పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : నాలుగవ అధ్యాయము

శ్రీమద్భాగవతమాహాత్మ్యము

నాలుగవ అధ్యాయము

కథలో భగవానుని ప్రాదుర్భావము, గోకర్ణోపాఖ్యాన ప్రారంభము.

సూతుఁడు_:- మునివరా! యీ సమయమున తన భక్తుల హృదయములం దలౌకికభక్తి ప్రాదుర్భవించుట చూచి, భక్తవత్సలుఁ డగు భగవానుఁడు తన శ్రీవైకుంఠధామమును విడిచి యిక్కడకు వేంచేసెను. ఆ ప్రభుని మంగళసీమ (గళము, కంఠము) వనమాల శోభిలుచుండెను. తిరుమేను సజలజలధర సమాన మయి, శ్యామసుందర మయి, యొప్పులకుప్ప యయి యుండెను. అందుపై మనోహరి పీతాంబరమును సుశోభిత మయి యుండెను. కటిప్రదేశమునఁ గాంచీగుణము వింతశోభ గురియుచుండెను. శిరమున వెలయు గిరీటముఠీవి వర్ణనాతీతము. కర్ణముల ధగధగ మెఱయు మణిమయ మనోహర మకరకుండలముల శోభకు వెల యెక్కడిది? పరమవిరాగుల సమాధి భంగ మొనరించి చిత్తమును హరించుచుండెను. వక్షస్థలమునఁ గౌస్తుభమణి మెఱుగులీనుచుండెను. శ్రీయంగ మంతయుఁ జందనచర్చిత మయి యుండెను. ఆ రూప శోభ నేమని చెప్పుదును, అయ్యది శతకోటి కామదేవుల రూప మాధురిని మురళీధరుఁ డిట్టి యనుపమ కాంతితోఁ దన భక్తుల నిర్మలచిత్తములం దావిర్భవించెను. భగవానుని నిత్యవిభూతి నివాసు లయి భగవల్లీలా పరికరభూతు లయిన యుద్ధవాదులు గుప్తరూపమునఁ గథ వినుటకయి వేంచేసి యుండిరి. ప్రభువు సాక్షాత్కరించినంతన, నలువంకల జయజయ ధ్వనులు చెలరేగెను. ఆ సమయమున నద్భుత భక్తిరసప్రవాహము వెల్లివిరిసెను. మాటిమాటికిఁ బుష్పవృష్టియు శంఖారవములు విస్తరిల్లెను. ఆ సభ యందున్న వారు, తమ దేహగేహములనన నేల. తమ యాత్మను సర్వమును మఱచి తన్మయు లయి యుండి, వారి యా యవస్థను దిలకించి శ్రీనారదు లిట్లనిరి. నేఁడు నేనిందు సప్తాహ శ్రవణము యొక్కయు లౌకిక మహాద్భుత మహిమను గంటిని. నేఁడిందుఁ జేరిన వారిలో వజ్రమూర్ఖులు, దుష్టులు, పశువులు, పక్షులును గలవు. వీరంద ఱత్యంతయు నిష్పాపు లయిరి. ఈ కలికాలమునఁ జిత్తశుద్ది కయి, పాపపుంజ నాశకర మయిన భాగవతకథకు సమాన మయిన దీ మర్త్యలోకమున వేఱొక పవిత్రసాధన మితరము లేదనుట నిస్సందేహము. మునివరులారా! తామత్యంత కృపాలురు. తాము లోకకళ్యాణము నాశించి యీ సరళ సుగమ పరమ సాధనమును జూపితిరి. తాము కృపయుంచి యీ కథారూప సప్తాహయజ్ఞమున నెవరెవరు పవిత్రు లయ్యెదరో తెలుపుఁడు. అన్నపుడు సనకాదు లిట్లనిరి.

