు; ధ్వజ = ధ్వజస్తంభములు; ద్వార = గుమ్మాలు; కవాట = తులుపులు; కుడ్య = గోడలు; వీథీ = ఇండ్లవరుసలు; యుతంబుగాన్ = కూడినదిగా; ఒడ్డగెడవు = ఒరిగినది; ఐనన్ = కాగా; పౌర = పురము నందలి; జనంబులున్ = ప్రజలు; పుడమిన్ = నేలమీద; అడుగు = అడుగులు; ఇడంగన్ = వేయుటకు; రాక = వీలుపడక; తడంబడుచున్ = తడబడుతు; ఆర్తులు = దుఃఖము నొందినవారు; ఐ = అయ్యి; కుయ్యిడుచుండిరి = మొరపెట్ట సాగిరి; అట్టి = అలాంటి; ఎడన్ = సమయము నందు; ఆ = ఆ; మహా = గొప్ప; ఉత్పాతంబులున్ = ఉపద్రవములను; కనుంగొని = చూసి; తాలంకుండు = బలరాముడు; కినుకన్ = కోపము; పొడమి = కలిగి; కావించిన = చేసిన; ఉపద్రవంబు = ప్రమాదము; కాన్ = అయినట్లు; ఎఱింగి = తెలిసికొని; దాని = ఆ ఉపద్రవమున; కిన్ = కు; ప్రతీకారంబున్ = ప్రతిక్రియ; లేమిని = లేకపోవుటచేత; కళవళంబునన్ = గాబరాతో, కంగారుతో; భయ = భయపడుటచే; ఆకుల = కలతచెందిన; మానసులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; పుత్ర = కొడుకులు; మిత్ర = హితులు; కళత్ర = భార్యలు; బంధు = ఙ్ఞాతులు; భృత్య = సేవకులు; పౌరజన = పురప్రజలతో; సమేతంబుగా = కూడినవారై; భీష్మ = భీష్ముడు; దుర్యోధన = దుర్యోధనుడు; ఆది = మున్నగు; కౌరవులు = కౌరవులు; వేగంబునన్ = శీఘ్రమే; అతని = అతని యొక్క; చరణంబులన్ = పాదములను; శరణంబులు = రక్షకములు; కాన్ = అగునట్లు; తలంచి = విచారించుకొని; సాంబునిన్ = సాంబుడును; కన్యకా = బాలికతో; యుక్తంబుగా = కూడినవానిగా, సహా; మణి = రత్నాలు; మయ = పొదిగిన; భూషణ = అలంకారములు; అంబర = వస్త్రములు; జాలంబు = సమూహము; తోన్ = తోటి; కొనివచ్చి = తీసుకువచ్చి; దండప్రణామంబులు = సాగిలపడి మొక్కుటలు {దండప్రణామము - కఱ్ఱ వలె నేలపై పడి నమస్కరించుట, సాగిలపడి మొక్కుట}; ఆచరించి = చేసి; కర = చేతులు అను; కమలంబులున్ = కమలములను; మొగిడ్చి = జోడించి; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా చేబట్టిన తన హలాన్ని బలరాముడు, కౌరవరాజధాని అయిన హస్తినాపురం చిట్టచివరికొన భాగంలో తన నాగలి చివరి భాగాన్ని చొప్పించి, పట్టణం మొత్తం పెకలించి గంగలో కలపటానికి ఉద్యుక్తుడైనాడు. ఆ సమయంలో హస్తినాపురం సముద్రజలాల్లో ఊగిసలాడెడి పడవలాగ అయింది ఆ పట్టణం పరిస్థితి. గోపుర ప్రాకార సౌధాలతో సహా ఒక వైపుకు ఒరిగింది. పౌరులు హాహాకారాలు చేశారు. ఈ మహోపద్రవానికి భయపడిపోయారు. బలభద్రుని రౌద్రావేశం తగ్గించటానికి మరోమార్గం లేక భీష్మ దుర్యోధనాదు లందరూ పరుగెత్తుకుని వచ్చి బలరాముడిని శరణువేడారు. కన్యకను, సాంబుడిని తీసుకు వచ్చి అప్పజెప్పారు. అనేక మణిమయ భూషణాదులు కానుకగా ఇచ్చి, చేతులు జోడించి ఇలా ప్రార్థించారు...

10.2-589-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

”రా! సమంచితముక్తా
దా! యశఃకామ! ఘనసుధాధామ! రుచి
స్తో! జయసీమ! జగదభి
రా! గుణోద్దామ! నిఖిలరాజలలామా!

టీకా:

రామ = బలరాముడా; సమంచిత = మిక్కిలి మనోజ్ఞమైన; ముక్తా = ముత్యాల; దామ = దండ ధరించిన వాడ; యశః = యశస్సును; కామ = కోరువాడు; ఘన = అధికమైన; సుధాధామ = చంద్రుని వంటి; రుచి = దేహకాంతుల; స్తోమ = సమూహము కలవాడా; జయ = గెలుపునకు; సీమ = మేర ఐన వాడా; జగత్ = లోకములకు; అభిరామ = మనోజ్ఞములైన; గుణ = సుగుణములచేత; ఉద్దామ = అధికుడైన వాడా; నిఖిల = ఎల్ల; రాజ = రాజులకు; లలామ = భూషణమైన వాడా.

భావము:

“ఓ బలరామా! జగదభిరామా! నీవు రాజులలో శ్రేష్ఠుడవు; ముత్యాలహారాలు ధరించువాడవు; కీర్తికాముకుడవు; మనోహర ఆకారం కలవాడవు; జయశీలివి; సుగుణశాలివి; అట్టి నీవు మమ్మల్ని రక్షించాలి.

10.2-590-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ హిమ యెఱిఁగి పొగడఁగ
నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్‌
క్షేమంకరుఁడవు; సుమతివి
తాసులము మమ్ముఁ గావఁ గు హలపాణీ!

టీకా:

నీ = నీ యొక్క; మహిమన్ = గొప్పదనమును; ఎఱిగి = తెలిసికొని; పొగడగన్ = కీర్తించుటకు; ఏము = మేము; ఎంతటివారము = ఏపాటివాళ్ళము; అఖిల = సర్వ; నేతవు = నియామకుడవు; త్రిజగత్ = ముల్లోకములకు; క్షేమంకరుడవు = మేలు చేయువాడవు; సుమతివి = మంచి బుద్ధిశాలివి; తామసులమున్ = అఙ్ఞానులము; మమ్మున్ = మమ్మలిని; కావదగున్ = కాపాడుము; హలపాణీ = బలరామా {హలపాణి - నాగలి చేత ధరించిన వాడు, బలరాముడు}.

భావము:

ఓ బలరామ! హలాయుధము ధరించు వాడ! నీ మహిమ తెలిసి పొగడడానికి మేమెంతవారము. నీవేమో సర్వానికీ నాయకుడవు. ముజ్జగాలకూ క్షేమం కలిగించేవాడవు. బుద్ధిమంతుడవు. మేము అహంకారులము మమ్మల్ని కాపాడు.

10.2-591-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూక్ర మెల్లఁ దాల్చిన
యా క్రీశ్వరుఁడు దావకాంశుఁడు బలదే
వా! క్రికి నగ్రజుఁడవు
నీక్రియ లుడుపఁ జెల్లు నీకు జితారీ!

టీకా:

భూచక్రము = భూమండలము; ఎల్లన్ = సమస్తమును; తాల్చిన = ధరించిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; చక్రీశ్వరుడు = ఆదిశేషుడు {చక్రీశ్వరుడు - చక్రి (సర్పములకు) ఈశ్వరుడు (ప్రభువు), ఆదిశేషుడు}; తావక = నీ యొక్క; అంశుడు = అంశ కలవాడు; బలదేవా = బలరాముడా; చక్రి = కృష్ణుని; కిన్ = కి; అగ్రజుడవు = అన్నవి {అగ్రజుడు - ముందు పుట్టినవాడు, అన్న}; నీచ = అల్పపు; క్రియలున్ = పనులను; ఉడుపన్ = విడుచుట; చెల్లున్ = తగును; నీ = నీ; కున్ = కు; జితారీ = జయింపబడిన శత్రువులు కలవాడ.

భావము:

జయింపబడిన శత్రువులు కలవాడా! బలభద్ర! ఈ సమస్త ప్రపంచాన్నీ భరించే ఆదిశేషుడు నీ అంశం. నీవు ఆ చక్రాయుధుడు శ్రీకృష్ణుడికి అన్నవు. నీచకార్యాలకు పాల్పడిన మమ్మల్ని రక్షించు.

10.2-592-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్షింపుము రక్షింపు ము
పేక్షింపక నమితనిఖిలబృందారక! ఘో
క్షణదాచరవిషనిట
లాక్ష! భయాతురుల మమ్ము రయు మనంతా!

టీకా:

రక్షింపుము = కాపాడుము; రక్షింపుము = కాపాడుము; ఉపేక్షింపక = అనాదరము చేయకుండ; నమిత = నమస్కరింపబడిన; నిఖిల = సర్వ; బృందారక = దేవతలు కలవాడా; ఘోర = భయంకరమైన; క్షణదాచర = రాక్షసులు అను {క్షణదాచర - క్షణద (ప్రజలకు తీరికను వేడుకను ఇచ్చునది, రాత్రి) చర (చరించువాడు), రాక్షసుడు}; విష = కాలకూటవిషమునకు; నిటలాక్ష = శివుని వంటివాడా {నిటలాక్షుడు - నొసట కన్ను కలవాడు, శివుడు}; భయ = భయముచేత; ఆతురులము = పీడింపబడువారము; మమ్మున్ = మమ్మలిని; అరయుము = ఆదరించికాపాడుము; అనంతా = శేషావతారుడా.

భావము:

సమస్త దేవతలచేతా నమస్కరింపబడే ఓ మహానుభావా! బలదేవా! మమ్మల్ని ఉపేక్షించక రక్షించు. శివుడు హాలాహాలాన్ని మ్రింగిన విధంగా క్రూరరాక్షసులను మ్రింగివేసిన అనంతుడవు. నీవు భయార్తులమైన మమ్మల్ని రక్షించు.

10.2-593-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును దేవా! యీ సచరాచరంబు నయిన జగంబుల నీ లీలావినోదంబులం జేసి దుష్టజనమర్దనంబును, శిష్టజనరక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తి స్థితి లయహేతువైన నీకు నమస్కరింతు” మని వెండియు నిట్లనిరి.

టీకా:

మఱియును = ఇంకను; దేవా = భగవంతుడా; ఈ = ఈ; సచరాచరంబున్ = చర అచర ప్రాణులతో కూడినట్టిది; అయిన = ఐన; జగంబులన్ = లోకములను; నీ = నీ; లీలా = క్రీడా; వినోదంబులన్ = వినోదములు అగుట; చేసి = వలన; దుష్ట = దుష్టులైన; జన = వారిని; మర్దనంబును = దండించుట; శిష్ట = సజ్జనులైన; జన = వారిని; రక్షణంబునున్ = కాపాడుట; చేయుచున్ = చేస్తూ; జగత్ = భువనమును; ఉత్పత్తి = సృష్ణించుట; స్థితి = పాలించుట; లయ = నశింపజేయుటకు; హేతువు = కారణభూతుడువు; ఐన = అయినట్టి; నీ = నీ; కున్ = కు; నమస్కరింతుము = నమస్కరించెదము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగా; అనిరి = అన్నారు.

భావము:

ఈ సచరాచర ప్రపంచం అంతటినీ లీలావినోదంగా నడిపిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ సృష్టి స్థితి లయాదులకు కారణమైన దేవా! నీకు నమస్కరిస్తున్నాము. అని కౌరవులు మరల ఇలా అనసాగారు...

10.2-594-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వ్యయుండువు; సర్వభూతాత్మకుఁడవు;
ర్వశక్తి ధరుండవు; శాశ్వతుఁడవు;
విశ్వకరుఁడవు; గురుఁడవు; విమలమూర్తి
వైన నిన్ను నుతింప బ్రహ్మకునుఁ దరమె?”

టీకా:

అవ్యయుండవు = వ్యయమగుట లేనివాడవు; సర్వ = ఎల్ల; భూత = జీవులు; ఆత్మకుడవు = నీవే ఐనవాడవు; సర్వ = సమస్తమైన; శక్తిన్ = శక్తులను {శక్తులు - సర్వజ్ఞత్వాది శక్తులు}; ధరుండవు = ధరించినవాడువు; శాశ్వతుడవు = శాశ్వతమైనవాడవు; విశ్వ = జగత్తును; కరుడవు = నిర్మింప జేయువాడవు; గురుడవు = ఙ్ఞానమును ఇచ్చువాడవు; విమల = స్వచ్ఛమైన; మూర్తివి = స్వరూపము గలవాడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; నుతింపన్ = స్తుతించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కునున్ = కైనను; తరమె = శక్యమా, కాదు.

భావము:

నాశనం లేనివాడవూ; సర్వప్రాణుల అంతరాత్మ అయి ఉండువాడవూ; సమస్త శక్తులనూ ధరించిన వాడవూ; శాశ్వతుడవూ; జగద్గురుడవూ; సృష్టికర్తవూ; నిర్మలమైన ఆకారం కలవాడవూ; అయిన నిన్ను పొగడటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు.”

10.2-595-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని వినుతించినం బ్రముదితాత్మకుఁడై హలపాణి వారలం
నుఁగొని "యోడ కోడకుఁడు కార్యగతిం దగి లిట్లు మీరు సే
సి యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబుఁ దక్కి పొం"
నిన సుయోధనుండు వినయంబున నల్లునిఁ గూఁతునుం దగన్.

టీకా:

అని = అని; వినుతించినన్ = స్తుతించగా; ప్రముదిత = మిక్కిలి సంతోషించిన; ఆత్మకుడు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; హలపాణి = బలరాముడు; వారలన్ = వారిని; కనుంగొని = చూసి; ఓడకుడు = బెదరకండి; ఓడకుడు = బెదిరిపోకండి; కార్య = కార్యసాధన; గతిన్ = మార్గమును; తగిలి = పూని; ఇట్లు = ఈ విధముగా; మీరు = మీరు; చేసిన = చేసినట్టి; అవినీతి = అవజ్ఞ; చేతన్ = వలన; ఇటు = ఈ విధముగా; చేసితిన్ = చేసాను; ఇంకన్ = ఇకపై; భయంబున్ = భయమును; తక్కి = విడిచిపెట్టి; పొండు = వెళ్ళండి; అనినన్ = అని చెప్పగా; సుయోధనుండు = దుర్యోధనుడు; వినయంబునన్ = వినయముతో; అల్లుని = అల్లుడిని; కూతున్ = పుత్రికను; తగన్ = తగినట్లు.

భావము:

అని ఇలా కౌరవులు సంస్తుతించగా బలభద్రుడు సంతోషించి “మీరు చేసిన అవినీతివలన ఇలా చేశాను. ఇక భయపడకండి. వెళ్ళండి.” అన్నాడు అప్పుడు దుర్యోధనుడు వినయంతో అల్లుడిని కూతురినీ సాగనంపాడు.

10.2-596-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుపుచు నరణము దాసీ
ముల వేయింటి లక్ష సైంధవములఁ దా
నినుమడి యేనుంగులఁ గాం
రథముల నాఱువేల మ్మతి నిచ్చెన్.

టీకా:

అనుపుచున్ = పంపించుచు; అరణము = కట్నముగా; దాసీ = సేవకురాండ్రైన; జనములన్ = వారిని; వేయింటిన్ = వెయ్యి మందిని (1000); లక్ష = లక్ష (100000); సైంధవములన్ = గుఱ్ఱములను; తాన్ = వాటికి; ఇనుమడి = రెట్టింపు; ఏనుంగులన్ = ఏనుగులను; కాంచన = బంగారు; రథములన్ = తేరులను; ఆఱువేలన్ = ఆరువేలు (6000); సమ్మతిన్ = ఇష్టముతో; ఇచ్చెన్ = ఇచ్చెను.

భావము:

దుర్యోధనుడు కూతురికీ అల్లుడికీ వేయి మంది దాసీలు, ఒకలక్ష గుఱ్ఱాలు, రెండులక్షల ఏనుగులు, ఆరువేల రథాలు ఆనందంగా కట్నంగా ఇచ్చాడు.

10.2-597-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లిచ్చి యనిచిన బలభద్రుండు గొడుకునుంగోడలిం దోడ్కొనుచుఁ బరమానందంబు నొందుచు, నక్కడక్కడి జనంబులు పదివేల విధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవుల తోడఁ దాఁ గరిపురంబునకుం బోయిన విధంబును, వారలాడిన దురాలాపంబులును, దానందులకై యొనర్చిన ప్రతీకారంబును నెఱింగించి సుఖంబుండె; వారణపురంబు నేఁడును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక గంగకై క్రుంగి బలభద్రుని మాహాత్మ్యంబుఁ దెలుపుచున్న” దని ”యమ్మహాతుని భుజవీర్యం బవార్యం” బనిచెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; ఇచ్చి = ఇచ్చి; అనిచినన్ = పంపించగా; బలభద్రుండు = బలరాముడు; కొడుకునున్ = కుమారుడుని, సాంబుడుని; కోడలినిన్ = కోడలును, లక్షణను; తోడ్కొనుచున్ = వెంటబెట్టుకొనుచు; పరమ = మిక్కుటమైన; ఆనందంబున్ = సంతోషము; ఒందుచున్ = పొందుతు; అక్కడక్కడి = ఆయా ప్రదేశాలలోని; జనంబులున్ = ప్రజలు; పదివేల = పదివేల (10000), అనేక; విధంబులన్ = రకములుగా; పొగడన్ = స్తుతించుచుండగా; నిజ = తన; పురంబున్ = పట్టణమున; కున్ = కు; అరిగి = వెళ్ళిపోయి; అచ్చట = అక్కడ; యాదవుల = యాదవులు; తోడన్ = తోటి; తాన్ = అతను కూడ; కరిపురంబున్ = హస్తినాపురమున; కున్ = కు; పోయిన = వెళ్ళిన; విధంబును = వివరములును; వారలు = వారు; ఆడిన = అనిన; దురాలాపంబులును = దుష్టపుమాటలు; తాన్ = తను; అందులకై = దానికి ప్రతిగా; ఒనర్చిన = చేసిన; ప్రతీకారంబునున్ = ప్రతీకారమును; ఎఱింగించి = తెలిపి; సుఖంబున్ = సుఖముగా; ఉండెన్ = ఉండెను; వారణపురంబు = హస్తినాపురము; నేడునున్ = ఇవాళ్టికిని; దక్షిణంబు = దక్షిణము వైపు; ఎగిసి = ఎత్తుగాలేచి; ఉత్తర = ఉత్తరదిక్కు వైపు; భాగంబు = భాగము; ఒకించుక = కొద్దిగా; గంగ = గంగానది; కై = వైపునకు; క్రుంగి = కుంగి; బలభద్రుని = బలరాముని; మహాత్మ్యంబున్ = మహిమను; తెలుపుచున్ = తెలియజేయుచు; ఉన్నది = ఉంది; అని = అని; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; భుజ = భుజబలము; వీర్యంబున్ = శౌర్యము; అనివార్యంబు = అడ్డుకొనరానిది; అని = అని; చెప్పి = చెప్పి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రున్ = రాజున; కున్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

ఇలా కట్నాలు ఇచ్చి దుర్యోధనుడు అల్లుడినీ కూతురునీ సాగనంపగా, బలరాముడు వారిని వెంట పెట్టుకుని ఆనందంగా ద్వారకానగరానికి వెళ్ళాడు. దారమ్మట ప్రజలు చేసే ప్రణామాలు అందుకుంటూ వెళ్ళాడు. అక్కడ తన వారితో తాను హస్తినాపురానికి వెళ్ళిన వివరమూ, దుర్యోధనాదులు ఆడిన మాటలూ, దానికి ప్రతీకారంగా తాను చేసిన పనీ సర్వం వివరంగా చెప్పి వారిని సంతోషపరిచాడు. బలరాముడి మహత్మ్యాన్ని చాటుతూ హస్తినాపురం ఈనాటికీ దక్షిణంవైపు లేచి, ఉత్తరం గంగానది వైపు కొంచెం క్రుంగి ఉంది” అని ఈరీతిగా శుకమహర్షి “బలరాముడి భుజబలం సామాన్యమైనది కా” దని చెప్పి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.