పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శివుని కృష్ణస్తుతి (రక్షణ ప్రదం)

  1
“దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుం డవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును.

  2
వ్యయుండ; వనంతుండ; చ్యుతుండ;
వాదిమధ్యాంతశూన్యుండ; ఖిలధృతివి
నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి
నిఖిల మెల్లను నీ యంద నెగడుఁ గృష్ణ!"

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత శివుని కృష్ణస్తుతి (రక్షణ ప్రదం)