సదా వివిధము లగు పాపములు చేయుచుండు వారును, నిరంతరము దురాచారపరాయణు లయి యుండువారును, విపరీత మార్గవర్తు లయినవారు, క్రోధాగ్నితప్తులును, గుటిలులు, కామాసక్తులును, వీరందఱు కలియుగమున సప్తాహయజ్ఞముచేఁ బవిత్రు లయ్యెదరు. సత్యమును విడిచినవారును, తల్లిదండ్రుల నిందించువారలును, పేరాసకు లోనయి వికలచిత్తు లయినవారును, ఆశ్రమధర్మముల వదలినవారును, దంభాచారులును, ఇతరుల యున్నతి కులుకువారలును, పరులకు దుఃఖము గలిగించువారును, కలియుగమున వీ రెల్లరు సప్తాహయజ్ఞముచేఁ బవిత్రులు కాఁగలరు. కల్లు ద్రావువారును, బ్రహ్మహత్య చేయువారును, బంగారు దొంగిలించువారును, గురుదారాగమన మొనరించువారును, నమ్మినవారిని జెఱుచువారును, వీరు పంచమహాపాతకులు, కపట వర్తనులు, క్రూరులును, పిశాచము లట్లు నిర్దయులును, బ్రాహ్మణధనముచేఁ బుష్టి నొందువారును, వ్యభిచారులును, వీరు గూడఁ గలియుగమున సప్తాహయజ్ఞముచేఁ బావను లయ్యెదరు. పట్టుదలతో మనోవాక్కాయములచే సర్వదా పాపము చేయు దుష్టుడును, పరులధనముచేఁ బుష్టి గనువాఁడును, మలినమనస్కుఁడును, దుష్టహృదయుఁడును కలియుగమున సప్తాహయజ్ఞముచేఁ బావను లయ్యెదరు. నారదా! యిప్పుడు మే విన్నమాత్రమున నొక ప్రాచీనేతిహాసము వినిచెదము. దాని విన్న మాత్రముననే సర్వపాపములు నశించిపోవును. పూర్వకాలమునఁ దుంగభద్రానది యొడ్డున నొక సుందరనగర ముండెను. అందున్న వారందఱు తమతమ వర్ణాశ్రమ ధర్మముల నాచరించుచు సత్యము నందు సత్కర్యము లందుఁ దత్పరు లయి యుండిరి. ఆ నగరమున సమస్త వేదవిశేషము లెఱిగినవాఁడును, శ్రౌతస్మార్తకర్మము లందు నిపుణుఁడును, నాత్మదేవుఁ డను పేరు గల బ్రాహ్మణుఁ డొకఁ డుండెను. తేజస్సున రెండవమార్తండుఁడు. భిక్షాటనముచేసి జీవించువాఁడే యయినను లోకమునఁ గొంత డబ్బు గలవాఁడని వాడుక. ఆ విప్రుని ప్రియభార్య దుంధులి యను పేరు గలది. ఎల్లప్పుడు తన మాట నెగ్గవలె ననెడి పట్టుదల కలది. సత్కులమునఁ బుట్టినది. చక్కనిది. లోకవార్తా రతురాలు; స్వభావమునఁ గొంత క్రూరురాలు; వదరుబోతు; గృహకృత్యముల నిపుణురాలు; కలహప్రియ; కృపణబుద్ధిగలది (ఒకనికిఁ బెట్టక తాను భక్షింపక ధనమును గూడఁబెట్టు బుద్ధి, లోభత్వం; కుత్సితం; పిసినారి). ఇన్ని యుండినను భార్యాభర్తలు పరస్పరానురాగము గలిగి యానందముగఁ గాలము గడుపుచుండిరి. వారికి ధనమునకుఁగాని, భోగసామగ్రికిఁ గాని కొఱఁత లేదు. కాని వారి కొకటియే లోటు. ఒక మగనలుసు గాని యాఁడుబిడ్డ గాని లేదు. సంతానము లేని కారణమున నిన్ని యుండియును వారికి సర్వమును శూన్యముగాఁ దోఁచుచుండెను. వారి కేదియు సుఖముగాఁ దోఁపకుండెను. వారికి వయస్సు దాఁటిపోవుటఁ గాంచి, వారు సంతానము కొఱకు వివిధములగు పుణ్యకర్మములు చేయఁసాగిరి. వారు పేదసాదులకు, గోవులను, భూమి, హిరణ్యము, వస్త్రములు మున్నగునవి దానము చేసిరి. ఇట్లు ధర్మమార్గమున వారు తమ కున్న ధనములో సగము వెచ్చించిరి. ఇంత చేసినను వీరికి సంతతి కలిగినది కాదు. ఆ కారణమున నా బ్రాహ్మణుఁ డత్యంత చింతాతురుడుఁ కాఁజొచ్చెను.

