పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : కృష్ణ దండకము - కళాపూర్ణోదయము (184)

దండకము:-
శ్రీ కామినీకామితాకార! సాకారకారుణ్య ధారానవాంకూర శంకాకరా! శోణ రేఖామయూఖాళీ కిమ్మీరితాలోకనాలోకలోకైక సంస్తుత్యనిత్యప్రభావా! విభావైభవాధిక్య ధిక్కారితానంతమార్తండ కోటీర! యాటీకమానామలా స్తంభశుంభద్యశః పూర కర్పూర సౌరభ్యమైత్రీ! పవిత్రీకృ తామ్నాయ వాయు ప్రచారానిశాపాదితాపార సంసారసంతాపనిర్వాపణా! పాపనిర్వాపణోపాయనామ ప్రశంసానుభావా! భవాభావలోభాకులీభూత చేతస్సుధీవ్రాతనిర్ణీత సంప్రాప్తసద్భక్తి మార్గైకవిశ్రామ భూమీభవత్తత్త్వరూపా! సురూపావళీదుర్నిరూపస్వరూపా! గురూపాసనాసాదితానారతానన్య సాంకర్యకైంకర్యమాధుర్యధుర్యప్రసన్నా! ప్రసన్నావళీమానసోదస్త భోగాపవర్తాభిలాషా! హృషీకేశ! యీశానవాణీశముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీదివ్యచారిత్ర చారుప్రచారంబు పారంబుముట్టన్ నుతింపంగలేరంచు నెంచంగ వించుం ప్రపంచస్వభావంబు భావంబునన్ మానకిట్టేము నీముందటన్ జాటువాచాటతల్ చూపుచున్నార మిన్నేరముల్ మన్ననన్ చేసి సైరించు మో వాసుదేవా! సదానంద! గోవింద! సేవించు మావింద వై డెంద మానంద మొందింప నెందున్ విచారంబు లేమిన్ వచోగోచరాగోచరత్వంబు లూహింపలే మైతి, మో దేవ! మీపాదసేవాదరంబున్ మదింగోరుచున్; వేదవాదుల్, శమాదుల్ కడుం జాల నార్జించి; భోగేచ్ఛ వర్జించి; నానాతపశ్చర్య, తాత్పర్య, పర్యాకులత్వంబునం గైకొనన్ మాకు నేయత్నముల్ లేక, యో కృష్ణ! యీ కైవడిన్ మీకృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్; బుద్ధిఁ దర్కింప నత్యంత చిత్రంబుగాదే, జగన్నాథ! యీరీతిఁ జెన్నార మున్నేఋషుల్ మిమ్ముఁ గన్నారఁ గన్నారు? మాకన్ను లెన్నంగ నేపుణ్యముల్ చేసెనో? యీవిశేషంబుఁ గాంచెన్, విరించోదయస్థాననాభీసరోజా! సరోజాతజాతాండముల్ తండతండబులై యుండ నొండొండు నీరోమకూపంబు లేపారఁగాఁ దాల్చుటల్; చెప్పఁగా నీవు గోవర్ధనం బెత్తి తంచున్; వరాహావతారంబునన్ ధారుణీచక్రముం దాల్చి తంచున్; మహాకూర్మభావంబునన్ మందరగ్రావమున్ మోచి తంచున్; జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమప్రక్రియావేళఁ బాదత్రయిం జాలఁ బూరించి తంచున్; నుతింపంగ యుక్తంబె? భక్తప్రజాధీన! దీనిన్ వివేకించి లోకంబులోఁ గొంద ఱార్యోత్తముల్ సర్వవేదంబులున్, సర్వవాదంబులున్, సర్వయాగంబులున్, సర్వయోగంబులున్, సర్వమౌనంబులున్, సర్వదానంబులుం; జూడ నీదాసదాసానుదాసాంఘ్రిసంసేవలోఁ; గోటికోట్యంశముం బోలఁగాఁ జాల వంచుం; దదాచారాముం బూని వర్తింతు రత్యున్నతిన్, సర్వసంకల్పనిత్యోదయా! యేము నీనామమాత్రంబు మానాలుకం జేర్చుటల్ దక్క; నొక్కింతయున్ దక్కు త్రోవల్ భవన్మాయ దాఁటంగ లే, మవ్యయా! భవ్యయోగీంద్రసాంద్రదరా! కాంక్షితైకాంతసంసేవనా! భావనాతీతకల్యాణనానాగుణశ్రీసముద్భాసితాంగా! మముం గేవలంబైన కారుణ్యదృష్టిం గటాక్షించి రక్షించు, లక్ష్మీమనోవల్లభా! దేవదేవా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః!!-x-