పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : దండకములు


భాగవత దండకములు

పద్య సూచిక;-
శ్రీనాథనాథా! జగన్నాథ! ;
శ్రీమానినీమానచోరా! ;

up-arrow (1) 3-203-దం.

శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజ పత్రేక్షణా! దేవదేవా! భవద్దాస వర్గానుతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబునాఁ బొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసారతాపంబులం బోవఁగా మీటి వర్తింతురో తండ్రి! ఈశా! సమస్తాఘ నిర్ణాశ! ఈ విశ్వమం దెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేఁ గ్రాగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యేకర్మమున్ ధర్మముం బొందఁగా లేక సంసారచక్రంబు నందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు; రమ్మూఢ చేతస్కులం జెప్పఁగా నేల యో దేవ! విజ్ఞానదీపాంకురం బైన మీ పాదపంకేరుహచ్ఛాయఁ బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌని సంఘంబు లైకాంతికస్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగానివాసంబుగాఁ నొప్పు నీ పాద యుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజశ్రేణిచేతం గవేషించి సంప్రాప్తులై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుటజ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబు లందే పరంజ్యోతి పాదాబ్జపీఠంబు గీలించి కైవల్యసంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు మింద్రాదివంద్యా! ముకుందా సమస్తంబుఁ గల్పింపఁ బాలింపఁ దూలింపఁగాఁ బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులై యొప్పు భక్తావళిన్ మోక్షదం బైన నీ పాదకంజాతముల్ కొల్తు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహగేహంబులం దోలి వర్తించు దుర్మానవశ్రేణు లందంతరాత్ముండవై యుండియున్ దూరమై తోఁచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియవ్యాప్తి నుద్వృత్తు లైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీకళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానఁగాఁజాల రప్పుణ్యు లా దుష్టులం జూడఁగా నొల్లరంభోధిరాట్కన్యకాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాసార చంచత్సుధాసార పూరంబులం గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులం దేలి సంపన్నులై మన్న నిత్యప్రసన్నుల్ మహోత్కంఠతం బేర్చి వైకుంఠధామంబు నల్పక్రియాలోలురై కాంతు రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన భోధాత్మ యోగక్రియా రూఢి నంతర్బహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబుఁ గావించి హృత్పద్మ వాసుండ వై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లసన్మూర్తిఁ జిత్తంబు లం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వరశ్రేణికిం దావకీ నానుకంపానులబ్దస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; రో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! భవద్దాసు లైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్య విస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటేకాక నీ దివ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముం జేయ నేమెంతవారౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతు లైనట్టి మమ్మెన్నఁగా నేల నధ్యాత్మ తత్త్వంబ వన్నం బరం జ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్వాది త్రైగుణ్య మూలంబునా నొప్పు మాయాగుణం బందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు; నాయాయి కాలంబులన్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు; మేరీతి నన్నంబు భక్షింతు; మెబ్భంగి వర్తింతు; మే నిల్కడన్నుందు; మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచున్నున్న యిక్కార్య సంధాను లైనట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్ దేవ! నీ శక్తిఁ దోడ్పాటు గావించి విజ్ఞానముం జూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనః పల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరో హంస! దేవాదిదేవా! నమస్తే! నమస్తే! నమః!
భావము:- ఓ లక్ష్మీవల్లభా! అనాథనాథా! అఖిలజగన్నాథా! నీవు శిరస్సు వంచిన వారిని చేర దీసే కరుణా సాంద్రుడవు పగవారనే పర్వతాలను బద్దలు కొట్టే దేవేంద్రుడవు, కమలదళాల వంటి కన్నులు గలవాడవు. దేవతలకు దేవుడవైనవాడవు నీ దాసుల తాపాన్ని పోగొట్టే చల్లని వెల్లగొడుగులు నీ అడుగులు. అఖిల సౌభాగ్యాలకూ అలవాలాలైన నీ అంఘ్రికమలాలను ఆశ్రయించిన మహాయోగులు దుర్వార సంసార బాధలన్నింటినీ దూరంగా పారదోలి సుఖంగా ఉంటారు. సకల పాతక సమూహాలనూ సంహరించే ఓ తండ్రీ! నీవు జగదీశ్వరుడవు ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ భయంకరమైన భవబంధాలలో చిక్కుకొని ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధి దైవికం అనే తాపత్రయ రూపమైన దావానలంలో కాలుతూ దుఃఖసముద్రంలో మునిగి తేలుతున్నారు. ఒక సత్కర్మం గానీ, ధర్మం గాని లేకుండా సంసార చక్రంలో పడి క్రిందు మీదులూగా తిరుగుతున్నారు. అటువంటి పరమ మూర్ఖుల మాట చెప్పేదేముంది. ఓ దేవాదిదేవా! విజ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞాన తమస్సును తొలగించే మీ పాద పద్మాలను ఆశ్రయిస్తాము. కమలలోచనా! ఘనులైన మునులు మనస్సును ఏకాగ్రం చేసుకొని గూటిలోనుండి పక్షులవలె నీ నోటిలో నుండి వెలువడిన వేదవాక్కుల ద్వారా వెదకి వెదకి నీ పదారవిందాలను అందుకుంటారు. నీ చరణ కమల ద్వయం దుర్దాంతమూ, దురంతమూ అయిన దురిత సంచయాన్ని తుడిచివేసే గగన గంగా తరంగిణికి ఆశ్రయం.
ఓ ప్రభూ! నీవే అందరికీ పైవాడవు. నీపైని ఎవ్వరు లేరు. వైరాగ్యబలంచేత ప్రాప్తించిన నిశ్చలమైన జ్ఞానోదయంతో మేల్కాంచిన ధీరశ్రేష్ఠులు నిత్యములూ, నిర్మలములూ అత్యంత పవిత్రములూ అయిన తమ హృదయంలో ఏ పరంజ్యోతి పాదపీఠాన్ని నెలకొల్పి మోక్షాన్ని పొందారో, ఆ మోక్ష స్వరూపుడవైన నిన్ను సన్నుతిస్తున్నాము. ఇంద్రాది బృందారక బృందాల అభివందనాలు అందుకొనే ఓ ముకుందా! ఈ సృష్టి నంతటినీ పుట్టించి, రక్షించి నశింప జేయడానికై అనేకాలైన దివ్యావతారాలు ధరించావు. నీ పదకమలాలను హృదంతరాలలో నిరంతరం స్మరించే భక్త సమూహానికి ముక్తిని ప్రసాదించే ప్రభూ! మేము నీ చరణ సరోజాలను సంసేవిస్తాము. ఈశా! ఓ రమాధీశా! పిల్లలూ, ఇల్లాలు, మిత్రులూ, అనే సంబంధ బంధాల్లో బంధితులై ఎల్లప్పుడూ దుష్టకార్యాలు చేయుట యందే ఇష్టం కలిగి నా యిల్లూ, నా ఒళ్లూ అనే మమకారంతో ప్రవర్తించే మూఢమానవుల అంతరంగాలలో కూడా సర్వాంతర్యామివైన స్వామీ! నీవు నిండి ఉంటావు. కాని నీ పాదాలు వారికి దూరంగానే ఉంటాయి. అటువంటి నీ చరణ సరోజాలను పూజిస్తాము. ఓ దేవా! ఇంద్రియోన్మాదానికి లోబడి చెడుపనులనే చేస్తూ మిడిసిపడే పరమ శుంఠల, అధ్యాత్మ తేజోవిరాజితులై అఖిల సంపదలకు ఆలవాలమైన నీ పాద మూలమందే మనస్సు నిల్పిన మహానుభావులను దర్శించాలని వాంఛింపరు. ఈ మహాపురుషులు కూడా ఆ కాపురుషుల ముఖం చూడటానికి సుముఖులు కారు. లక్ష్మీమనోవల్లభా! ఉపనిషత్కాంతలకు అంతఃపురమైన నీ కథాసారమనే సుధాపూరాన్ని గ్రోలుతూ సంతోషాతిశయంతో సోలుతూ, జ్ఞానవంతులై సంసార తాపాన్ని పారదోలుతూ, ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ, సత్త్వసంపన్నులై నిత్యప్రసన్ను లైనవారు పరమోత్కంఠతో నీ వైకుంఠ ధామాన్ని చేరుతారు. మేము కూడా అటువంటి దివ్యస్థానాన్ని కోరుతున్నాము. ఓ దేవదేవా! వైరాగ్యం చేతనూ, విజ్ఞానం చేతనూ ప్రబుద్ధమైన ఆత్మయోగంలో సిద్ధిపొంది, లోపలా బయటా వ్యాపించి చలిస్తూ ఉండే మనోవృత్తిని నిరోధించి, పరిశుద్ధమైన అంతరంగంతో ఒప్పే యోగీశ్వరులు, తమ హృదయపద్మాల్లో వర్తిస్తూ చిన్మయాకారంతో ప్రపర్తిస్తూ ఉన్న నీ అనంతతేజో విరాజితమైన దివ్యమూర్తిని తమ మనస్సులో నిలుపుకొని ఎల్లప్పుడు ఆనందిస్తూ ఉంటారు. నీ అనుగ్రహంవల్ల ప్రాప్తించిన పరమ జ్ఞానం పొందినందువల్ల వారికి ఆయాస మనేది ఉండదు.
ఓ సకల దేవతా చక్రవర్తీ! ఓ సచ్చిదానందమూర్తీ! నీ కీర్తి విశ్వమంతా కీర్తిస్తున్నది. నీ మూర్తి సమస్త జీవరాసులో వర్తిస్తున్నది. లోకాలను సృష్టించాలనే సంకల్పంతో సత్త్వరస్తమో గుణాలను ప్రస్ఫురింపజేసి, నీ దాసులైన మమ్ములను పుట్టించావు. పుట్టిస్తే పుట్టామే తప్ప గొప్పదైన నీసృష్టిని అనుసరించి లోకాలను సృష్టించటానికి మే మెంత వాళ్లం స్వామీ! నీ ప్రసాదంవల్ల కల్గిన శక్తియుక్తులతో నిన్ను పూజిస్తాము. అంతే. నీ అంశవల్ల పుట్టిన మమ్మల్ని ప్రత్యేకంగా గణించడం ఎందుకు? త్రిగుణాలకు అతీతుడవైన ఓ పరమాత్మా! అధ్యాత్మతత్త్వాని వన్ననూ, పరంజ్యోతి వన్ననూ, ప్రపంచాని వన్ననూ, అధిష్ఠాత వన్ననూ, సదాసాక్షి వన్ననూ, అన్నీ నీవే కదా తామర రేకులవటి కన్నులు కలదేవా! సత్త్వరజస్తమో గుణాలకు మూలమైన మాయాగుణంలో మహత్తత్త్వమైన నీ తేజస్సును ప్రవేశపెట్టిన నీవు నీ సృష్టికంతటికీ కారణమైనావు. నీ అంశలమైన మేము కాలానుసారంగా నీ కే విధంగా సంతోషాన్ని సమకూర్చుతాము? మా ఆహారం ఏమి? మేము ఏ విధంగా ప్రవర్తించాలి? మా స్థితి ఏమి? ఈ ప్రాణి లోకమే మాకు ఆధారం కాగా అనుభవాల్ని పొందుతూ నీ కార్యం నెరవేర్చాలని కుతూహలపడుతున్న మాకు మార్గాన్ని చూపించు. కరుణతో నీ శక్తిని ప్రసాదించి జగత్తును సృష్టించే శక్తిని కల్గించి రక్షించు. లక్ష్మీహృదయమనే నీటి పడియలో విహరించే మహా వరాహస్వామీ! మహాయోగుల మానస సరోవరాలలో సంచరించే మరాళరాజా! దేవాదిదేవా! నీకు నమస్కారం! నీకు నమస్కారం!!, నమస్కారం!!!"

up-arrow (2) 10.1-1236-దం.

శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబులన్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్ నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.