ఒక దినమున నా భూసురోత్తముఁడు మిగుల దుఃఖము నొంది, యిల్లు వెడలి, యడవికిఁ బోయెను. మిట్టమధ్యాహ్న మయినది. మిగుల డప్పిగొని, యొక చెఱువు దగ్గఱకుఁ బోయెను. బిడ్డలు లేకపోయి రనెడి దిగులుచే నాతని శరీరము మిగుల శుష్కించిపోయెను. అందువలన నలసి యచ్చోట నీరు త్రావి కూర్చుండెను. రెండు జాములు దాఁటిన పిమ్మట నక్కడ కొక మహాత్ముఁ డగు సన్న్యాసి విచ్చేసెను. ఆ సన్న్యాసి జలము గ్రోలి దాహశాంతి చేసికొనినది చూచి యా బ్రాహ్మణుఁ డా యతి కడకుఁ బోయి, నమస్కరించి వేఁడి నిట్టూర్పు లిచ్చుచు, నిలఁబడి యుండెను.

సన్న్యాసి _:-
చెప్పు! బ్రాహ్మణుఁడా ఏడ్చెద వేల? నీ కింత దురంతచింత యేమి కారణమునఁ గలిగినది? తత్క్షణమ నీ దుఃఖమునకు గారణమును దెలుపుము?

బ్రాహ్మణుఁడు _:- “ మునిచంద్రమా! నా దుఃఖ మే మని చెప్పుదును? ఇ దంతయు నేను బూర్వమునఁ జేసిన పాపఫలము. నా కెట్టి సంతానము లేదు. అందుచే నేను నా పితృదేవతల కొసఁగెడి తిలోదకము దుఃఖమువలన వచ్చెడి వేఁడి నిట్టూర్పులచే సలసల మఱుగుచున్నవి. దేవతలకు, బ్రహ్మణులకు నే నే మిచ్చినను సంతోషముతో గ్రహింపకున్నారు; బిడ్డలు లే రనెడి దుఃఖముచే నాకు సర్వము శూన్యముగానే తోఁచుచున్నది. అందువలన నిప్పు డిక్కడఁ బ్రాణములు విడువ వచ్చితిని. సంతతి లేని జన్మ మేటికి? ఛీ! కాల్పనా? ఎవని భవనమున నల్లారుముద్దుగా నాడుచుండు బిడ్డలు లేరో, యది వనమే, సంబాళించుకొనిపోవు ఉత్తరాధికారి లేనివాని ధనము దంధనము (అస్థిరమైనది) కాక మఱేమి? సంతానము లేనివాని కులము ఛీ! ఛీ! ఏమి ప్రయోజనము? నేను పెంచెడి గోవు కట్టదు; ఈనదు. ఎప్పుడు చూచినను గొడ్డుబోతుఁగానే యుండును. నేను వేసి పెంచిన చె ట్టొకప్పుడు పూచి కాచుట లేదు. అంత దూరము పోనేల? నా యింటికిఁ దెచ్చిన పండో కాయయో తత్క్షణమ క్రుళ్ళిపోవును. నే నిట్టి దౌర్భాగ్యుడ నయి సంతాన హీనుఁడ నయిన పిమ్మట భూమి మీఁద బ్రతికి ఫల మేమి? చెప్పుఁడు.”

అని యీ ప్రకారము చెప్పి దుఃఖాకులుఁ డయి యా బ్రాహ్మణుఁడు సన్న్యాసి మ్రోల వెక్కివెక్కి యేడువఁ జొచ్చెను. అది గని యా యతి హృదయము నీ రయ్యెను. అతఁడు యోగనిష్ఠుఁడు కావున నా భూసురుని లలాట రేఖలఁ బరికించి, సర్వమును దెలిసికొని, యా విప్రవరునితో సర్వమును విస్తరించి వచింపఁ బూనెను.

సన్న్యాసి _:- “ బ్రాహ్మణుఁడా! నీ వీ సంతానముకొఱ కయిన భ్రమను విడువుము. చూచితివా? కర్మగతి బలవత్తర మయినది. నీవు వివేకము గలిగి, సంసారవాసనను వదలి వేయుము. విప్రపుంగవా! విను. ఇప్పుడు నీ ప్రారబ్దమును జూచితిని. ఇది నిశ్చయము. నీకేడు జన్మములవఱకును ఏ ప్రకారముగను ఎట్టి సంతానమును గలుగనేరదు. కావున నీ వీ కుటుంబము మీఁది మమత్వమును విడుపుము. త్యాగము నందు, సర్వవిధముల సుఖమే తప్ప వేటొకటి లేదు. ఈ సంతాన మనెడి మాయలోఁ దగుల్కొని యేమి సుఖము పడియం గలవు? పూర్వకాలమున నగరచక్రవర్తి, అంగరాజు మున్నగువా రీ సంతానము మూలమున నెంతెంత యాతన లనుభవించిరో చూడలేదా?”

బ్రాహ్మణుఁడు _:- “ మహాత్మా! నాకు వివేకముతో నేమి పని? అది మీవంటివారికిఁ దగును. నాకో యొక పుత్రు ననుగ్రహింపుఁడు. పుత్రకళత్రాదిక సుఖము లేని యీ సన్న్యాసము సర్వధా నీరస మయినది. పుత్రపౌత్రాదులతో నిండిన గృహస్థాశ్రమమే సరస మయినది.”

బ్రాహ్మణుని యీ పట్టుదలఁ జూచి, యా తపోధనుఁడు “విధాత వ్రాత తప్పింప హఠము గావించిన చిత్రకేతుఁ డను నరపాలుఁడు మిగులఁ గష్టముల పాలు గావలసి వచ్చెను. దైవ మనుకూలింపని పురుష ప్రయత్నము వ్యర్థము. నీకును బుత్రునివలనఁ సుఖము లభింపఁజాలదు. కాని యే మందును? నీవో మొండిపట్టు పట్టినావు ని న్నెట్లు కా దందును?”

ఆ మహాత్ముఁడా పాఱుఁ డేవిధముగను దన పట్టుదల విడువకుండుట చూచి, వానికొక ఫలము దీనిని “నీ భార్య కిచ్చి యామె తినునట్లు చేయుము. ఆమె కొక పుత్రుఁడు కలుగ గలఁడు. నీ భార్య యొక సంవత్సరము వఱకు, సత్యము శౌచము, దయ, దానము, ఒంటిపూట భోజనము నియమముగఁ బాటింపవలెను. ఆమె యట్లు గావించెనేని, బాలకుఁడు మిగుల శుద్ధ మగు స్వభావము గలవాఁడు కలుగఁగలఁడు.”

అని యీ మాదిరిగాఁ జెప్పి యోగిరాజు వెడలిపోయెను. బ్రాహ్మణుఁడు తన యింటికిఁ బోయెను. తన గృహమున కేగి యా ద్విజుఁడు తాను తెచ్చిన ఫలమును తన యిల్లాలి చేతి కిచ్చి తా నెందోపోయెను. అతని భార్య వక్రస్వభావము కలది కావున నేడ్చుచుఁ బోయి దాని సావాసకత్తె నొకర్తుకను జూచి ఇట్లని చెప్పసాగెను. ”సఖీ! నా కెంతో దిగులు వేయుచున్నాదే? నే నీ పండు తినలే నమ్మా! చూడు! యీ పండు తింటివా వేఁకటి (వేవిళ్ళు) వచ్చును. గర్భము నిలిచిన కడుపు పెద్ద దగును? తర్వాత నేమియుఁ దినను ద్రాగను వీలుపడదు. అటులయిన సంసారము జరగుటెట్లే? భగవత్కృపచే లేదు గాని, యొకవేళ గ్రామములో బందిపోటు దొంగల హడావిడి కలిగిన, గర్భిణిగా నున్న యాఁడుది పాఱిపోవు టెట్లు? ఇట్లుగాక శుకునివలె. నీ గర్భములోఁ బిండము (పండ్రెండేఁడులుఁ) యుండిన, ఈ గండము గడచి పిండము బయట పడు టెట్లు? మఱియు ప్రసవసమయమున లోపలి శిశు వడ్డము తిరిగిన, ప్రాణము మీఁదికి రాదా? పోనీ, సహజముగానే ప్రసవించుట సంభవించినను, ప్రసవవేదన మతి భయంకర మయినది కదా! నే నో బహుసుకుమారిని యీ బాధ నెట్లు సహింపఁగలను? ఆ సమయమున నే నేదో యొకటి చేయుటకు లేదు. చూచుటకు లేదు. అట్లుండ వాఁడు బిడ్డ వచ్చి యింటిలోని దంతయుఁ దోఁచుకొని పోవఁగలదు. అమ్మయ్యో! నే నేమి, ఆ సత్యము శౌచము మున్నగు నియమములు సంవత్సరము దాఁక జరుపు టేమి, నావలన నయ్యెడి పని కాదు. నెత్తిమీఁదఁ బడఁగలదు? కావున గొడ్రాలో, విధవయో యయిన స్త్రీ హాయిగా సుఖపడఁగల దని నా యభిప్రాయము.”

