పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ గ్రహణంబు

  •  
  •  
  •  

10.1-1757-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని రుక్మిణీదేవిని హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథిరాజచక్రంబు మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ, నారాచ, భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.

టీకా:

అని = అని; రుక్మిణీదేవిని = రుక్మిణీదేవిని; హరి = కృష్ణుడు; ఊరడించెను = విచారము తగ్గించెను; బలభద్ర = బలరాముడు; ప్రముఖులు = మొదలగువారు; ఐన = అయినట్టి; యదు = యాదవ; వీరులు = శూరులు; ప్రళయవేళ = ప్రళయకాలమునందు; మిన్నునన్ = ఆకాశము నందు; పన్ని = కమ్మి; బలు = బలమైన; పిడుగులన్ = పిడుగులను; అడరించు = వ్యాపింపజేసెడి; పెను = గొప్ప; మొగుళ్ళ = మేఘముల; వడువునన్ = వలె; జరాసంధ = జరాసంధుడు; ఆది = మున్నగు; పరిపంథి = శత్రు; రాజ = రాజుల; చక్రంబు = సమూహము, వ్యూహము; మీదన్ = పైన; అవక్ర = తిరుగులేని; పరాక్రమంబునన్ = శౌర్యముతో; శిఖి = అగ్ని; శిఖా = జ్వాలలతో; సంకాశ = సమానమైన; నిశిత = వాడియైన; శిలీముఖ = ఉక్కు అలుగు బాణము {శిలీముఖము - శల్యము (ముల్లు) కొనయందు కలది, ఇనప ముల్లు బాణము}; నారాచ = ఇనుప బాణము {నారసము లేదా నారాచము అనగా అమ్ము, బాణము. అచ్చ యినుప బాణము, కృష్ణలోహ బాణము. నల్లని ఇనుప అమ్ము, నరుల ప్రాణములను హరించును కనుక నారసము}; భల్ల = భల్లములు, వెడల్పైన ముల్లు కలవి; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; బహు = పెక్కు; విధ = విధములైన; బాణ = బాణముల; పరంపరలు = వరుసలను; కురియన్ = జల్లులా వేయగా; అదియును = ఆ శత్రుసేన; విదళిత = నరకబడిన; మత్త = మదపు; మాతంగంబును = ఏనుగులు కలది; విచ్ఛిన్న = మిక్కిలి ఛేదింపబడిన; తురంగంబును = గుఱ్ఱములు కలది; విభిన్న = విరగగొట్టబడిన; రథ = తేరుల యొక్క; వరూధంబును = పైకప్పులు కలది; వినిహత = చంపబడిన; పదాతి = కాల్బలముల; యూధంబును = సమూహము కలది; విఖండిత = నరకబడిన; వాహ = గుఱ్ఱములను; వారణ = ఏనుగులను; రథా = రథములను; ఆరోహణ = ఎక్కిన యోధుల; మస్తకంబును = తలలు కలది; విశకలిత = విచ్ఛేదము చేయబడిన; వక్షః = వక్షస్థలములు; మధ్య = నడుములు; కర్ణ = చెవులు; కంఠ = మెడలు; కపోల = చెక్కిళ్ళు; హస్తంబునున్ = చేతులు కలది; విస్ఫోటిత = పగులగొట్టబడిన; కపాలంబును = తల (పుఱ్ఱె)లు కలది; వికీర్ణ = చెదిరిన; కేశ = తలవెంట్రుకల; జాలంబును = సమూహములు కలది; విపాటిత = విరగగొట్టబడిన; చరణ = పాదములు; జాను = మోకాళ్ళు; జంఘంబునున్ = పిక్కలు కలది; విదళిత = రాలగొట్టబడిన; దంత = దంతముల; సంఘంబును = సమూహము కలది; విఘటిత = విదలగొట్టబడిన; వీర = వీరుల యొక్క; మంజీర = కాలి అందెలు; కేయూరంబును = భుజకీర్తులు కలది; విభ్రష్ట = మిక్కిలి జారిపోయిన; కుండల = చెవికమ్మలు; కిరీట = కిరీటములు; హారంబునున్ = మెడలోని దండలు; విశ్రుత = వినబడిన; వీరాలాపంబును = బింకపు మాటలు కలది; విదార్యమాణ = చెక్కులెగయబడిన; గదా = గదలు; కుంత = ఈటెలు; తోమర = చిల్లకోలు, సర్వలలు, అయిదారు తాళ్ళు కలిగిన కొరడా; పరశు = గండ్రగొడ్డళ్ళు; పట్టిస = పట్టాకత్తులు; ప్రాస = బల్లెములు; కరవాల = కత్తులు; శూల = శూలములు; చక్ర = చక్రాయుధములు; చాపంబును = విల్లులు కలది; వినిపాతిత = కూలగొట్టబడిన; కేతన = టెక్కెములు, జండాలు; చామర = వింజామరలు; ఛత్రంబును = గొడుగులు కలది; విలూన = చీల్చివేయబడిన; తనుత్రాణంబునున్ = కవచములు కలది; వికీర్యమాణ = చెల్లాచెదురు అగుచున్న; ఘోటక = గుఱ్ఱముల {ఘోటకము - భూమి యందు పొరలునది, గుఱ్ఱము}; సంఘ = సమూహముల యొక్క; రింఖా = గిట్టలచే; సముద్ధూత = రేగగొట్టబడిన; ధరణీపరాగంబును = దుమ్ము కలది; వినష్ట = చెడగొట్టబడిన; రథ = తేరుల యొక్క; వేగంబును = వేగము కలది; వినివారిత = నివారింపబడిన; సూత = కీర్తించువారి; మాగధ = ప్రతాపము వర్ణించువారి; వంది = స్తోత్రములు చేయువారి; వాదంబును = పఠించుటలు కలది; వికుంఠిత = మొక్కపోని, తక్కువపడని; హయ = గుఱ్ఱముల; హేషా = సకిలింతలు; పటహ = డప్పు వాయిద్యముల; భాంకార = భాం అనుటలు; కరణి = ఏనుగు; ఘటా = గుంపుల యొక్క; ఘీంకార = గీకలనెడి అరుపులు; రథ = రథముల; నేమి = చక్రముల కమ్ముల; పటాత్కార = పటపట అనుటలు; తురగ = గుఱ్ఱముల; నాభి = బొడ్డు సమీపమున కట్టిన; ఘంటా = గంటల యొక్క; ఘణఘణాత్కార = గణగణ అనుటలు; వీర = యోధుల యొక్క; హుంకార = హుం అనుటలు; భూషణ = ఆభరణముల యొక్క; ఝణఝణత్కార = ఝణఝణ అనుటలు; నిస్సాణ = ఢంకాల యొక్క; ధణధణాత్కార = ధణధణ అనుటలు; మణి = రత్నాల; నూపుర = అందెల; క్రేంకార = క్రేం అనుటలు; కింకిణీ = గజ్జల, చిరుగంటల; కిణకిణత్కార = కిణకిణ అనుటలు; శింజనీ = వింటినారుల యొక్క; టంకార = టం అనుటలు; భట = సైనికులు; పరస్పర = ఒకినొకరు; ధిక్కార = ధిక్కరించుకొనెడి; నాదంబును = ధ్వనులు కలది; వినిర్భిద్యమాన = మిక్కిలి భేదింపబడుతున్న; రాజ = రాజుల యొక్క; సమూహంబును = గుంపులు కలది; విద్యమాన = తెలియబడుతున్న; రక్త = రక్తపు; ప్రవాహంబును = కాలువలు కలది; విశ్రూయమాణ = వినబడుతున్న; భూత = భూతముల యొక్క {భూతము - పిశాచ భేదము}; బేతాళ = బేతాళముల యొక్క {బేతాళము - పిశాచ భేదము}; కలకలంబును = కలకల ధ్వనులు కలది; విజృంభమాణ = చెలరేగుతున్న; ఫేరవ = నక్కలు; కాక = కాకులు; కంక = రాపులుగు, బోరువ; ఆది = మున్నగునవి; సంకులంబును = వ్యాపించినది; ప్రచలిత = మిక్కిలి కదులుతున్న; కబంధంబును = తుళ్ళుతుండెడి తలలేని మొండెములు కలది; ప్రభూత = పుట్టుచున్న; పలల = మాంసము యొక్క; గంధంబును = వాసన కలది; ప్రదీపిత = ప్రకాశింపజేయబడిన; మేదః = మెదడు; మాంస = మాంసము; రుధిర = రక్తముల; ఖాదనంబును = తినుటలు కలది; ప్రవర్తిత = నడపబడుతున్న; డాకినీ = డాకినుల {డాకిని - పిశాచ భేదము}; ప్రమోదంబునున్ = సంతోషములు కలది; అయి = అయ్యి; ఉండె = ఉండెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుఱ్ఱాలు చెల్లాచెదు రయ్యాయి. రథాలు ముక్క లయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుఱ్ఱాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుఱ్ఱాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగుగుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుఱ్ఱాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతళాల కలకల ధ్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు తుళ్ళుతున్నాయి, మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.