ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట
- ఉపకరణాలు:
యాదవు లందుఁ, బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
టీకా:
యాదవులందున్ = యదు వంశమువారి మీదను; పాండుసుతులందున్ = పాండురాజు పుత్రుల మీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకున్న; మోహ = మోహమును; విచ్ఛేదమున్ = విమోచనము; సేయుము = చేయుము; అయ్య = అయ్యా; ఘనసింధువున్ = సముద్రము {ఘనసింధువు - ఘనమైన సింధువు (సముద్రము), మహాసముద్రము}; చేరెడి = చేరేటటువంటి; గంగ = గంగ; భంగిన్ = వలెను; నీ = నీయొక్క; పాద = పాదములను; సరోజ = పద్మముల; చింతనము = భక్తి; పైన్ = మీద; అనిశంబు = ఎల్లప్పుడు; మదీయ = నాయొక్క; బుద్ధిన్ = మనసుని; అతి = మిక్కిలి; ఆదర = ఆదరమైన; వృత్తి = ప్రవర్తన; తోన్ = తో; కదియునట్లుగన్ = కూడి ఉండునట్లుగా; చేయన్ = చేయవచ్చు; కద = కదా; అయ్య = అయ్యా; ఈశ్వరా = ఈశ్వరుడా, శ్రీకృష్ణా.
భావము:
స్వామీ! విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా, నా బుద్ధి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే లగ్న మయ్యేటట్లు చెయ్యి.