నారదా? యీరీతిగా నా దుంధులి మనస్సున, వివిధము లయిన కుతర్క పరంపరలు బయలు దేఱుటచే నా ఫలమును దినినది కాదు. పెనిమిటి ”పండు తింటివా?” యని యడుగ ”ఆఁ! తింటిని” అని యతినితో బొంకెను. ఒకనాఁ డెందుకో తనంతన నా దుంధులి చెల్లె లింటికి రాఁగా, నామెతో నీ వృత్తాంత మంతయు జెప్పి ”చెల్లెలా! సంతానము కలుగకున్న, మీ బావ గారేమి చేయుదురో వారి కేమి చెప్పుదునా యని భయ మగుచున్నది. ఈ విచారముచే దినదినము కృశించిపోవుచున్నాను. డబ్బెత్తు సత్తువ లేదు. ఏమి చేయుదును? చెప్పు” మని యన, నప్పుడా సోదరీ! ”అక్కా! ఏలనే భయపడెదవు? నా గర్భమున బిడ్డ యున్నది. ప్రసవము కాఁగానే, యా బాలకుని నీ కిచ్చెదను. అంతదనుక నీవు కడుపుతో నున్న దానివలె నింటిలో గోప్యముగా నటింపుము. మీ మఱఁది కేదో కొంత చేయితడి చేసితివా, యాయన యూరకుండఁగలడు. మే మొక యుక్తి పన్నెదము. మాకుఁ బుట్టినబిడ్డ బదునాఱు నెలలయిన తరువాత జనిపోయినాఁడని లోకు లనుకొనునట్లు చేసెదము. నేను మీ యింటికి వచ్చి యా పిల్లవానికి నిత్యము పాలిచ్చి పోషించెదను. పరీక్షార్థ మిప్పుడు ఫల మావునకుఁ బెట్టు” మని చెప్ప నా బ్రాహ్మణ స్త్రీ స్వభావముచే ”నేమి యనక” తన చెల్లెలు చెప్పినట్లే చేసెను.

తరువాత, సమయానుసార మా దుంధులి చెల్లెలు ప్రసవింపఁగానే యా నవజాత శిశువును గప్ చిప్ గా జనకుఁడు తీసికొని వచ్చి దుంధులి కిచ్చి పోయెను. ఆమె తాను సుఖముగా కొడుకును గంటి నని తన పతి యగు నాత్మదేవున కెఱిగించెను. ఈ ప్రకార మాత్మదేవునకుఁ బుత్రుఁడు కలుగుట విని యెల్లవార లానందించిరి. అప్పు డా బ్రాహ్మణుఁ డా శిశువునకు జాతసంస్కారము చేసి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను. ఆ యాత్మదేవున గృహద్వారమున మేళతాళము లాటపాటలు మున్నగు వేడుకలు మాంగళిక కృత్యములు జరిగెను. అంద దుంధులి పతితోఁ ”నా ఱొమ్ములలో పాలుపడలేదు. ఈ బిడ్డకు ఆవు మున్నగు నితర జీవుల వలనఁ బోఁతపాలు పోసి యెట్లు పోషింపగలను. నా చెల్లెలికి మగపిల్లవాఁడు పుట్టి వాఁడు చనిపోయినాఁడు. ఆమెను బిలుచుకొని వచ్చి యిక్కడ నుంచు కొంటిమా యే దిగులు లేకుండ బిడ్డను సర్వవిధముల నామె పోషణము చేయఁగలదు” అని చెప్పఁగా, నాతఁడు ”మంచి దని తన పిల్లవాని పోషణ కామెను, తన భార్య చెప్పినట్లే తీసికొని వచ్చి తన యింటిలో నుంచెను. ఆ బిడ్డకు దుంధులి ధుంధుకారి యని పేరిడెను.

