పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : రెండవ అధ్యాయాము

శ్రీమద్భాగవతమాహాత్మ్యము

రెండవ అధ్యాయము

నారదుఁ డిట్లనియె_:-   "బాలా! నీ వూరక ఖేదపడెద వేల? ఇంత చింతాతురవు కా నేల? శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములఁ జింతన మొనరింపుము. ఆ ప్రభుని కృపచే నీ దుఃఖ మంతయు దూరముగ పోఁగలదు. కౌరవుల యత్యాచారము నుండి ద్రౌపదినిఁ గాపాడినవాఁడు, గోపసుందరుల ననాథల జలిపి (చలుపు అంటే అనుగమించు) యేలినవాఁడు నగు నా శ్రీకృష్ణుఁ డిప్పు డెక్కడకుఁ బోయినాఁడు? మఱి నీవో భక్తివి. ఆ విభునకు సదా ప్రాణముకంటెఁ బ్రియమైనదానవు. నీవు పిలచితివేని వెంటనే నీచజనుల కొంపలకైనను తాను బరుగెత్తి వచ్చును. సత్యము, త్రేత, ద్వాపర మను నీ మూఁడు యుగము లందు; జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనము లయి యుండెను; కాని యీ కలియుగ మందన్ననో, కేవలము భక్తియే సాధనము. అది బ్రహ్మసాయుజ్య (మోక్ష) మును బ్రాపింపఁ జేయును. ఈ ప్రకారము యోజించియే పరమానంద స్పూర్తి, జ్ఞానస్వరూపి, శ్రీహరి సత్స్వరూపముతో నిన్ను సృజించెను. నీవు శ్రీకృష్ణచంద్రునకు సాక్షాత్తు ప్రియురాలవు. పరమసుందరివి. నీ వొకప్పుడు జేతులు జోడించి ”నేనేమి చేయుదు” నని యడుగ భగవానుఁడు “నా భక్తులఁ బోషణము చేయు” మని యానతిచ్చి యుండెను. నీవు భగవంతుని యాజ్ఞను స్వీకరించి యుంటివి. అందుచే నీపై శ్రీహరి ప్రసన్నుఁ డయి, నీ సేవచేయుటకు ముక్తిని నీకు దాసిగను, జ్ఞాన వైరాగ్యులను బుత్రులుగను బ్రసాదించి యుండెను. నీవు నీ సాక్షాత్స్వరూపముతో శ్రీవైకుంఠధామమున భక్తుల పోషణము చేయుచుందువు; భూలోక మందో, నీవు వారి పుష్టికయి కేవలము ఛాయా రూపమును ధరించి యున్నావు.

అప్పుడు నీవు ముక్తి, జ్ఞాన, వైరాగ్యులను వెంట నిడుకొని పృథివీతలమున కేతెంచి, సత్యయుగము నుండి ద్వాపరము వఱకు మిగుల నానందముతో నుంటివి. కలియుగము నందు నీ దాసి ముక్తి పాషండ రూప వ్యాధులచేఁ బీడింపఁబడి. క్షీణించిపోఁజాగెను. ఆ కారణమున నది వెంటనే నీ యాజ్ఞచే వైకుంఠమునకు వెడలిపోయెను. ఈ లోక మందు నీ స్మరణ చేసినంతనె యది వచ్చును. మరల వైకుంఠమునకుఁ బోవుచుండును. కాని యీ జ్ఞానవైరాగ్యులను నీవు పుత్రులనుగ నెంచి, నీ యొద్దనే యుంచుకొంటివి, వెండియుఁ గలియుగమున నెల్లరు వీరి నుపేక్షించుటచే నీ పుత్రులగు వీరిట్టు లుత్సాహ హీనులయి వృద్ధు లయిపోయిరి. అయినను, నీవు చింతిల్లకుము, వీరి నుద్దరించుట కుపాయ మాలోచించుచున్నాను; సుముఖి! కలియుగమునకు సాటియైన యుగమే లేదు; ఈ యుగమున నేను నిన్ను యింటింటను ప్రతి పురుషుని హృదయము నందును స్థాపించెదను గాక. చూడు! మితర ధర్మముల నన్నిటిని ద్రోసిరాజని, నిన్ను బ్రచారమునకుఁ దేకుండితనేని, నేను శ్రీహరికి దాసుఁడనే కాను. కలియుగమున నే జీవిపై నీ కృప కలిగెనో, వాఁడెంతటి మహాపాపియే కాని, జంకుకొంకులేక శ్రీకృష్ణ భగవానుని యభయ ధామమునకు వేంచేయును. ఎవని హృదయమునఁ బ్రేమరూపిణి యగు భక్తి నివాసము చేయునో, యా పవిత్రమూర్తి స్వప్న మందును యముని ముఖమును జూడఁడు. ఎవని హృదయసీమ భక్తిరాణి నివాసము చేయుచుండునో, వానిని ప్రేత, పిశాచ, రాక్షస, ద్వైతులు మున్నగువారు స్పర్శచేయుటకును సాహసింపఁజాలరు. భగవానుఁడు తపము, వేదాధ్యయనము. జ్ఞానము, కర్మము మున్నగు నే సాధనములకును వశపడఁడు. కేవలము భక్తిచేతనే వశీభూతుఁ డగును. దీనికి గోపికామతల్లులే ప్రమాణము. మనుష్యుల కనేక జన్మములం దార్జించిన పుణ్యవిశేషముననే భక్తియం దనురాగము కలుగును. కలియుగ మందన్ననో, భక్తియే సారమయినది. భక్తిచేతనే సాక్షాత్తు శ్రీకృష్ణచంద్రుఁడు సాన్నిధ్యము ననుగ్రహించును. భక్తికి ద్రోహ మెంచువారు ముజ్జగములం దెందును శాంతిని బడయఁ జాలరు; పూర్వకాలమున భక్తుని తిరస్కరించి దుర్వాసుఁ డను ఋషి యెంతటి కష్టములపాలు కావలసి వచ్చెనో, చూడుము. వ్రతములు, తీర్థములు, యజ్ఞములు, జ్ఞానచర్చలు మున్నగు వేల సాధనములతో నేమిపని, ముక్తియో కేవలము భక్తిచేతనే లభింపగలదు.”

