పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-443-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చేసినఁ గాని పాపములు సెందవు; చేయఁ దలంచి నంతటం
జేసెద నన్నమాత్రమునఁ జెందుఁ గదా కలివేళఁ బుణ్యముల్
మోము లే దటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము
ల్లాముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్.

టీకా:

చేసినన్ = చేసిన; కాని = కాని; పాపములు = పాపములు; సెందవు = చెందవు; చేయన్ = చేయుటను; తలంచిన్ = తలచిన; అంతటన్ = అంతటనే; చేసెదన్ = చేసెదను; అన్న = అనిన; మాత్రమునన్ = మాత్రముచేతనే; చెందున్ = చెందును; కదా = కదా; కలి = కలి; వేళన్ = కాలములో; పుణ్యముల్ = పుణ్యములు; మోసము = మోసము; లేదు = లేదు; అటంచున్ = అనుచును; నృపముఖ్యుఁడు = పరీక్షిత్తుడు {నృపముఖ్యుఁడు - నరపాలకులలో ముఖ్యమైనవాడు, పరీక్షిత్తుడు}; కాచెన్ = కాపాడెను; కలిన్ = కలిని; మరందము = మకరందము, తేనె; ఉల్లాసము = ఉత్సాహము; తోడన్ = తో; గ్రోలి = త్రాగి; విరులన్ = పువ్వులను; తెగన్ = తెగబడి; చూడని = చూడని; తేఁటి = తేనేటి; కైవడిన్ = వలె.

భావము:

అయితే ఈ కలియుగంలో ఒక విశేషముంది, చేస్తేనే గాని పాపాలు పట్టుకోవు. ఇక పుణ్యాలందామా ”చేస్తాను’ అని అనుకొంటే చాలు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. అందుకనే అభిమన్య కుమారుడు, కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద, లోపల ఉన్న మకరందాన్ని మాత్రం ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా! అలాగన్నమాట.
పరీక్షిత్తు కలిపురుషుని నిగ్రహించాడు కాని నిర్మూలించలేదు ఎందుకు అనే సందేహానికి తావు లేకుండా వివరించబడింది.