ప్రథమ స్కంధము : ఏకవింశత్యవతారములు
- ఉపకరణాలు:
భగవంతుం డగు విష్ణుఁడు
జగముల కెవ్వేళ రాక్షసవ్యధ గలుగుం
దగ నవ్వేళలఁ దడయక
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
టీకా:
భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; విష్ణుఁడు = హరి; జగములు = లోకములు; కు = కు; ఎవ్వేళ = ఏవేళ; రాక్షస = రాక్షసులవలన; వ్యధ = బాధ; కలుగున్ = కలుగుతుందో; తగన్ = తగినట్లుగ; ఆ = ఆ; వేళలన్ = సమయములలో; తడయక = ఆలస్యము చేయక; యుగయుగమునన్ = ప్రతియుగములోను; పుట్టి = ఉద్భవించి; కాచున్ = రక్షించును; ఉద్యత్ = యత్నమనే; లీలన్ = మాయతో.
భావము:
ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.