పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-193-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన, వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రారిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు, వెచ్చనూర్చుచుం,
బాపఁడవై నటించుట కృపాపర! నా మదిఁ జోద్య మయ్యెడిన్.

టీకా:

కోపము = కినుక; తోడన్ = తో; నీవు = నీవు; దధి = పాల; కుంభము = కుండ; భిన్నము = ముక్కలు; చేయుచు = చేస్తూ; ఉన్నచోన్ = ఉన్నపుడు; గోపిక = యశోదాదేవి; త్రాటన్ = తాడుతో; కట్టిన = కట్టగా; వికుంచిత = వంచిన, జారిన; సాంజన = కాటుకతో కూడిన; బాష్పతోయ = కన్నీటి; ధారా = ధారలతో; పరిపూర్ణ = నిండిన; వక్త్రమున్ = ముఖమును; కరంబులన్ = చేతులతో; ప్రాముచు = అలము కొనుచు; వెచ్చనూర్చుచున్ = వేడినిట్టూర్పులు నిట్టూరుస్తూ; పాపఁడవు = శిశువు; ఐ = అయి; నటించుట = నటించుట; కృప = దయను; పర = ప్రసరించువాడా; నా = నా యొక్క; మదిన్ = మనసులో; చోద్యము = ఆశ్చర్యమును; అయ్యెడిన్ = కలిగిస్తోంది.

భావము:

దయామయా! శ్రీకృష్ణా! చిన్నప్పుడు నీవు ఒకసారి కోపంవచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ, ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించటం తలచుకుంటే, ఇప్పటికి నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా.