పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : తాపసోత్తముల కృష్ణ స్తుతి (శ్రేయస్కరం)

  1
అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబు లగు వాక్యంబులు విని; య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున క మ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, య ప్పుండురీకాక్షున కి ట్లనిరి “దేవా! నేమునుం దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢం బయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుత కర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్స్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబు నెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, య మ్మురాంతకుఁ జేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున.

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత తాపసోత్తముల కృష్ణ స్తుతి (శ్రేయస్కరం)