దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట
- ఉపకరణాలు:
వరదుఁ డుదార భక్తజనవత్సలుఁడైన హరుండు బాణునిం
గర మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా
దురమొనరించువేడ్క బ్రమథుల్ గుహుఁడున్ నిజభూతకోటియున్
సరస భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁ డై.
టీకా:
వరదుడు = కోరిన వరము లిచ్చువాడు; ఉదార = అధికముగా; భక్త = భక్తులైన; జన = వారి ఎడల; వత్సలుడు = వాత్సల్యము కలవాడు; ఐన = అయినట్టి; హరుండు = శివుడు {హరుడు - భక్తుల పీడను హరించువాడు, శివుడు}; బాణునిన్ = బాణుని; కరమున్ = మిక్కిలి; అనురక్తిన్ = అనురాగముతో; ఆత్మజుల = కన్నకొడుకుల; కంటెన్ = కంటె; దయా = దయతోడి; మతిన్ = బుద్ధితో; చూచున్ = కనిపెట్టి ఉండును; కాన = కనుక; తాన్ = తను; దురము = యుద్ధము; ఒనరించు = చేసెడి; వేడ్కన్ = కుతూహలముతో; ప్రమథుల్ = ప్రమథగణములు {ప్రమథ గణములు - ప్రమథనము (వధించుట) చేసెడి శివుని భటుల గణములు (సమూహములు)}; గుహుడున్ = కుమారస్వామి {గుహుడు - తన సైన్యమును రక్షించుకొనువాడు, కుమారస్వామి}; నిజ = తనను ఆశ్రయించి ఉండు; భూత = పిశాచ; కోటియున్ = సమూహములు; సరసన్ = పక్కన; భజింపన్ = కొలుచుచుండగా; ఉజ్వల = కాంతివంతమైన; నిశాత = వాడియైన; భయంకర = భయము పుట్టించు; శూల = త్రిశూలము; హస్తుడు = చేతబట్టినవాడు; ఐ = అయ్యి.
భావము:
వరదుడు, ఉదారుడు, భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు.
- ఉపకరణాలు:
ఖరపుటాహతి రేఁగు ధరణీపరాగంబు-
పంకేరుహాప్తబింబంబుఁ బొదువ
విపులవాలాటోప విక్షేపజాత వా-
తాహతి వారివాహములు విరయఁ
గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన-
బ్రహ్మాండభాండ కర్పరము వగుల
నలవోక ఖణి ఖణిల్లని ఱంకె వైచిన-
రోదసీకుహరంబు భేదిలంగ
- ఉపకరణాలు:
గళ చలద్భర్మఘంటికా ఘణఘణప్ర
ఘోషమున దిక్తటంబు లాకులత నొంద
లీల నడతెంచు కలధౌతశైల మనఁగ
నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె.
టీకా:
ఖరపుటా = గిట్టల; ఆహతిన్ = తాకుడుల వలన; రేగు = పైకెగయునట్టి; ధరణీ = మట్టి; పరాగంబున్ = రేణువులు; పంకేరుహాప్త = సూర్య {పంకేరుహాప్తుడు - పంక (నీటిలో, బురదలో) ఈరుహ (పుట్టు) పద్మములకు ఆప్తుడు, సూర్యుడు}; బింబంబున్ = బింబమును; పొదువ = కమ్ముకొనగా; విపుల = పొడవైన; వాలా = తోక యొక్క; ఆటోప = సంభ్రమముతోడి; విక్షేప = ఊపుటవలన; జాత = పుట్టిన; వాత = వాయువు యొక్క; ఆహతిన్ = దెబ్బచేత; వారివాహములున్ = మేఘములు; విరయన్ = విడిపోగా; కుఱుచ = పొట్టి; తిన్నని = వంకరలులేని; వాడి = వాడియైన; కొమ్ములన్ = కొమ్ములతో; చిమ్మినన్ = ఎగజిమ్మినచో; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కర్పరము = పైకప్పు; పగులన్ = పగిలిపోగా; అలవోకన్ = వినోదముగా; ఖణిఖణిల్ = ఖణిల్లుఖణిల్లు; అని = అనెడి శబ్దముతో; ఱంకె = అరుచుట; వైచినన్ = చేయగా; రోదసీకుహరంబు = భూమ్యాకాశముల మధ్య ప్రదేశము; భేదిలంగన్ = బద్దలుకాగా;
గళ = మెడలోని; చలత్ = ఊగుతున్న; భర్మ = బంగారు; ఘంటికా = గంటల; ఘణఘణ = గణగణ అను; ప్రఘోషమునన్ = గట్టిధ్వనిచేత; దిక్ = దిక్కులందలి; తటంబులు = ప్రదేశములు; ఆకులతన్ = వ్యాకులత; ఒందన్ = పొందగా; లీలన్ = విలాసముగా; అడతెంచు = నడచునట్టి; కలధౌతశైలము = వెండికొండ; అనగన్ = అన్నట్లుగా; ఉక్కుమిగిలిన = బలముతో అతిశయించిన; వృషభేంద్రున్ = నందిని {వృషభేంద్రము - వృషభము (ఆబోతులలో) ఇంద్రము (శ్రేష్ఠము), నంది, శివుని వాహనము}; ఎక్కి = అధిరోహించి; వెడలెన్ = బయలుదేరెను.
భావము:
అలా విలాసంగా కదలివస్తున్న కైలాసపర్వతంలాగ మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి.
- ఉపకరణాలు:
ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున.
టీకా:
ఇఇట్లు = ఈ విధముగా; వెడలి = బయలుదేరి; సమర = యుద్ధ; సన్నాహ = ప్రయత్నమునందలి; సముల్లాసంబున్ = ఉత్సాహమును; మొగంబుల్ = ముఖముల; కున్ = కు; వికాసంబు = తేటదనము; సంపాదింపన్ = కలుగజేయగా; ప్రతిపక్ష = శత్రువుల యొక్క; బలంబుల్ = సైన్యముల; తోడన్ = తోటి; తలపడినన్ = ఎదిరించగా, తాకిన; ద్వంద్వయుద్ధము = జతజతగా చేసే యుద్ధము; అయ్యెన్ = జరిగెను; అప్పుడున్ = అప్పుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; పురాతన = పురాతనమైన; యోధుల = శూరుల; ఆ = ఆ యొక్క; యోధనంబున్ = పోరును; చూచున్ = చూసెడి; వేడ్కన్ = కుతూహలముతో; చనుదెంచిన = వచ్చిన; సరసిజసంభవ = బ్రహ్మదేవుడు; శక్ర = ఇంద్రుడు; సుర = దేవతలు; యక్ష = యక్షులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; గరుడ = గరుడులు; ఉరగ = నాగులు; ఆదులు = మున్నగువారు; నిజ = తమ; విమాన = విమానములందు; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; వియత్తలంబునన్ = ఆకాశ ప్రదేశమునందు; నిలిచిరి = నిలుచుండిరి; అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు; కృష్ణుండును = కృష్ణుడు; హరుండునున్ = శివుడులు; మారుండును = ప్రద్యుమ్నుడు; కుమారుండును = కుమారస్వామి లు; కూపకర్ణ = కుపకర్ణ; కుంభాండులును = కుంభాండులుతో; కామపాలుండును = బలరాముడును; బాణ = బాణుని; పుత్రుండు = కొడుకు; అగు = ఐన; బలుండును = బలుడు తో; సాంబుండును = సాంబుడును {సాంబుడు - కృష్ణుని కొడుకు}; సాత్యకియునున్ = సాత్యకి {సాత్యకి - కృష్ణుని రథ సారథి}; బాణుండును = బాణుడు లు; రథికులున్ = రథికులు; రథికులును = రథికులతో; ఆశ్వికులున్ = గుఱ్ఱపురౌతులు; ఆశ్వికులునున్ = గుఱ్ఱపురౌతులతో; గజారోహకులున్ = ఏనుగులపైనియోధులు; గజారోహకులున్ = గజారోహకులతో; పదాతులున్ = కాలిబంట్లు; పదాతులునున్ = కాలిబంట్లతో; తలపడి = తాకి; ఇతరేతర = ఒకరినొకరు; హేతి = ఆయుధములతో; ఘట్టనంబులన్ = కొట్టుటలతో; మిణుగుఱులు = నిప్పురవ్వలు; చెదరన్ = ఎగయగా; పరస్పర = ఒకరినొకరు; ఆహ్వాన = పిలుచుటలు; బిరుదా = బిరుదులతో; అంకిత = గుర్తులతో; సింహనాద = బొబ్బలు; హుంకార = హుం అను ధ్వనులతోను; శింజినా = వింటితాడు యొక్క; టంకార = టం అను శబ్దములతో; వారణ = ఏనుగు; ఘీంకార = ఘీం అను శబ్దములతో; వాజి = గుఱ్ఱముల; హేషా = సకిలింతల; రవంబులనున్ = శబ్దములతో; పటహ = యుద్ధవాద్యాలుతప్పెటలు; కాహళ = ఊదెడి వాద్యవిశేషము, బాకా; భేరీ = పెద్దనగారాలు; మృదంగ = మద్దెలలు; శంఖ = శంఖములు; తూర్య = యుద్ధ వాద్యముల; ఘోషంబులను = ధ్వనులు; బ్రహ్మాండ = బ్రహ్మాండము అనెడి; కోటరంబు = తొఱ్ఱ; పరిస్పోటితంబు = బద్దలైనది; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;
భావము:
పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.
- ఉపకరణాలు:
జలరుహనాభుఁ డార్చి నిజ శార్‌ఙ్గ శరాసన ముక్త సాయకా
వలి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా
కలితుల గుహ్యకప్రమథ కర్బుర భూతపిశాచ డాకినీ
బలవ దరాతియోధులను బ్రమ్మెరపోయి కలంగి పాఱఁగన్.
టీకా:
జలరుహనాభుడు = కృష్ణుడు; నిజ = తన; శార్ఙ్గ = శార్ఙ్గము అను; శరాసన = విల్లునుండి; ముక్త = వదలబడిన; సాయకా = బాణముల; ఆవలిన్ = సమూహమును; నిగుడించి = ప్రయోగించి; నొంచెన్ = నొప్పించెను; పురవైరి = శివుని; పురోగములన్ = ముందుకు వచ్చు సైనికులను; రణ = యద్ధపు; క్రియా = పనులలో; కలితులను = లగ్న మైనవారిని; గుహ్యక = గుహ్యకులు; ప్రమథ = ప్రమథగణములను; కర్బుర = నైరృతి (ఆంధ్ర వాచస్పతము), రాక్షసులను (ఆంధ్రశబ్దరత్నాకరము) {కర్బురుడు - కర్బర, కర్బుర (పాపము, చిత్ర వర్ణము) కల వాడు, రాక్షసుడు}; భూత = భూతములు {భూతము - పిశాచ భేదము}; పిశాచ = పిశాచములు {పిశాచము - దేవయోని విశేషము}; డాకినీ = డాకినీలు {డాకినీ - పిశాచ స్త్రీ భేదము}; బలవత్ = బలవంతులు అయిన; అరాతి = శత్రు; యోధులను = వీరులను; బ్రమ్మెరపోయి = తత్తరపడి; కలంగి = కలతచెంది; పాఱగన్ = పారిపోవునట్లుగా.
భావము:
శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు
- ఉపకరణాలు:
ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరునినేసిన, వానినన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును.
టీకా:
ఇట్లు = ఈ విధముగా; ఏసి = బాణములను ప్రయోగించి; ఆర్చినన్ = బొబ్బరించగా; కుంభినీధరున్ = కృష్ణుని {కుంభి నీధరుడు - కుంభిని (భూమిని) ధరించినవాడు, విష్ణువు}; భుజా = భుజబలము యొక్క; విజృంభణ = చెలరేగెడి; సంరంభంబున్ = ఆటోపమున; కున్ = కు; సహింపక = ఓర్వకుండా; నిటలాంబకుండు = శివుడు {నిటలాంబకుడు - నొసట కన్ను కలవాడు, శివుడు}; అనల = నిప్పు; కణంబులున్ = రవ్వలను; ఉమియు = రాల్చుచున్న; నిశిత = వాడియైన; అంబకంబులన్ = బాణములచే; పీతాంబరునిన్ = కృష్ణుని {పీతాంబరుడు - పచ్చని బట్టలు ధరించున వాడు, కృష్ణుడు}; ఏసినన్ = కొట్టగా; వానిన్ = వాటిని; అన్నింటిని = అన్నింటిని; నడుమన్ = మధ్యలోనే; ప్రతి = తిరుగుడు చేయు; బాణంబులు = బాణములను; ఏసి = వేసి; చూర్ణంబు = నుగ్గునుగ్గు; చేసినన్ = చేయగా; కనుంగొని = చూసి; మఱియును = ఇంకను.
భావము:
ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు.
- ఉపకరణాలు:
అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా
వనజాతేక్షణు మీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁ డై యేసె; నే
సినఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్
జనితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్ శక్రాదు లగ్గింపఁగన్.
టీకా:
అనలాక్షండు = శివుడు {అనలాక్షుడు - అగ్ని నేత్రములు కలవాడు, శివుడు}; త్రిలోక = ముల్లోకములలోను; పూజ్యంబు = పూజింపబడునది; అగు = ఐన; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమును; అరిన్ = నారి యందు; పోసినన్ = సంధించగా; ఆ = ఆ; వనజాతేక్షణు = కృష్ణుని; మీదన్ = పై; క్రోధ = కోపము యొక్క; మహిమా = అధిక్యమును; వ్యాకీర్ణుడు = వ్యాపింప జేయువాడు; ఐ = అయ్యి; ఏసెన్ = వేసెను; ఏసినన్ = వేయగా; ఆ = ఆ; దివ్య = మహిమాన్వితమైన; శరంబు = బాణము; చేతనే = తోనే; మఱల్చెన్ = వెనుకకు మరల్చెను; కృష్ణుడు = కృష్ణుడు; అతి = మిక్కిలి; ఉద్ధతిన్ = విజృంభణముతో; జనిత = కలిగిన; ఆశ్చర్య = ఆశ్చర్యము అను; రసా = రసము అను; అబ్ధి = సముద్రము నందు; మగ్నులు = మునిగినవారు; అగుచున్ = ఔతు; శక్ర = ఇంద్రుడు {శక్రుడు - దుష్టులను శిక్షించు శక్తి కలవాడు, ఇంద్రుడు}; ఆదులు = మున్నగువారు; అగ్గింపన్ = శ్లాఘించుచుండగా.
భావము:
నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు.
- ఉపకరణాలు:
వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దై
తేయధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం; గ్రతుధ్వంసి యా
గ్నేయాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై; దాని వే
మాయం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్.
