దశమ స్కంధము - పూర్వ : పూర్ణి
- ఉపకరణాలు:
కువలయరక్షాతత్పర!
కువలయదళ నీలవర్ణ కోమలదేహా!
కువలయనాథ శిరోమణి!
కువలయజన వినుత విమలగుణ సంఘాతా!
టీకా:
కువలయరక్షాతత్పర = శ్రీరామా {కువలయ రక్షా తత్పరుడు - కు (భూమి) వలయ (మండలమును) రక్షా (కాపాడుట యందు) తత్పరుడు (ఆసక్తి కలవాడు), శ్రీరాముడు}; కువలయదళనీలవర్ణకోమలదేహా = శ్రీరామా {కువలయ దళ నీలవర్ణ కోమల దేహుడు - కువలయ (నల్లకలువ) యొక్క దళ (రేకులవంటి) వర్ణ (రంగు కలిగిన) కోమల (మృదువైన) దేహుడు (శరీరము కలవాడు), శ్రీరాముడు}; కువలయనాథశిరోమణి = శ్రీరామా {కువలయనాథ శిరోమణి - కు (భూమి) వలయ(మండలమును) నాథ (ఏలువారిలో) శిరోమణి (తలమీది మణివలె శ్రేష్ఠమైన వాడు), శ్రీరాముడు}; కువలయజనవినుత = శ్రీరామా {కువలయజన వినుత - కువలయ (భూమండలము యొక్క) జన (సర్వ ప్రజలచేత) వినుత (స్తుతింపబడువాడు), శ్రీరాముడ}; విమలగుణసంఘాతా = శ్రీరామా {విమల గుణ సంఘాతుడు - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు కలవాడు), శ్రీరాముడు}.
భావము:
భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఈ శ్రీరాముని ప్రార్థనలోని చమత్కర మాధుర్యం తొణికిసలాడుతోంది. కువలయ అని నాలుగు పాదాలు ఆరంభిస్తు లోకం, కలువలు, రాజులు, మానవులు అని నాలుగు రకాల అర్థబేధంతో యమకం పండించిన తీరు అద్భుతం. రెండు గాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు, అర్థభేదం కలిగి, మరల మరల వస్తూ ఉంటే యమకాలంకారం.