పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-412-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైలాసాచలసన్నిభంబగు మహాగంభీరగోరాజముం
గాక్రోధుఁడు, దండహస్తుఁడు, నృపాకారుండు, క్రూరుండు, జం
ఘాలుం డొక్కఁడు, శూద్రుఁ డాసురగతిం గారుణ్యనిర్ముక్తుఁడై
నేలం గూలఁగఁ దన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్.

టీకా:

కైలాస = కైలాస; అచల = పర్వతమునకు; సన్నిభంబు = సమానము; అగు = అయి నట్టి; మహా = చాలా; గంభీర = గంభీర మైన; గో = ఎద్దులలో; రాజమున్ = శ్రేష్ఠ మైన దానిని; కాల = యముని వలె మిక్కిలి; క్రోధుఁడు = కోపిష్టి; దండ = దుడ్డుకఱ్ఱను; హస్తుఁడు = చేత పట్టుకున్న వాడు; నృప = రాజు యొక్క; ఆకారుండు = ఆకారమున ఉన్న వాడు; క్రూరుండు = క్రూరుడు; జంఘాలుండు = వడిగ నడచు వాడు {జంఘాలుడు - పిక్క గట్టి కల వాడు, మిక్కిలి వేగంగా నడచువాడు.}; ఒక్కఁడు = ఒకడు; శూద్రుఁడు = శూద్రుడు; ఆసుర = అసురుని; గతిన్ = వలె; కారుణ్య = దయను; నిర్ముక్తుఁడు = విడిచిన వాడు; ఐ = అయి; నేలన్ = నేలమీద; కూలంగన్ = కూలిపోవు నట్లు; తన్నెన్ = తన్నెను; పంచితిలఁగాన్ = మూత్రము పోసుకునేలాగ {పంచితిలు(క్రియ) - గోవు మూత్రము విడుచు}; నిర్ఘాత = పిడుగుపాటు వంటి; పాద = కాలి; హతిన్ = తన్నుతో.

భావము:

కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమ మైన ఆ మహా వృషభాన్ని క్రోధోన్మత్తుడు, కఠోరచిత్తుడు, రాజవేషధారి, దుడ్డుకఱ్ఱ పట్టుకొన్న వాడు, బలమైన పిక్కలు కల వాడు అయిన ఒక శూద్రుడు కటిక రాక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభ రాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. (పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తు, ఇలా శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు.)