సూతుఁడు_:-   "ఈ ప్రకారము శ్రీనారదులు నిర్ణయము చేసిన తన మాహాత్మ్యమును విని భక్తి కంగములన్నియుఁ బుష్టి వహించెను. వాని యందు బలము వచ్చెను. అంత భక్తి యిట్లని చెప్పఁ దొడఁగెను.

“నారద మునిపుంగవా? నీవు ధన్యుఁడవు, నీకు నా యెడ నిశ్చల మగు ప్రీతి కలదు. నేను సదా నీ హృదయమున నుందును. ఎప్పుడును విడిచిపోవను. సాధూ! నీవు మిగులఁ గృపాలుఁడవు. ఒక క్షణములో నా దుఃఖము నంతయు దూర మొనరించితివి. కాని యింకను నా పుత్రులకు స్పృహ రాలేదు. దయయుంచి వీరికిని శీఘ్రముగాఁ దెలివి వచ్చు మార్గమును జూడుము.”

సూతుఁడిట్లనెను.   “భక్తియాడిన యీ వచనములను విని నారదునకు మిగుల జాలిపొడమెను. వారిని తన చేతులలో నటు నిటు పొరలించి తట్టి, మేలుకొనఁజేయఁ జూచెను. మఱియు వారి చెవులకడ నోరుపెట్టి “ఓ జ్ఞానదేవా! లే, త్వరగా లెమ్ము. ఓ వైరాగ్యమూర్తీ! లెమ్ము. వేగమే, లెండు యని బిగ్గరగా నఱచెను. మఱి మఱి వేదధ్వని, వేదాంతఘోష గీతాపాఠము లొనరించెను. వారిని మేల్కొలుపఁ నెంతో కష్టపడెను. వారెట్లెట్లో బలవంతముగా లేచిరి. కాని యలసత కతమున వారిరువు రావులించుచు, గనులఱెప్పలు విచ్చి చూడఁజాలక మరలఁ బరుండిరి. వారి వెండ్రుకలు, కొంగ ఱెక్కలవలెఁ దెల్లనయ్యెను. వారి యంగములు శుష్కకాష్ఠమున (పనికిరాని కఱ్ఱ) కు సమానముగాఁ నిస్తేజము లయి కొఱడువాఱిపోయెను. ఈ ప్రకార మాఁకలిదప్పులచే నత్యంత దుర్బలు లయిన కారణమున వారలు మరల పండుకొని నిద్దురపోవుటఁ గాంచి నారదుఁడు చాల విచారమును నొంది “నేనిఁక నేమి చేయుదును? వీరి యీ నిద్ర, దానిని మించిన వీరి వృద్ధాప్యము నెట్లు పోఁగొట్టవచ్చును? అని యోచనా పరంపరలలో మునిఁగి పోయెను”. ఈ సమయమున నాకాశవాణి "మునీంద్రా! భేదపడకుము. నీ ప్రయత్నము నిస్సందేహముగా సఫలము కాఁగలదు. దేవర్షి! దీనికై నీవొక సత్కర్మ మొనరింపుము. ఆ కర్మమును సంతశిరోమణులు తెలుపఁగలరు. ఆ సత్కార్యము ననుష్ఠించినంతనే చిటికెలో వీరి నిద్ర యీ వృద్ధావస్థ తొలఁగి పోవును. అంత సర్వత్ర భక్తిప్రసారము కాఁగలదు.” అని చెప్పెను. ఆ యాకాశవాణి యక్కడ నున్న వారి కందఱకును స్పష్టముగా వినిపించెను. దీనిచే నారదునకు పరమ విస్మయము కలిగి “దీని యభిప్రాయమేమో నా మనస్సునకు రాలేదే” యని తనలో నిట్లని యోజింపఁ బూనెను. ఈ యాకాశవాణి చాఁటున నుండి యేమేమో పలికినది. నా ప్రయత్న మెద్దాన సిద్ధించునో యా సాధనమును దెలుపదాయెను. ఆ సంత మహాత్ము లెందు లభింపఁగలరు? ఏవిధముగ నా సాధనమును దెలిపెదరు? నాకేమియుఁ దోఁచకున్నది. ఇప్పు డాకాశవాణి చెప్పిన ప్రకారము నేనేమి చేయవలెను?”

సూతుఁడు _:- “ నారదుఁ డిట్లు చింతించి భక్తిని జ్ఞాన వైరాగ్యు లిద్దర నంద విడిచి, తా నక్కడనుండి వెడలిపోయెను. తీర్ధము లన్నియుఁ దిరిగెను. దారిలోఁ గనవచ్చిన మునుల నెల్ల నీ సాధనమును గుఱించి యడిగెను. ఆ నారదుని మాటల నెల్ల వారు విన్నవారే కాని, యెవరు కాని యా విషయము నిదమిత్థమని నిశ్చయించి చెప్పినవారు కానరారైరి. అసాధ్యమని కొంద ఱనిరి. కొందఱు దీని వాస్తవ మెఱుఁగుట కఠిన మనిరి. కొందఱు కిమ్మనకుండిరి. తెలియ దనిన నవమానమని భయపడి కొందఱు యేదియో సాకు చెప్పి తప్పించుకొని పోయిరి. మూఁడు లోకము లందును మిగుల విస్మయజనక మగు హాహాకారము ప్రబలిపోయెను. ఎల్లరును గుజగుజలు పోఁజాగిరి. అన్నా! వేదధ్వని, వేదాంతఘోష, ముహుర్ముహుద్గీతా పాఠమున భక్తి, జ్ఞాన, వైరాగ్యముల కుద్బోధనము కలుగదేని, యిఁక వేఱుపాయ మేది యుండఁగలదు. బళా! యోగిరాజు నారదుల వారికే దానిజాడ తెలియనిచో, పామరు లగు సంసారి జడులేమి తెలియఁగలరు? ఈ ప్రకార మే యే ఋషులతో నీ విషయమును గుఱించి ముచ్చటించిరో వారెల్లరు నిర్ణయించి “యీ విషయము దుస్సాధ్యమే” యని చెప్పిరి. అంత నారదుఁడు దురంతచింతాతురుం డయి, దీని కొఱకేను దపము చేసెదఁ గాక యని నిశ్చయము చేసికొని బదరికావనమున కేగెను. అచటకుఁ జేరినంతనే తన సమీపమునఁ గోటిసూర్యులతో సాటియైన తేజస్సు గల సనకాది మునీశ్వరుల దివ్య దర్శనము లభించెను. వారిని జూచి మునిశ్రేష్ఠుఁ డగు నారదుఁ డిట్లని విన్నవించెను.

నారదుఁడు _:- “ మహాత్ములారా! తమ సమాగమము లభించిన ఈ క్షణ మెంతో సౌభాగ్యవంత మయినది. తాము నాయందు దయయుంచి శీఘ్రమే యా సాధనమును ప్రసాదింపుఁడు. తా మెల్లరు మహాయోగులరు. బుద్ధిమంతులరు, విద్వాంసులరు, చూచుటకుఁ దా మైదేడుల బాలకులవలెఁ గానిపించెదరు. కాని, పూర్వజులకును తాము పూర్వజులరు. మరీచి మున్నగు ప్రజాపతులును వయస్సునఁ దమకంటెఁ చిన్నవారు. తాము సదా శ్రీవైకుంఠధామమున వేంచేసి యుందురు. నిరంతరము హరికీర్తనమునఁ దత్పరులయి యుందురు. భగవల్లీలామృత రసాస్వాదన మొనరించి సదా యున్మత్తులవలె నుందురు. భగవచ్చర్చయే తమకుఁ బ్రధాన మగు జీవనాధారము. తమ శ్రీముఖమున సర్వదా ”హరిశ్శరణం” (భగవానుఁడే మాకు రక్షకుఁడు) అను వాక్య (మంత్ర) మే యుండును. ఈ కారణమునఁ గాలప్రేరిత మగు వృద్ధావస్థ యొక్క వప్పు (వ్యధ) మీ యం దుండదు కదా. పూర్వకాలమున మీ బొమముడి మాత్రముననే భగవంతుఁ డగు శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకు లయిన జయవిజయులు త్క్షణము పుడమిబడి, మరల మీ యనుగ్రహమునచే శ్రీవైకుంఠ లోకమునకుఁ బోవఁజాలిరి. ఈ సమయమునఁ దమ దర్శనము మహత్తర సౌభాగ్యమునఁ బ్రాప్తించినది. నేను బరమదీనుఁడను. తాము స్వభావ సిద్ధముగనే దయాళురు. కాన నా యెడల నవశ్యము కృపచేయవలెను. అనుగ్రహింపుఁడు. ఆకాశవాణి తెలిపిన విషయ మెయ్యది? ఆ సాధన మె ట్లనుష్ఠించవలెను? తాము దానిని గురించి విస్తరించి తెలుపుఁడు. భక్తి జ్ఞాన వైరాగ్యులకు సుఖమెట్లు లభించును? వీనిని ప్రేమ పూర్వకముగ సర్వవర్ణముల యందుఁ బ్రచార మెట్లు చేయనగును?”

సనకాదు లిట్లనిరి _:- “ దేవర్షీ! చింతిలకుము. మనమునఁ బ్రసన్నత వహింపుము. చూడు వీరి నుద్దరించుటకు సరళ మగు నుపాయము ప్రథమము నుండి ప్రసిద్ధిగా నున్నది. నారదా! నీవు ధన్యుఁడవు. నీవు విరక్తులలో శిరోమణివి. నారదా! శ్రీకృష్ణదాసులలో సదా యగ్రగణ్యుడవు. యోగమునకు సాక్షాత్తు సూర్యుఁడవే. నీవు భక్తికొఱకు చేయు యుద్యోగ మేమియు నాశ్చర్యమైన విషయము కాదు. భగవద్భక్తులకో భక్తిస్థాపన చేయుట యుచితమే. ఋషు లీ ప్రపంచమున ననేక మార్గములను బ్రకటించి యున్నారు. కాని యవియన్నియుఁ గష్టములు మాత్రమే. ఇంతదనుక భగవత్ప్రాప్తినిఁ గలిగించు మార్గము గుప్తమయియే యున్నది. దాని నుపదేశించు పురుషుఁడు భాగ్యవశముననే లభింపఁగలఁడు. నీకాకాశవాణి సూచించిన సత్కార్యమును మేము విశదీకరించెదము. నీవు ప్రసన్నుఁడ వయి సమాహిత చిత్తమున నాలింపుము.

నారదమునీశ్వరా! ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయరూప జ్ఞానయజ్ఞము. ఈ యన్నియు స్వర్గాదులను గలిగించు కర్మమునే సూచించును. పండితులు జ్ఞానయజ్ఞమునే సత్కర్మ (ముక్తిదాయక)ముగాఁ దలఁచుచున్నారు. అది శ్రీ మద్బాగవత పారాయణము. శ్రీశుకాది మహానుభావు లిట్లని నిరూపణ చేసియున్నారు. దానిమాట విన్నంతనే భక్తి, జ్ఞాన వైరాగ్యములకు మిగుల సత్తువ గలుగును. దీనిచే జ్ఞాన వైరాగ్యముల కష్టము తొలఁగిపోవును. భక్తి కానందము లభింపఁగలదు. చూడు! సింహగర్జనము వినినంత తోడేళ్లు కాలికి బుద్ది చెప్పునట్లు, శ్రీ మద్బాగవత ధ్వనితోనే కలియుగము యొక్క దోషము లన్నియు దూరముగాఁ బోవును. అంత ప్రేమరసమును బ్రవహింపఁ జేయు భక్తి, జ్ఞాన వైరాగ్య సమేతముగఁ బ్రతి యింటను, బ్రతి వ్యక్తి హృదయ మందును గ్రీడింపఁ గలదు. అన్ని చోటులను దీని ప్రచారము లెస్సగఁ గాఁగలదు.”

నారదుఁడు _:- “ నేను వేదవేదాంతధ్వని, గీతాపాఠము చేసి వాని నెన్నివిధములనో ప్రబోధించితిని. కాని భక్తి, జ్ఞాన, వైరాగ్యము లించుకంతయు మేల్కొనినవి కావు. కాగా ఇట్టి స్థితిలో శ్రీమద్భాగవతము వినిపించిన మాత్రనే వాని కెట్లు చైతన్యము కలుగఁగలదు? ఏలనన ఆ కథ యొక్క ప్రతిశ్లోకమున. బ్రతి పదమునను వేదము యొక్క సారాంశమే యున్నది. తాము శరణాగతవత్సలురు. తమ దర్శనము వ్యర్థమెప్పుడును గానేరదు. కావున నా యీ సందేహమును బాపుఁడు. ఈ కార్యమున విలంబము సేయకుఁడు.”

సనకాదులు _:- “ శ్రీమద్భాగవతకథ, వేదము ఉపనిషత్తుల సారముచేఁ గల్పింపబడినది. ఇందువలన వానికంటె వేఱయి, వానికి ఫలమాప మయిన కారణమున వానికంటె నుత్తమమయినదిగా గుణింపఁబడుచున్నది. ఒక వృక్షము యొక్క వేరునుండి శాఖాగ్రమువరకు రసముండినను, నీ స్థితిలో నా రసము నాస్వాదనము చేయఁజాలము. ఆ రసమే వానినుండి వేఱయి ఫలరూపమును బొందినప్పు డీ ప్రపంచమున నెల్లరకును బ్రియమైన దయి యొప్పును. పాలలో నేయి యున్నది. కాని యా స్థితిలో దాని రుచి ప్రత్యేకముగ నాస్వాదింప వలనుపడదు. అది యా పాలనుండి వేఱుగఁ దీయఁబడినప్పుడు, దేవతలకును స్వాదునర్థకము కాఁగలదు. కలకండ చెఱకుగడలో నంతటను నిండి యుండునప్పటికిని, దానినుండి వేఱుగాఁదీసి నప్పుడు మటింత మధురముగా నుండును. అట్లే భాగవతకథయు ఈ భాగవతపురాణము వేదములకు సమాన మయినదిగా నెంచఁబడుచున్నది. శ్రీవేదవ్యాస భగవానుఁడు దీనిని, భక్తి జ్ఞాన వైరాగ్య స్థాపన కొఱకే ప్రకాశింపఁజేసినాఁడు. వేదవేదాంతసార గామియు, గీతారచనకారుఁడు నగు శ్రీవేదవ్యాస భగవానుఁడు పూర్వకాలమున ఖిన్నుఁ డయి యజ్ఞానసముద్రమున మునిఁగి యుండి నప్పుడు నీవే కదా చతుశ్లోకములలో దీని నుపదేశించితిని. దాని వినఁగానే యా వ్యాసమునికిఁ గలిగిన విచార మంతయుఁ దొలఁగిపోయెను. అట్టి నీకిప్పుడు దీని విషయమున నేల యాశ్చర్యము కలిగి యిట్లు ప్రశ్న చేయుచున్నావు? నీవు శోకమును దుఃఖమును బాఱుఁదోలునట్టి శ్రీమద్భాగవత పురాణము వినిపింపవలెను.”

శ్రీనారదుఁడు _:- “ మహానుభావులారా! తమ దర్శనము జీవుల పాప పుంజముల నెల్లఁ దత్క్షణమ నశింపఁజేయును. సంసార దుఃఖ దావానల సంతప్తు లయినవారిమీఁద వైళమ (తప్పక) శాంతి వర్షమును గురియించును, తాము నిరంతరము శేషుని సహస్ర ముఖములనుండి వెడలు భగవత్కథామృతమును పానము చేయుచుందురు. నేను ప్రేమలక్షణ భక్తిని బ్రకాశింపఁజేయు నుద్దేశముతోఁ దమ శరణు వేఁడుచున్నాను. అనేక జన్మములందు సముపార్జించిన పుణ్యపుంజ ముదయమయినఁ గాని మానవులకు సత్సంగము లభింపదు. ఆ సత్సంగము దొరికినచో నజ్ఞానముచేఁ గలిగిన మోహము, మద మనెడి యంధకారము నాశమయి వివేకోదయము కాఁగలదు.”