ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు
- ఉపకరణాలు:
గజనామధేయపురమున
గజరిపుపీఠమున ఘనుఁడు గలిదమనుం డున్
గజవైరిపరాక్రముఁ డే
గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్.
టీకా:
గజనామధేయపురమున = హస్తినాపురమునందు {గజనామధేయపురము - గజ (హస్తిన అను) నామధేయ (పేరు కల) పురము (పురము) హస్తినాపురము}; గజరిపుపీఠమున = సింహాసనమున {గజరిపుపీఠము - గజ (ఏనుగు) రిపు (శత్రువు, సింహము) పీఠము (ఆసనము), సంహాసనము}; ఘనుఁడున్ = గొప్పవాడు; కలి = కలిని; దమనుండున్ = అణచిన వాడును; గజ వైరి పరాక్రముడు = సింహపరాక్రముడు {గజవైరిపరాక్రముడు - గజవైరి (సింహ) పరాక్రముఁడు (పరాక్రమము కలవాడు), - సింహపరాక్రముడు}; ఏ = ఎట్టి; గజిబిజి = గజిబిజి, గందరగోళం; లేకుండన్ = లేకుండగ; తాల్చెన్ = ధరించెను; గౌ(కౌ)రవ = గౌరవము అను, కౌరవ సామ్రాజ్యం అను; లక్ష్మిన్ = సంపదను.
భావము:
సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు ఆయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీను డై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు.