పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మహదాదులు హరి స్తుతి

  •  
  •  
  •  

3-203-దం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజ పత్రేక్షణా! దేవదేవా! భవద్దాస వర్గానుతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబునాఁ బొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసారతాపంబులం బోవఁగా మీటి వర్తింతురో తండ్రి! ఈశా! సమస్తాఘ నిర్ణాశ! ఈ విశ్వమం దెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేఁ గ్రాగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యేకర్మమున్ ధర్మముం బొందఁగా లేక సంసారచక్రంబు నందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు; రమ్మూఢ చేతస్కులం జెప్పఁగా నేల యో దేవ! విజ్ఞానదీపాంకురం బైన మీ పాదపంకేరుహచ్ఛాయఁ బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌని సంఘంబు లైకాంతికస్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగానివాసంబుగాఁ నొప్పు నీ పాద యుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజశ్రేణిచేతం గవేషించి సంప్రాప్తులై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుటజ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబు లందే పరంజ్యోతి పాదాబ్జపీఠంబు గీలించి కైవల్యసంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు మింద్రాదివంద్యా! ముకుందా సమస్తంబుఁ గల్పింపఁ బాలింపఁ దూలింపఁగాఁ బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులై యొప్పు భక్తావళిన్ మోక్షదం బైన నీ పాదకంజాతముల్ కొల్తు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహగేహంబులం దోలి వర్తించు దుర్మానవశ్రేణు లందంతరాత్ముండవై యుండియున్ దూరమై తోఁచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియవ్యాప్తి నుద్వృత్తు లైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీకళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానఁగాఁజాల రప్పుణ్యు లా దుష్టులం జూడఁగా నొల్లరంభోధిరాట్కన్యకాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాసార చంచత్సుధాసార పూరంబులం గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులం దేలి సంపన్నులై మన్న నిత్యప్రసన్నుల్ మహోత్కంఠతం బేర్చి వైకుంఠధామంబు నల్పక్రియాలోలురై కాంతు రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన భోధాత్మ యోగక్రియా రూఢి నంతర్బహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబుఁ గావించి హృత్పద్మ వాసుండ వై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లసన్మూర్తిఁ జిత్తంబు లం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వరశ్రేణికిం దావకీ నానుకంపానులబ్ధస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; రో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! భవద్దాసు లైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్య విస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటేకాక నీ దివ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముం జేయ నేమెంతవారౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతు లైనట్టి మమ్మెన్నఁగా నేల నధ్యాత్మ తత్త్వంబ వన్నం బరం జ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్వాది త్రైగుణ్య మూలంబునా నొప్పు మాయాగుణం బందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు; నాయాయి కాలంబులన్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు; మేరీతి నన్నంబు భక్షింతు; మెబ్భంగి వర్తింతు; మే నిల్కడన్నుందు; మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచున్నున్న యిక్కార్య సంధాను లైనట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్ దేవ! నీ శక్తిఁ దోడ్పాటు గావించి విజ్ఞానముం జూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనః పల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరో హంస! దేవాదిదేవా! నమస్తే! నమస్తే! నమః!

