పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గర్భస్థకుని విష్ణువు రక్షించుట

  •  
  •  
  •  

1-281-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
య్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!

టీకా:

కుయ్యడన్ = కుయ్ అని ఏడ్చుటకు; శక్తి = నేర్పు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము = పిండము; లోపలన్ = లోపల; ఉన్నవాఁడన్ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్ = వినుచుందును; నేడు = ఈవేళ; ఈ = ఈ; ఇషు = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నిని; పాయుట = దూరము చేయుట; కున్ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్ = నన్ను; కావన్ = కాపాడుటకు; ఏ = ఏ; అయ్య = మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్ = ప్రమాదమును; ఎవ్వఁడు = ఎవడు; ఎఱుంగున్ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా.

భావము:

"ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి; ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో; తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా! (తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.)