దశమ స్కంధము - ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
- ఉపకరణాలు:
ఆ దానవేశ్వరు ననుఁగుఁ గుమారి యు-
షాకన్య విమలసౌజన్యధన్య
రూపవిభ్రమ కళారుచిర కోమలదేహ-
యతను నాఱవబాణ మనఁగఁ బరఁగు
సుందరీరత్నంబు నిందునిభానన-
యలినీలవేణి పద్మాయతాక్షి
యొకనాఁడు రుచిరసౌధోపరివేదికా-
స్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి
- ఉపకరణాలు:
మున్ను దన చౌల నెన్నఁడు విన్న యతఁడుఁ
గన్నులారంగఁ దాఁ బొడగన్న యతఁడుఁ
గాని యసమానరూపరేఖావిలాస
కలితు ననిరుద్ధు నర్మిలిఁ గవిసినటులు.
టీకా:
ఆ = ఆ; దానవేశ్వరున్ = బాణాసురుని; అనుగున్ = ప్రియమైన; కుమారి = పుత్రిక; ఉష = ఉష అను; కన్య = బాల; విమల = నిర్మలమైన; సౌజన్య = మంచితనముతో; ధన్య = కృతార్థురాలు; రూప = చక్కటి రూపము; విభ్రమ = విలాసములు; కళా = విద్యలు; రుచిర = మనోజ్ఞమైన; కోమల = మృదువైన; దేహ = శరీరముకలామె; అతను = మన్మథుని {అతను - ముక్కంటి చూపుకి భస్మమగుటచే తనువు లేని వాడు, మన్మథుడు}; ఆఱవ = ఆరవ (6); బాణము = బాణము; అనగన్ = అనగా; పరగు = ప్రసిధ్దమగు; సుందరీ = అందగత్తెలలో; రత్నంబు = శ్రేష్ఠురాలు; ఇందు = చంద్రుని; నిభ = వంటి; ఆనన = ముఖము కలామె; అలి = తుమ్మెదల వంటి; నీల = నల్లని; వేణి = జడ కలామె; పద్మా = పద్మముల వలె; ఆయత = విశాలమైన; అక్షి = కన్నులు కలామె; ఒక = ఒకానొక; నాడు = రోజు; రుచిర = ప్రకాశిస్తున్న; సౌధ = మేడ; ఉపరి = మీది భాగము; వేదికాస్థలమున = తిన్నెమీద, డాబా; మృదు = మెత్తని; శయ్యన్ = పాన్పుమీద; ఎలమిన్ = సుఖముగా; కూర్కి = నిద్రించి;
మున్ను = ఇంతకు ముందు; తన = తన యొక్క; చౌలన్ = చెవులతో; ఎన్నడున్ = ఎప్పుడు; విన్న = వినినట్టి; అతడు = వాడు; కన్నులు = కళ్ళ; ఆరంగన్ = నిండుగా; పొడగన్న = కనుగొన్న; అతడు = వాడు; కాని = కానట్టి; అసమాన = సాటిలేని; రూప = చక్కటి రూపము; రేఖా = ఆకృతి; విలాస = విలాసములతో; కలితున్ = కూడినవానిని; అనిరుద్ధున్ = అనిరుద్ధుడుని; నర్మిలిన్ = ప్రీతితో; కవిసినటులు = కలిసినట్లు.
భావము:
దానవేశ్వరుడైన బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్యరాశి, సద్గుణవతి, చంద్రముఖి, నీలవేణి, పద్మనేత్ర, మన్మథుని ఆరవబాణం. ఇటువంటి ఉషాబాల ఒకనాడు తన సౌథంలో మెత్తనిపాన్పుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతు డైన అనిరుద్ధుడితో సుఖించుచునట్లు అమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకు ముందు వినలేదు, చూడలేదు.