టీకా:

శ్రీనాథనాథా = విష్ణుమూర్తీ {శ్రీనాథనాథుడు - శ్రీ (లక్ష్మీదేవి)కి నాథ (భర్త), విష్ణువు}; జగన్నాథా = విష్ణుమూర్తీ {జగన్నాథుడు - విశ్వమునకు ప్రభువు, విష్ణువు}; నమ్రైకరక్షా = విష్ణుమూర్తీ {నమ్రైకరక్ష - నమ్రత ఏక (ఒక్కటితోనే) రక్షణ ఇచ్చువాడు, విష్ణువు}; విపక్షక్షమాభృత్సహస్రాక్ష = విష్ణుమూర్తీ {విపక్షక్షమాభృత్సహస్రాక్ష - విపక్ష (శత్రువులు) అను పర్వతములకు ఇంద్రునివంటివాడు, విష్ణువు}; నీరేజపత్రేక్షణా = విష్ణుమూర్తీ {నీరేజపత్రేక్షణ - పద్మము (నీరు న పుట్టినది) రేకుల వంటి కన్నులు ఉన్న వాడ, విష్ణువు}; దేవదేవా = విష్ణుమూర్తీ {దేవదేవ - దేవుళ్ళకే దేవుడా, విష్ణువు}; భవత్ = నీయొక్క; దాస = భక్తుల; వర్గ = సమూహముల; అనుతాపంబులన్ = వగపులను; పాపంగా = పోగొట్టగా; ఓపు = సామర్థ్యంబు కల; దివ్య = దివ్యమైన; అతపత్రంబునన్ = గొడుగు; నాన్ = వలె; పొల్చు = ప్రకాశించు; యుష్మత్ = నీయొక్క; పద = పాదము అను; అంభోజ = పద్మముల {అంభోజము - నీటిలో పుట్టినది, పద్మము}; మూలంబు = అరికాళ్ళు; పుణ్య = పుణ్యముల; ఆలవాలంబు = పుట్టిల్లు {ఆలవాలము - మొక్క మొలచుటకు చేయు పాదు, పుట్టిల్లు}; కాన్ = అగునట్లు; పొంది = పొంది; యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఉద్దామ = మిక్కుటమైన; సంసార = సంసారము యొక్క; తాపంబులన్ = బాధలను; పోవగాన్ = పోవునట్లుగా; మీటి = గోటితో మీటి; వర్తింతురు = తిరుగుదురు; ఓ = ఓ; తండ్రీ = అయ్యా; ఈశా = ప్రభువా; సమస్త = సమస్తమైన; అఘ = పాపములను; నిర్ణాశ = పూర్తిగా నశింప చేయువాడ; ఈ = ఈ; విశ్వము = లోకము; అందు = లో; ఎల్ల = సమస్తమైన; జీవుల్ = జీవులు; భవత్ = నీయొక్క; ఉదగ్ర = భయంకరమైన; దుర్వార = వారింపరాని; తాపత్రయ = తాపత్రయములు అను {తాపత్రయములు - 1 ఆధ్యాత్మము 2 ఆధిభౌతికము 3 ఆధిదైవము అను తాపములు}; ఆభీల = భయంకరమైన; దావాగ్ని = కార్చిచ్చు; చేన్ = చేత; క్రాగి = కాలిపోయి, ఉడికిపోయి; దుఃఖ = దుఃఖము అను; అబ్ధి= సముద్రము; లోన్ = లో; తోగి = మునకలేసి; ఏ = ఏ; కర్మమున్ = కర్మమమునను; ధర్మమున్ = రక్షణను; పొందగాన్ = పొంద; లేక = లేక; సంసార = సంసారము అను; చక్రంబు = చక్రము; అందున్ = లో; పరిభ్రామ్యణ్య = సుడులుతిరుగుతున్న; ఆత్ములు = ఆత్మలుకలవారు; ఐ = అయి; ఉందురు = ఉందురు; ఆ = ఇంకను ఆ; మూఢ = మూఢమైన; చేతస్కులన్ = పనులుచేయువారిగురించి; చెప్పగాన్ = చెప్పుట; ఏల = ఎందులకు; ఓ = ఓ; దేవ = దేవుడా; విజ్ఞాన = విజ్ఞానము అను {విజ్ఞానము - విశిష్ట జ్ఞానము, సర్వమునందును భగవంతుని అస్థిత్వమును జ్ఞప్తియందు ఉంచుకొనుట}; దీప = దీపమునకు; అంకురము = వత్తి; ఐన = అయిన; మీ = మీ; పాద = పాదములు అను; పంకేరుహత్ = పద్మముల; ఛాయన్ = నీడలో; ప్రాపింతుము = పొందుదుము; అబ్జాక్ష = విష్ణుమూర్తీ {అబ్జాక్షుడు - పద్మముల (నీటిలో పుట్టినవి) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సత్ = మంచి; ముని = మునుల {ముని - మౌనము(అంతర్యామి తత్త్వమునకు తప్ప దేనికిని వర్తింపక ఉండుట)ను అభ్యసించు వారు}; సంఘంబులు = సమూహములు; ఏకాంతిక = ఏకాంతికము అను {ఏకాంతికము - ఆత్మపరమాత్మల ఏకత్వ అనుభవమున ఉండుట, అనన్యభక్తి, అనన్యచింత}; స్వాంతతంబు = స్వస్థతను; పేర్చి = (సాధనను) కూడబెట్టుకొని; దుర్దాంత = అంతము చేయుటకు రాని; పాప = పాపముల; ఓఘ = సమూహములను; నిర్ణాశక = పూర్తిగా నశింప చేయు; అంబు = నీటి; ప్రవాహ = ప్రవాహముకల; అభ్ర = ఆకాశ; గంగా = గంగకు; నివాసంబుగాన్ = నివాసముగా; ఒప్పు = ఒప్పి ఉండు; నీ = నీయొక్క; పాద = పాదముల; యుగ్మంబున్ = జంటను; యుష్మత్ = నీయొక్క; ముఖ = ముఖము అను; అంభోజ = పద్మము అను {అంభోజము - నీటిలో పుట్టినది, పద్మము}; నీడ = గూటి నుండి; ఉద్గతంబున్ = వెలువడ్డవి; ఐన = అయిన; వేద = వేదములు అను; అండజ = పక్షుల; శ్రేణి = గుంపులు; చేతన్ = వలన; గవేషించి = వెదకి; సంప్రాప్తులు = చక్కగా (వలసినది) దొరకినవారు; ఐ = అయి; ఉందురు = ఉందురు; ఓ = ఓ; నాథ = ప్రభువా; వైరాగ్య = వైరాగ్యము యొక్క {వైరాగ్యము - విరాగ్యము (పరాత్పరుని యందు తప్ప దేనియందు రాగము లేక ఉండుట)ను అభ్యసించుట}; శక్తి = శక్తివలన; స్ఫుట = స్పష్టమైన; జ్ఞాన = జ్ఞానము; బోధాత్ములు = బోధపడినవారు; ఐనట్టి = అయినట్టి; ధీర = ధీరులైన {ధీరులు - ధారణ నేర్చిన వారు}; ఉత్తములు = ఉత్తములు; నిత్య = శాశ్వతమైన; నైర్మల్య = నిర్మలమైన; భవ్య = శుభకరములు నగు; అంతరంగంబులు = హృదయములు; అందున్ = లోపల; ఏ = ఏ; పరంజ్యోతి = పరంజ్యోతి యొక్క {పరంజ్యోతి - పరము (అత్యుత్తమ) ప్రకాశమైన స్వరూపము, విష్ణువు}; పాద = పాదములు అను; అబ్జ = పద్మముల; పీఠంబు = అరికాలు; కీలించి = ధ్యానముచేసి; కైవల్య = ముక్తి {కైవల్యము - కేవలము పరమాత్మ అనగా తాను మాత్రమే ఉన్నది అని తెలియు స్థితి}; సంప్రాప్తులు = చక్కగా అందినవారు; ఐరి = అయినావారో; అట్టి = అటువంటి; నిర్వాణ = ముక్తి; మూర్తిన్ = స్వరూపమును; ప్రశంసింతుము = కీర్తింతుము; ఇంద్రాదివంద్య = విష్ణుమూర్తీ {ఇంద్రాదివంద్యుడు - ఇంద్రుడు మొదలగు వారిచే నమస్కరింపబడువాడు, విష్ణువు}; ముకుందా = విష్ణుమూర్తీ {ముకుందుడు - ఎఱ్ఱతామరల దండ ధరించువాడు, నవనిధిలలోని ముకుందమునకు అధిదేవత, విష్ణువు?