మూఁడు నెలలు గడచిన పిమ్మట యా గోమాత కొక మనుష్యాకరము గల వత్స కలిగెను. ఆ బిడ్డఁడు సర్వాంగ సుందరుఁడు. దివ్యమయి నిర్మలమయి సువర్ణమువంటి కాంతి గలవాఁడు. ఆ శిశువును జూచి యాత్మదేవుఁ డానందసాగరమున మునిఁగి తానే యా శిశువునకు సర్వసంస్కారములు గావించెను. ఈ సమాచారము విని, లోకు లందఱు మిగుల నాశ్చర్యమును బొంది, యా బాలకునిఁ జూడ వచ్చిరి. చూచి తమలోఁ దాము “యీ యాత్మదేవుఁ డెంత యదృష్టవంతుఁడు? ఎంత వింత? ఈతని యావుకూడ నిట్టి దివ్యరూపము గల బాలకునిఁ గన్నది” అనుకొనఁసాగిరి. దైవయోగమున ఈ పరమ రహస్య మెవరికిని దెలిసినది కాదు. ఆత్మదేవుఁ డా బాలకుని కావువంటి చెవు లుండుట గని గోకర్ణుఁడని నామకరణము చేసెను.

కొంతకాలమున పిమ్మట నా బాలకు లిరువురు యౌవన లక్ష్మి వరించెను. వారిలో గోకర్ణుడు గొప్ప పండితుఁడు, జ్ఞాని యయ్యెను. కాని ధుంధుకారి మిగుల దుష్టుఁ డయ్యెను. స్నానశౌచాది బ్రాహ్మణోచితము లగు నాచారములు పేరున కయిన వాని యెడఁ గానరావు. ఆహార పానముల యెడ మంచి సెబ్బరల విచారమే లే దాతనికి. క్రోధపర్వత మానసకుఁ డతఁడు. దుష్పరిగ్రహ (చెడును గ్రహించుట) మతనికి మంచినీళ్ళప్రాయము. పీనుఁగు మీఁది పిండమును తినుట కతఁడు జంకఁడు. పరధనదారహరణమునఁ బండితుఁడు. పరుల ద్వేషించుట వాని స్వభావము. దాఁగి దాఁగి పరుల కొంపల కగ్గి దాకొలుపును. పరుల బాలకుల నాడించుట కెత్తుకొనపోయి, జంకక బావులలోఁ బడవేయుచుండును. హింసచేయుటయే వానికి వ్యసన మయినది. వాఁడెల్లప్పు డస్త్రశస్త్రముల ధరించి తిరుగుచుండును. పాపము కుంటిగ్రుడ్డివాండ్రను, దీనులను దుఃఖభారపీడితులను రిత్తకు వేఁపికొని తినుచుండును. చండాలు రన్న వానికి విశేష ప్రేమ. చేతఁ బాశములు పూని కుక్కల వెంటగొని సదా వేఁటకై గ్రుమ్మరుచుండును. వేశ్యల వలలోఁ జిక్కి వాఁడు పితృ సంపత్తి నంతయు వ్యర్థముగాఁ బాడుచేసెను. ఒకనాఁడు తల్లిదండ్రులను జావమోది, కొంపలోని వస్తువుల నెల్ల నెత్తికొని పోయెను.

ఈ ప్రకారము సర్వసంపత్తి స్వాహా కాఁగా పాప మాతని తండ్రి వెక్కి వెక్కి యేడ్చుచు “ఇంతకంటె వీని తల్లి గొడ్రా లయినను మేలుగా నుండెడిది. కుపుత్రుఁడు, అబ్బా! మహత్తర దుఃఖములకు నిదానము. ఇప్పుడు నే నెక్కడ నుందును? ఎందుఁ జొత్తును? నా యీ సంకటమును బాపు పుణ్యాత్ము లెవరు? అయ్యో! నా నెత్తిన మహత్తరమగు విపత్తు వచ్చిపడినది. దీని మూలమున నే నవశ్యము గొంతున కురిపోసికొని ప్రాణములను విడువవలసినదే” యని విచారపడుచుండ, నింతలో పరమజ్ఞాని యగు గోకర్ణుఁ డక్కడకు వచ్చి, తన తండ్రికి వైరాగ్యము నుపదేశించుచు ననునయించెను. “అప్పా! నిజము నమ్ముఁడు. ఈ సంసారమున నించుకంతయు సారములేదు. ఇది యత్యంత దుఃఖరూప మయినది. మోహమున ముంచునది. బళా! తనయులు, ధనము, ఎప్పుడు ఎవనిది? వీని యందు మమత్వ మనెడి మాయలోఁ దగుల్కొనినవాఁడు రాత్రి పగలు కుమిలిపోవలసినదే. ఇంద్రుఁడే కానీ! చక్రవర్తియే కానీ రామ రామ! సుఖము లేశ మయినను లేదు. సుఖమందురా! ఏకాంత వాసియు విరక్తుఁడు నగు ముని కొక్కనికే గలదు. మీ రీ పుత్ర స్నేహ మనెడి యజ్ఞానమును విడువుఁడు. ఈ మోహమునఁ జిక్కినవాఁడు, నరకముపాలు గావలసినవాఁడే; చివర కీ శరీరమో నష్టమైపోవలసినదే. కావున, నిప్పుడే సమస్తమును విడిచి యడవికిఁ బొండు!”

గోకర్ణుని హితవచనముల నాలించి, యాత్మదేవుఁడు వనమునకుఁ బోవ సన్నద్ధుఁడై, “వానితోఁ నాయనా! అడవి యందుండి నే నేమి చేయవలెను? విస్తరించి నాకుఁ దెలుపుము. నేను వజ్రమూర్ఖుఁడను. ఇంతదనుక కర్మవశమున, స్నేహపాశ బద్దుఁడ నయి, పంగు (గతి వికలుడు. కుంటివాడు.) క్రియ, యిల్లనెడి పాడు చీఁకటి నూతిలోఁ దెళ్ళి కదలలేక పడియుంటిని. నీ వత్యంత దయాళుఁడవు. ఇందుండి నన్నుద్ధరింపుము” అని యడిగెను.

గోకర్ణుఁడు _:-
“నాయనా! ఈశరీర మెముకలు, మాంసము. నెత్తురుతోఁ గూడిన పిండము. దీనిని మీరు ”నేను” అనుకొనుట మానుఁడుఁ. దారసుతాదులు ”నా వా” రని యెంచకుఁడు; ఈ సంసార మహర్నిశము క్షణభంగురముగాఁ జూడుఁడు. ఇందలి యే వస్తువును స్థాయి కలదిగా, దలఁచి దాని యందు రాగము కలవారు కావలదు. కేవలము వైరాగ్యరస రసికు లయి, భగవానుని యెడ భక్తి గలవారు కండు; భగవద్భజనమే నన్నిటికంటె నుత్తమ పరమధర్మము. నిరంతరము దాని నాశ్రయింపుఁడు. తదితరము లగు సమస్త లౌకిక ధర్మములనుండి విముఖులు కండు; సదా సాధుజనుల సేవింపుఁడు. భోగలాలస దగ్గఱకు రానీయక దూరముగఁ దఱిమి వేయుఁడు. తత్క్షణమ, పరుల గుణదోషముల విచారము సేయుట మాని, యేకమాత్ర మగు భగవత్సేవ, భగవత్కథారసము లనే పానము చేయుఁడు.”

ఈ ప్రకారము పుత్రుఁడు చెప్పుటచే, నాత్మదేవుఁ డరువది సంవత్సరముల వయస్సు గడచిన వాఁడయ్యును, స్థిరచిత్తముతో గృహమును విడిచి, వనమునకు వెడలిపోయెను. అచట రాత్రిం దినము భగవానుని సేవ, పూజ చేయుచు, నియమపూర్వకముగ శ్రీమద్భాగవతము నందలి దశమస్కంధము పాఠము చేయుటచే, నాతఁడు శ్రీకృష్ణచంద్రభగవానుని నిత్యపదము బ్రాప్తించెను