పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నైమిశారణ్య వర్ణనము

 •  
 •  
 •  

1-38-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పుణ్యంబై, మునివల్లభ
ణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి, నైమిశాఖ్యా
ణ్యంబు నుతింపఁ దగు నణ్యంబులలోన్.
^^నైమిశారణ్యం వర్ణనలోని పదాలు - రెండేసి అర్థాలు
^^నైమిశారణ్యం వర్ణనలోని జీవాల గణన

టీకా:

పుణ్యంబు = పుణ్య ప్రదేశము; ఐ = అయి; ముని = మునులలో; వల్లభ = శ్రేష్ఠులచే; గణ్యంబు = గొప్పదిగా గణింప బడునది; ఐ = అయి; కుసుమ = పుష్పాల; ఫల = ఫలాలను; నికాయ = సమూహముల వలన; ఉత్థిత = ఉద్భవించిన; సాద్గుణ్యము = మంచి గుణాలు కలిగినది; అయి = అయి; నైమిశ = నైమిశమను; ఆఖ్య = పేరుగల; అరణ్యంబు = అరణ్యము; నుతింపన్ = పొగడుటకు; తగున్ = తగును; అరణ్యంబుల = అరణ్యా లన్నిటి; లోన్ = లోను.

భావము:

పుష్పములు, ఫలములతో నిండిన నైమిశారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్ఠమైనదని కీర్తింపబడుతుంటుంది,

1-39-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై; బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనంబునుం బోలె వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, రంభా గణికాభిరామంబై; మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై; ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరంబై; రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై; దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపితంబై; భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖా ఫలితంబై; మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలెఁ గేసరకరజకాంతంబై; నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; శైలజానిటలంబునుం బోలెఁ జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై; మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై; వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై; యమరావతీపురంబునుం బోలె సుమనోలలితంబై; కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై; పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై; వైకుంఠపురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితంబై; నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె రామమహిషీవంచక సమంచితంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, శరభ శోభితంబై; నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై; సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి; రం దొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి.

టీకా:

మఱియును = ఇంకనూ; మధువైరి = మధుడనే రాక్షసుని శత్రువు, విష్ణువు; మందిరంబునున్ = మందిరమును; పోలెన్ = వలె; మాధవీ = పూలగురివింద చెట్లతోను, లక్ష్మీతోను; మన్మథ = వెలగచెట్లతోను, మన్మథుడితోను; పాతంబు = అందంగా ఉన్నది; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మ; గేహంబునున్ = గృహము; పోలెన్ = వలె; శారద = ఏడాకులఅరటిచెట్లతోను, సరస్వతీదేవితోను; ఆన్వితంబు = కూడుకొన్నది; ఐ = అయి; నీలగళ = నీలకంఠుడైన శివుని; సభా = సభా; నికేతనంబునున్ = మండపమును; పోలెన్ = వలె; వహ్ని = చిత్రమూలం, అగ్నిదేవుడు; వరుణ = ఉలిమిరిచెట్లు, వరుణదేవుడు; సమీరణ = మరువము, వాయుదేవుడు; చంద్ర = పెద్ద ఏలకి, చంద్రుడు; రుద్ర = రుద్రాక్ష, ఏకాదశరుద్రులు; హైమవతీ = కరకచెట్లు, పార్వతీదేవి; కుబేర = నందివృక్షాలు, కుబేరుడు; వృషభ = అడ్ఢపర, వృషభవాహనము; గాలవ = లొద్దుగచెట్లు, గాలవముని; శాండిల్య = మారేడుచెట్లు,శాండిల్యముని; పాశుపత = శ్రీవల్లీ, శివభక్తులు; జటి పటల = జువ్విచెట్లుతోను, ముని సమూహములతోను; మండితంబు = అలంకరింపబడినది; ఐ = అయి; బలభేది = దేవేంద్రుని {బలభేది - బల (బలాసురుని) భేదించిన (సంహరించిన) వాడు, ఇంద్రుడు}; భవనంబునున్ = భవనాన్ని; పోలెన్ = పోలి; ఐరావత = నారింజచెట్లు, స్వర్గంలోని ఐరావతము; అమృత = ఉసిరిక, అమృతము; రంభా = అరటిచెట్లు, అప్సరస రంభ; గణిక = అడవిమొల్లలుతోను, దేవవేశ్యలతోను; అభిరామంబు = మనోజ్ఞము; ఐ = అయి; ముర = ముర; అసురు = అసురుని; నిలయంబునున్ = నిలయమును; పోలెన్ = పోలి; ఉన్మత్త = ఉమ్మెత్త, మదించిన; రాక్షస = బలురక్కెస, రాక్షసుల; వంశ = వెదురు, సమూహాలు; సంకులంబు = కలగలసినది; ఐ = అయి; ధనద = కుబేరుని {ధనదుడు - ధనము నిచ్చువాడు, దాత, కుబేరుడు}; ఆగారంబునున్ = సౌధము; పోలెన్ = పోలి; శంఖ = శంఖాలు, నవనిధులలోని శంఖము {నవనిధులు - 1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము 5కచ్చపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము}; పద్మ = పద్మపుష్పాలు, నవనిధులలోని పద్మము; కుంద = మొల్లలు,నవనిధులలోని కుందము; ముకుంద = ఎఱ్ఱతామరలతోటి, నవనిధులలోని ముకుందము తో; సుందరంబు = అందమైనది; ఐ = అయి; రఘు = రఘువంశోద్భవుడైన; రాము = శ్రీరాముని; యుద్ధంబునున్ = యద్దమును; పోలెన్ = పోలి; నిరంతర = అంతరములేని; శర = రెల్లు, బాణ; అనలశిఖ = శక్రపుష్పి, అగ్నిజ్వాలలు; బహుళంబు = తఱచుగాఉన్నది; ఐ = అయి; పరశురాము = పరశురాముడి; భండనంబునున్ = యుద్ధము; పోలెన్ = పోలి; అర్జునోద్భేదంబు = మద్ది అంకురాలు కలది, కార్తవీర్యార్జుని సంహారం కలది; ఐ = అయి; దానవ = రాక్షసుల; సంగ్రామంబునున్ = యుద్ధమును; పోలెన్ = పోలి; అరిష్ట = వేపచెట్లు, అరిష్టాసురుడు; జంభ = నిమ్మచెట్లు, జంభాసురుడు; నికుంభ = దంతిచెట్లు, నికుంభాసురుడు; శక్తి = (యొక్క) బలముతో; యుక్తంబు = కూడినది; ఐ = అయి; కౌరవ = కౌరవ పాండవుల; సంగరంబునున్ = యుద్ధమును; పోలెన్ = పోలి; ద్రోణ = తుమ్మచెట్లు, ద్రోణుడు; అర్జున = మద్ధిచెట్లు, అర్జునుడు; కాంచన = సంపెంగచెట్లు, బంగారు; స్యందన = నిమ్మిచెట్లు, రథాల; కదంబ = కడిమిచెట్లు, సమూహము; సమేతంబు = కలిసియన్నది; ఐ = అయి; కర్ణు = కర్ణుని; కలహంబునున్ = యుద్ధమును; పోలెన్ = పోలి; మహోన్నత = చాలా ఎత్తైన, చాలా ఉన్నతమైన; శల్య = మంగచెట్లు, శల్యుని; సహకారంబు = మామిడిచెట్లు, కలదై సహాయము కలది; ఐ = అయి; సముద్ర = సాగరము మీద; సేతు = వంతెన; బంధనంబునున్ = కట్టుటను; పోలెన్ = పోలి; నల = వట్టివేరు, నలుడనే వానరవీరుడు; నీల = నీలిచెట్లు, నీలుడనే వానరవీరుడు; పనస = పనసచెట్లు, పనసుడనే వానరవీరుడు; ఆది = మొదలైన; అద్రి = చెట్లతో, (వానరులనే) కొండలతో; ప్రదీపితంబు = ప్రకాశిస్తున్నది; ఐ = అయి; భర్గు = శివుని; భజనంబునున్ = భజనము; పోలెన్ = పోలి; నానా = వివిధరకాలైన, వివిధములైన; అశోక = అశోకచెట్లు, శుభ; లేఖా = పంక్తులకొద్దీ, పత్రికల; ఫలితంబు = వృక్షాలున్నదై, ఫలితాన్నిచ్చేది; ఐ = అయి; మరుని = మన్మథుని; కోదండంబునున్ = విల్లును; పోలెన్ = పోలి; పున్నాగ = సుర పొన్నలు, పున్నాగ పుష్పాల; శిలీముఖ = తుమ్మెదలతో, బాణాలతో; భూషితంబు = అలంకరింప బడినది; ఐ = అయి; నరసింహ = నరసింహుని; రూపంబునున్ = స్వరూపమును; పోలెన్ = పోలి; కేసర = పొన్నచెట్లు, జూలు; కరజ = కానుగచెట్లు, గోళ్ళు; కాంతంబు = తోవెలుగుతున్నది; ఐ = అయి; నాట్య = నాట్య; రంగంబునున్ = రంగమును; పోలెన్ = పోలి; నట = దుండిగచెట్లు, నటులు; నటీ = దొండచెట్లు, నటీమణులు; సుషిర = గువ్వగుతికచెట్లు, వాద్యవిశేషాల; అన్వితంబు = తోకలగలిసియున్నది; ఐ = అయి; శైలజా = పార్వతీదేవి; నిటలంబునున్ = నుదురును; పోలెన్ = పోలి; చందన = చందనవృక్షాలు, మంచిగంథము; కర్పూరతిలకా = కలిగొట్లు బొట్టుగచెట్లతో, కర్పూరతిలకముతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయి; వర్షాగమంబునున్ = వానరావటమును, వానాకాలము; పోలెన్ = పోలి; ఇంద్రబాణాసన = మరువం నల్లగోరింట వేగిస చెట్లు, ఇంద్రధనస్సు; మేఘ = తుంగముస్తెలు, మేఘాలు; కరక = దానిమ్మచెట్లు, వడగళ్లు; కమనీయంబు = తో చూడచక్కనిది; ఐ = అయి; నిగమంబునున్ = వేదమును; పోలెన్ = పోలి; గాయత్రీ = చండ్రచెట్లుతో, గాయత్రీ మంత్రంతో; విరాజితంబు = మంచి పంక్తులు కలది, ప్రకాశిస్తున్నది; ఐ = అయి; మహా = మహా; కావ్యంబునున్ = కావ్యమును; పోలెన్ = పోలి; సరళ = తెల్లతెగడచెట్లు, సరళత్వము; మృదులతా = కోమలమైన తీగలుతో, సౌకుమార్యములు; కలితంబు = కలసియన్నది, ఎఱుగబడినది; ఐ = అయి; వినతానిలయంబునున్ = వినతా నిలయమును; పోలెన్ = పోలి; సుపర్ణ = సుందరమైన ఆకులుతో, గరుత్మంతుడుతో; రుచిరంబు = ఒప్పి యున్నది; ఐ = అయి; అమరావతీ = అమరావతీ; పురంబునున్ = పురమును; పోలెన్ = పోలి; సుమనస్ = మంచి పుష్పాలతో, దేవతలతో {సుమనుస్సులు - మంచి మనసున్నవారు, దేవతలు}; లలితంబు = అందమైనది; ఐ = అయి; కైటభ = కైటభుని; ఉద్యోగంబునున్ = కొలువును; పోలెన్ = పోలి; మధు = పూదేనెతో, మధుడనే రాక్షస వీరునితో; మానితంబు = మన్నింప దగినది; ఐ = అయి; పురుషోత్తమసేవనంబును = హరి సేవను; పోలెన్ = పోలి; అమృత = తియ్యని, మోక్షమును; ఫలదంబు = పండ్లుకలది, ప్రసాదించేది; ఐ = అయి; ధనంజయ = అర్జునుని; సమీకంబునుం = యుద్ధమును; పోలెన్ = పోలి; అభ్రంకష = ఆకాశమంతా క్రమ్మిన, ఆకాశంనిండా క్రమ్మిన; పరాగంబు = పుప్పొడికలది, ధూళికలది; ఐ = అయి; వైకుంఠ = వైకుంఠ; పురంబునున్ = పురమును; పోలెన్ = పోలి; హరి = సింహము, విష్ణుమూర్తి; ఖడ్గ = ఖడ్గమృగము, నందకము {నందకము - విష్ణుమూర్తి ఖడ్గము పేరు, సంతోషించునది, సంతోషపెట్టునది, అలరించునది,. వ్యు. టునది - సమృద్ధౌ - నంద+ ణ్యుల్, కృ.ప్ర.}; పుండరీక = బెబ్బులుల, తెల్లదామరలతో; విలసితంబు = క్రీడలు కలది, ప్రకాశిస్తున్నది; ఐ = అయి; నంద = నందుని; ఘోషంబునున్ = మందను; పోలెన్ = పోలి; కృష్ణసార = నల్లజింకలతో, కృష్ణుని శక్తిసామర్థ్యముల వలన; సుందరంబు = చక్కనిది; ఐ = అయి; లంకా = లంకా; నగరంబునున్ = నగరమును; పోలెన్ = పోలి; రామ = పెద్దదుప్పి, రాముని; మహిషీ = దున్నపోతు, భార్యని; వంచక = నక్క, వంచించినవాడైన రావణాసురుని; సమంచితంబు = కలిగినది; ఐ = అయి; సుగ్రీవ = సుగ్రీవుని; సైన్యంబునున్ = సైన్యమును; పోలెన్ = పోలి; గజ = ఏనుగులు, వానరవీరుడు గజుడు; గవయ = కురుఁబోతులు, వానరవీరుడు గవయడు; శరభ = శరభమృగము, వానరవీరుడు శరభుడు; శోభితంబు = ప్రకాశమైనది; ఐ = అయి; నారాయణ = విష్ణు; స్థానంబునున్ = లోకమును; పోలెన్ = పోలి; నీలకంఠ = నెమళ్ళు, నీలకంఠుడైన శివుడు; హంస = హంసలు, పరమహంసలతో; కౌశిక = గుడ్లగూబలు, కౌశికమహర్షి; భరద్వాజ = ఏంట్రితలు, భరద్వాజమహర్షి; తిత్తిరి = తీతువులు, తిత్తిరిమహర్షి; భాసురంబు = లతో ప్రకాశించుచున్నది; ఐ = అయి; మహాభారతంబునున్ = మహాభారతమును; పోలెన్ = పోలి; ఏకచక్ర = ముఖ్యమైన చక్రవాకపక్షులు, ఏకచక్రపురము; బక = కొంగ, బకాసురుడు {దార్తరాష్ట్రలు - కాళ్ళు, ముక్కు ఎఱ్ఱగాను, మిగతా శరీరం తెల్లగా నుండే హంసలు}; కంక = రాబందులు, కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు; ధార్తరాష్ట్ర = హంసలు, ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు; శకుని = శకునిపక్షులు, శకుని; నకుల = ముంగిసలు, నకులుడు; సంచార = సంచారముతో; సమ్మిళితంబు = కలిసున్నది; ఐ = అయి; సూర్య = సూర్యుని; రథంబును = రథమును; పోలెన్ = పోలి; ఉరుతర = మంచి, మేలుజాతి; ప్రవాహంబు = జలప్రవాహాలుకలది, గుఱ్ఱములుకలది; ఐ = అయి; జలదకాల = వానాకాలపు; సంధ్యా = సంధ్యా; ముహూర్తంబునున్ = సమయమును; పోలెన్ = పోలి; బహువితత = మిక్కిలి, మిక్కిలి విశాలమైన; జాతిసౌమనస్యంబు = జాజిపూలు కలది, జాతీయ భావాలు కలది; ఐ = అయి; ఒప్పు = ఒప్పియున్నదైనట్టి; నైమిశ = నైమిశము అను పేరు కల; అరణ్యంబు = అరణ్యము; అను = అను; శ్రీ = శోభనకరమైన; విష్ణు = విష్ణుదేవుని; క్షేత్రంబున్ = ప్రదేశము; అందున్ = లో; శౌనక = శౌనకుడు; ఆది = మొదలైన; మహా = గొప్ప; మునులు = మునులు; స్వర్గ = స్వర్గ; లోక = లోక; గీయమానుండు = స్తుతింపబడువాడు; అగు = అయిన; హరిన్ = శ్రీహరిని; చేరు = చేరుట; కొఱకున్ = కోసము; సహస్ర = వెయ్యి; వర్షంబులు = సంవత్సరములు; అనుష్ఠాన = నిర్వహించవలసిన; కాలంబుగా = కాలముగా; కల = ఉన్నటువంటి; సత్ర = సత్ర; సంజ్ఞికంబైన = అను పేరు గల; యాగంబు = యాగము; చేయుచున్ = చేయుచు; ఉండిరి = ఉన్నారు; అందున్ = ఆ యాగ కాలములో; ఒక్క = ఒక; నాడు = దినమున; వారలు = వారు; రేపకడ = తెల్లవారగానే; నిత్య = నిత్యముచేయు; నైమిత్తిక = నిమిత్తికముగ చేయబడు; హోమంబులు = హోమములు; ఆచరించి = నిర్వహించి; సత్కృతుండు = సత్కరింప బడ్డవాడు; ఐ = అయి; సుఖ = సుఖమైన; ఆసీనుండు = ఆసన మలంకరించిన వాడు; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; సూతున్ = సూత మహర్షిని; చూచి = చూసి.

భావము:

అంతేకాక ఆ నైమిశారణ్యం. . .
(1) పూలగురివింద చెట్లతోటి, వెలగచెట్లతోటి; మధు డనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో, మన్మథునితో కూడినట్లు అందంగా ఉంది.
(2) ఏడాకులఅరటిచెట్టతోటి; బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది.
(3) చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లీ, జువ్విచెట్ల తోటి; నీలకంఠుడైన పరమ శివుని సభామండపమును పోలి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, వృషభ వాహనము, గాలవ ముని, శాండిల్య ముని, మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది.
(4) నారింజ, ఉసిరిక, అరటి, అడవిమొల్ల చెట్లతోటి; దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము, అమృతం, అప్సరస రంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది.
(5) ఉమ్మెత్త, బలురక్కెస, వెదురు పొదలతో; మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు కలగలసినదై ఉంది.
(6) శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎఱ్ఱతామరలతోటి; కుబేరుని సౌధము లాగ (పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము లనే నవనిధులు లోని) శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది.
(7) దట్టమైన రెల్లు, శక్రపుష్పి చిక్కటి పొదలు తో; శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది.
(8) మద్ది అంకురాలు కలదై; పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది.
(9) వేప, నిమ్మ, దంతిచెట్లతో బలిసి; రాక్షసులయుద్ధంలాగ అరిష్ట, జంభ, నికుంభాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది.
(10) తుమ్మ, మద్ధి, సంపెంగ, నిమ్మి కడిమిచెట్ల తోటి కూడి ఉండి; ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగ ఉంది.
(11) చాలా ఎత్తైన మంగ, మామిడిచెట్లు కలదై; మహోన్నత మైన శల్యుని సహాయము కల కర్ణుని యుద్ధంలాగ ఉంది.
(12) వట్టివేరు, నీలి, పనసాది చెట్ల తోటి; నలుడు, నీలుడు, పనసుడు మొదలైన వానరవీరు లనే కొండలతో ప్రకాశిస్తున్నట్లు ఉంది.
(13) నానా రకాలైన అశోకాది వృక్షాల వరుసలు కలిగి ఉండి; అనేక శుభాలు కలిగి ఉండే శివుని భజనను పోలి ఉంది.
(14) సురపొన్నలు, తుమ్మెదలతో కూడి; పున్నాగ పూల బాణాలతో అలంకరింపబడిన మన్మథుని విల్లు వలె ఉంది.
(15) పొన్న, కానుగచెట్లతో వెలిగిపోతూ; జూలు, గోళ్ళుతో నరసింహ రూపంలా ప్రకాశిస్తోంది.
(16) దుండిగ, దొండ, గువ్వగుతికచెట్లు కలదై; నటులు, నటీమణులు, వాద్యవిశేషాలతో కూడి ఉన్న నాట్యరంగం లాగ ఉంది.
(17) చందనం, మంచిగంధం, కలిగొట్లు బొట్టుగచెట్లతో; చందనము, మంచి గంధము, కర్పూరతిలకములతో అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది.
(18) మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మచెట్లతో; ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో చూడచక్కని వానాకాలంలాగ ఉంది.
(19) మంచి వరుసలు తీరిన చండ్రచెట్లతో; గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది.
(20) తెల్లతెగడచెట్లతో, కోమలమైన తీగెలతో కూడినదై; సరళత్వ, సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది.
(21) అందమైన ఆకులతో; గరుత్మంతుడితో ఉన్న వినతానిలయంలా ప్రకాశిస్తున్నది.
(22) అందమైన పూలతో; దేవతలతో నిండుగా ఉన్న అమరావతీపురంలా అందంగా ఉంది.
(23) పూదేనెతో చక్కగా; మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటభుని కొలువు వలె మన్నింపదగి ఉంది.
(24) తియ్యని పండ్లుకలదై; మోక్షమును ప్రసాదించే హరి సేవలా మనోహరంగా ఉంది.
(25) ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడికలదై; ఆకాశంనిండా క్రమ్ముకున్న ధూళికల అర్జునుడి యుద్ధములా ఉంది.
(26) సింహము, ఖడ్గమృగము, బెబ్బులుల క్రీడలు కలిగి; నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము, తెల్లదామరలతో ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది.
(27) చక్కగా ఉన్న నల్లజింకలతో; కృష్ణుని శక్తిసామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది.
(28) పెద్దదుప్పి, దున్నపోతు, నక్కలు కలిగి; రాముడి భార్య సీతని వంచించిన రావణాసురుడు ఉన్న లంకానగరంలాగ ఉంది.
(29) ఏనుగులు, కురుఁబోతులు, శరభమృగాలుతో ప్రకాశిస్తూ; గజుడు, గవయడు, శరభుడులతో శోభిస్తున్న సుగ్రీవ సైన్యంలాగ ఉంది.
(30) నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏంట్రితలు, తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతు; నీలకంఠుడైన పరమశివుడు, పరమహంసలు మరియు కౌశిక, భరద్వాజ, తిత్తిరి ఆది మహర్షులతో భాసురమైన వైకుంఠంలా ఉంది.
(31) చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకునిపక్షులు, ముంగిసలు మున్నగువాని సంచారం కలిగి; ఏకచక్రపురము, బకాసురుడు, కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు, ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు, శకుని, నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది.
(32) మంచి మంచి కాలువలతో; మేలుజాతి గుఱ్ఱములు కల సూర్యరథంలా ఉంది.
(33) జాజి పూలు అధికంగా కలిగి ఉండి; మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగ ఉంది;
ఆ విధంగా ఒప్పియున్న శ్రీమహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో శౌనకాది గొప్ప ఋషులు స్వర్గలోక వంద్యుండైన విష్ణువుని చేరుట కోసం వెయ్యి సంవత్సరముల పాటు చేసే”సత్ర"అనే యాగం చేస్తున్నారు; ఆ యాగం చేసే కాలంలో, ఒకనాడు సూతమహర్షి తెల్లవారగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకొన్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని చూసి. . .