}; సమస్తంబున్ = సమస్తమును; కల్పింపన్ = సృష్టించుటకును; పాలింపన్ = మనుగడ రక్షించుటకును; తూలింపన్ = తొలగించుటకును; పెక్కు = అనేకమైన; దివ్య = దివ్యమైన; అవతారంబులన్ = అవతారములను; పొందు = ఎత్తునట్టి; నీ = నీ; పాద = పాదములు అను; పంకేరుహ = పద్మముల; ధ్యాన = ధ్యానించుటలో; పారీణ = నేర్పుచే; సుస్వాంతులు = చక్కటిస్వస్థత కలవారు; ఐ = అయి; ఒప్పు = ఒప్పునట్టి; భక్తా = భక్తులయొక్క; ఆవళిన్ = సమూహములను; మోక్షదంబు = మోక్షమును ప్రసాదించునది; ఐన = అయినట్టి; నీ = నీ; పాద = పాదములు అను; కంజాతముల్ = పద్మములు {కంజాతములు - కం (నీటిలో) జాతములు (పుట్టినవి), పద్మములు}; కొల్తుము = కొలిచెదము; ఈశ = విష్ణుమూర్తీ {ఈశ - ప్రభువు, విష్ణువు}; రమాధీశ = విష్ణుమూర్తీ {రమాధీశుడు - లక్ష్మీపతి, విష్ణువు}; పుత్ర = పుత్రులు; అంగన = భార్యలు; మిత్ర = మిత్రులు అను; సంబంధంబుల్ = బంధములను; చెంది = కలిగి; నిత్యంబున్ = నిత్యము; దుష్ట = చెడ్డ; క్రియ = పనులుచేయుటలో; లోలురు = మునిగిపోయినవారు; ఐ = అయి; దేహ = దేహములందు; గేహములన్ = గృహములలోను; ఓలిన్ = క్రమముగా, వరుసగా; వర్తించు = నడచు; దుర్ = చెడ్డ; మానవ = మానవుల; శ్రేణులు = సమూహముల; అందు = లోను; అంతరాత్ముడవు = అంతరాత్మవు; ఐ = అయి; ఉండియున్ = ఉండికూడ; దూరము = దూరముగ ఉన్నవాడవు; ఐ = అయి; తోచు = తెలియబడువాడవైన; నీ = నీయొక్క; పాద = పాదములు అను; పద్మంబులన్ = పద్మములను; అర్చింతుము = సేవిస్తాము; ఓ = ఓ; దేవ = దేవుడా; బాహ్యేంద్రియ = బాహ్యేంద్రియముల; వ్యాప్తిన్ = విజృంభణము వలన; ఉద్వృత్తులు = మిడిసిపడువారు; ఐనట్టి = అయినట్టి; మూఢ = అవివేకపు; ఆత్ములు = మనసులు కలవారు; అధ్యాత్మ = అధ్యాత్మిక; తత్త్వ = తత్త్వము యొక్క; ప్రభావ = ప్రభావముతో; ఆఢ్యులు = సంపన్నులు; ఐ = అయి; నీ = నీయొక్క; పద = పాదములు అను; అబ్జ = పద్మములనుండి; జాత = పుట్టిన; విన్యాస = విలసిత; లక్ష్మీ = లక్ష్మీ; కళా = కళకు; వాసమున్ = నివాసమును; కన్న = చూసిన; ఆ = ఆ; ఉత్తమ = ఉత్తములచే; శ్లోకులన్ = కీర్తింపబడువారిని; కానంగా = చూడ; లేరు = లేరు; ఆ = ఆ; పుణ్యులు = పుణ్యులు; ఆ = ఆ; దుష్టులన్ = చెడ్డవారిని; చూడగాన్ = చూచుటకు; ఒల్లరు = ఒప్పుకొనరు; అంభోధిరాట్కన్యకాకాంత = విష్ణుమూర్తీ {అంభోధిరాట్కన్యకాకాంత - అంభోధి (సముద్రు)ని రాట్కన్య (రాకుమారి) యొక్క భర్త, విష్ణువు}; వేదాంత = వేదాంతములు అను; శుద్ధాంతము = అంతఃపురము; ఐ = అయి; ఒప్పు = ఒప్పుచున్న; నీ = నీ; సత్ = మంచి; కథా = కథల; సార = సారముఅను; చంచత్ = చలిస్తున్న; సుధా = అమృత; ఆసార = ప్రవాహ; పూరంబులన్ = నీటిని; గ్రోలి = తాగి; సౌఖ్య = సౌఖ్యము యొక్క; ఉన్నతిని = అతిశయమున; సోలి = పరవశించి; ధీ = బుద్ధితో; యుక్తులు = కూడినవారు; ఐ = అయి; వ్రాలి = ఉండి; తాపంబులన్ = తాపములను; తోలి = పోగొట్టికొని; మోదంబులన్ = సంతోషంబులందు; తేలి = మునిగితేలి; సంపన్నులు = సంపదలుకలవారు; ఐ = అయి; మన్న = బతికినట్టి; నిత్య = ఎల్లప్పుడును; ప్రసన్నుల్ = ప్రశాంతముగా ఉండువారు; మహా = మిక్కిలి; ఉత్కంఠతన్ = కుతూహలముతో; పేర్చి = అతిశయించిన; వైకుంఠ = వైకుంఠ {వైకుంఠము - ఎడతెరపిలేని ప్రకాశము కలది}; ధామంబున్ = నగరమును; అల్ప = సూక్ష్మమైన; క్రియా = పనులలో; లోలురు = నిమగ్నులు; ఐ = అయి; కాంతురు = చూచెదరు; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; వాస = వైకుంఠ నివాస; ఏక = ముఖ్యమైన; సంప్రాప్తి = లభించుట; కిన్ = ను; కోరుచున్నారము = కోరుతున్నము; ఓ = ఓ; దేవ = దేవుడా; వైరాగ్య = వైరాగ్యము; విజ్ఞాన = విజ్ఞానము; బోధాత్మ = బోధపడిన; యోగ = యోగ; క్రియా = క్రియల; ఆరూఢిన్ = సిద్ధించిన; అంతర్ = లోపలి; బాహ్య = బాహ్య; వ్యాప్తిన్ = (ఇంద్రియ) ప్రవర్తనలను; చాలించి = ఆపివేసి; శుద్ద = పరిశుద్దమైన; అంతరంగంబున్ = ఆత్మను; కావించి = ఏర్పరచి; హృత్ = హృదయము అను; పద్మ = పద్మమున; వాసుండవు = వసించువాడవు; ఐ = అయి; చిత్ = చైతన్యముతో; మయ = నిండిన; ఆకారము = స్వరూపము; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ; ఉన్నత = ఉన్నతమైన; అనంత = అంతములేని; తేజస్ = తేజస్సుయొక్క; విలాస = సొగసుచే; ఉల్లసత్ = ఉల్లాసముపొందిన; మూర్తిన్ = స్వరూపమును; చిత్తములన్ = మనసులలో; చేర్చి = చేర్చి; ఆనంద = ఆనందములో; లోలాత్మన్ = మునిగితేలుటయందు; పొల్చు = అతిశయించు; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠుల; శ్రేణి = సమూహమున; కిన్ = కి; తావకీన = నీయొక్క; అనుకంప = అనుగ్రహమువలని; అనులబ్ధ = చక్కగా లభించిన; స్పుట = స్పష్టమైన; జ్ఞానమున్ = జ్ఞానము; కల్గుటన్ = కలుగుట; చేసి = చేసి; ఆయాసమున్ = బాధపడుటను; చెందరు = చెందరు; ఓ = ఓ; దేవతాచక్రవర్తీ = విష్ణుమూర్తీ {దేవతాచక్రవర్తి - దేవతలకు చక్రవర్తి, విష్ణువు}; సదానందమూర్తీ = విష్ణుమూర్తీ {సదానందమూర్తి - శాశ్వత ఆనందమునకు స్వరూపము అయినవాడు, విష్ణువు}; జగద్గీతకీర్తీ = విష్ణుమూర్తీ {జగద్గీతకీర్తి - లోకముచే గానము చేయబడిన కీర్తికలవాడ, విష్ణువు}; లసద్భూతవర్తీ = విష్ణుమూర్తీ {లసద్భూతవర్తి - లసత్ (ప్రకాశిస్తున్న) భూతములు (జీవులు మహాభూతములు) అందును వర్తి (వర్తించువాడు), విష్ణువు}; భవత్ = నీయొక్క; దాసులు = దాసులు; ఐనట్టి = అయినటువంటి; మమ్మున్ = మమ్ములను; జగత్ = లోకములను; కల్పనా = సృష్టించుటకు; ఆసక్త = సంకల్పముకల; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయి; నీవు = నీవు; త్రైగుణ్య = త్రిగుణముల {త్రిగుణములు - సత్త్వరజస్తమో గుణములు మూడు}; విస్ఫూర్తిన్ = ప్రకాశము; పుట్టించినన్ = పుట్టించగా; పుట్టుటే = పుట్టడమే; కాక = కాకుండగ; నీ = నీ; దివ్య = దివ్యమైన; లీలా = క్రీడలచే; అనుమేయంబుగాన్ = అనుసరించి; సృష్టి = సృష్టి; నిర్మాణమున్ = నిర్మించుటను; చేయన్ = చేయుటకు; నేము = మేము; ఎంత = ఎంత; వారము = వారము; ఔదుము = అవుతాము; మీ = మీ; శక్తి = శక్తితో; యుక్తిన్ = కూడుటకు; భవత్ = నీయొక్క; పూజన్ = పూజలను; కావింతుము = చేయుదము; అట్లు = ఆవిధముగ; ఉండె = ఉండెను; నీ = నీయొక్క; సత్ = మంచి; కళా = అంశతో; జాతులు = పుట్టినవారము; ఐనట్టి = అయినట్టి; మమ్మున్ = మమ్ములను; ఎన్నగా = ఎంచుట; ఏలన్ = ఎందులకు; అధ్యాత్మ = ఆధ్యాత్మ యొక్క; తత్త్వంబవు = తత్త్వము నీవే; అన్నన్ = అనినను; పరంజ్యోతివి = పరంజ్యోతి నీవే {పరంజ్యోతి - పరము (అత్యుత్తమ) ప్రకాశమైన స్వరూపము}; అన్నన్ = అనినను; ప్రపంచంబవు = ప్రపంచము నీవె; అన్నన్ = అనినను; అధిష్ఠాతవు = అధిపతివి; అన్నన్ = అనినను; సదాసాక్షివి = సర్వసాక్షివి; అన్నన్ = అనినను; గుణాతీతా = విష్ణుమూర్తీ {గుణాతీత - త్రిగుణములకు అతీతమైనవాడు, విష్ణువు}; నీవే = నీవే; కదా = కదా; పద్మపత్రాక్ష = విష్ణుమూర్తీ {పద్మపత్రాక్షుడు - పద్మముల రేకులవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సత్త్వాది = సత్త్వాది; త్రైగుణ్య = త్రిగుణములకు; మూలంబున్ = మూలము; నాన్ = అనగా; ఒప్పు = ఒప్పియుండు; మాయా = మాయతో కూడిన; గుణంబు = గుణముల; అందున్ = లోపల; ఉద్యత్ = అతిశయిస్తున్న; మహా = గొప్ప; తత్త్వము = తత్త్వము; ఐనట్టి = అయినట్టి; నీ = నీయొక్క; వీర్యమున్ = తేజస్సును; పెట్టుటన్ = పెట్టుట; చేసి = వలన; నీవు = నీవు; ఇంతకున్ = ఈ సమస్తమునకును; కారణంబు = కారణము; ఔదు = అవుతావు; నాయాయి = అనుసారులము, పరతంత్రులము; కాలంబులన్ = కాలమునకు; నీకున్ = నీకు; సౌఖ్యంబులు = సౌఖ్యములు; ఏము = మేము; ఎట్లు = ఏవిధముగ; కావింతుము = కలిగింపగలము; ఏ = ఏ; రీతిన్ = విధముగ; అన్నంబున్ = ఆహారమును; భక్షింతుము = తినెదము; ఎబ్బంగిన్ = ఏ విధముగ; వర్తింతుము = ప్రవర్తింతుము; ఏ = ఏ విధముగ; నిల్కడన్ = నిలకడగా; ఉందుము = ఉండెదము; ఈ = ఈ; జీవంబె = జీవితమే; ఆధారము = అధారము; ఐ = అయి; ఉండి = ఉండి; భోగంబులన్ = భోగములను; పొందుచున్ = పొందుతూ; ఉన్న = ఉన్నట్టి; ఈ = ఈ; కార్య = కార్యములను; సంధానులు = చేస్తున్నవారము; ఐనట్టి = అయినట్టి; మాకున్ = మాకు; జగత్ = లోకములను; కల్పనా = సృష్టించు; శక్తిన్ = శక్తి; కిన్ = కి; దేవ = విష్ణుమూర్తీ; నీ = నీయొక్క; శక్తిన్ = శక్తిని; తోడ్పాటు = సహాయముగా; కావించి = చేసి; విజ్ఞానమున్ = విజ్ఞానమును; చూపి = చూపించి; కారుణ్య = దయను; సంధాయివి = చేకూర్చువాడవు; ఐ = అయి; మమ్మున్ = మమ్ములను; రక్షింపు = కాపాడు; లక్ష్మీమనఃపల్వలక్రోడ = విష్ణుమూర్తీ {లక్ష్మీమనఃపల్వల క్రోడ - లక్ష్మీదేవి మనసు అను నీటిగుంట యందు క్రీడించు వరాహమూర్తి, విష్ణువు}; యోగీంద్రచేతస్సరోహంస = విష్ణుమూర్తీ {యోగీంద్రచేతస్సరోహంస - యోగీంద్రుల (యోగులలో శ్రేష్ఠుల) చేతస్ ( మనసు) అను సరస్(సరోవరము) న ఉండు హంస, విష్ణువు}; దేవాదిదేవ = విష్ణుమూర్తీ {దేవాదిదేవ -దేవుళ్ళకే ఆదిదేవుడు, విష్ణువు}; నమస్తే = నమస్తే; నమస్తే = నమస్తే; నమః = నమస్తే.