టీకా:
వాయవ్యాస్త్రంబున్ = వాయవ్యాస్త్రమును; ఉపేంద్రు = కృష్ణుని {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, విష్ణువు}; పైన్ = మీద; అలిగి = కోపించి; దుర్వార = అడ్డగింపరాని; ఉద్ధతిన్ = అతిశయముతో; ఏయన్ = ప్రయోగించగా; దైతేయధ్వంసియున్ = కృష్ణుడు {దైతేయ ధ్వంసి - రాక్షసులను నాశము చేయువాడు, విష్ణువు}; పార్వతాశుగము = పర్వతాస్త్రము; చేన్ = చేత; త్రెంచెన్ = ఖండించెను; క్రతుధ్వంసి = శివుడు {క్రతు ధ్వంసి - క్రతు (యాగమును (దక్షుని)) ధ్వంసము చేసినవాడు, శివుడు}; ఆగ్నేయాస్త్రంబున్ = ఆగ్నేయాస్త్రమును; అడరించెన్ = ప్రయోగించెను; ఉగ్ర = భీకరమైన; గతిన్ = రీతిని; లక్ష్మీనాథు = కృష్ణుని {లక్ష్మీనాథుడు - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; పైన్ = మీద; దానిన్ = దానిని; వేన్ = శీఘ్రమే; మాయన్ = నశించునట్లు; చేసెన్ = చేసెను; ఐంద్రబాణమునన్ = ఐంద్రబాణముచేత; పద్మాక్షుండు = కృష్ణుడు; లీలా = విలాసపు; గతిన్ = రీతిని.
భావము:
అంతట ఉమాపతి ఉపేంద్రుడిమీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా, కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు.
- ఉపకరణాలు:
మఱియును.
టీకా:
మఱియును = ఇంకను.
భావము:
ఇంకా.....
- ఉపకరణాలు:
పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్;
దోయరుహాయతాక్షుఁడునుఁ దోడన లోకభయంకరోగ్ర నా
రాయణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ
క్రాయుధుఁ డిత్తెఱంగునఁ బురారి శరావలి రూపుమాపినన్.
టీకా:
పాయని = వదలని; కిన్క = కినుక, కోపము; తోన్ = తోటి; హరుడు = శివుడు {హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు}; పాశుపతాస్త్రమున్ = పాశుపతాస్త్రమును; నారిన్ = వింటితాడు నందు; పోసినన్ = సంధించగా; తోయరుహాయ తాక్షుడునున్ = కృష్ణుడుకూడ {తోయరుహాయతాక్షుడు తోయరుహము (నీట పుట్టినదైన పద్మమువలె) ఆయత (విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; తోడనన్ = వెంటనే; లోక = ముల్లోకములకు; భయంకర = భయము పుట్టించెడి; ఉగ్ర = క్రూరమైన; నారాయణబాణ రాజమున్ = నారయణాస్త్రమును; రయంబునన్ = వేగముగా; ఏసి = వేసి; మరల్చె = వెనుదిరుగు నట్లు చేసెను; దానిన్ = దానిని; చక్రాయుధుడు = కృష్ణుడు; ఈ = ఈ; తెఱంగునన్ = రీతిగా; పురారి = శివుడు; శర = బాణముల; ఆవలిన్ = అనేకమును; రూపుమాపినన్ = నశింపజేయగా.
భావము:
అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు.
- ఉపకరణాలు:
ఊహ కలంగియు విగతో
త్సాహుండగు హరునిమీఁద జలజాక్షుడు స
మ్మోహన శిలీముఖం బ
వ్యాహత జయశాలి యగుచు నడరించె నృపా!
టీకా:
ఊహ = మనసు; కలంగియున్ = చలించి; విగత = చెడినట్టి; ఉత్సాహుండు = ఉత్సాహము కలవాడు; అగు = ఐన; హరుని = శివుని; మీదన్ = పైన; జలజాక్షుడు = కృష్ణుడు; సమ్మోహన = సమ్మోహన; శిలీముఖంబున్ = బాణమును; అవ్యాహత = ఓటమి ఎరుగని; జయశీలి = జయించు శీలము గలవాడు; అగుచున్ = ఔతు; అడరించెన్ = ప్రయోగించెను; నృపా = రాజా.
భావము:
రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు.
- ఉపకరణాలు:
అట్లేసిన.
టీకా:
అట్లు = ఆ విధముగా; ఏసినన్ = వేయగా.
భావము:
అలా ప్రయోగించడంతో.....
- ఉపకరణాలు:
జృంభణశరపాతముచే
శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్
జృంభితుఁడై ఘననిద్రా
రంభత వృషభేంద్రు మూఁపురముపై వ్రాలెన్.
టీకా:
జృంభణశర = సమ్మోహనాస్త్రము యొక్క; పాతము = పాటు; చేతన్ = చేత; శంభుడు = శివుడు {శంభుడు - సుఖమును కలిగించువాడు, శివుడు}; నిజ = తన; తనువు = దేహము; పరవశంబు = స్వాధీనత తప్పినది; అయి = ఐ; సోలన్ = తెలివి తప్పిపోగా; జృంభితుడు = ఆవులించువాడు; ఐ = అయ్యి; ఘన = గాఢమైన; నిద్రా = నిద్రించుట; ఆరంభతన్ = మొదలిడుటచేత; వృషభేంద్రు = నంది; మూపురము = మూపురము; పైన్ = మీద; వ్రాలెన్ = వాలెను.
భావము:
ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు.
- ఉపకరణాలు:
ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత.
