పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణీ గ్రహణంబు

71

కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ, యాదవవాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి చనియె; నంత జరాసంధవశు లైన రాజు లందఱు హరిపరాక్రమంబు విని సహింప నోపక.

భావము:- అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.

72

" సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
నుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ స్త్రాస్తముల్ గాల్పనే?
నుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్."

భావము:- "గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నారు. రాకుమారిని విడిపించ లేకపోతే మన పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. లోకులు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.

73

అని యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదువీరుల వెంటనంటఁ దాఁకి, "నిలునిలు"మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిలధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడి; రప్పుడు.

భావము:- అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, జరాసంధుడు మొదలైనవారు ఒకరినొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు, పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు.

74

రిబల భట సాయకముల
రిబలములు గప్పఁబడిన డరెడు భీతిన్
రిమధ్య సిగ్గుతోడను
రివదనముఁ జూచెఁ జకితరిణేక్షణయై.

భావము:- ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని కృష్ణుని ముఖం వైపు చూసింది.

75
ఇట్లు చూచిన.

భావము:- ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా, అతడు ఇలా చెప్పసాగాడు. .

76

"వచ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేఁడు చూడు లజాతాక్షీ!"

భావము:- ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరౌతారు, చచ్చిపోతారు చూస్తుండు.” అని ఊరడించసాగాడు.

77

అని రుక్మిణీదేవిని హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథిరాజచక్రంబు మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ, నారాచ, భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.

భావము:- ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుఱ్ఱాలు చెల్లాచెదు రయ్యాయి. రథాలు ముక్క లయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుఱ్ఱాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుఱ్ఱాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగుగుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుఱ్ఱాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతళాల కలకల ధ్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు తుళ్ళుతున్నాయి, మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.