భావము:

ఓ లక్ష్మీవల్లభా! అనాథనాథా! అఖిలజగన్నాథా! నీవు శిరస్సు వంచిన వారిని చేర దీసే కరుణా సాంద్రుడవు పగవారనే పర్వతాలను బద్దలు కొట్టే దేవేంద్రుడవు, కమలదళాల వంటి కన్నులు గలవాడవు. దేవతలకు దేవుడవైనవాడవు నీ దాసుల తాపాన్ని పోగొట్టే చల్లని వెల్లగొడుగులు నీ అడుగులు. అఖిల సౌభాగ్యాలకూ అలవాలాలైన నీ అంఘ్రికమలాలను ఆశ్రయించిన మహాయోగులు దుర్వార సంసార బాధలన్నింటినీ దూరంగా పారదోలి సుఖంగా ఉంటారు. సకల పాతక సమూహాలనూ సంహరించే ఓ తండ్రీ! నీవు జగదీశ్వరుడవు ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ భయంకరమైన భవబంధాలలో చిక్కుకొని ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధి దైవికం అనే తాపత్రయ రూపమైన దావానలంలో కాలుతూ దుఃఖసముద్రంలో మునిగి తేలుతున్నారు. ఒక సత్కర్మం గానీ, ధర్మం గాని లేకుండా సంసార చక్రంలో పడి క్రిందు మీదులూగా తిరుగుతున్నారు. అటువంటి పరమ మూర్ఖుల మాట చెప్పేదేముంది. ఓ దేవాదిదేవా! విజ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞాన తమస్సును తొలగించే మీ పాద పద్మాలను ఆశ్రయిస్తాము. కమలలోచనా! ఘనులైన మునులు మనస్సును ఏకాగ్రం చేసుకొని గూటిలోనుండి పక్షులవలె నీ నోటిలో నుండి వెలువడిన వేదవాక్కుల ద్వారా వెదకి వెదకి నీ పదారవిందాలను అందుకుంటారు. నీ చరణ కమల ద్వయం దుర్దాంతమూ, దురంతమూ అయిన దురిత సంచయాన్ని తుడిచివేసే గగన గంగా తరంగిణికి ఆశ్రయం.
ఓ ప్రభూ! నీవే అందరికీ పైవాడవు. నీపైని ఎవ్వరు లేరు. వైరాగ్యబలంచేత ప్రాప్తించిన నిశ్చలమైన జ్ఞానోదయంతో మేల్కాంచిన ధీరశ్రేష్ఠులు నిత్యములూ, నిర్మలములూ అత్యంత పవిత్రములూ అయిన తమ హృదయంలో ఏ పరంజ్యోతి పాదపీఠాన్ని నెలకొల్పి మోక్షాన్ని పొందారో, ఆ మోక్ష స్వరూపుడవైన నిన్ను సన్నుతిస్తున్నాము. ఇంద్రాది బృందారక బృందాల అభివందనాలు అందుకొనే ఓ ముకుందా! ఈ సృష్టి నంతటినీ పుట్టించి, రక్షించి నశింప జేయడానికై అనేకాలైన దివ్యావతారాలు ధరించావు. నీ పదకమలాలను హృదంతరాలలో నిరంతరం స్మరించే భక్త సమూహానికి ముక్తిని ప్రసాదించే ప్రభూ! మేము నీ చరణ సరోజాలను సంసేవిస్తాము. ఈశా! ఓ రమాధీశా! పిల్లలూ, ఇల్లాలు, మిత్రులూ, అనే సంబంధ బంధాల్లో బంధితులై ఎల్లప్పుడూ దుష్టకార్యాలు చేయుట యందే ఇష్టం కలిగి నా యిల్లూ, నా ఒళ్లూ అనే మమకారంతో ప్రవర్తించే మూఢమానవుల అంతరంగాలలో కూడా సర్వాంతర్యామివైన స్వామీ! నీవు నిండి ఉంటావు. కాని నీ పాదాలు వారికి దూరంగానే ఉంటాయి. అటువంటి నీ చరణ సరోజాలను పూజిస్తాము. ఓ దేవా! ఇంద్రియోన్మాదానికి లోబడి చెడుపనులనే చేస్తూ మిడిసిపడే పరమ శుంఠల, అధ్యాత్మ తేజోవిరాజితులై అఖిల సంపదలకు ఆలవాలమైన నీ పాద మూలమందే మనస్సు నిల్పిన మహానుభావులను దర్శించాలని వాంఛింపరు. ఈ మహాపురుషులు కూడా ఆ కాపురుషుల ముఖం చూడటానికి సుముఖులు కారు. లక్ష్మీమనోవల్లభా! ఉపనిషత్కాంతలకు అంతఃపురమైన నీ కథాసారమనే సుధాపూరాన్ని గ్రోలుతూ సంతోషాతిశయంతో సోలుతూ, జ్ఞానవంతులై సంసార తాపాన్ని పారదోలుతూ, ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ, సత్త్వసంపన్నులై నిత్యప్రసన్ను లైనవారు పరమోత్కంఠతో నీ వైకుంఠ ధామాన్ని చేరుతారు. మేము కూడా అటువంటి దివ్యస్థానాన్ని కోరుతున్నాము. ఓ దేవదేవా! వైరాగ్యం చేతనూ, విజ్ఞానం చేతనూ ప్రబుద్ధమైన ఆత్మయోగంలో సిద్ధిపొంది, లోపలా బయటా వ్యాపించి చలిస్తూ ఉండే మనోవృత్తిని నిరోధించి, పరిశుద్ధమైన అంతరంగంతో ఒప్పే యోగీశ్వరులు, తమ హృదయపద్మాల్లో వర్తిస్తూ చిన్మయాకారంతో ప్రపర్తిస్తూ ఉన్న నీ అనంతతేజో విరాజితమైన దివ్యమూర్తిని తమ మనస్సులో నిలుపుకొని ఎల్లప్పుడు ఆనందిస్తూ ఉంటారు. నీ అనుగ్రహంవల్ల ప్రాప్తించిన పరమ జ్ఞానం పొందినందువల్ల వారికి ఆయాస మనేది ఉండదు.
ఓ సకల దేవతా చక్రవర్తీ! ఓ సచ్చిదానందమూర్తీ! నీ కీర్తి విశ్వమంతా కీర్తిస్తున్నది. నీ మూర్తి సమస్త జీవరాసులో వర్తిస్తున్నది. లోకాలను సృష్టించాలనే సంకల్పంతో సత్త్వరస్తమో గుణాలను ప్రస్ఫురింపజేసి, నీ దాసులైన మమ్ములను పుట్టించావు. పుట్టిస్తే పుట్టామే తప్ప గొప్పదైన నీసృష్టిని అనుసరించి లోకాలను సృష్టించటానికి మే మెంత వాళ్లం స్వామీ! నీ ప్రసాదంవల్ల కల్గిన శక్తియుక్తులతో నిన్ను పూజిస్తాము. అంతే. నీ అంశవల్ల పుట్టిన మమ్మల్ని ప్రత్యేకంగా గణించడం ఎందుకు? త్రిగుణాలకు అతీతుడవైన ఓ పరమాత్మా! అధ్యాత్మతత్త్వాని వన్ననూ, పరంజ్యోతి వన్ననూ, ప్రపంచాని వన్ననూ, అధిష్ఠాత వన్ననూ, సదాసాక్షి వన్ననూ, అన్నీ నీవే కదా తామర రేకులవటి కన్నులు కలదేవా! సత్త్వరజస్తమో గుణాలకు మూలమైన మాయాగుణంలో మహత్తత్త్వమైన నీ తేజస్సును ప్రవేశపెట్టిన నీవు నీ సృష్టికంతటికీ కారణమైనావు. నీ అంశలమైన మేము కాలానుసారంగా నీ కే విధంగా సంతోషాన్ని సమకూర్చుతాము? మా ఆహారం ఏమి? మేము ఏ విధంగా ప్రవర్తించాలి? మా స్థితి ఏమి? ఈ ప్రాణి లోకమే మాకు ఆధారం కాగా అనుభవాల్ని పొందుతూ నీ కార్యం నెరవేర్చాలని కుతూహలపడుతున్న మాకు మార్గాన్ని చూపించు. కరుణతో నీ శక్తిని ప్రసాదించి జగత్తును సృష్టించే శక్తిని కల్గించి రక్షించు. లక్ష్మీహృదయమనే నీటి పడియలో విహరించే మహా వరాహస్వామీ! మహాయోగుల మానస సరోవరాలలో సంచరించే మరాళరాజా! దేవాదిదేవా! నీకు నమస్కారం! నీకు నమస్కారం!!, నమస్కారం!!!”