పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట

  •  
  •  
  •  

1-169-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్.""

టీకా:

కొడుకులన్ = కొడుకులను; పట్టి = పట్టుకొని; చంపెన్ = చంపేసాడు; అని = అని; కోపమున్ = కోపం; ఒందదు = పొందదు; బాల = పిల్లలను; ఘాతుకున్ = సంహరించిన వానిని; విడువుము = వదిలిపెట్టండి; అటంచున్ = అంటూ; చెప్పెడిని = చెప్తోంది; వెఱ్ఱిది = వెఱ్ఱిబాగులది; ద్రౌపది = ద్రౌపది; వీఁడు = ఇతడు; విప్రుఁడే = బ్రాహ్మణుడా; విడువఁగన్ = వదలిపెట్టుట; ఏల = ఎందుకు; చంపుఁడు = చంపండి; ఇటు = ఇలా; వీనిని = ఇతనిని; మీరలు = మీరు; సంపరేని = చంపకపోతే; నా = నాయొక్క; పిడికిటి = పిడికిలి; పోటునన్ = పోటుతో; శిరము = తల; భిన్నము = బద్దలు; సేసెదన్ = కొడతాను; చూడుఁడు = చూడండి; ఇందఱున్ = మీరు అందరూ.

భావము:

“తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు; పైగా వదిలిపెట్టమంటోంది; ఎంత పిచ్చిదో చూడండి; బ్రాహ్మణుడు కదా వదలేయండి అంటోంది; ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా? చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏమీ లేదు; చంపెయ్యండి; మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుఱ్ఱబద్దలుకొట్టేస్తాను; మీరంతా చూస్తూ ఉండండి.”