భావము:- “ఓ శ్రీమన్నారాయణా! అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా! మంగళ స్వరూపం కలవాడా! ఓ వీరుడా! నిఖిల ప్రపంచ సృష్టికి కారణ మైన పృథివ్యాది పంచమహాభూతాలకూ కారణ మైనవాడా! మిక్కిలి చలించు తరంగశ్రేణిచే కలత నొందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీన మైపోయి నప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడావు. అప్పుడు నీ నాభికమలం నుంచి సకల భువనాలను సృజించు విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారము మాయ మహాత్తత్వము మనస్సు మొదలైనవీ ఇంద్రియములూ ఇంద్రియవృత్తు లైన శబ్ద స్పర్శ రూప రస గంధములూ లోకములూ లోకకారణములూ ఈ సమస్తమూ నీ మహా శరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడవై యున్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించుటకు ఎంత గొప్పవారయినా సమర్ధులు కారు. మాయ మున్నగు తత్త్వములు జడములు కాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్టి మాయా సంబంధ మైన గుణాలచే ఆవరింపబడున్నాడు. కనుక అతడు నిన్ను ఇలాంటివాడిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు మున్నగువారు నిన్ను ఆధ్యాత్మ ఆధిదైవ ఆధిభూతములకు అనగా దేహాంద్రియాధి దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకు డైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాము లైన కొందరు కర్మయోగులు నీవు ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు అంటారు. ఇది నిజ మంటున్నారు. మరికొందరు జ్ఞాన యోగులు అన్ని కర్మలను వదలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరిం నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ భేధాలతో నలువురై సొంపు ఘటిస్తున్నా వంటున్నారు, కొందరు నీవు నారాయణుడ వనీ, కొందరు శివుడవనీ అనేక రకాలుగా శ్లాఘిస్తున్నారు. ఇందులో తప్పులేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబము ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలం ద్రొక్కక ఒంటరివాడవై యుంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖము; చంద్రసూర్యులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; చెట్లు నీ రోమములు; గాలి నీ ప్రాణము; ఇంద్రాదులు నీ బాహువులు; మేఘాలు నీ తలవెంట్రుకలు; ఆకాశం నీ నాభి; రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు; బ్రహ్మ నీ మేఢ్రము; వర్షము నీ వీర్యము; స్వర్గము నీ శిరస్సు; ఇలా నీ శరీరంలో బ్రహ్మాండములు అత్తి చెట్టు కొమ్మలలో ఉన్న పండ్ల వలె నీ అందు అనంత ప్రాణి సమూహం మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్పురుషా! నీ రూపములు పొగడ్తకు అందనివి. మునుపు మత్స్యాకృతితో ప్రళయ సాగర మందు శత్రు వగు సోమకు నెదిరించి సాధించి వేదప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రముచే బూని మధు, కైటభులను సంహరించావు కదా. కూర్మ రూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు కదా. వరాహ రూపం ధరించి క్రుంగుతున్న భూమండలాన్ని లేవ నెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు కదా. భయంకర శత్రు వగు హిరణ్యకశిపుని నరసింహాకృతితో నీవు సంహరింప లేదా? ప్రతాపశీలి వగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించ లేదా? బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా? భార్గవ రాముడవై క్షత్రియ సమూహమును వధింప లేదా? దశరథ రాముడవై చంద్రబింబము వంటి మోము గల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని దునుమాడ లేదా? వాసుదేవాది రూపములను దాల్చి క్రూరులను శిక్షించ లేదా? శుద్ధబుద్ద స్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరగించావు కదా. కల్కిరూపము ధరించి పెంపుతో వెలుగొందవా? నిన్ను పొగుడుటకు నేను ఏపాటివాణ్ణి; నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి; దుఃఖము చెందిన వాణ్ణి; అనుగ్రహబుద్ధితో నా దిగులు దీర్చి నన్నాదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా! కరుణయే అలంకారముగా కలవాడా! నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా! నీకు అభివాదము. నీకు నమస్కారము. నీకు వందనము. నీకు ప్రణామము.