ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు
- ఉపకరణాలు:
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బా
లొడ్డగిలఁ బ్రేమభరమున
జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా!
టీకా:
బిడ్డఁడు = కుమారుడు; మ్రొక్కినన్ = నమస్కరింపగ; తల్లులు = తల్లులు; జడ్డనన్ = తటాలున; అంకములన్ = తొడలపై; ఉనిచి = ఉంచుకొని; చన్నుల = చన్నుల; తుదిన్ = మొనలలో; పాలు = క్షీరము; ఒడ్డగిలన్ = పొంగి రాగా; ప్రేమ = ప్రేమ యొక్క; భరమునన్ = భారము వలన; జడ్డువడన్ = ఆశ్చర్యకరముగ; తడిపిరి = చెమ్మగిల చేసిరి; అక్షిజలములన్ = కన్నీటితో; అనఘా = పాపము లేని వాడా.
భావము:
చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, అతని తల్లులు అందరు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లి చన్నులు చేపుతుండగా, తమ కన్నీటితో అతనిని అభిషేకించారు.