దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన
- ఉపకరణాలు:
"శ్రవణోదంచితకర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే?
టీకా:
శ్రవణ = చెవి యందు; ఉదంచిత = మిక్కిలి చక్కగా ఉంచబడిన; కర్ణికారమున్ = కొండగోగిపువ్వు; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; ఆభ = ప్రభ గల; చేలంబు = వస్త్రము; తోన్ = తోటి; అవతంసాయిత = సిగబంతిగా కూర్చబడిన; కేకి = నెమలి; పింఛమున్ = పింఛము, కుంచము; తోన్ = తోటి; అంభోజ = పద్మముల; దామంబు = దండ; తోన్ = తోటి; స్వవశుండు = స్వతంత్రుడు; ఐ = అయ్యి; మధుర = తియ్యనైన; అధర = పెదవులస్పర్శ అనెడి; అమృతము = అమృతము; చేన్ = చేత; వంశంబున్ = మురళిని; పూరించుచున్ = ఊదుతు; ఉవిదా = వనితా; మాధవుడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి ప్రియుడు, కృష్ణుడు}; ఆల = ఆవుల; వెంటన్ = వెంబడిని; వనము = అడవి; అందున్ = లో; ఒప్పారెడిన్ = చక్కగాఉన్నాడు; చూచితే = చూచితివా.
భావము:
"సఖీ! మన కృష్ణుడు చూసావా? చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకొన్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజాలందు నెమలిపింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు. పరవశత్వంతో వేణువు నందు తియ్యని అధరామృతం పూరించుతు, అడవిలో ఆలమందలను మేపుతు ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు!
- ఉపకరణాలు:
రావే సుందరి! యేమె బోటి! వినవే; రాజీవనేత్రుండు బృం
దావీధిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో
భ్రూవిన్యాసము లంగుళీ క్రమములుంబొల్పార షడ్జంబుగాఁ
గావించెన్ నటుభంగి బ్రహ్మమగు దద్గాంధర్వ సంగీతమున్.
టీకా:
రావే = రమ్ము; సుందరి = చక్కనిచుక్క; ఏమె = ఒసేయ్; బోటి = వనితా; వినవే = వినుము; రాజీవనేత్రుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; బృందా = బృందావనము; వీధిన్ = దారు లమ్మట; తగన్ = చక్కగా; వేణువున్ = మురళిని; ఊదుచున్ = పూరించుచు; లసత్ = ప్రకాశిస్తున్న; సవ్య = ఎడమపక్కకు; ఆనత = వంచబడిన; ఆస్యంబు = మోము; తోన్ = తోటి; భ్రూ = కనుబొమల; విన్యాసములన్ = కదలించుటలతో; అంగుళీ = వేళ్ళ యొక్క; క్రమములున్ = వాడుటలోని లయలు; పొల్పారన్ = శోభించగాఉం; షడ్జంబున్ = షడ్జమస్వరము {షడ్జమము (స) - షట్ + జమ, షట్ (నాసిక, కంఠము, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతములు (6) ఆరు స్థానములందు) జమ (జనించు ధ్వని)కి షడ్జమము అని పేరు}; కాన్ = కలుగునట్లు; కావించెన్ = చేసెను, పలికించెను; నటు = నటుని; భంగిన్ = వలె; బ్రహ్మము = గొప్పది, వేదమయమైనది; అగు = ఐన; తత్ = ఆ యొక్క; గాంధర్వ = గంధర్వులు చేయునట్టి; సంగీతమున్ = గానమును.
భావము:
ఓ చక్కదనాల చిన్నదాన! ఇలారావే. ఏమే వింటున్నావా. బృందావన వీధిలో పద్మాక్షుడు మన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబొమలాడిస్తూ వేణువుపై వేళ్ళవిన్యాసాలు వెలయిస్తూ నటునివలె షడ్జమస్వరంలో బహ్మగాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.
అని బృందావనంలో కృష్ణుడు మన్మథోద్దీపితంగా వాయిస్తున్న మురళీగాన లోలులైన గోపికలు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నారు. అసలే బృందావనం బాగా పెద్దది, అతిశ్రేష్ఠమైనది, బహుమనోహరమైనది. శ్రీకృష్ణభగవానుల ఆకర్షణ చాలా ఎక్కువ, ఆలపిస్తున్నది పరబ్రహ్మం తానైన గాంధర్వగీతం, అది మనస్సును మథించి ఉద్దీపితం చేసేది, మరి గోపికలు (గో (జ్ఞానం) ఓపిక ఎక్కు వున్నవాళ్ళుట. మరి వేగిరపాటు సహజమే కదా.
- ఉపకరణాలు:
తలఁకెను గొబ్బునఁ జిత్తము
నళినాక్షుని మధుర వేణునాదము నా వీ
నులు సోఁకినంత మాత్రన
చెలియా! యిఁక నేటివెఱపు చింతింపఁ గదే.
టీకా:
తలకెను = చలించిపోయినది; గొబ్బునన్ = తటాలున; చిత్తము = నా మనసు; నళినాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; మధుర = ఇంపైన; వేణు = మురళీ; నాదము = రవము; నా = నా యొక్క; వీనులన్ = చెవు లందు; సోకిన = తగిలిన; అంతమాత్రన్ = అంతమాత్రముచేతనే; చెలియా = స్నేహితురాల; ఇక = మరి; ఏటి = దేనికి; వెఱపు = బెదురు; చింతింపగదే = ఆలోచించుము.
భావము:
ఓ నా చెలి! ఆ అరవిందాక్షుడి మధుర మైన మురళీ రవం చెవుల సోకే సరికి నా మనసు చలించింది; ఇంకా భయం దేనికి, ఏదైనా ఉపాయం ఆలోచించవే!
- ఉపకరణాలు:
నాతోడ వెఱవ వలదే?
నాతోడనె గొనుచుఁ బోయి నళినదళాక్షున్
నీతోడుతఁ బలికించెద
నీతోడి జనంబు మెచ్చ నీతోడు సుమీ."
టీకా:
నా = నా; తోడన్ = తోటి, తోబుట్టువా; వెఱవన్ = బెదరు; వలదే = పడవద్దు; నా = నాకు; తోడనె = తోకూడా; కొనుచున్ = తీసుకొని; పోయి = వెళ్ళి; నళినదళాక్షున్ = కృష్ణుని {నళిన దళాక్షుడు - నళిన (తామర) దళ (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; నీ = నీ; తోడుతన్ = తోటి; పలికించెదన్ = మాట్లాడించెదను; నీ = నీ; తోటి = తోపాటి, సహచరులైన; జనంబు = వారు; మెచ్చన్ = మెచ్చుకొనునట్లుగా; నీ = నీమీద; తోడు = ఒట్టు; సుమీ = సుమా.
భావము:
నాతో రావడానికి భయపడకే. నీ తోటివారు మెచ్చేలా నిన్ను నా వెంట తీసుకెళ్ళి గోవిందుడు నీతో మాట్లాడేటట్లు చేస్తాను నీ మీద ఒట్టు.”
- ఉపకరణాలు:
అని పెక్కు భంగుల నోర్తోర్తు నుద్దేశించి పలుకుచు గోపసుందరులు బృందావనంబునకు గోవిందుని కెదురు చని పరమానందంబున నతనిం దమ మనంబులఁ బ్రతిపదంబును నాలింగనంబు చేసిన వార లగుచు, రామకృష్ణుల నుద్దేశించి.
టీకా:
అని = అని; పెక్కు = అనేక; భంగులన్ = విధములుగా; ఒర్తోరును = ఒండొరులను; ఉద్దేశించి = గురించి; పలుకుచు = చెప్పుకొనుచు; గోప = గోపికా; సుందరులు = స్త్రీలు; బృందావనంబున్ = బృందావనమున; కున్ = కు; గోవిందుని = కృష్ణుని; కిన్ = కి; ఎదురు = ఎదురుగా; చని = పోయి; పరమ = అత్యధికమైన; ఆనందంబునన్ = సంతోషముతో; అతనిన్ = అతనిని; తమ = వారియొక్క; మనంబులన్ = మనసు లందు; ప్రతిపదంబునున్ = అడుగడుగునకు; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసిన = చేసినట్టి; వారలు = వారు; అగుచున్ = అగుచు; రామ = బలరామ; కృష్ణులన్ = కృష్ణులను; ఉద్దేశించి = గురించి.
భావము:
అంటూ, ఇలా రకరకాలుగా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ గొల్లపడుచులు బృందావనంలో అరవిందదళ నేత్రుణ్ణి మనస్సులో మాటిమటికీ కౌగలించుకున్నారు. బలరామ కృష్ణులను ఉద్దేశించి తమలోతాము ఇలా చెప్పుకోసాగారు.
- ఉపకరణాలు:
"నవగోస్థానక రంగమందుఁ బరమానందంబుతోఁ జూత ప
ల్లవ నీలోత్పల పింఛ పద్మదళ మాలా వస్త్ర సంపన్నులై
కవయై వేణువు లూఁదుచున్ బహునటాకారంబులం గేళితాం
డవముల్ జేసెద రీ కుమారకులు; వేడ్కం గామినుల్ గంటిరే.
టీకా:
నవ = కొత్త; గోస్థానక = పశువులదొడ్డి అనెడి; రంగము = రంగస్థలము; అందున్ = అందు; పరమ = మిక్కిలి; ఆనందంబునన్ = సంతోషముతో; చూత = మామిడి; పల్లవ = లేతచిగుళ్ళ; నీలోత్పల = నల్ల కలువపూవుల; పింఛ = నెమలిపింఛము; పద్మదళ = తామరపూలరేకుల; మాలా = దండలు; వస్త్ర = మంచిబట్టలు; సంపన్నులు = సమృద్ధిగా గలవారు; ఐ = అయ్యి; కవ = జోడి, జతగా; ఐ = అయ్యి; వేణువులు = పిల్లనగ్రోవులను; ఊదుచున్ = పూరించుచు; బహు = మిక్కిలిగా; నట = నటుల యొక్క; ఆకారంబులన్ = స్వరూపముతో; కేళీ = వినోదపు; తాండవముల్ = ఉద్ధతమైన నృత్యములను {లాస్యము – మృదుమధురమైన నాట్యము}; చేసెదరు = చేయుచున్నారు; ఈ = ఈ ప్రసిద్ధమైన; కుమారకులు = బాలురు; వేడ్కన్ = సంతోషముతో; కామినుల్ = పడతులు {కామిని - కామము కలామె, కామించదగినామె, స్త్రీ}; కంటిరే = చూసితిరా.
భావము:
“ఓ గొల్లభామల్లారా! ఈ వేడుకలు చూడండి. ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంతో మామిడి చివుళ్ళు, నల్ల కలువలు, నెమలి ఫించాలు, తామర పూదండలు, పట్టు పుట్టాలు ధరించారు. జతగూడి ఈ సుకుమారులు మురళి మ్రోగిస్తూ నిత్యం ఎన్నెన్నో నటవేషాలతో అత్యంత మనోహరంగా తాండవ మాడుతున్నారు. చూడండి.
- ఉపకరణాలు:
ఓ చెలువలార! వినుఁడీ
వాచా శతకంబులేల? వర్ణింపంగా
లోచనముల కలిమికి ఫల
మీ చెలువురఁ జూడఁగలుగు టింతియ సుండీ. "
టీకా:
ఓ = ఓహో; చెలువలు = స్నేహితులులారా; వినుడీ = వినండి; వాచా = నోటిమాటల; శతకంబు = వందలు; ఏలన్ = ఎందుకు; వర్ణింపంగా = స్తుతించుచుటకు; లోచనముల = చూపుల, కన్నులు; కలిమి = సంపదల, ఉన్నందు; కిన్ = కు; ఫలము = ప్రయోజనము; ఈ = ఈ ప్రసిద్ధమైన; చెలువురన్ = సుందరులను; చూడగలుగుట = చూడగలుగుట; ఇంతియ = ఇంతే; సుండీ = సుమా అండి.
భావము:
సుందరీమణులారా! వినండి. వందల మాటలతో వర్ణించడం ఎందుకు? కన్నులు ఉన్నందుకు ఫలం ఈ సొబగు కాండ్రను చూడగలగడమే సుమా.”
- ఉపకరణాలు:
అని పలికి; రందుఁ గొందఱు గోవిందు నుద్దేశించి.
టీకా:
అని = అని; పలికిరి = చెప్పుకొనిరి; అందున్ = వారిలో; కొందఱు = కొంతమంది; గోవిందున్ = కృష్ణుని; ఉద్దేశించి = గురించి.
భావము:
ఇలా అనుకుంటుండగా, వారిలో కొంతమంది గొల్లభామలు కృష్ణుడు గురించి ఇలా అన్నారు.
- ఉపకరణాలు:
"ఒనరన్ వ్రేతల కించుకేనియును లేకుండంగ గోపాలకృ
ష్ణుని కెమ్మోవి సుధారసంబు గొనుచుం జోద్యంబుగా మ్రోఁయుచుం
దన పర్వంబులు నేత్రపర్వములుగా దర్పించెఁ, బూర్వంబునన్
వనితా! యెట్టి తపంబు జేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్.
టీకా:
ఒనరన్ = చక్కగా; వ్రేతల = గోపికల; కున్ = కు; ఇంచుక = కొద్దిగా; ఏనియును = ఐయినను; లేకుండగన్ = మిగలకుండునట్లుగా; గోపాల = గోవులను పాలించెడి; కృష్ణుని = కృష్ణుని యొక్క; కెంపు = ఎఱ్ఱని; మోవి = పెద వనెడి; సుధా = అమృతపు; రసంబున్ = ఊటను; కొనుచున్ = తీసికొనుచు; చోద్యంబుగా = వింతగా; మ్రోయుచున్ = పలుకుచు; తన = తన యొక్క; పర్వంబులు = కణుపులు; నేత్ర = కన్నులకు; పర్వములు = పండుగులు; కాన్ = అగునట్లుగా; దర్పించెన్ = గర్వించెను; పూర్వంబునన్ = పూర్వజన్మమునందు; వనితా = పడతీ; ఎట్టి = ఎలాంటి; తపంబున్ = తపస్సును; చేసెనొకొ = చెసినదోకదా; ఈ = ఈ యొక్క; వంశంబు = వేణువు; వంశంబు = జాతి; లోన్ = అందు.
భావము:
“సుందరీ! ఈ వేణువు ఉంది చూసావూ, మునుపు ఏం తపస్సులు చేసిందో కాని. ఇలా వెదురు వంగడంలో జన్మించింది. ఇప్పుడు ఈ పిల్లనగ్రోవి అయి, కృష్ణుడి మోవిని అందుకుంది. గొల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అరుణ అధరసుధలను ఆస్వాదిస్తూ వింతమ్రోత లీనుతున్నది. తన స్వరా లొలికే వెదురు కణుపులతో అందగిస్తూ కనులపర్వం గావిస్తూ వెదురుల కులంలో నేనే గొప్పదాన్ని అని గర్వంతో మిడిసి పడుతున్నది.
- ఉపకరణాలు:
ముదితా! యే తటినీ పయఃకణములన్ మున్ వేణు వింతయ్యె నా
నది సత్పుత్రునిఁ గన్నతల్లి పగిదిన్ నందంబుతో నేడు స
మ్మద హంసధ్వని పాటగా వికచపద్మశ్రేణి రోమాంచమై
యొదవం దుంగతరంగ హస్తనటనోద్యోగంబు గావింపదే!
టీకా:
ముదితా = ముద్దుగుమ్మా; ఏ = ఏ యొక్క; తటినీ = నది యొక్క; పయస్ = నీటి; కణములన్ = బిందువులచే; మున్ = ఇంతకుముందు; వేణువు = వెదురుకఱ్ఱ; ఇంత = ఇంతగొప్పది; అయ్యెన్ = అయినదో; ఆ = ఆ యొక్క; నది = ఏరు; సత్ = మంచి; పుత్రునిన్ = కొడుకును; కన్న = కనినట్టి; తల్లి = తల్లి; పగిదిన్ = వలె; నందంబు = సంతోషము; తోన్ = తోటి; నేడు = ఇవాళ; సమ్మద = సంతోషము కలిగించెడి; హంస = హంసల యొక్క; ధ్వని = రుతము; పాట = గానము; కాన్ = కాగా; వికచ = వికసించిన; పద్మ = కమలముల; శ్రేణి = పంక్తి; రోమాంచము = గగుర్పాటు; ఐ = అయ్యి; ఒదవన్ = కలుగగాగా; తుంగ = పొడవైన; తరంగ = అలలు అనెడి; హస్త = చేతులతో; నటన = నాట్యాభినయనముల; ఉద్యోగంబున్ = ప్రయత్నములను; కావింపదే = చేయదా, చేయును.
భావము:
విరిబోణీ! ఏ నదీజల బిందువులతో ఈ వేణువు ఇంతగా వర్ధిల్లిందో ఆ నదీమతల్లి, మంచి కొడుకును కన్న మాతృదేవత లాగ, మహానందంతో; మత్తిల్లిన రాయంచల రవళి అనే గానంతో; వికసించిన పద్మాలు అనే రోమాంచములతో; చెలరేగిన అలలనే హస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా.
- ఉపకరణాలు:
నళినోదరుభక్తునిఁ గని
కులజులు ప్రమదాశ్రుజలము గురియు తెఱఁగు మ్రాఁ
కులు పూదేనియ లొలికెడు
నలినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్.
టీకా:
నళినోదరు = విష్ణుమూర్తి; భక్తుని = భక్తుడుని; కని = చూసి; కులజులు = స్వకులస్థులు; ప్రమద = సంతోషపు; అశ్రుజలమున్ = కన్నీటిని; కురియన్ = కార్చు; తెఱగున్ = విధముగా; మ్రాకులు = చెట్లు; పూదేనియలు = మకరందములను; ఒలికెడున్ = కార్చుచున్నవి; నలినాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; చేతి = చేతిలోని; వంశనాళము = వేణువు; మ్రోతన్ = నాదమువలన.
భావము:
పద్మనాభుడైన విష్ణుమూర్తి యొక్క భక్తుడిని చూసిన అతని కులం వారు ఆనందబాష్పాలు కార్చినట్లు, కమలాక్షుడు శ్రీకృష్ణుని కమ్మని పిల్లనగ్రోవి పాటలు విని చెట్లు పూదేనియలు జాలువారుస్తున్నాయి.
- ఉపకరణాలు:
నా మోసంబున కెద్ది మేర? విను నే నా పూర్వజన్మంబులన్
లేమా! నోములు నోఁచుచో నకట! కాళిందీతటిన్ వేణువై
భూమిం బుట్టెద నంచుఁ గోరఁ దగదే? బోధిల్లి యెట్లైన నీ
బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే?
టీకా:
నా = నేను చెందిన; మోసంబున్ = మోసమునకు; ఎద్ది = ఏది; మేర = పరిమితి; విను = వినుము; నేన్ = నేను; నా = నా యొక్క; పూర్వ = మొదటి; జన్మంబులన్ = పుట్టుకలలో; లేమా = చిన్నదానా{లేమ - లేత వయస్కురాలు}; నోములు = స్త్రీలు చేయు వ్రతములు; నోచుచోన్ = చేయినప్పుడు; అకట = అయ్యో; కాళిందీ = యమునానదీ; తటిన్ = తీరమున; వేణువు = వెదురును; ఐ = అయ్యి; భూమిన్ = భూలోకమున; పుట్టెదన్ = జన్మించెదను; అని = అని; అంచున్ = అనుచు; కోరన్ = కోరినచో; తగదే = సరిపోయెడిదికదా; బోధిల్లి = తెలివితెచ్చుకొని; ఎట్లైనను = ఎలాగైనను; ఈ = ఈ యొక్క; బాము = జన్మ; అందున్ = లో; ఇప్పుడు = ఇప్పుడు; మాధవ = కృష్ణుని; అధర = పెదవి సోకు టనెడి; సుధా = అమృతము; పానంబు = తాగుట; కల్గున్ = లభించును; కదే = కదా.
భావము:
అయ్యయ్యో! నేనెంత వంచితురాలను అయ్యానో కదా. ఓ చిన్నదానా! విను. నేను పూర్వ జన్మలో నోములు నోచేటప్పుడు యమునానదీతీరంలో వెదురు మొక్కగా పుట్టాలని తెలివిగా కోరుకోలేకపోయాను కదా. ఆ జన్మలో అలా కోరుకుని ఉంటే ఇప్పుడీ జన్మలో మాధవుడైనమన కృష్ణుడి అధరామృతం ఆస్వాదించి ఉందును కదా.
- ఉపకరణాలు:
కాళిందీ కూలంబున
నాళీ! యీ నందతనయు నధరామృతముం
గ్రోలెడి వేణువు నగు నో
మేలాగున నోమవచ్చు నెఱిఁగింపఁగదే?
టీకా:
కాళందీ = యమునానదీ; కూలంబునన్ = గట్టు నందు; ఆళీ = స్నేహితురాల; ఈ = ఈ యొక్క; నందతనయున్ = కృష్ణుని {నంద తనయుడు - నందుని కొడుకు, కృష్ణుడు}; అధర = పెదవి సోకు టనెడి; అమృతమున్ = అమృతమును; క్రోలెడి = తాగెడి; వేణువున్ = వెదురుకఱ్ఱని, వేణువుని; అగు = అయ్యెడి; నోమున్ = వ్రతమును; ఏ = ఏ; లాగునన్ = విధముగా; నోమ = ఆచరించ; వచ్చున్ = వచ్చునో; ఎఱిగింపగదే = తెలుపుము.
భావము:
ఓ చెలియా! యమునాతీరంలో నందుని పుత్రుడు కృష్ణుడి యొక్క మోవిసుధను పీల్చే పిల్లనగ్రోవిగా అయ్యే నోము ఏవిధంగా నోచుకోవలెనో చెప్పవే.
- ఉపకరణాలు:
వనితా! కృష్ణుఁడు నల్లని
ఘన మనియున్ వేణురవము గర్జన మనియున్
మనమునఁ దలంచి రొప్పుచు
ననవరతము నెమలితుటుము లాడెడిఁ గంటే?
టీకా:
వనితా = స్త్రీ; కృష్ణుడు = కృష్ణుడు; నల్లని = నల్లటి; ఘనము = మేఘము; అనియున్ = అని; వేణు = మురళీ; రవము = నాదము; గర్జనము = ఉరుము; అనియున్ = అని; మనమునన్ = మనసు నందు; తలచి = భావించి; రొప్పుచున్ = కేకలువేయుచు; అనవరతము = ఆగకుండగ; నెమలి = నెమళ్ళ; తుటుములు = సమూహములు; ఆడెడిన్ = నాట్యము చేయుచున్నవి; కంటే = చూసితివా.
భావము:
పడతీ! నళినాక్షుడు కృష్ణుడు నల్లని మేఘమనీ; మురళీ నినాదం ఉరుమనీ; మదిలో భావించి ఎడతెరపి లేకుండా కేకారవాలు గావిస్తూ, నెమళ్ళు పురివిచ్చి నాట్యాలు చేస్తున్నాయి చూసావా.
- ఉపకరణాలు:
గిరిచరమిథునము లోలిం
బరికింపఁగఁ గృష్ణపాదపద్మాంకితమై
సురరాజు నగరికంటెనుఁ
దరుణీ! బృందావనంబు తద్దయునొప్పెన్.
టీకా:
గిరిచర = గిరిజనులు; మిథునములు = దంపతులు; ఓలిన్ = వరుసగా, అదేపనిగా; పరికింపన్ = చూచుచుండగా; కృష్ణ = కృష్ణుని; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మములుపెట్టిన; అంకితము = గుర్తులు కలది; ఐ = అయ్యి; సురరాజునగరి = అమరావతి {సురరాజునగరి - సురరాజు (ఇంద్రుని) నగరి (పట్టణము), అమరావతి}; కంటెను = కంటె; తరుణీ = యువతీ {తరుణి - తరుణ వయస్కురాలు, స్త్రీ}; బృందావనంబు = బృందావనము; తద్దయున్ = అధికముగా; ఒప్పెన్ = చక్కగా ఉన్నది.
భావము:
ఓ అంగనా! కృష్ణుడి పద్మాల వంటి అడుగుల ముద్రల చిన్నెలతో కూడిన ఈ బృందావనం అమరావతి కంటే మిక్కిలి అందంగా భాసిస్తున్నది. కొండజాతి జంటలు ఈ సౌభాగ్యాన్ని అదేపనిగా చూస్తున్నారు.
- ఉపకరణాలు:
అమరేంద్రాంగన లాకసంబున విమానారూఢులై పోవుచుం
గమలాక్షున్ శుభమూర్తిఁ గాంచి మురళీగానంబు లందందఁ గ
ర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలఁగా నాథాంకమధ్యంబులం
బ్రమదా! వ్రాలిరి చూచితే వివశలై పంచాశుగభ్రాంతలై?
టీకా:
అమర = దేవతా; ఇంద్ర = శ్రేష్ఠుల; అంగనలు = భార్యలు; ఆకసంబునన్ = ఆకాశము నందు; విమాన = విమానము లందు; ఆరూఢులు = ఎక్కినవారై; పోవుచున్ = వెళుతూ; కమలాక్షున్ = పద్మాక్షుని, కృష్ణుని; శుభమూర్తిన్ = కృష్ణుని {శుభమూర్తి - శుభములు స్వరూపమైన వాడు, కృష్ణుడు}; కాంచి = చూసి; మురళీ = వేణు; గానంబులన్ = నాదములతో; అందందన్ = మఱిమఱి; కర్ణములన్ = చెవు లందు; నిల్పుచున్ = ఉంచుకొనుచు; మేఖలల్ = మొలతాళ్ళు; వదలగా = వీడగా; నాథ = భర్తల; అంకమధ్యంబులన్ = ఒడిలో; ప్రమదా = సుందరీ {ప్రమద - మిక్కిలి, సంతోషము కలామె, స్త్రీ}; వ్రాలిరి = వాలి పోయిరి; చూచితే = చూసితివా; వివశలు = పరవశులు; ఐయ్యి = అయిపోయి; పంచాశుగ = మన్మథవేదనలచే {పంచాశుగుడు - 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణములు కలవాడు, మన్మథుడు}; భ్రాంతలు = భ్రమగొన్నవారు {మన్మథుని పంచబాణములు - 1మోహనము 2ఉన్మాదము 3సంతపనము 4శోషణము 5నిశ్చేష్టీకరణము}; ఐ = అయ్యి.
భావము:
ఓ కాంతా! అదిగో దేవతాస్త్రీలు విమానాలెక్కి ఆకాశవీధిలో వెళుతూ, మంగళమూర్తి అయిన కృష్ణుడిని తిలకించి, ఆయన వేణుగానం వీనులపడగానే పులకించారు. వారి కలాపం అనే మొలతాళ్ళు వదులైపోసాగాయి. వారు వశంతప్పి మదనపీడితులై పతుల ఒడులలో ఒరిగిపోతున్నారు చూసావా.
- ఉపకరణాలు:
కానల నుండుచున్ సరసగాన వివేకవిహీనజాతలై
వీనుల నేఁడు కృష్ణముఖ వేణురవామృతధార సోఁకినన్
మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీమృగావళుల్
మానిని! చూడవమ్మ; బహుమానము చేసెఁ గృతార్థచిత్తలై.
టీకా:
కానలన్ = అడవులలో; ఉండుచున్ = ఉంటు; సరస = నవరసభరితమైన {నవరసములు - 1శృంగారము 2హాస్యము 3కరుణము 4వీర్యము 5రౌద్రము 6భయానకము 7భీభత్సము 8అద్భుతము 9శాంతము, వీని సంఖ్య ఇతర సందర్భములలో హెచ్చుతగ్గులు కావచ్చు}; గాన = సంగీతపు; వివేక = తెలివి, ఙ్ఞానము; విహీన = లేనట్టి; జాతలు = పుట్టుకలు కలవి; ఐ = అయ్యి; వీనులన్ = చెవు లందు; నేడు = ఇవాళ; కృష్ణ = కృష్ణుని; ముఖ = మూలముగా; వేణు = మురళీ; రవ = నాదము అనెడి; అమృత = అమృతపు; ధారన్ = జల్లులు; సోకినన్ = తగులుటచేత; మేనులున్ = ఒళ్ళు; మేతలున్ = మేయుటలు; మఱచి = మరిచిపోయి; మెత్తని = మృదువైన; చూడ్కిన్ = చూపులతో; మృగీ = ఆడజంతువులు; మృగా = మగజంతువుల; ఆవళుల్ = సమూహములు; మానిని = స్త్రీ {మానిని - మంచిమానము కలామె, స్త్రీ}; చూడవు = చూడుము; అమ్మ = తల్లి; బహుమానము = గౌరవించుట; చేసెన్ = చేసినవి; కృతార్థ = ధన్యమైన; చిత్తులు = మనసులు కలవి; ఐ = అయ్యి.
భావము:
ఓ యమ్మా! మానవతీ! చూసావా. అడవిలో నివసించే ఈ పెంటి, పోతు జంతువులు అన్నీ సంగీత మాధుర్యం గ్రోలే జ్ఞానం బొత్తిగా లేనట్టివి అయినా; నేడు చిన్నికృష్ణుడు చిందిస్తున్న మురళీ గానాల సుధారసం చెవులలో పడగానే, ఒడలు మరచి; మేతలు విడిచి; సుతిమెత్తని చూపులతో; పరవశించిన మనసులతో; నందగోపుణ్ణి అభినందిస్తున్నాయి.
- ఉపకరణాలు:
తల్లుల చన్నుఁబాలు మును ద్రావు తఱిం దమకర్ణవీధులన్
వల్లభమైన మాధవుని వంశరవామృతధార చొచ్చినం
ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక కృష్ణుమీఁద దృ
గ్వల్లులు చేర్చి నిల్చె నదె; వత్సము లంగనలార! కంటిరే?
టీకా:
తల్లులు = తల్లుల యొక్క; చన్నుబాలు = స్తన్యము; మును = ఇంతకుముందు; త్రావు = తాగెడి; తఱిన్ = అప్పుడు; తమ = వాటి; కర్ణ = చెవుల; వీధులన్ = మార్గములద్వారా; వల్లభము = ప్రీతికరము; ఐన = అయిన; మాధవుని = కృష్ణుని; వంశ = వేణు; రవ = గానము అనెడి; అమృత = అమృతపు; ధార = పరంపరలు; చొచ్చినన్ = దూరగా; త్రుళ్ళకన్ = గెంతులేయకుండ; పాలు = స్తన్యము; రాన్ = వచ్చునట్లు; తివక = పీల్చుకొనకుండ, తాగక; దూటక = మూతితో పొడిచి చేపకుండ; మానక = వదలకుండ; కృష్ణు = కృష్ణుని; మీదన్ = మీద; దృక్ = చూపు లనెడి; వల్లులున్ = తీగలను; చేర్చి = ఉంచి; నిల్చెన్ = నిలుచున్నవి (కదలక); అదె = అదిగో; వత్సములు = దూడలు; అంగనలార = అందగత్తెలు {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కంటిరె = చూచితిరా.
భావము:
ఓ వనితలారా! చూసారా. లేగలు తల్లి ఆవుల పాలు కుడిచే వేళ ప్రియమైన మాధవుడు కృష్ణుడి వేణుగాన సుధాదార చెవులలో పడడంతో అవి తుళ్ళిపడటం మానేసాయి. పాలు పీల్చకుండా; పొదుగు కుమ్మకుండా; ఊరక చన్నులను నోటిలో ఉంచుకుని; చిన్నికృష్ణుడి మీదనే కన్నులుంచి; అలాగే చూస్తూ నిలబడిపోయాయి.
- ఉపకరణాలు:
మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు చాలించి హృ
త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి మురళీగానామృతశ్రేణి క
ర్ణములం గ్రోలుచు మేఁతమాని గళితానందాశ్రులై చిత్రితో
పమలై గోవులు చూచుచున్న వవిగో పద్మాక్షి! వీక్షించితే?
టీకా:
మమతన్ = మోహముతో; మోములు = మోరలు; మీదికిన్ = పైకి; ఎత్తుకొని = ఎత్తి; రోమంథంబు = నెమరువేయుటలను; చాలించి = ఆపివేసి; హృత్ = హృదయములు అనెడి; కమల = పద్మముల; అగ్రంబులన్ = మీద; కృష్ణున్ = కృష్ణుని; నిల్పి = ఉంచుకొని; మురళీ = పిల్లనగ్రోవి యొక్క; గాన = నాదము యనెడి; అమృత = అమృతపు; శ్రేణి = పరంపరలు; కర్ణములన్ = చెవులతో; క్రోలుచున్ = తాగుతు; మేతన్ = మేతమేయుట; మాని = విడిచిపెట్టి; గళిత = కారుచున్న; ఆనంద = సంతోషపు; అశ్రులు = కన్నీరు కలవి; ఐ = అయ్యి; చిత్రిత = చిత్తరవులోని బొమ్మలతో; ఉపమలు = పోల్చదగినవి; ఐ = అయ్యి; గోవులు = ఆవులు; చూచుచున్నవి = చూస్తున్నవి; అవిగో = అదిగో; పద్మాక్షీ = సుందరీ {పద్మాక్షి - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ}; వీక్షించితే = చూసితివా.
భావము:
ఓ కలువ కన్నుల సుందరీ! అవిగో చూడు. ఆవులు మమకారంతో మోరలు పైకెత్తుకున్నాయి; నెమరువేయడం ఆపేసాయి; హృదయకోశంలో కృష్ణుడిని నిలుపుకున్నాయి; వేణునాదామృత ధారలను చెవులతో త్రాగుతూ మేతలు మేయడం మానేసాయి; ఆనందబాష్పాలు విడుస్తున్నాయి; బొమ్మల లాగ కదలక మెదలక నిలబడి శ్రీ కృష్ణుడి వైపే చూస్తున్నాయి. పరికించావా?
- ఉపకరణాలు:
జగతీజంబులశాఖ లెక్కి మురళీశబ్దామృతస్యందమున్
మిగులన్ వీనులఁ ద్రావి వ్రేఁగుపడి నెమ్మిం గృష్ణు రూపంబు చి
త్తగమై యుండఁగ నడ్డపెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ
ఖగముల్ చొక్కెడిఁ జూచితే? మునిజనాకారంబులం గామినీ!
టీకా:
జగతీజంబులన్ = చెట్ల యొక్క {జగతీజములు - భూమి యందు పుట్టునవి, వృక్షములు}; శాఖలన్ = కొమ్మలను; ఎక్కి = ఎక్కి; మురళీ = వేణు; శబ్ద = నాదము యనెడి; అమృత = అమృతపు; స్యందమున్ = స్రావమును; మిగులన్ = అధికముగా; వీనులన్ = చెవులతో; త్రావి = తాగి; వ్రేగుపడి = మత్తుగొని, బరువెక్కి; నెమ్మిన్ = నెమ్మదిగా; కృష్ణు = కృష్ణుని; రూపంబున్ = రూపమును; చిత్తగము = మనస్సు నందు పొందినది; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండిపోవునట్లుగా; అడ్డపెట్టి = అడ్డుపెట్టెడి; క్రియన్ = విధముగ; నేత్రంబులు = కళ్ళు; తగన్ = చక్కగా; మూసి = మూసి; ఈ = ఈ యొక్క; ఖగముల్ = పక్షులు; చొక్కెడిన్ = సోలిపోతున్నవి; చూచితే = చూసితివా; ముని = ఋషులైన; జన = వారి; ఆకారంబులన్ = వలె; కామినీ = సుందరీ {కామిని - ప్రియ సంగము నందు మిక్కిలి ఆశ కలామె, స్త్రీ}.
భావము:
ఓ పడతీ! పక్షులు చెట్లకొమ్మలపై చేరి వేణుగాన మనే సుధారస ధారలను మిక్కిలిగా చెవులారా త్రాగి, మత్తుగొన్నాయి. చిత్తంలో నెలకొల్పుకున్న చిన్నారి కృష్ణుడి రూపం వెలికి వెళ్ళనీకుండా ఆపుకోడం కోసమా అన్నట్లు, అవి కళ్ళు మూసుకుని ఉన్నాయి. వాటిని గమనించావా, ఎలా కళ్ళుమూసుకుని మునిజనం లాగ సొక్కుతున్నాయో?
- ఉపకరణాలు:
క్రమమొప్పన్ నదులెల్ల వంశరవ మాకర్ణించి సంజాత మో
హములన్ మన్మథసాయక క్షత విశాలావర్తలై హంస వా
క్యములం జీరి తరంగహస్తముల నాకర్షించి పద్మోప హా
రములం గృష్ణపదార్చనంబు సలిపెన్ రామా! విలోకించితే?
టీకా:
క్రమమొప్పన్ = సక్రమముగా; నదులు = నదులు; ఎల్లన్ = అన్ని; వంశ = వేణువు యొక్క; రవమున్ = నాదమును; ఆకర్ణించి = విని; సంజాత = పుట్టిన; మోహములన్ = మోహములచేత; మన్మథ = మన్మథుని; సాయక = బాణములుచేత కలిగిన; క్షత = గాయము లనదగిన; విశాల = పెద్దపెద్ద; ఆవర్తలు = సుడిగుండములు కలవి; ఐ = అయ్యి; హంస = హంసల కూత లనెడి; వాక్యములన్ = పలుకులతో; చీరి = పిలిచి; తరంగ = అల లనెడి; హస్తములన్ = చేతులతో; ఆకర్షించి = దగ్గరకు పిలిచి; పద్మ = పద్మములు అనెడి; ఉపహారములన్ = కానుకలచేత; కృష్ణ = కృష్ణుని; పద = పాదముల; అర్చనంబు = పూజలు; సలిపెన్ = చేసెను; రామా = రమణీ {రామ - రమించు నట్టి యామె, స్త్రీ}; విలోకించితే = చూసితివా.
భావము:
ఓ మనోహరమైన సుందరీ! నదులన్నీ చక్కగా వేణునాదం వింటున్నాయి; ఆ సుడిగుండాలు అవి మోహంలో పడగా కలిగిన మదనునిబాణాల గాయల వలె ఉన్నాయి కదా. ఆ నదులు హంసల పలుకులనే తమ మాటలతో కృష్ణుణ్ణి అహ్వానిస్తున్నాయి. అలలనే చేతులతో చెంతకు పిలుస్తున్నాయి. కలువలనే కానుకలతో ఆ కమలాక్షుడి పాద పద్మాలను పూజిస్తున్నాయి. వీక్షించావా?
- ఉపకరణాలు:
వనిత! నేడు కృష్ణు వంశనినాదంబు
విని పయోధరంబు విరులు గురిసి
తన శరీర మెల్ల ధవళాతపత్రంబుఁ
జేసి మింట నీడఁ జేసెఁ గంటె?
టీకా:
వనితా = యువతీ {వనిత - మిక్కిలి అనురాగస్తురాలు, స్త్రీ}; నేడు = ఇవాళ; కృష్ణు = కృష్ణుని యొక్క; వంశ = వేణువు యొక్క; నినాదంబు = మోతను; విని = విని; పయోధరంబు = మబ్బులు; విరులు = పూలు; కురిసి = వర్షించి; తన = దాని యొక్క; శరీరము = దేహము; ఎల్లన్ = అంతటిని; ధవళ = తెల్లని; అతపత్రంబున్ = గొడుగుగా; చేసి = చేసి; మింటన్ = ఆకాశము నందు; నీడన్ = ఛాయలను; చేసెన్ = చేసెను; కంటే = చూసితివా.
భావము:
నెలతా! ఇదిగో ఇక్కడ చూడు కృష్ణుడి మురళీ స్వరాలు విని, నీలమేఘం పూల వానకురిసింది. ఆపైని తన విపుల దేహం అంతటినీ గొడుగులా చేసి అకాశంలో నిలబడి నీడ కల్పిస్తోంది. విలోకించావా?
- ఉపకరణాలు:
మంచి ఫలంబులు హరిచే
నించి కరాలంబనముల నెగడుచు నిదె క్రీ
డించెద, రంగన! చూడుము
చెంచెతలం బింఛ పత్ర చేలాంచితలన్.
టీకా:
మంచి = చక్కటి; ఫలంబులున్ = పండ్లను; హరి = కృష్ణుని; చేన్ = చేతి యందు; నించి = నిండించి; కర = చేతులను; ఆలంబనములన్ = ఊతమిచ్చుటలుతో; నెగడుచున్ = అతిశయించుచు; ఇదె = ఇదిగో; క్రీడించెదరు = వినోదించుచున్నారు; అంగన = ఇంతి; చూడుము = చూడుము; చెంచెతలన్ = చెంచుస్త్రీలు; పింఛ = నెమలి పింఛములను; పత్ర = ఆకులను; చేల = వస్త్రములచే; అంచితలన్ = ధరించినవారిని.
భావము:
అందాల బొమ్మా! చూడు. ఆ బోయపడతులను. నెమలి ఈకల గుత్తులు ఆకులూ కోకలుగా ధరించి, ఎంతో మురుపు గొల్పుతున్నారు. వారు మధురమైన మంచి మంచి మాగిన పండ్లు గోవిందుడికి ఇచ్చే నెపంతో, అతని చేతిలో చేయ్యేసి ఆనందంతో అడుతున్నారు.
- ఉపకరణాలు:
ఉల్లసిత కుచభరంబున
నల్లాడెడి నడుముతోడ నలరుల దండన్
భిల్లి యొకతె హరి కిచ్చెను
హల్లోహలకలిత యగుచు నంగన! కంటే?
టీకా:
ఉల్లసిత = ఉప్పొంగిన, నిక్కిన; కుచ = స్తనముల; భరంబునన్ = బరువులచేత; అల్లాడెడి = ఊగిపోతున్న; నడుము = నడుము; తోడన్ = తోటి; అలరుల = పూల; దండన్ = మాలను; భిల్లి = ఎరుక యువతి; ఒకతె = ఒకామె; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇచ్చెను = ఇచ్చెను; హల్లోహల = సంభ్రమము, తొట్రుపాటు, ఆదరము; కలిత = కలామె; అగుచున్ = అగుచు; అంగన = సుందరి; కంటె = చూసితివా.
భావము:
ఓ మానినీ! చూసావా? ఒక బోయత ఉప్పొంగే కుచముల బరువుతో జవ్వాడే నడుముతో భావావేశంతో పూల మాలికను కృష్ణుడికి సమర్పించింది. కన్నావుటే.
- ఉపకరణాలు:
గిరు లెల్ల జలము లయ్యెం
దరు లెల్లనుఁ బల్లవించె ధరణి గగన భూ
చరు లెల్లనుఁ జొక్కిరి హరి
మురళిరవామృతము సోఁక ముద్దియ! కంటే?
టీకా:
గిరులు = కొండలు; ఎల్లన్ = అన్ని; జలములు = నీళ్ళు కలవి; అయ్యెను = అయినవి; తరులు = చెట్లు; ఎల్లన్ = అన్ని; పల్లవించెన్ = చిగురించినవి; ధరణిన్ = భూలోకము నందు; గగన = ఆకాశము నందు; భూ = నేలమీద; చరులు = మెలగెడివారు; ఎల్లను = అందరును; చొక్కిరి = సోలిపోయిరి; హరి = కృష్ణుని; మురళి = వేణు; రవ = నాదము యనెడి; అమృతము = అమృతము; సోక = తగలగా; ముద్దియ = ముగ్ధ; కంటె = చూసితివా.
భావము:
ఓ ముద్దరాలా! కృష్ణుడి మురళీగానామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరైపోతున్నాయి. భూమ్మీదున్న చెట్లన్నీ చిగురిస్తున్నాయి. ఖేచరులు భూచరులు అందరూ సొక్కి సోలిపోతున్నారు. విలోకించావా?
- ఉపకరణాలు:
బలకృష్ణాంఘ్రిసరోజ సంగమముచే భాసిల్లుచున్ ధన్యమై
ఫలపుష్పంబులఁ గానికల్ గురిసి సంభావించి మిన్నందుచున్
జలఘాసంబుల గోవులం దనిపి చంచద్భూజరోమాంచమై
వెలసెం జూడఁ గదమ్మ! యీ గిరిపురోవీధిన్ సరోజాననా!"
టీకా:
బల = బలరాముడు; కృష్ణ = కృష్ణుల; అంఘ్రి = పాదము లనెడి; సరోజ = పద్మములతో; సంగమము = కలియ గలుగుట, సోకుట; చేన్ = వలన; భాసిల్లుచున్ = ప్రకాశించుచు; ధన్యము = కృతార్థమైనది; ఐ = అయ్యి; ఫల = పండ్లు; పుష్పంబులన్ = పువ్వులు అనెడి; కానికల్ = కానుకలను; కురిసి = సమృద్ధిగా ఇచ్చి; సంభావించి = గౌరవించి; మిన్నుందుచున్ = మిన్నుముట్టుచు; జల = నీళ్ళచేతను; ఘాసంబులన్ = గడ్డిచేతను; గోవులన్ = ఆవులను; తనిపి = తృప్తిపొందించి; చంచత్ = కదులుతున్న; భూజ = చెట్లు అనెడి; రోమాంచము = గగుర్పాటులు కలది; ఐ = అయ్యి; వెలసెన్ = ప్రకాశించెను; చూడగద = చూడుము; అమ్మ = తల్లి; ఈ = ఈ యొక్క; గిరి = కొండ; పురోవీధిన్ = మన ఎదుటి భాగమున; సరోజాననన = సుందరి {సరోజానన - సరోజ (పద్మముల వంటి) ఆనన (మోముకలామె), స్త్రీ}.
భావము:
ఓ పద్మముఖీ! మన ఎదురుగా ఉన్న ఈ కొండను చూడవమ్మా! ఈ పర్వతం బలరామకృష్ణుల పాదపద్మాల సంస్పర్సతో ధన్యత పొంది ప్రకాశిస్తున్నది. పండ్లు పూలు అనే కానుకలను సమర్పించి వారిని సత్కరిస్తున్నది. ఆనందంతో ఆకాశం అందుకుంటోంది. నీటితో కసవుతో ధేనువుల తనివితీరుస్తున్నది. అందమైన తరువులనే గగుర్పాటుతో కనువిందు చేస్తున్నది.”
- ఉపకరణాలు:
అని యిట్లు బృందావన విహారియైన గోవిందుని సందర్శించి పంచబాణభల్ల భగ్నహృదయ లయి వల్లవకాంత లేకాంతంబులఁ జింతించుచుఁ దత్పరతంత్రలై యుండి; రంత.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; బృందావన = బృందావనము నందు; విహారి = విహరించుచున్నవాడు; ఐన = అయిన; గోవిందుని = కృష్ణుని; సందర్శించి = చూసి; పంచబాణ = మన్మథుని {పంచబాణుడు - 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణములు కలవాడు, మన్మథుడు}; భల్ల = బాణములచే; భగ్న = తెబ్బతిన్న, లోనైన; హృదయలు = హృదయములు కలవారు; అయి = అయ్యి; వల్లవ = గోపికా; కాంతలు = స్త్రీలు {కాంత - కాంక్షిప దగి నామె, స్త్రీ}; ఏకాంతంబునన్ = రహస్య ప్రదేశము లందు; చింతించుచున్ = స్మరించుకొనుచు; తత్ = అతని యందు; పరతంత్రలు = ఆసక్తి కలవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; అంత = ఆ సమయము నందు.
భావము:
ఇలా అనుకుంటూ గోపికలు బృందావనంలో విహరిస్తున్న మాధవుడిని చూసి మదనుడి భాణ పరంపరలచే పీడింపబడే మనసులతో ఏకాంతంలో చింతిస్తూ తదేక ధ్యానపరాయణులై ఉండిపోయారు.