టీకా:
ఇట్లు = ఇలా; వ్రాలినన్ = వాలిపోగా; చక్రపాణి = కృష్ణుడు {చక్రపాణి – చక్రము చేత గలవాడు, కృష్ణుడు}; పర = శత్రువుల; బలంబులన్ = సైన్యములను; నిశిత = వాడియైన; బాణ = బాణముల; పరంపరలన్ = వరుసలచేత; తునిమియున్ = ఖండించి; ఒక్క = ఒకానొక; ఎడన్ = చోట; కృపాణంబులన్ = కత్తుల; కణికలు = తునకలుగా;తో చేసియున్ = చేసి; ఒక్క = ఒకానొక; చోన్ = చోట; గదా = గద; హతులన్ = మోదుటలచేత; తుత్తురుముగా = నుగ్గునుగ్గుగా; మొత్తియున్ = మొత్తి; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; పీనుగపెంటలన్ = శవాల గుట్టలు గుట్టలుగా; కావించెన్ = చేసెను; అంత = పిమ్మట;
భావము:
శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు.
- ఉపకరణాలు:
తఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ
గఱకరిఁ దాఁకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపఁగా
నెఱఁకులు గాఁడిపైఁ దొరఁగు నెత్తుటఁ జొత్తిలి వైరు లార్వఁగాఁ
బఱచె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజిభీతుఁడై.
టీకా:
తఱిమి = వెంటబడి; మురాంతకాత్మజుడు = ప్రద్యుమ్నుడు {మురాంతకాత్మజుడు - మురాసురుని సంహరించిన కృష్ణుని యొక్క పుత్రుడు, ప్రద్యుమ్నుడు}; ఉదాత్త = మిక్కుటమైన; బలంబునన్ = బలముతో; బాహులేయు = కుమారస్వామి; పైన్ = మీద; కఱకరిన్ = కఠినంగా; తాకి = తలపడి; తీవ్ర = తీక్షణములైన; శిత = వాడి యైన; కాండ = బాణముల; పరంపరన్ = వరుసలను; ఏసి = వేసి; నొంపగా = నొప్పించగా; నెఱకులున్ = మర్మములను; కాఁడి = నాటి; పైన్ = పైకి; తొరగు = పొర్లుచున్న; నెత్తుటన్ = రక్తముతో; జొత్తిలి = తడిసి ఎఱ్ఱబారి; వైరులు = శత్రువులు; అర్వగాన్ = బొబ్బలిడగా; పఱచెన్ = పారిపోయెను; మయూర = నెమలి; వాహనమున్ = వాహనమును; పైకొని = ఎక్కి; తోలుచున్ = వేగముగా తోలుతు; ఆజి = యుద్ధము నందు; భీతుడు = భయపడినవాడు; ఐ = అయ్యి.
భావము:
ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు.
- ఉపకరణాలు:
పంబి రణక్షితిన్ శరవిపాటిత శాత్రవవీరుఁ డైన యా
సాంబుఁడు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో
పంబున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ
ర్యంబును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్.
టీకా:
పంబి = అతిశయించి; రణ = యుద్ధ; క్షితిన్ = భూమి యందు; శర = బాణములచే; విపాటిత = పడగొట్టబడిన; శాత్రవ = శత్రువుల; వీరుడు = యోధులు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; సాంబుడు = సాంబుడు; హేమ = బంగారపు; పుంఖ = పింజలు గల, పిడులు గల; శిత = వాడియైన; సాయక = బాణముల; జాలముల్ = సమూహములు; ఏర్చి = సంధించి; భూరి = మిక్కుటమైన; కోపంబునన్ = రోషముతో; ఏసినన్ = ప్రయోగించగా; బెదిరి = భయపడి; బాణతనూభవుడు = బలుడు; ఓడి = ఓడిపోయి; పాఱెన్ = పారిపోయెను; శౌర్యంబును = వీరత్వము; బీరమున్ = పౌరుషము; తగవును = పద్ధతి, యుద్ధము; ఆఱడిపోవన్ = వ్యర్థముకాగా; బలంబులు = సేనలు; ఆర్వగన్ = బొబ్బలు పెట్టగా.
భావము:
శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు.
- ఉపకరణాలు:
వరబాహాబలశాలి యా హలి రణావష్టంభ సంరంభ వి
స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూన్చి వ్రేసెన్ బొరిం
బొరిఁ గుంభాండక కూపకర్ణులు శిరంబుల్ వ్రస్సి మేదంబు నె
త్తురుఁ గర్ణంబుల వాతనుం దొరఁగ సంధుల్ వ్రీలి వే చావఁగన్.
టీకా:
వర = శ్రేష్ఠమైన; బాహాబలశాలి = భుజబలము కలవాడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హలి = బలరాముడు {హలి - హలము ఆయుధముగా కల వాడు, బలరాముడు}; రణ = యుద్ధము నందు; అవష్టంభ = గర్వము, పూనిక యొక్క; సంరంభ = వేగిరపాటు; విస్ఫురత్ = బాగా ప్రకాశించుచున్న; ఉగ్ర = భయంకరమైన; అశని = వజ్రాయుధముతో; తుల్యము = సమానము; ఐన = అయిన; ముసలంబున్ = రోకలిని; పూన్చి = ధరించి; వ్రేసెన్ = కొట్టెను; పొరింబొరిన్ = బురబుర; కుంభాండక = కుంభాండకుడు; కూపకర్ణులున్ = కూపకర్ణుల; శిరంబుల్ = తలలు; వ్రస్సి = పగిలి; మేదంబున్ = మెదడు; నెత్తురు = రక్తము; కర్ణంబులన్ = చెవులనుండి; వాతనున్ = నోటినుండి; తొరగన్ = కారుతుండగా; సంధుల్ = కీళ్ళు; వ్రీలి = విడిపోయి; వే = వెంటనే; చావగన్ = చచ్చిపోవునట్లుగా.
భావము:
పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు.
- ఉపకరణాలు:
అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున.
టీకా:
అట్టి = అటువంటి; ఎడన్ = సమయమ నందు; సైన్యంబు = సేనలు; దైన్యంబున్ = దీనత్వమును; ఒంది = పొంది; అనాథంబు = దిక్కులేనిది; ఐ = అయ్యి; చెడి = ఓడి; విఱిగి = వెనుదీసి; పాఱినన్ = పారిపోగా; కని = చూసి; బాణుండు = బాణుడు; సాత్యకిన్ = సాత్యకిని; కేడించి = పరిహాసముచేసి; ప్రళయ = ప్రళయకాలపు; అగ్నియున్ = అగ్ని; పోలెన్ = వలె; విజృంభించి = రెచ్చిపోయి; చెయి = చేతిని; వీచి = ఊపి; బలంబులన్ = సైన్యమును; మరలన్ = తిరిగి; పురిగొల్పి = ప్రేరేపించి; తానును = తనే; ముంగలి = ముందుండువాడు; ఐ = అయ్యి; నడచెన్ = వెళ్ళగా; అప్పుడు = అప్పుడు; ఉభయ = ఇద్దరి; సైన్యంబులున్ = సేనలు; అన్యోన్య = ఒకరి నొకరు; జయ = గెలవవలెను; కాంక్షన్ = కోరికలతో; తలపడు = పోరెడి; దక్షిణ = దక్షిణపు; ఉత్తర = ఉత్తరపు; సముద్రంబులన్ = సముద్రముల; రౌద్రంబునన్ = భీకరత్వములతో; వీకన్ = ఉత్సాహముగా; తాకినన్ = పోరగా; పోరు = యుద్ధము; ఘోరంబు = భీకరము; అయ్యెన్ = అయినది; అట్టి = ఆ; ఎడన్ = సమయము నందు; గదలన్ = గదలతో; నడచియున్ = అణచి; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; పొడిచియున్ = నరికి; సురియలన్ = చురకత్తులతో; క్రుమ్మియున్ = పొడిచి; శూలంబులన్ = శూలములతో; చిమ్మియున్ = ఎగరగొట్టి; శక్తులన్ = శక్తి అను ఆయుధాలతో; నొంచియున్ = నొప్పించి; చక్రంబులన్ = చక్రములతో; త్రుంచియున్ = కోసి; ముసలంబులన్ = రోకళ్ళతో; మొత్తి = మొత్తి; ముద్గరంబులన్ = ఇనపగుదియలతో; ఒత్తియున్ = కొట్టి; కుంతలంబులన్ = ఈటెలతో; గ్రుచ్చియున్ = గుచ్చి; పంతంబులున్ = పంతములు; ఇచ్చియున్ = పెట్టుత; పరిఘంబులన్ = ఇనపకట్లగుదియలతో; నొంచియున్ = కొట్టి; పట్టిసంబులన్ = అడ్డకత్తులతో; త్రుంచియున్ = నరికి; శరంబులన్ = బాణములను; ఏసియు = వేసి; కరవాలంబులన్ = కత్తులతో; వ్రేసియున్ = నరికి; సత్రాసులు = భయముకలవారు; ఐ = అయ్యి; పాసియు = పారిపోయి; విత్రాసులు = భయములేనివారు; ఐ = అయ్యి; డాసియున్ = సమీపించి; పెనగినన్ = పోరాడగా; తునిసిన = తెగిన; శిరంబులును = తలలు; తునకలు = విరిగినవి; ఐన = అయిన; కరంబులునున్ = చేతులు; తెగిన = తెగినట్టి; కాళ్ళునున్ = కాళ్ళు; త్రెస్సిన = తెగిన; వ్రేళ్ళునున్ = వేళ్ళు; తుమురులు = పొడిపొడి; ఐన = అయిన; ఎముకలును = ఎముకలు; ప్రోవులు = పోగులుపడినవి; ఐన = అయిన; ప్రేవులును = పేగులు; నులిసిన = తూలిన; మేనులును = దేహములు; నలిసిన = నలిగిన; జానువులును = మోకాళ్ళును; నొగిలిన = వికలములైన; వర్మంబులునున్ = కవచములు; పగిలిన = చిట్లిన; చర్మంబులును = చర్మములు; వికలంబులు = విరిగిపోయినవి; అయిన = ఐన; సకల = ఎల్ల; అవయవంబులును = అవయవములు; వికీర్ణంబులు = తెగిపోయినవి; అయిన = ఐన; కర్ణంబులునున్ = చెవులు; విచ్చిన్నంబులు = పగిలినవి; ఐన = అయిన; నయనంబులునున్ = కళ్ళు; వెడలు = కారుతున్న; రుధిరంబులు = రక్తములు; పడలుపడు = కుప్పకూలెడి; బలంబులును = సేనలు; కొండల = పర్వతాల; వడువునన్ = వలె; పడు = పడిపోవు; మాంస = మాంసము; ఖండంబులును = ముక్కలు; వాచఱుచు = వా అని అరచెడి; కొఱప్రాణంబులును = కొనప్రాణమున్నవారు; వ్రాలిన = ఒరిగిన; తేరులును = రథములు; కూలిన = పడిన; కరులునున్ = ఏనుగులు; ఒఱగిన = పడిపోయిన; గుఱ్ఱంబులును = గుఱ్ఱములు; తెరలిన్ = తుళ్ళిన; కాలుబలంబులును = భటులు; కలిగి = కలిగి; పలల = మాంసమును; ఖాదన = తినుట యందు; కుతూహల = వేడుకల వలన; జనిత = పుట్టిన; మద = కొవ్వుచేత; అంధీభూత = గుడ్డివైన; పిశాచ = పిశాచములు; డాకినీ = డాకినీలు; భూత = భూతములు; బేతాళ = బేతాళములు {బేతాళము - పిశాచ భేదము}; సమాలోల = విహరించుటలవలన; కోలాహల = కలకలలతో; భయంకర = భయంకరమైన; ఆరావ = అరుపులతో; బధిరీకృత = చెవుడుకలుగజేయబడిన; సకల = ఎల్ల; దిశా = దిక్కులలోని; అవకాశంబున్ = ప్రదేశము కలది; అయి = అయ్యి; సంగరా = యుద్ధ; అంగణంబు = భూమి; భీషణంబు = భయముగొల్పునది; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి; రథాలు కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది.
- ఉపకరణాలు:
శరకుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా
సుర నవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో
త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల
స్ఫురణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్.
టీకా:
శర = బాణములు అను; కుముదంబులున్ = తెల్లకలువలు; ఉల్లసిత = ప్రకాశించుచున్న; చామర = వింజామరలు అను; ఫేనములు = నురుగలు; ఆతపత్ర = గొడుగులు అను; భాసుర = ప్రకాశించుచున్న; నవ = నవనవ లాడుతున్న; పుండరీకములున్ = తెల్లతామరలు; శోణిత = రక్తము అను; తోయములు = నీళ్ళు; అస్థి = ఎముకలు అను; సైకత = ఇసుక తిన్నెల; ఉత్కరమున్ = సమూహములు; భుజ = చేతులు అను; భుజంగమ = పాముల; నికాయమున్ = సమూహములు; కేశ = శిరోజముల; కలాప = సమూహములు అను; శైవల = పాచి; స్ఫురణన్ = స్ఫురించుచుండుటచేత; రణ = యుద్ధ; అంగణంబు = క్షేత్రము; అమరెన్ = ఒప్పి ఉన్నది; పూరిత = నిండుగా ఉన్న; శోణ = రక్తపు; నదంబు = ఏరులు కలదాని; పోలికన్ = వలె.
భావము:
బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది.
- ఉపకరణాలు:
అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి.
టీకా:
అట్టి = ఆ; ఎడన్ = సమయము నందు; బాణుండు = బాణుడు; కట్ట = మిక్కుటమైన; అలుకన్ = కోపముతో; కృష్ణుని = కృష్ణుని; పైన్ = మీద; తన = తన యొక్క; రథంబున్ = రథమును; పఱపించి = తోలించి; అఖర్వ = విస్తారమైన; బాహా = చేతులు; సహస్ర = వేయింటితో (1000); దుర్వార = వారింపరాని; గర్వ = అహంకారపు; ఆటోప = సంరంభముతో; ప్రదీప్తుండు = మిక్కిలి ప్రకాశించువాడు; ఐ = అయ్యి; కదిసి = సమీపించి.
భావము:
అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు.
- ఉపకరణాలు:
ఒక యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త
క్కక యొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం
దకహస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం
జక తత్సారథిఁ గూలనేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్.
టీకా:
ఒక = ఒకానొక; ఏనూఱు = ఐదువందల (500); కరంబులన్ = చేతులతో; ధనువులన్ = విల్లులు; అతి = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; ఆకృతిన్ = రీతితో; తాల్చి = ధరించి; తక్కక = తప్పిపోకుండా; ఒక్కొక్కటన్ = ఒకోదానిలోను; సాయక = బాణముల; ద్వయమున్ = జంటను; వీకన్ = ఉత్సాహముగా; పూన్చు = సంధించు; ఆలోనన్ = ఆలోపల; నందకహస్తుండు = కృష్ణుడు {నందకము - విష్ణువు యొక్క కత్తి}; తత్ = అతని {నందక హస్తుడు - నందకము చేతిలో ధరించినవాడు, కృష్ణుడు}; ఉగ్ర = భయంకరమైన; చాప = ధనుస్సుల; చయ = సమూహము యొక్క; విధ్వంసంబున్ = విరగగొట్టుటను; కావించి = చేసి; కొంజక = సంకోచింపకుండా; తత్ = ఆ యొక్క; సారథిన్ = రథము నడపువానిని; కూలనేసి = పడగొట్టి; రథమున్ = రథమును; చక్కాడి = ముక్కలు చేసి; శౌర్య = వీరత్వము; ఉద్ధతిన్ = ఉధృతితో.
భావము:
బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు.
- ఉపకరణాలు:
ప్రళయ జీమూత సంఘాత భయద భూరి
భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
మఖిలజనులు భయభ్రాంతులయి చలింపఁ
గడఁగి నిర్భిన్న రాక్షసీగర్భముగను.
టీకా:
ప్రళయ = ప్రళయకాలపు; జీమూత = మేఘముల; సంఘాత = సమూహమువలె; భయద = భయమును కలిగించెడి; భూరి = మిక్కిల అధికమైన; భైరవ = భీకరమైన; ఆరావము = ధ్వని; కను = కలుగునట్లు; ఒత్తెన్ = ఊదెను; పాంచజన్యమున్ = పాంచజన్యమను శంఖము {పాంచజన్యము - విష్ణుమూర్తి శంఖము}; అఖిల = ఎల్ల; జనులు = వారు; భయ = భయముచేత; భ్రాంతులు = తత్తరిల్లినవారు; అయి = అయ్యి; చలింపన్ = తడబడగా; కడగి = పూని; నిర్భిన్న = విచ్ఛిన్నమైన; రాక్షసీ = రాక్షస స్త్రీల; గర్భము = గర్భములు; కన్ = కలుగునట్లు.
భావము:
అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి.
- ఉపకరణాలు:
అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ.
టీకా:
అట్టి = అటువంటి; అవక్ర = వంగని; విక్రమ = ప్రతాపముతోటి; పరాక్రమంబున = పరాక్రమమున; కున్ = కు; నెగడుపడి = దిగ్భ్రమ చెంది; బాణుండు = బాణుడు; లేటమొగంబు = దైన్యము, పెడముఖము; పడి = పొంది, పెట్టి; చేయునది = చేయగలిగినది; లేక = లేక; విన్నన = చిన్నబోయినవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు.
భావము:
శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....
- ఉపకరణాలు:
అత్తఱిఁ గోటర యను బాణ జనయిత్రి-
సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి
వీడి శిరోజముల్ వ్రేలంగ నిర్ముక్త-
పరిధానయై మురాసురవిభేది
యెదుర నిల్చినఁ జూడ మదిఁ జాల రోసి ప-
రాఙ్ముఖుఁడై యున్న ననువు వేచి
తల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ-
దలచీర వీడ యాదవులు నవ్వ
- ఉపకరణాలు:
నవ్యకాంచనమణిభూషణములు రాలఁ
బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ
పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము
లాకులతతోడ నెక్కడే నరుగుటయును.
టీకా:
ఆ = ఆ; తఱిన్ = సమయమునందు; కోటర = కోటర; అను = అనెడి; బాణ = బాణుని; జనయిత్రి = తల్లి; సుతున్ = పుత్రుని; కాచు = కాపాడెడి; మతమున్ = పద్ధతిని; సన్మతిన్ = గట్టి ఆలోచనతో; తలచి = ఆలోచించి; వీడి = విడిపోయిన; శిరోజముల్ = తలవెంట్రుకలు; వ్రేలంగన్ = వేళ్ళాడుతుండగా; నిర్ముక్త = విడిచిన; పరిధాన = పైవస్త్రములు కలది; ఐ = అయ్యి; మురాసురవిభేది = కృష్ణుని {మురాసురవిభేది - మురాసురుని సంహరించిన వాడు, కృష్ణుడు}; ఎదురన్ = ఎదుట; నిల్చినన్ = నిలబడగా; చూడన్ = చూచుటకు; మదిన్ = మనసునందు; చాలన్ = మిక్కిల; రోసి = అసహ్యించుకొని, రోతపడి; పరాఙ్ముఖుడు = పెడముఖమువాడు {పరాఙ్ముఖుడు - పక్కకు తిప్పిన ముఖము కలవాడు, పెడముఖమువాడు}; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; అనువు = అనుకూలతను; వేచి = కనిపెట్టి; తల్లడించుచున్ = సంకట పడుతు; బాణుడు = బాణుడు; ఉల్లంబున్ = మనస్సు; కలగంగన్ = కలత చెందగా; తలచీర = తలపాగా; వీడన్ = ఊడిపోగా; యాదవులు = యాదవులు; నవ్వన్ = నవ్వగా; నవ్య = సరికొత్త; కాంచన = బంగారపు; మణి = రత్నాల; భూషణములు = ఆభరణములు; రాలన్ = రాలిపోగా; పాద = అడుగులు; ఆహతిన్ = వేయుటచే, తాకిడికి; నేల = భూమి; కంపింపన్ = అదురుతుండ; పాఱి = పారిపోయి; ఆత్మ = తన; పురమున్ = నగరమునకు; వడిన్ = వేగముగా; చొచ్చెన్ = ప్రవేశించెను; అప్పుడు = అప్పుడు; భూతగణములు = శివగణములు; ఆకులత = కలతపాటు; తోడన్ = తోటి; ఎక్కడేన్ = ఎక్కడికో; అరుగుటయును = పోగానే;
భావము:
బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి.