పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1122-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబు లగు వాక్యంబులు విని; య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున క మ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, య ప్పుండురీకాక్షున కి ట్లనిరి “దేవా! నేమునుం దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢం బయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుత కర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్స్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబు నెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, య మ్మురాంతకుఁ జేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున.

టీకా:

అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; కృష్ణుండు = కృష్ణుడు; ఆడిన = పలికినట్టి; సాభిప్రాయంబులు = అర్థవంతము లైనవి; అగు = ఐన; వాక్యంబులున్ = మాటలను; విని = విని; ఆ = ఆ; ముని = ఋషి; ఇంద్రులు = ఉత్తములు; విభ్రాంత = విస్మయముతో కూడిన; హృదయులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; ఊరకుండి = మౌనముగా ఉండి; ముహూర్త = కొద్ది సమయము; మాత్రంబునన్ = పాటున; కున్ = కు; ఆ = ఆ; మహాత్ము = గొప్పవాని; అనుగ్రహంబున్ = అనుగ్రహమును; పడసి = పొంది; మందస్మిత = చిరునవ్వులతో కూడిన; ముఖులు = ముఖములు కలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; కిన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = మాట్లాడిరి; దేవా = భగవంతుడా; నేమునున్ = మేమూ; తత్వ = తత్వమును; విదుత్ = తెలిసినవారిలో; ఉత్తములు = శ్రేష్ఠులు; అయిన = ఐనట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆదులునున్ = మొదలగువారును; భవదీయ = నీ యొక్క; మాయా = మాయ వలన; విమోహితులము = మిక్కిలి మోహము నొందిన వారము; ఐ = అయ్యి; ఉందుము = ఉంటాము; నిగూఢంబు = తెలియరానిది; అయిన = ఐనట్టి; నీ = నీ యొక్క; ఇచ్ఛ = తలపు; చేతన్ = చేత; మమ్మున్ = మమ్ములను; అనుగ్రహించితివి = మన్నించితివి; భవదీయ = నీ యొక్క; చరిత్రంబులు = వృత్తాంతములు; విచిత్రంబులు = అద్భుతంబులు; ఈ = ఈ; మేదినిన్ = భూమి {భూమి యొక్కటి - మన్ను ఒకటే ఐన కుండలు అనేకములు ఐనట్లు అను తత్వవిచారసూత్రము సూచన}; ఒక్కటి = ఒకటే; అయ్యునున్ = అయినప్పటికి; బహు = పెక్కు; రూపంబులన్ = రూపములతో; కానంబడు = కనబడెడి; విధంబునన్ = విధముగనే; నీవును = నీవు కూడ; మొదలన్ = ముఖ్యముగా; కారణ = మూలకారణభూత {మూల కారణభూతము - అవ్యక్త మహతత్తవాది కార్యములకు కారణమైన పరబ్రహ్మము సూచన}; రూపంబునన్ = రూపముతో; ఏకము = అద్వితీయము {ఏకము - సజాతీయ విజాతీయ స్వ పర భేదరహితమైనది, రెండవది లేనిది, అద్వితీయము}; అయ్యునున్ = అయినప్పటికిని {ఏకానైకము - శ్రు. ఏకోదేవా బహుధాని విష్టః.}; అనేక = పెక్కు; రూపంబులున్ = స్వరూపములను; కైకొని = చేపట్టి; జగత్ = భువనములకు; ఉత్పత్తి = సృష్టి, బ్రహ్మ; స్థితి = స్థితి, విష్ణు; లయంబుల్ = లయముల, మహేశ్వర; కున్ = కు; హేతుభూతంబున్ = కారణభూతమైనది; నాన్ = అనగా ప్రసిద్ధమై; అద్భుత = అద్భుతమైన; కర్మంబులన్ = కార్యము లందు; తగిలి = లగ్నమై; లీలా = విలాస; అవతారంబులున్ = అవతారములను; కైకొని = గ్రహించి; దుష్ట = దుర్మార్గులైన; జన = వారి; నిగ్రహంబును = శిక్షించుట; శిష్ట = మంచి; జన = వారిని; రక్షణంబునున్ = కాపాడుట; కావించుచుందువు = చేస్తుంటావు; అదియునున్ = అంతే; కాక = కాకుండా; వర్ణ = చాతుర్వర్ణ {చతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర}; ఆశ్రమ = చతురాశ్రమ {చతురాశ్రములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్థము 3వానప్రస్థము 4సన్యాసము}; ధర్మంబులున్ = ధర్మములను; అంగీకరించి = చేపట్టి; పురుష = మానవ; రూపంబునన్ = రూపములతో; వేద = వేదము లందు చెప్పబడిన; మార్గంబున్ = ధర్మమార్గములు; విదితంబు = తెలియబరచుట; చేసిన = చేసినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపివి = స్వరూపమవు; తపస్ = తపస్సులు; స్వాధ్యాయ = వేదాధ్యయనములు; నియమంబులు = వ్రతములు; చేతన్ = చేత; ఈ = ఈ యొక్క; హృదయంబున్ = హృదయము; పరిశుద్ధంబున్ = నిర్మలములు; కావునన్ = కాబట్టి; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపంబులు = ఆకారములు; ఐన = అయినట్టి; వేదంబుల్ = వేదముల; అందున్ = లో; వ్యక్తావ్యకత = తెలిసీ తెలియని; స్వరూపంబులన్ = రూపములలో; ఏర్పడగన్ = తోచుచు; ఉందువు = ఉంటావు; కావునన్ = కాబట్టి; బ్రాహ్మణ = బ్రాహ్మణ; కులంబున్ = వర్ణస్థులను; ఎల్లన్ = అందరిని; బ్రహ్మకుల = బ్రాహ్మణ కులమునకు; అగ్రణివి = ముఖ్యుడవు; ఐ = అయ్యి; రక్షించిన = కాపాడిన; మహానుభావుండవు = గొప్ప మహిమ కలవాడవు; మాయా = మాయ (ప్రకృతి) అను; జవనికాంతరితుండవు = తెర వెనుక సూత్రధారివి {జవని కాంతరితుండవు – తెర వెనుక నుండి ఆడించెడి వాడు}; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఈ = ఈ; భూపాల = రాజుల; వర్గంబునున్ = సమూహమును; నేమునున్ = మేము; దర్శింపంగంటిమి = చూడగలిగితిమి; మా = మా యొక్క; జన్మ = పుట్టుక; విద్యా = విద్యలు; తపః = తపస్సులు; మహిమలున్ = సామర్థ్యములు; సఫలంబులు = ధన్యమును; అయ్యెన్ = అయినవి; నీకున్ = నీకు; నమస్కరించెదము = నమస్కరింతుము; అని = అని; బహు = పెక్కు; విధంబులన్ = రకములుగా; కృష్ణున్ = కృష్ణుని; అభినందించి = శ్లాఘించి; ఆ = ఆ దివ్యమైన; మురాంతకున్ = కృష్ణుని; చేతన్ = వలన; ఆమంత్రణంబు = అనుజ్ఞ; పడసి = పొంది; తమతమ = వారివారి; నివాసంబుల్ = గృహముల; కున్ = కు; పోవన్ = వెళ్ళిపోవలెను అని; తలంచున్ = అనుకొనెడి; అవసరంబునన్ = సమయము నందు.

భావము:

ఈలాగున, శ్రీకృష్ణుడు భావగర్భితంగా పలికిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై, క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది, చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు. “దేవా! మేము, ఉత్తమ తత్వవేత్త లైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయ్యూ అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుతకార్యాన్ని చేపట్టి, లీలావతారాలు ఎత్తి, దుష్టజనశిక్షణం శిష్టజనరక్షణం చేస్తూ ఉంటావు. అంతే కాకుండా, నీవు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించి విరాట్పురుషరూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్స్వాధ్యాయ నియమాల చేత పరిశుద్ధం అయినది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే, బ్రాహ్మణకులాన్నిరక్షించిన బ్రహ్మణ్యమూర్తివి; మహానుభావుడవు; మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకమూ మేమూ దర్శించ గలిగాము; మా జన్మమూ, మా విద్యా, మా తపోమహిమా సార్ధకమయ్యాయి; నీకు నమస్కరిస్తున్నాము.” అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమతమ నివాసాలకు బయలుదేరు సమయంలో.