పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివుడు కృష్ణుని స్తుతించుట

  •  
  •  
  •  

10.2-441-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుండవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును.

టీకా:

దేవా = ప్రభూ; నీవు = నీవు; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపంబు = స్వరూపము; అగు = ఐన; జ్యోతిః = తేజస్సు; మయుండవు = స్వరూపముగా కలవాడవు; నిఖిల = సర్వ; వేద = వేదముల; వేదాంత = ఉపనిషత్తుల సారముల; నిగూఢుండవు = మరగున ఉండు వాడవు; నిర్మలుండవు = మాలిన్య రహితుడవు; సమాన = సమానమైన వారు కాని; అధిక = అధికమైన వారు కాని; రహితుండవు = లేనివాడవు; సర్వ = సర్వలోకము నందు; వ్యాపకుండవు = నిండి ఉండువాడవు; నిన్ను = నిన్ను; నిర్మల = రాగద్వేషాదులు లేని; అంతఃకరణులు = అంతరంగము కలవారు; ఐన = అయినట్టి; వారలు = వారు; ఆకాశంబు = ఆకాశము {ఆకాశము - అంతట నిండి ఉండి అన్నిటిని అంటియు అంటక ఉండునది ఆకాశము }; పగిదిని = వలె; అవలోకింతురు = చూతురు; అదియునున్ = అంతే; కాక = కాకుండా; పంచోపనిషన్మయంబు = పంచోపనిషన్మయము; అయిన = ఐన; భవదీయ = నీ యొక్క; దివ్య = అప్రాకృతమైన, దివ్యమైన; మంగళ = శుభస్వరూపమైన; మహావిగ్రహ = విరాడ్రూపము యొక్క; పరిగ్రహంబున్ = ధరించుట; చేయునెడ = చేయు నప్పుడు; నాభి = బొడ్డు; అందున్ = అందు; ఆకాశంబునున్ = ఆకాశము; ముఖంబునన్ = ముఖము నందు; కృశానుండును = అగ్ని {కృశానుడు - తన్నంటినవానిని కృశింపజేయు వాడు, అగ్ని}; శిరంబునన్ = తల యందు; స్వర్గంబునున్ = స్వర్గలోకము; శ్రోత్రంబులన్ = చెవుల యందు; దిశలునున్ = దిక్కులు; నేత్రంబులన్ = కన్ను లందు; సూర్యుండును = సూర్యుడు; మనంబునన్ = మనస్సు నందు; చంద్రుడును = చంద్రుడు; పాదంబులన్ = పాదముల యందు; వసుంధరయున్ = భూమండలము; ఆత్మ = ఆత్మ; అందున్ = అందు; అహంకారంబును = భూతాదియైన అహంకారం; జఠరంబునన్ = కడుపు నందు; జలధులునున్ = సముద్రములు; రేతంబునన్ = రేతస్సు; అందున్ = అందు; అంబువులును = నీరు; భుజంబులన్ = బాహువు లందు; ఇంద్రుండు = ఇంద్రుడు; రోమంబులన్ = మేని వెంట్రుక లందు; మహీరుహ = చెట్లు; ఓషధీ = పైరులు, మొక్కలు; వ్రాతంబును = సమూహములు; శిరోజంబులన్ = తల వెంట్రుకలు అందు; బ్రహ్మలును = బ్రహ్మదేవుడాది సృష్టికర్తలు; ఙ్ఞానంబునన్ = తెలివి అందు; సృష్టియు = సమస్తమైన సృష్టి; అవాంతర = సృష్టి లోపలి; ప్రజాపతులునున్ = ప్రజాపతులు; హృదయంబున్ = అంతఃకరణము నందు; ధర్మంబును = ధర్మము; కలిగి = కలిగి; మహాపురుషుండవు = పంచకర్తలను మీరిన వాడవు {పంచకర్తలు - బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అను ఐదుగురు పురుషులు (కారణభూతులు, కర్తలు)}; ఐ = అయ్యి; లోక = లోకములను; కల్పనంబు = సృష్టించుట; కొఱకు = కోసము; నీ = నీ యొక్క; అకుంఠిత = కొరతపడని; తేజంబున్ = తేజస్సును; గుప్తంబు = దాచినది; చేసి = చేసి; జగత్ = జగత్తు; ఉద్భవంబు = పుట్టుక; కొఱకు = కొరకు; కైకొన్న = గ్రహించిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారముల; వైభవంబున్ = విస్తృతిని; ఎఱింగి = తెలిసికొని; నుతింపన్ = స్తుతించుటకు; ఎంతవారము = ఏపాటివారము; నీవు = నీవు; సకల = సమస్తమైన; చేతనా = ప్రాణుల యొక్క; అచేతన = జడముల యొక్క; నిచయంబులు = సమూహములు; కున్ = కు; ఆద్యుండవు = మూలకారణుడవు; అద్వితీయుండవు = రెండవది లేనివాడవు; పురాణ = పంచకర్తలకు ముందు ఉన్న; పురుషుండవు = కర్తవు; సకల = సమస్తమైన; సృష్టి = సృష్టికి; హేతుభూతుండవు = కారణభూతుడవు; ఈశ్వరుండవు = నియామకుండవు; దినకరుండు = సూర్యుడు {దినకరుడు - పగలు కలిగించువాడు, సూర్యుడు}; కాదంబినీ = మేఘముల {కాదంబిని - కదంబ వృక్షములను పుష్పించుట కలిగి ఉండునది, మేఘము}; కదంబ = సమూహములచే; ఆవృతుండు = ఆవరింపబడినవాడు; అగుచున్ = ఔతు; భిన్న = వేరువేరు; రూపుండు = రూపములు కలవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; విధ = విధములైన; ఛాయలన్ = రంగులతో; తోచు = కనబడెడి; విధంబునన్ = విధముగా; నీ = నీ; అఘటిత = కూర్పరాని వాటిని; ఘటనా = కూర్పగల; నిర్వాహకంబు = సామర్థ్యము కలది; ఐన = అయిన; సంకల్పంబునన్ = సంకల్పము చేత; త్రిగుణా = త్రిగుణములకు {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; అతీతుండవు = మీరినవాడవు; అయ్యునున్ = అయినప్పటికి; సత్వాదిగుణ = త్రిగుణముల; వ్యవధానంబులు = భేదములచేత; అనేక = అనేకమైన; రూపుండవు = ఆకారములు కలవాడవు; ఐ = అయ్యి; గుణవంతులు = సజ్జనులు {గుణవంతులు - సుగుణములు (శమము దమము ఉపరతి తితిక్ష ఆది గుణములు) కలవారు, సజ్జనులు}; ఐన = అయిన; సత్పురుషుల = మంచివారి; కున్ = కి; తమః = తమోగుణమును; నివారకంబు = తొలగించునది; ఐన = అయిన; దీపంబు = దీపము; రూపంబునన్ = వలె; ప్రకాశించుచుందువు = ప్రకాశిస్తుంటావు; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; విమోహితులు = మోహమున పడినవారు; అయిన = ఐన; జీవులు = మానవులు; పుత్ర = సంతానము; దార = భార్య; గృహ = ఇండ్లు; క్షేత్ర = పొలము; ఆది = మున్నగు; సంసార = సంసారము అను; రూపకంబు = రూపము కలది; ఐన = అయిన; పాప = పాపముల; పారావార = సముద్రము నందలి; మహా = పెద్ద; ఆవర్త = సుడిగుండములు; గర్తంబులన్ = లోతులలో; మునుంగుచున్ = ములుగుచు; తేలుచున్ = తేలుతూ; ఉందురు = ఉంటారు; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; దివ్య = ప్రకృతి కతీతమైన; రూప = రూపమును; అనుభవంబున్ = సేవించుట; చేయంజాలక = చేయనేరక; ఇంద్రియ = ఇంద్రియములకు; పరతంత్రుడు = లోబడినవాడు; ఐ = అయ్యి; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అను; సరసీరుహంబులన్ = పద్మములను; చేరన్ = చేరుట; ఎఱుంగని = తెలిసికొనలేని; మూఢాత్మ = తెలివిమాలినవాడు; ఆత్మ = ఆత్మ; వంచకుడు = ద్రోహి; అనంబడు = అనబడును; విపరీత = నీకన్యమైన; బుద్ధిన్ = భక్తి; చేసి = వలన; ప్రియుండవు = మేలు చేయువాడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఒల్లక = అంగీకరించకుండా; ఇంద్రియార్థ = విషయములను; అనుభవంబున్ = అనుభవించుట; చేయుట = చేయుట; అమృతంబున్ = అమృతమును; మాని = వదలి; హాలాహలంబున్ = విషమును; సేవించుట = భుజించుట; కాదె = కాదా, అవును; జగత్ = భువనముల; ఉదయ = సృష్టి; పాలన = స్థితి; లయ = నాశము అను; లీలా = విలాసములకు; హేతుండవు = కారణభూతుడవు; ఐ = అయ్యి; శాంతుండవు = శుద్ధ సత్వవృత్తి కలవాడవు; అయి = అయ్యి; సుహృజ్జన = మంచి హృదయము కలవారు, మిత్రజనులు; భాగధేయుండవు = సౌభాగ్య స్వరూపుండవు; ఐ = అయ్యి; సమాన = సమానమైన; అధిక = అధికమైన; వస్తు = వస్తువులు; శూన్యుండవు = లేనివాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; నేను = నేను; అంచు = అంటు; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; పరిణత = పరిణితిచెందిన; అంతఃకరణులు = మనస్సు కలవారు; ఐన = అయిన; ముని = మునుల; గణంబులును = సమూహములు; భజియించుచున్ = కొలుచుచు; ఉందుము = ఉంటాము; మఱియును = ఇంకను.

భావము:

“దేవా! నీవు బ్రహ్మస్వరూపుడవు; జ్యోతిర్మయుడవు; సమస్త వేదవేదాంత నిగూఢుడవు; నిర్మలుడవు; నీతో సమానమైనవాడు అధికుడు మరొకడు లేడు; సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగ దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించు నపుడు; నాభి యందు ఆకాశాన్ని, ముఖంలో అగ్నినీ, శిరస్సున స్వర్గాన్నీ, చెవులలోదిక్కులనూ, నేత్రాలలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, పాదాలలో భూమినీ, ఆత్మలో అహంకారాన్నీ, కడుపులో సముద్రాలనూ, రేతస్సులో నీటినీ, భుజాలలో దేవేంద్రుణ్ణీ, వెంట్రుకలలో వృక్షౌషధీ విశేషాలనూ, శిరోజాలలో బ్రహ్మలనూ, జ్ఞానంలో సృష్టినీ ప్రజాపతులనూ, హృదయంలో ధర్మాన్నీ వహించిన మహా పురుషుడవు. అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్కల్యాణం నిమిత్తం అవతారం దాల్చావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యం అవుతుంది. నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు; అద్వితీయుడవు; పురాణపురుషుడవు; సూర్యుడు మేఘమాలచేత కప్పబడి భిన్నరూపాలతో కనిపించే విధంగా అఘటితఘటనాఘటన సమర్ధమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేక రూపాలతో గోచరిస్తుంటావు; సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగితేలుతూ ఉంటారు; నీ దివ్యరూపాన్ని దర్శించకుండా నీ పాదకమలపూజ చేయకుండా ఇంద్రియలోలుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనబడతాడు; నిన్ను ధ్యానించకుండా విపరీతబుద్ధితో ఇంద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం; సృష్టి స్థితి లయకారకుడవై శాంతుడవై, సజ్జన భాగధేయుడవై, అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాదిదేవతలూ మహామునీంద్రులూ నేనూ భజిస్తూ ఉంటాము. అంతేకాదు....