ప్రథమ స్కంధము : అశ్వత్థామని తెచ్చుట
- ఉపకరణాలు:
భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధవీరభటసందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ!
టీకా:
భూసురుఁడవు = బ్రాహ్మణుడవు; బుద్ధి = బుద్ధియందు; దయా = దయతో; భాసురుఁడవు = ప్రకాశించువాడవు; శుద్ధ = చక్కటి; వీర = వీరుల; భట = భటుల; సందోహ = సమూహములో; అగ్రేసరుఁడవు = పెద్దనాయకుడవు; శిశు = పిల్లలను; మారణము = సంహరించుట; అసుర = రాక్షసపు; కృత్యంబు = పని; ధర్మ = న్యాయము; అగునే = అవుతుందా; తండ్రీ = అయ్యా.
భావము:
తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు.