పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : పద్మపురాణాంతర్గతము

శ్రీరామ


శ్రీ తెలుగు భాగవత మాహాత్మ్యము

(పద్మపురాణాంతర్గతము)

మూలం: శ్రీ దాసశేషులుసౌజన్యము

శ్రీ భాగవతమాహాత్మ్యము పద్మపురాణ మందు, సంస్కృత భాషలో కలదు. తెలుగులో పద్యకావ్యముగా కూడ రచింపబడినది. వచన రూపమున తేటతెలుగులో ఎల్లరకు తెలిసేలాగ ఒంటిమిట్టి శ్రీ వాసుదాసు వారి, శ్రీ భక్తిసంజీవనిలో ప్రకటింపబడింది. శ్రీ దాసశేషుల వారు దీనిని సంకలనం చేసి సిఇ. 1952 (పరీధాని, కార్తీక శుద్ద తదియ) ప్రచురించారు.

ఇంతటి మహాకృషి మరింత మందికి సుళువుగా అందించుట ఉచితం అన్న భావనతో. వారికి సవినయ ప్రణామములతో ఈ పద్మ పురాణాంతర్గత శ్రీ భాగవతమహాత్మ్యం ఇక్కడ అందిస్తున్నాము. ఆస్వాదించండి.

భాగవత మాహాత్మ్యము చక్కగా తెలుగులో తెలిసి పరమహంస సంహిత ఐన శ్రీ పోతన తెలుగు భాగవతము అధ్యయనము చేసి శాశ్వత శాంతినిధానం బైనట్టి భగత్సన్నిధాన మహాభాగ్యమును చూఱుగొనెదరు గాత!

_ భాగవత గణనాధ్యాయి.


వినతి

 గీ.
 శ్రీ యశోదాకిశోరంబుఁజేరి మ్రొక్కి
 మందప్రోయాండ్ర పదధూళి మౌళిఁ దాల్చి.
 బాదరాయణ నారద పరమమునుల,
 భక్తి సేవించి, శుకదేవుఁ బ్రణతిసల్పి,
 ధన్యు మద్గురు శ్రీ వాసుదాసుఁ దలఁచి,
 భాగవతమహిమ తెనుఁగు బాస నెలమి,
 ననువదించెద నాలింపుఁ డాదరమున,
 భక్తజనులార! సాధు ప్రపన్నులార!
 తల్లులార! ప్రేమలతామతల్లులార!!

 ఈ భాగవతమాహాత్మ్యము పద్మపురాణాంతర్గతము. శ్రీ శుకశాస్త్రమగు శ్రీమద్భాగవతముయొక్క మాహాత్మ్యము గీర్వాణ భాషయందుఁ గలదు. పండితకవులు దీనిని దెనుఁగునఁ బద్యరూపమున రచించియున్నారు. కాని తెలుఁగున తేటమాటలతో నుండిన నెల్లర కందుబాటులో నుండగలదని నమ్మి సాహసించి, ఈ పనికిఁ బూనితిని. విజ్ఞులు మన్నించెదరుగాక. విషయమును మాత్రము గ్రహించి, శ్రీకృష్ణ భగవానుని ప్రతిరూప మగు శ్రీ భాగవతమును బఠించియో, వినియో భగవత్కృపకుఁ బాత్రు లగుటయే దేహధారులకు జన్మ మెత్తినందుకు ఫలము. కుత్సిత కథలకుఁ జెవియొగ్గి, కుపథములఁ బడి తల్లి గర్భవేదనకు మాత్రమే తాము కారణభూతు లగుట బుద్ధిమంతులకు లక్షణము కాదు. కావున సాధువులఁ జేరి వారి సద్బోధనలను మనస్సునఁ బట్టించుకొని మననము చేసి భగవత్కృపకుఁ బాత్రులయి పరమ శాంతిసౌఖ్యములఁ బడసి జన్మసాఫల్యతకుఁ బ్రయత్నించెదము గాక .
 ఇట్లు విన్నవించు
 దాసశేషుఁడు