పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసురుని వధించుట

 •  
 •  
 •  

10.2-202-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"అంభోజనాభున కంభోజనేత్రున-
కంభోజమాలాసన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు-
దేవునకును దేవదేవునకును
క్తులు గోరినభంగి నే రూపైనఁ-
బొందువానికి నాదిపురుషునకును
ఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ-
యినవానికిఁ, బరమాత్మునకును,

10.2-202.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! మితచరిత!

టీకా:

అంభోజనాభున్ = పద్మనాభున {అంభోజనాభుడు - జగత్సృష్టికి కారణమైన బ్రహ్మ జనించిన కమలము నాభియందు కలవాడు, విష్ణుమూర్తి}; కిన్ = కి; అంభోజనేత్రున్ = పద్మాక్షున; కిన్ = కు; అంభోజ = పద్మముల; మాలా = దండ; సమన్వితున్ = కలిగిఉన్నవాని; కున్ = కి; అంభోజ = పద్మములవంటి; పదున్ = పాదములు కలవాని; కున్ = కి; అనంత = అంతులేని {అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వనియామక సర్వాంతర్యామిత్వ సర్వసృష్టత్వ సర్వపాలక సర్వసంహారకాది మేరలేని సమర్థత కలవాడు, విష్ణువు}; శక్తి = శక్తి కలవాని; కిన్ = కి; వాసుదేవున్ = కృష్ణుని {వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోపలుంచుకొని ప్రపంచమదెల్లడల సర్వభూతములందు వసించి ఉండువాడు, విష్ణువు మరింకొక విధమున వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; కును = కి; దేవదేవున్ = దేవుళ్ళకే దేవుని; కును = కి; భక్తులు = భక్తులు; కోరిన = అపేక్షించిన; భంగిన్ = విధముగా; ఏ = ఎట్టి; రూపు = స్వరూపము {ఏరూపైనపొందువాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతులైనను సూక్ష్మ స్థూలాది రూపములైనను చేపట్టువాడు}; ఐనన్ = అయినను; పొందు = ధరించెడి; వాని = వాని; కిన్ = కి; ఆదిపురుషున్ = మూలకారణభూతుడైనవాని; కును = కి; అఖిల = సమస్తమునకు; నిదానము = ఆధారభూతమై; ఆపూర్ణ = సంపూర్ణమైన; విఙ్ఞానుడు = విఙ్ఞానముతనైనవాడు; ఐన = అయిన; వాని = వాని; కిన్ = కి; పరమాత్మున్ = పరబ్రహ్మ ఐనవాని; కును = కి;
ధాతన్ = బ్రహ్మను; కన్న = పుట్టించిన; మేటి = గొప్ప; తండ్రి = తండ్రి; కిన్ = కి; అజున్ = పుట్టుక లేనివాని; కిన్ = కి; నీ = నీ; కున్ = కు; వందనంబు = నమస్కారము; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; నిఖిల = సమస్త; భూత = జీవ; రూప = స్వరూపుడ; నిరుపమ = పోలికలకతీతమైనవాడ; ఈశ = సర్వనియామక; పరా = పరాప్రకృతియు; అపరా = అపరాప్రకృతియి; ఆత్మ = స్వరూపమైనవాడ; మహిత = మిక్కిలగొప్పవాడ; అమిత = మేరలేని; చరిత = వర్తనకలవాడ.

భావము:

"సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు[1]; వసుదేవు సుతుడవు[2]; దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు[3]; ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు; అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. -
[1] అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు -
[2] వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు -
[3] ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు"