పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పూర్ణి

 •  
 •  
 •  

1-528-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రాజీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత త్న మరీచి
భ్రాజితపాదాంభోరుహ!
భూనమందార! నిత్యపుణ్యవిచారా!

టీకా:

రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్ఠుల యొక్క; మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల యొక్క; మరీచి = కాంతి చేత; భ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు కలవా డా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా {మందారుడు - కల్పవృక్షము (మందారము) వలె కోరికలు తీర్చు వాడు}; నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; విచారా = ఆలోచించు వాడా – పాలించు వాడా.

భావము:

కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! నమస్కారము.
ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం., కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షింస్తూ ఉంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీపాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటాయి అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసమాన్యం వరకు మేమెవరి మైనా వలసినవి అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.

1-529-మాలి.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుపమగుణహారా! న్యమా నారివీరా!
వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
నుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
కలుష కఠోరా! కంధి గర్వాపహారా!

టీకా:

అనుపమ = సాటి లేని; గుణ = గుణములు అను; హారా = హారము కల వాడా; హన్యమాన = చంపబడిన; అరివీరా = శత్రువీరులు కల వాడా; జన = జనుల చేత; వినుత = స్తుతింప దగ్గ; విహారా = విహారములు కల వాడా; జానకీ = జానకి యొక్క; చిత్త = మనస్సును; చోరా = దొంగిలించిన వాడా; దనుజ = రాక్షసులు అను; ఘన = మేఘములకు; సమీరా = వాయువు వంటి వాడా; దానవ = దానవుల; శ్రీ = ని; విదారా = విదళించు వాడా, బ్రద్దలు కొట్టు వాడా; ఘన = అత్యధిక, కరడు గట్టిన; కలుష = పాపుల ఎడ; కఠోరా = కఠోరముగా ఉండు వాడా; కంధి = సముద్రుని; గర్వ = గర్వమును; అపహారా = తొలగించిన వాడా.

భావము:

సాటిలేని కల్యాణ గుణ హారుడా! వైరులందరు పరాజితిలుగా గల వీరుడా! సర్వ లోకాలకు స్తుతింప తగిన విహారాలు గల మహాత్మా! సీతా మానస చోరుడా! శత్రువులనే మేఘాల పాలిటి సమీర మైన వాడా! రాక్షసుల వైభవాలు విదళించే వాడా! కరడు గట్టిన కలుషాత్ముల పాలిటి అతి కఠినుడా! సముద్రుని సమస్త గర్వాన్ని హరించిన వాడా! దయతో చిత్తగించుము.

1-530-గ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు నైమిశారణ్య వర్ణనంబును, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణకథా సూచనంబు సేయుటయు, వ్యాస చింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబునుఁ, బుత్రశోకాతురయైన ద్రుపదరాజనందన కర్జునుం డశ్వత్థామం దెచ్చి యొప్పగించి గర్వపరిహారంబు సేయించి విడిపించుటయు, భీష్మనిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబు వలనం బాపి విష్ణుండు రక్షించుటయుఁ, బరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిర్గమంబును, నారదుండు ధర్మజునకుఁ గాలసూచనంబు సేయుటయుఁ, గృష్ణ నిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, నభిమన్యుపుత్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుం డై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకసందర్శనంబు సేసి మోక్షోపాయం బడుగటయు నను కథలు గల ప్రథమ స్కంధము సంపూర్ణము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శ్రీ; పరమేశ్వర = ఉత్కృష్టమైన ఈశ్వరుడు; శివుని; కరుణా = దయ వలన; కలిత = పుట్టిన వాడును; కవితా = కవిత్వ రచనములో; విచిత్ర = విశేషమైన చిత్రములు కలవాడును; కేసనమంత్రి = కేసన మంత్రికి; పుత్ర = పుత్రుడును; సహజ = స్వాభావికముగా అబ్బిన; పాండిత్య = పాండిత్యము కలవాడును; పోతనామాత్య = పోతనామాత్యునిచే; ప్రణీతంబు = చక్కగా రచింపబడినది{ప్రణీతము- (సం॥) స్థానాంతర ప్రాపణ సంస్కృతః॥ ; (తె॥) మఱియొక స్థలమునందుంచుటకై సంస్కారము చేయఁబడినది.}; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అను = అను; మహా = గొప్ప; పురాణంబు = పురాణము; అందున్ = లో; నైమిశ = నైమిశము అను; అరణ్య = అడవి; వర్ణనంబును = వర్ణనమును; శౌనక = శౌనకుడు; ఆదుల = మొదలగు వారి; ప్రశ్నంబును = ప్రశ్నలును; సూతుండు = సూతుడు; నారాయణ = విష్ణుమూర్తి {నారాయణుడు - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,}; కథ = కథల యొక్క, గ్రంథమునకు; సూచనంబు = ప్రారంభమును; సేయుటయున్ = చేయుటయును; వ్యాస = వ్యాసుని; చింతయున్ = విచారమును; నారద = నారదుని; ఆగమనంబును = వచ్చుటయును; నారదుని = నారదుని; పూర్వ = పూర్వ; కల్ప = జన్మ; వృత్తాంతంబును = సమాచారమును; పుత్ర = పుత్రులను గూర్చిన; శోక = శోకము వలన; ఆతుర = కలత చెందినది; ఐన = అయినట్టి; ద్రుపద = ద్రుపద {ద్రుపదరాజనందన - ద్రౌపది, ద్రుపదరాకుమారి}; రాజ = రాజు యొక్క; నందన = కుమార్తె; కున్ = కి; అర్జునుండు = అర్జునుండు; అశ్వత్థామన్ = అశ్వత్థామను; తెచ్చి = తీసుకొని వచ్చి; ఒప్పగించి = అప్పజెప్పి; గర్వ = గర్వమునకు; పరిహారంబు = పరిహారము; చేయించి = చేయించి; విడిపించుటయున్ = విడిపించుటయును; భీష్మ = భీష్ముని; నిర్యాణంబును = నిర్యాణమును; ధర్మనందను = ధర్మరాజునకు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; రాజ్యా = రాజ్యమును; అభిషేకంబును = అభిషేకము చేయించుటయును; గోవిందుని = శ్రీకృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు.}; ద్వారక = ద్వారకకు; ఆగమనంబును = వచ్చుటయును; విరాట = విరాటుని {విరాటకన్యక - ఉత్తర, విరాట రాకుమారి, అభిమన్యు భార్య, పరీక్షిత్తు తల్లి}; కన్యక = పుత్రిక యొక్క; ఆగర్భ = గర్భమందు; విద్యమానుండు = ప్రవర్తమానుడు; ఐన = అయినట్టి; అర్భకున్ = పిల్లవానిని; అశ్వత్థామ = అశ్వత్థామ; బాణ = బాణము యొక్క; అనలంబు = అగ్ని; వలనన్ = వలని బాధలను; పాపి = పోగొట్టి; విష్ణుండు = విష్ణువు; రక్షించుటయున్ = రక్షించుటయును; పరీక్షిత్ = పరీక్షిత్తు; జన్మంబును = జన్మించుటయును; గాంధారీ = గాంధారియును; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడును; విదురుల = విదురుల; నిర్గమంబును = నిష్క్రమణమును; నారదుండు = నారదుడు; ధర్మజున = ధర్మరాజు; కున్ = కి; కాల = (రాబోవు) కాలమును; సూచనంబు = సూచించుటలు; సేయుటయున్ = చేయుటయున్; కృష్ణ = శ్రీకృష్ణుని; నిర్యాణంబు = నిర్యాణమును – వెడలిపోవుటను; విని = విని; పాండవులు = పాండురాజు పుత్రులు; మహా = మహా; పథంబునన్ = ప్రస్థానమునకు; చనుటయున్ = వెళ్ళుటయును; అభిమన్యుపుత్రుండు = పరీక్షిన్మహారాజు; దిగ్విజయంబున్ = దిగ్విజయయాత్ర; చేయుచు = చేయుచు; శూద్ర = శూద్రుని యొక్క; రాజ = రాజుల యొక్కయు; లక్షణ = లక్షణములు; లక్షితుండు = తో ఉన్నవాడు; అగు = అయిన; కలి = కలియొక్క; గర్వంబు = గర్వము; సర్వంబు = అంతయు; మాపి = పోగొట్టి; గో = గోవు; వృష = ఎద్దు; ఆకారంబులన్ = రూపములలో; ఉన్న = ఉన్నటువంటి; ధరణీ = వసుంధరా; ధర్మ = ధర్మ; దేవతలన్ = దేవతలను; ఉద్ధరించుటయున్ = ఉద్దరించుటయును; శృంగి = శృంగి యొక్క; శాప = శాపము వలన; భీతుండు = భయపడినవాడు; ఐ = అయి; ఉత్తర = ఉత్తరయొక్క; నందనుండు = పుత్రుడు; గంగా = గంగానదీ; తీరంబునన్ = తీరములో; ప్రాయోపవేశంబునన్ = మరణాయత్త దీక్షలో; ఉండి = ఉండి; శుక = శుకుని; సందర్శనంబు = సందర్శనము – చూచుట; చేసి = చేసి; మోక్ష = మోక్షమునకు; ఉపాయంబు = ఉపాయము; అడుగటయున్ = అడుగుటయును; అను = అనే; కథలున్ = కథలు; కల = ఉన్నట్టి; ప్రథమ = మొదటి; స్కంధము = స్కంధము; సంపూర్ణము = సంపూర్ణము.

భావము:

భాగవతమనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడూ, కేసనామాత్యుని పుత్రుడూ, సహజపాండిత్యుడూ అయిన పోతనామాత్యుడు రచించాడు; ఈ మహాగ్రంథంలో నైమిశారణ్య వర్ణనమూ; శౌనకాది మహర్షుల సంప్రశ్నమూ; సూతులవారి నారాయణ కథా సూచనమూ; వ్యాసులవారి విచారమూ; నారదాగమనమూ; నారదులవారి పూర్వజన్మ వృత్తాంతమూ; ద్రౌపది పుత్రశోకంతో పరితపించడమూ; అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకొనిరావడమూ; అశ్వత్థామ గర్వ పరిహారమూ; భీష్ముని నిర్యాణమూ; ధర్మరాజు పట్టాషేభికమూ; శ్రీకృష్ణుని ద్వారకాగమనమూ; ఉత్తరా గర్భస్థుడైన అర్భకుణ్ణి అశ్వత్థామ అస్త్ర జ్వాల నుంచి విష్ణుమూర్తి రక్షించడమూ; పరీక్షిత్తు పుట్టడమూ, గాంధారీ, ధృతరాష్ట్ర, విదురుల నిర్యాణమూ; నారదుడు ధర్మరాజునకు భవిష్యత్తు సూచించడమూ; కృష్ణుడు అవతారం చాలించడమూ; పాండవుల మహాప్రస్థానమూ; పరీక్షిత్తు దిగ్విజయమూ; కలి గర్వం సమస్తమూ తప్పించడమూ; భూ ధర్మదేవతలను ఉద్ధరించడమూ; శృంగిశాపానికి భయంతో పరీక్షిత్తు గంగ ఒడ్డున ప్రాయోపవేశము చేపట్టడమూ; శుకముని దర్శనముచేసి మోక్షోపాయం అడుగడమూ అనెడి కథలు కలిగిన ప్రథమ స్కందము సంపూర్ణము.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!