పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శ్రీమానినీచోర దండకము

  •  
  •  
  •  

10.1-1236-దం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబుల న్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్; నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.

టీకా:

శ్రీ = లక్ష్మీదేవి అనెడి {శ్రీ - లక్ష్మీదేవి, బ్రహ్మవిద్య}; మానినీ = స్త్రీ {మానిని - మానస్యో ఇతి మానినీ (వ్యుత్పత్తి)}; మాన = మనసును; చోరా = దొంగిలించినవాడా; శుభ = మంగళకరమైన; ఆకార = స్వరూపము కలవాడ; వీరా = శూరుడా; జగత్ = చతుర్దశ భువనములకు {జగత్ - జాయతే గచ్చతి ఇతి జగత్ (వ్యుత్పత్తి), జనన లయములు గల పదునాలుగు లోకములు}; హేతు = కారణభూతమైన; ప్రకారా = విధము గలవాడా; సమస్తంబున్ = బ్రహ్మాది పిపీలక పర్యంతమైన; అస్తంగతంబు = ప్రళయ కాలమున నశించినది; ఐ = అయ్యి; మహా = మిక్కిలి; లోల = చలించునట్టి; కల్లోల = పెద్ద అలల; మాలా = పరంపరలచే; ఆకుల = వ్యాకులమై; ఆభీల = భయంకరమైన; పాథోనిధిన్ = సముద్రము నందు; కూలగాన్ = పడిపోగా; బాల = పిల్లల; కేళీ = ఆటల; గతిన్ = వలె; తేలి = తేలుతు; నారయణ = నారాయణుడు అనెడి; ఆఖ్యన్ = పేరుతో; పటు = మిక్కిలి; ఖ్యాతిన్ = ప్రసిద్ధితో; శోభిల్లు = ప్రకాశించెడి; నీ = నీ యొక్క; నాభి = బొడ్డు; కంజంబు = తమ్మి {కంజము - కం (నీటి యందు) జము (పుట్టునది), పద్మము)}; లోన్ = అందు; లోక = సమస్త లోక; పుంజంబులన్ = సమూహములను; పన్నన్ = ఏర్పరుప, సృజింప; విన్నాణి = మిక్కిలి నేర్పరి; ఐ = అయ్యి; మన్న = ఉండునట్టి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; బమ్మ = బ్రహ్మదేవుడు; ఉత్పన్ను డయ్యెన్ = పుట్టినాడు; కదా = కదా; పావక = అగ్ని; ఆకాశ = ఆకాశము; వాత = వాయువు; అవనీ = భూమి; వారి = నీరు; అహంకార = అహంకారము; మాయా = మూలప్రకృతి; మహామానస = మహత్తత్వము; ఆదుల్ = మొదలగునవి, పంచతన్మాత్రలు; హృషీక = చతుర్దశేంద్రియములు; ఆదులున్ = వాని వృత్తులు; లోకముల్ = చతుర్దశ భువనములు; లోక = లోకములకు; బీజంబులున్ = కారణభూతులైన బ్రహ్మాదులు; నిత్య = సత్యము మొదలగు; సందోహము = సమూహములు; ఐన్ = అయిన; నీ = నీ యొక్క; మహాదేహము = విరాట్చరీరము; అందున్ = అందు; ఉల్లసించున్ = పుట్టును; వసించున్ = వర్ధిల్లును; నశించున్ = లయించును; జడత్వంబు = మూఢత్వము; లేక = లేనట్టి; ఆత్మ = పరమాత్మవు {ఆత్మ - ఆతతిత్తద్వస్తు రూపేణ సర్వత్ర వ్యాప్నోతీత్యాత్మా. (వ్యుత్పత్తి), సర్వ రూప నామ క్రియలతో కూడినది ఆత్మ}; ఐ = అయ్యి; ఒప్పు = ఉండెడి; నీ = నీ యొక్క; ఒప్పిదంబు = చక్కదనములు; ఎల్లన్ = సమస్తము; ఓచెల్ల = ఔరా; చెల్లన్ = తగినట్లు; విచారింపన్ = తరచి తెలిసికొనుటకు; తారు = వారు; ఎంత = సమర్దులు; వారు = వారు; ఎంతవారు = ఎంత గొప్పవారు; ఐనన్ = అయినను; మాయ = మూలప్రకృతి; ఆదులన్ = మొదలగునవి; మాయ = ప్రకృతి; తోన్ = తోటి; కూడి = చేరి; క్రీడించు = వినోదించునట్టి; లోకా = లోకములను; అనుసంధాత = గూర్చువాడు; ఔ = అయిన; ధాత = బ్రహ్మదేవుడు; నిర్ణేతయే = నిర్ణయించ గలవాడా; నీ = నీ యొక్క; కళా = చిత్కళా; రాశి = సముదాయమున; కిన్ = కు; కొందఱు = కొంతమందైన; అంభోజగర్భ = బ్రహ్మదేవుడు {అంభోజ గర్భుడు - అంభోజ (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారు; అధ్యాత్మలు = చతుర్దశేంద్రియముల; అందున్ = వానిలో; అశేష = అనేకమైన; ఆధిభూతంబులు = ఇంద్రియ విషయములు; అందున్ = వానిలో; అనేక = అనేకులైన; అధిదైవంబులు = ఇంద్రియాధి దేవతలు (చంద్రాదులు); అందున్ = వానిలో; సదా = ఎల్లప్పుడు; సాక్షివి = ఎడంగా నుండి చూచువాడు; ఐ = అయ్యి; ఉందువు = ఉంటావు; అంచున్ = అని; తత్ = వాని; అంతర్గత = లోనుండు; జ్యోతివి = ప్రకాశమువు; ఈశుండవు = సర్వనియామకుడవు; అంచున్ = అని; త్రయీ = వేద; పద్ధతిన్ = మార్గమున; కొందఱు = కొంతమంది; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దేవా = దేవతలు; అభిదానంబులన్ = పేర్లతో; నిక్కున్ = నిజమునకు; ఒక్కండవు = ఇతరము లేనివాడవు; అంచున్ = అని; మఱిన్ = ఇంకను; కొందఱు = కొంతమంది; ఆరూఢ = స్థిరములైన; కర్మంబులన్ = ప్రారబ్ధకర్మలను; త్రెంచి = నాశనముచేసి; సంసారమున్ = భవబంధములను; త్రుంచి = తెగగొట్టి; సన్యస్తులు = సన్యసించినవారు; ఐ = అయ్యి; మించి = అతిశయించి; విఙ్ఞాన = బ్రహ్మఙ్ఞానము అనెడి; చక్షుండవు = దృష్టిచేత తెలుసుకొన గలవాడు; అంచున్ = అని; మఱిన్ = ఇంకను; పాంచరాత్ర = పాంచరాత్రాగమమును; అనుసారంబునన్ = అనుసరించుటచేత; తన్మయత్వంబు = ఇతర స్వరూపాక్ష లేమి; తోన్ = తోటి; కొందఱు = కొంతమంది; ఈవు = నీవు; ఆత్మవు = ప్రత్యగాత్మవు; అంచున్ = అని; మఱిన్ = ఇంకను; కొందఱు = కొంతమంది; ఆ = ప్రసిద్ధమైనట్టి; వాసుదేవాది = చతుర్వ్యూహహముల {చతుర్వ్యూహములు - 1వాసుదేవ 2ప్రద్యుమ్న 3సంకర్షణ 4అనిరుద్ధ రచనావిశేషములు, ఇంకొక విధముగ వాసుదేవాదులు (1వాసుదేవుడు 2అచ్యుతుడు 3అనంతుడు 4గోవిందుడు)}; భేదంబులన్ = విశేషములచే; నల్వురు = నలుగురు; ఐ = అయ్యి; చెల్వున్ = చక్కగా; పాటింతువు = వ్యక్తమౌతావు; అంచున్ = అని; మఱిన్ = ఇంకను; నీవు = నీవు; నారాయణ = నారాయణుడు అనెడి {నారాయణుడు - నారం విఙ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; ఆఖ్యుండవు = పేరు గలవాడవు; అంచున్ = అని; శివ = శివుడు అనెడి {శివుడు - శిష్టజనుల హృదయముల శయనించువాడు}; ఆఖ్యుండవు = పేరు గలవాడవు; అంచున్ = అని; మఱిన్ = ఇంకను; పెక్కు = అనేకమైన; మార్గంబులన్ = రీతులలో; నిన్నున్ = నిన్ను; అగ్గింతురు = స్తుతింతురు; ఎగ్గు = తక్కువ; ఏమి = ఏమున్నది; యేఱుల్ = నదులు; పయోరాశిన్ = సముద్రము నందే; రాసులు = సమూహములు; ఐ = అయ్యి; కూడు = చేరునట్టి; క్రీడన్ = రీతిగా; విశేషంబులు = జీవేశ్వరాది భేదములు; ఎల్లన్ = సమస్తమును; విశేషంబులు = మిగులుట లేకుండినవి; ఐ = అయ్యి; డింది = అణఁగి; నీ = నీ; అందన్ = లోనే; అనూనంబు = కొఱత లేకుండు నట్లుగా, యావత్తు; లీనంబులు = ఐక్యమైనవి; ఔన్ = అగును; ఏకన్ = ఒకటే ఐన; రాకేందు = నిండుపున్నమి నాటి; బింబంబు = చంద్రబింబము; కుంభ = కుండల; అంతర = లోని; అంభంబులన్ = నీళ్ళలో; బింబితంబు = ప్రతిఫలించెడిది; ఐన = అయినను; వేఱు = భేదము; ఉన్నదే = ఉన్నదా ఏమి, లేదు; ఎన్నన్ = విచారించుట; ఏలా = ఎందులకు, అక్కర లేదు; ఘటా = కుండల; అంతర్గత = లోని; ఆకాశముల్ = ఆకాశములు; తత్ = ఆయా; ఘటా = కుండల; అంతంబులన్ = పగిలిపోవుటలు; అందే = తోనే; ఏకము = ఒకటే; ఔ = అగు; రేఖ = విధముగ; లోకా = లోకముల యొక్క; అవధిన్ = ముగియుట యందు; వీకన్ = పూనికతో; ఏ = ఎట్టి; పోకలన్ = ప్రవర్తించుటకు {పోకలు - పంచకృత్యములు (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) లోని వర్తించుట}; పోకన్ = చెయ్యకుండ; ఏకాకి = ద్వితీయము లేనివాడవు {ఏకాకి - శ్రు. ఏకమేవాద్వితీయం బ్రహ్మః, బ్రహ్మ}; ఐ = అయ్యి; ఉండుదు = ఉండెదవు; ఈశా = స్వామీ; కృశానుండు = అగ్ని {కృశానుడు - తాకినవానిని కృశింప చేయువాడు, అగ్ని}; నెమ్మోము = నిండైన ముఖము; సోముండు = చంద్రుడు {సోమన్ – వ్యుత్పత్తి. షు-ను (అభిషవే), షూ - సూ (ప్రేరణే – ప్రసవే) సు – సూ + మన్, కృ.ప్ర. అమృతము ఒసగువాడు, ప్రేరకుడు, చంద్రుడు (ఆంధ్రశబ్దరత్నాకరము)}; భానుండు = సూర్యుడు {భానుడు - ప్రకాశించువాడు, సూర్యుడు}; కన్నుల్ = కళ్ళు; దిశల్ = దిక్కులు; కర్ణముల్ = చెవులు; భూమి = భూమండలము; పాదంబులున్ = పాదములు; అంభోనిధులు = సముద్రములు {అంభోనిధి - అంభము (నీరు) కి నిధివంటిది, సముద్రము}; కుక్షి = కడుపు; శల్యంబులు = ఎముకలు; అద్రుల్ = కొండలు; లతా = తీగలు; సాలముల్ = చెట్లు; రోమముల్ = వెంట్రుకలు; గాలి = వాయువు; ప్రాణంబు = పంచప్రాణవాయువులు {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; బాహుల్ = చేతులు; సురేంద్రుల్ = ఇంద్రాదులు; ఘనంబుల్ = మేఘములు; కచంబుల్ = తలవెంట్రుకలు; నభోవీధి = ఆకాశప్రదేశము; నాభి = బొడ్డు; ప్రదేశంబు = ప్రాంతము; రేలున్ = రాత్రులు; పగళ్ళున్ = పగటి సమయములు; నిమేషంబులన్ = కనురెప్పపాటులు; అంభోజగర్భుండు = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము నందు) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; గుహ్యంబు = రహస్యావయవము; వర్షంబు = వాన; వీర్యంబు = రేతస్సు; నాకంబు = స్వర్గము; మూర్ధంబు = శిరస్సు; కాన్ = అగుచుండ; ఏకము = అఖండ స్వరూపము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; మేని = దేహపు; దండన్ = అండగా కలిగి; పయోజాతగర్భాండమ్ముల్ = బ్రహ్మాండములు; మండిత = అలంకరింపబడిన; ఉదుంబర = అత్తి; అనోకహ = చెట్టు యొక్క; అనేక = పెక్కు; శాఖా = కొమ్మలు; ఫలా = పండ్ల యందు; ఆపూరితా = నిండి యున్న; అనంత = లెక్క లేనన్ని; జంతు = జంతువుల; ప్రకాండంబున్ = సమూహములు; లీలన్ = వలెనే; ప్రసిద్ధ = ప్రసిద్ధమైనట్టి; ఉదరాశిస్థ = సముద్రము నందుండు; జంతు = జీవజాలము; ప్రకారంబుగా = వలెనే; నిండి = వ్యాపించి; ఉండున్ = ఉండును; మహారూప = గొప్ప స్వరూపము కలవాడ; నీ = నీ యొక్క; రూపముల్ = స్వరూపములు; వెగ్గలంబున్ = మిక్కుటమైనవి; ఉగ్గడింపన్ = ఇట్టిదని చెప్పుటకు; లయాంబోధి = ప్రళయ సముద్రము; లోన్ = అందు; మీను = మత్స్యము, చేప; మేనన్ = దేహముతో; విరోధిన్ = శత్రుని (సోమకాసురుని); నిరోధించి = అడ్డగించి; సాధించి = సాధించి; మున్ = పూర్వము; వేధ = బ్రహ్మదేవుని; కున్ = కి; వేదరాశిన్ = వేదము లన్నిటిని; ప్రసాదింపవే = ఇవ్వలేదా; త్రుంపవే = నశింపజేయ లేదా; కైటభ = కైటభాసురుని; శ్రీన్ = కలిమిని; మధున్ = మధు అనెడి రక్కసుని; చక్రివి = చక్రము ధరించిన వాడవు; ఐ = అయ్యి; మొత్తవే = శిక్షింపలేదా; ఎత్తవే = ఎత్తలేదా; మందర = మందర అనెడి; అగంబున్ = పర్వతమును; రాగంబు = అనురాగము; తోన్ = తోటి; కూర్మ = కూర్మావతార మనెడి; లీలా = విలాసపు; పరిష్పందివి = పరికరము కలవాడవు; ఐ = అయ్యి; పందివి = వరాహావతారుడవు; ఐ = అయ్యి; మేదినిన్ = భూమండలమును; మీదికిన్ = పైకి; త్రోచి = ఎత్తి; దోషాచరున్ = రాక్షసుని (హిరణ్యాక్షుని); కొమ్ములన్ = కొమ్ములతో; ఇమ్ములన్ = బాగా; చిమ్ముచుం = కుమ్ముతూ; గ్రువ్వవే = కూల్చలేదా; త్రెవ్వవే = పేగులు తెంపలేదా; ఘోర = భయంకరుడైన; వైరిన్ = శత్రువును (హిరణ్యకశిపు); నృసింహుండవు = నరసింహావతారుండవు; ఐ = అయ్యి; దండివి = బ్రహ్మచారివి {దండి - దండము ధరించువాడు, బ్రహ్మచారి}; ఐ = అయ్యి; దండిన్ = గాంభీర్యముతో; వైరోచనిన్ = బలిచక్రవర్తిని {వైరోచనుడు - విరోచనుని కొడుకు, బలి}; చూచి = చూసి; యాచింపవే = యాచించలేదా; పెంపవే = పెంచలేదా; మేనున్ = దేహమును; బ్రహ్మాండమున్ = బ్రహ్మండము నంతటిని; నిండన్ = నిండిపోవునట్లుగా; పాఱుండవు = బ్రాహ్మణుడవు (పరశురామావతారుడవు); ఐ = అయ్యి; రాజ = రాజవంశస్థుల; కోటిన్ = సమూహమును; విపాటింపవే = సంహరించలేదా; రాజవు = రాజు, రామావతారుడవు; ఐ = అయ్యి; రాజబింబాస్య = చంద్రముఖి (సీత); కై = కోసమై; దుర్ = చెడ్డ; మద = గర్వము గల; అరిన్ = శత్రువును (రావణుని); విదారింపవే = సంహరింపలేదా; నొంపవే = అణచివేయలేదా; క్రూరులన్ = క్రూరస్వభావులను; వాసుదేవాది = కృష్ణ బలరామాది {వాసుదేవాది - వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షులు అనెడి చతుర్వ్యూహములు (మనోబుద్ధిచిత్తాహంకారములు ఈ నామములకు ఒప్పును)}; రూపంబులన్ = మూర్తులతో; శుద్ధ = పరిశుద్ధుడైన; బుద్ధుండవు = బుద్ధావతారుడవు {బుద్ధుడు - ఙ్ఞానోదయము పొందిన శుద్ధోదనుడు, బుద్ధావతారము}; ఐ = అయ్యి; వైరి = శత్రువు (త్రిపురాసురుల); దారా = భార్యల; అంతరంగంబులన్ = మనస్సులను; అంతరంగంబులు = స్వరూప నాశమైనవి; కాన్ = అగునట్లుగా; కరగింపవే = కరగజేయలేదా; పెంపు = అధిక్యము; దీపింపవే = ఫ్రకాశింపజేయలేదా; కల్కిమూర్తిన్ = కల్క్యావతారమున {కల్కి - కపటస్వభావము కలవాడు. కల్క్యవతారము}; ప్రవర్తించు = మెలగెడి; నిన్నున్ = నిన్ను; ఎన్నన్ = శ్లాఘింపగా; నేన్ = నేను; ఎవ్వడన్ = ఎంతవాడను; నన్నున్ = నన్ను; మాయా = మాయవలన; విపన్నున్ = ఆపద పొందినవాడను; విషణ్ణున్ = మనోవేదన పొందినవాడను; ప్రపన్నున్ = ఆశ్రయించినవానిని; ప్రసన్నుండవు = అనుగ్రహించువాడవు; ఐ = అయ్యి; ఖిన్నతన్ = దుఃఖమును; పాపి = పోగొట్టి; మన్నింపవే = ఆదరింపుము; పన్నగాధీశతల్పా = శ్రీకృష్ణా {పన్నగాధీశ తల్పుడు - పన్నగాధీశుడు (ఆదిశేషుడు) తల్పుడు (పాన్పుగా కలవాడు), విష్ణువు}; కృపాకల్పా = శ్రీకృష్ణా {కృపా కల్పుడు - దయ ఆభరణముగా కలవాడు, విష్ణువు}; వందారుకల్పా = శ్రీకృష్ణా {వందారు కల్పుడు - సేవకులకు కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నమస్తే = నమస్కారము; నమస్తే = నమస్కారము; నమస్తే = నమస్కారము; నమః = నమస్కారించుచున్నాను.

భావము:

“ఓ శ్రీమన్నారాయణా! అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా! మంగళ స్వరూపం కలవాడా! ఓ వీరుడా! నిఖిల ప్రపంచ సృష్టికి కారణ మైన పృథివ్యాది పంచమహాభూతాలకూ కారణ మైనవాడా! మిక్కిలి చలించు తరంగశ్రేణిచే కలత నొందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీన మైపోయి నప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడావు. అప్పుడు నీ నాభికమలం నుంచి సకల భువనాలను సృజించు విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారము మాయ మహాత్తత్వము మనస్సు మొదలైనవీ ఇంద్రియములూ ఇంద్రియవృత్తు లైన శబ్ద స్పర్శ రూప రస గంధములూ లోకములూ లోకకారణములూ ఈ సమస్తమూ నీ మహా శరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడవై యున్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించుటకు ఎంత గొప్పవారయినా సమర్ధులు కారు. మాయ మున్నగు తత్త్వములు జడములు కాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్టి మాయా సంబంధ మైన గుణాలచే ఆవరింపబడున్నాడు. కనుక అతడు నిన్ను ఇలాంటివాడిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు మున్నగువారు నిన్ను ఆధ్యాత్మ ఆధిదైవ ఆధిభూతములకు అనగా దేహాంద్రియాధి దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకు డైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాము లైన కొందరు కర్మయోగులు నీవు ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు అంటారు. ఇది నిజ మంటున్నారు. మరికొందరు జ్ఞాన యోగులు అన్ని కర్మలను వదలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరిం నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ భేధాలతో నలువురై సొంపు ఘటిస్తున్నా వంటున్నారు, కొందరు నీవు నారాయణుడ వనీ, కొందరు శివుడవనీ అనేక రకాలుగా శ్లాఘిస్తున్నారు. ఇందులో తప్పులేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబము ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలం ద్రొక్కక ఒంటరివాడవై యుంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖము; చంద్రసూర్యులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; చెట్లు నీ రోమములు; గాలి నీ ప్రాణము; ఇంద్రాదులు నీ బాహువులు; మేఘాలు నీ తలవెంట్రుకలు; ఆకాశం నీ నాభి; రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు; బ్రహ్మ నీ మేఢ్రము; వర్షము నీ వీర్యము; స్వర్గము నీ శిరస్సు; ఇలా నీ శరీరంలో బ్రహ్మాండములు అత్తి చెట్టు కొమ్మలలో ఉన్న పండ్ల వలె నీ అందు అనంత ప్రాణి సమూహం మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్పురుషా! నీ రూపములు పొగడ్తకు అందనివి. మునుపు మత్స్యాకృతితో ప్రళయ సాగర మందు శత్రు వగు సోమకు నెదిరించి సాధించి వేదప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రముచే బూని మధు, కైటభులను సంహరించావు కదా. కూర్మ రూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు కదా. వరాహ రూపం ధరించి క్రుంగుతున్న భూమండలాన్ని లేవ నెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు కదా. భయంకర శత్రు వగు హిరణ్యకశిపుని నరసింహాకృతితో నీవు సంహరింప లేదా? ప్రతాపశీలి వగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించ లేదా? బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా? భార్గవ రాముడవై క్షత్రియ సమూహమును వధింప లేదా? దశరథ రాముడవై చంద్రబింబము వంటి మోము గల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని దునుమాడ లేదా? వాసుదేవాది రూపములను దాల్చి క్రూరులను శిక్షించ లేదా? శుద్ధబుద్ద స్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరగించావు కదా. కల్కిరూపము ధరించి పెంపుతో వెలుగొందవా? నిన్ను పొగుడుటకు నేను ఏపాటివాణ్ణి; నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి; దుఃఖము చెందిన వాణ్ణి; అనుగ్రహబుద్ధితో నా దిగులు దీర్చి నన్నాదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా! కరుణయే అలంకారముగా కలవాడా! నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా! నీకు అభివాదము. నీకు నమస్కారము. నీకు వందనము. నీకు ప్రణామము.