పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : మూడవ అధ్యయము

శ్రీమద్భాగవతమాహాత్మ్యము

మూడవ అధ్యాయము

భక్తి కష్టనివృత్తి

నారదుఁడు _:-
మంచిది. అయిన నేనిప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్య స్థాపనకయి ప్రయత్నపూర్వకముగ, శ్రీశుక దేవగదిత శ్రీ భాగవతశాస్త్రకథ మూలమున నుజ్జ్వల మగు జ్ఞాన యజ్ఞమును గావించెదను. ఈ జన్నము (యజ్ఞము (ప్ర) – జన్నము (వి)) నేనెక్కడ చేయవలెను? తాము దీనికిఁ దగిన స్థానమును జూపుఁడు; తాము వేదముల సారము ముట్టఁదెలిసినవారు. కావున నా కీ శుకశాస్త్ర మహిమ కొంత వినిపింపుఁడు. ఇంతియకాక యీ కథ నెన్నిదినములలో వినవలెనో యదియును, దానిని వినవలసిన విధియును దెలుపుఁడు.

సనకాదులు _:-
నారదా! నీవు మహావినయవంతుఁడవు వివేకివి విను. నీకు మేము సర్వవిషయములు వివరముగాఁ దెలిపెదము; హరిద్వారము దగ్గఱ నానంద మనెడి ఘట్టము గలదు. అక్కడ ననేకులు ఋషు లుండెదరు. దేవతలు సిద్ధులు దానిని సేవించుచుందురు. వివిధము లగు వృక్షలతాదుల కారణమున, నది సఘన మయిన దయి యొప్పుచుండును; అం దత్యంత కోమల నవీన వాలుక (నదిలోని ఇసుక తిన్నె, మేట) సొంపుగా నుండును. ఆ ఘట్టము మిగుల రమ్యమై, యేకాంత ప్రదేశ మయి యొప్పి యున్నది. అం దెల్లవేళల బంగరు కమలముల సుగంధము వీచుచుండును. దానికిఁ జుట్టుపట్ల నుండెడి సింహములు, హరిణములు మున్నగు సహజ విరోధ స్వభావము గల జంతువులు చిత్తమున వైరభావమును మాని యుండును. అచ్చట విశేష శ్రమము లేకయే నీవు జ్ఞాన యజ్ఞారంభము చేయవలెను. అందు జరగెడి కథ యం దపూర్వ రసము పొడమఁగలదు. భక్తియును, నీ కన్నుల కెదుట నిర్బలు లయి ముసలితనమున వగ్గు లయి యున్న జ్ఞానవైరాగ్యులను దీసికొని రాఁగలదు ఏలననఁగా, నెందు భాగవతకథ జరగునో, యచ్చట కీ భక్తి మున్నగునవి తమంతన వచ్చి చేరును. అచ్చోట జెవులలో కథాశబ్దము పడినంతటనే యా భక్తి జ్ఞాన వైరాగ్యములు మూఁడును తరుణభావమును బొందును.”

సూతుఁడు _:- “ ఈ ప్రకారము చెప్పి నారదునితో సనకాదులు శ్రీ భాగవతకథామృతమును బానము చేయుట కయి యక్కడనుండి గంగాతీరమునకు వేంచేసిరి. వారు గంగాతటమునకు వేంచేసి నంతట భూలోక దేవలోక బ్రహ్మలోకము లేల సమస్త దేశములం దెల్లెడ భగవత్కథా విషయమైన వార్త వ్యాపించెను. శ్రీ భగవత్కథారసికు లయిన విష్ణుభక్తు లందఱు శ్రీమద్భాగవతకథామృత పానము చేయుట కయి ముందుగాఁ బరుగుపరుగున రాఁజాగిరి. భృగువు, వసిష్ఠుఁడు, చ్యవనుఁడు, గౌతముఁడు, మేధాతిథి, దేవలుఁడు, దేవరాతుఁడు, పరశురాముఁడు, విశ్వామిత్రుఁడు, శాకలుఁడు, మార్కండేయుఁడు, దత్తాత్రేయుఁడు, పిప్పలాదుఁడు, యోగేశ్వరుఁడగు వ్యాసుఁడుఁ పరాశరుఁడు, ఛాయాశుకుఁడు, జాబాలి, జహ్ను మున్నుగా గల ప్రధాన మునిగణములు తమతమ పుత్రులు శిష్యులు, స్త్రీలతోఁ గూడి మిగుల బ్రేమతో నక్కడకు విచ్చేసిరి, వీరు గాక వేదములు, ఉపనిషత్తులు, మంత్రములు, తంత్రములు, పదునేడు పురాణములు, ఆఱు శాస్త్రములును మూర్తిమంతము లయి యక్కడకు వచ్చెను. అట్లె గంగాది నదులు, పుష్కరము మున్నుగాఁ గల సరోవరములు, కురుక్షేత్ర మాదిగాఁ గల క్షేత్రములు, సమస్తదిక్కులు, దండకాది వనములు, హిమాలయము మొదలుగాఁ గల పర్వతములు దేవ, గంధర్వ దానవు లాదిగా నెల్లరును గథను వినుటకు వచ్చిరి. మేము గొప్పవార మనెడి యభిమానమున నచటకురా సంకోచపడు వారిని భృగు మహర్షి లాలించి బుజ్జగించి పిలుచుకొని వచ్చెను.

అంత కథను వినుటకు దీక్షపూని శ్రీకృష్ణపరాయణు లయి నారదుఁ డర్పించిన సుందర మగు దివ్యాసనమున సనకాదులు వేంచేసి యుండిరి. ఆ సమయమున శ్రోత లందఱు వారికి వందనము చేసిరి. వినువారలలో, వైష్ణవులు, విరక్తులు, సన్న్యాసులు, బ్రహ్మచారులు ముందు కూర్చుండిరి. అందఱకు ముందుగా శ్రీనారదులవారు కూర్చుండిరి. ఒక యోర ఋషి గణము, ఒకవైపు దేవతలు, ఒక వంశ వేదములు ఉపనిష దాదులు, అట్లే యొక క్రేవఁ దీర్థములు నుండెను. వేఱొకప్రక్క స్త్రీలు కూర్చుండిరి. ఆ సమయమున, జయజయ నినాదములు, నమోవాక ధ్వనులు, శంఖారావములు చెలరేగెను. గందవొడి చల్లిరి. పూలవాన గురిసెను. కొన్ని దేవగణములు విమానములు నధిరోహించి, యందుఁ గూర్చుండిన వారందఱ మీఁదఁ గల్పవృక్షముల పుష్పములఁ గురియఁసాగెను.”

సూతుఁడు _:-
ఈ ప్రకారము పూజ సమాప్త మయిన పిమ్మట నెల్లవా రేకాగ్రచిత్తులయి యుండిరి. అంత సనకాదులు నారదమునికి శ్రీమద్భాగవత మాహాత్మ్యమును స్పష్టీకరించి వినిపింపఁ సాగిరి.

సనకాదులు _:- “ ఇప్పుడు మేము నీకీ భాగవతశాస్త్ర మహిమను వినిపించు చున్నాము. దీనిని విన్నమాత్రమున ముక్తి కరగతమగును. శ్రీమద్భాగవతకథను సదా సేవించుచుండవలెను. దీని శ్రవణ మాత్రముననే హృదయమున శ్రీహరి విచ్చేసి విరాజితుఁ డగును. ఈ గ్రంథమునఁ బదునెనిమిదివేల శ్లోకములు, పండ్రెండు స్కంధములు గలవు. ఇది శ్రీశుకదేవునకుఁ బరీక్షిన్మహారాజునకు జరిగిన సంవాదము. ఈ భాగవత శాస్త్రమును మేము నీకు వినిపించుచున్నాము. మనస్సుంచి వినుము. ఎంతదాఁక నీ శుకశాస్త్రకథ క్షణకాల మయినను జెవినిఁబడదో, యంతదాఁక నీ జీవుఁ డజ్ఞానమునఁ జిక్కి యీ సంసార చక్రమునఁ దగుల్కొని భ్రమించుచుండును. అనేకము లగు శాస్త్రములు, పురాణములు వినిన నేమి లాభము? వానితో వ్యర్థశ్రమము వృద్ధి కావుటయే కదా. ముక్తి నొసఁగుటకు యొక భాగవతశాస్త్రమే గర్జించుచున్నది. ఏ యింటిలో ప్రతినిత్యం శ్రీమద్భాగవతకథ జరుగుచుండునో, యా గృహము, అందున్న వారు తీర్థరూపు లయ్యెదరు. వారిపాపములు నాశము లగును. వేలకొలఁది యశ్వమేథములు, నూర్లకొలంది వాజపేయ యజ్ఞము లీ శుకశాస్త్రకథకుఁ బదునాఱవపా లయినను సరి గాఁజాలవు. తపోధనా! ఎంతవఱకు లోకులు శ్రీ భాగవత కథ లెస్సగ శ్రవణము చేయరో, యంతవఱకు వారి శరీరమునఁ బాపము నిలచి యుండఁ గలదు. ఫల మిచ్చుటలో నీ శుకశాస్త్రకథకు నేవియు సాటి కాఁజాలవు.

పరమగతి కావలె ననెడి యిచ్చ మీకుఁ గలదేని, మీ నోటితో శ్రీమద్భాగవత మందలి యొక యరశ్లోకమో, యొక పాదమో, నిత్యము నియమపూర్వకముగఁ బాఠ మొనర్పుఁడు. ఓంకారము, గాయత్రి, పురుష సూక్తము, మూఁడు వేదములు, శ్రీమద్భాగవతము, ఓంనమోభగవతే వాసుదేవాయ యను ద్వాదశాక్షర మంత్రము, ద్వాదశ మూర్త్యాత్మకుఁడగు సూర్యభగవానుఁడు, ప్రయాగ, సంవత్సరరూప మయిన కాలము, బ్రాహ్మణులు, అగ్నిహోత్రము, గోవులు ద్వాదశీతిథి, తులసి, వసంతరువు, పురుషోత్తమ భగవానుఁడు యీ యన్నిటి యందు బుద్ధిమంతులగువా రెన్నఁడును భేదమెంచరు. అహర్నిశ మర్థ సహితముగ శ్రీమద్భాగవతమును బాఠ మొనరించు పురుషుని కోట్ల కొలఁది జన్మములం దార్జించిన పాపము నశించును. ఇం దించుకంతైన సందియము లేదు. నిత్యం ప్రతీ శ్రీ భాగవతమందలి శ్లోకార్థమో, పాదమో చదువు పురుషునకు రాజసూయాశ్వమేధ యజ్ఞముల ఫలము లభించును, నిత్యము భాగవతము బఠించుట, భగవానుని చింతనము చేయుట, తులసికి నీరు పోయుట, గోవును సేవించుట ఈ నాలుగు సమానములు. అంతిమకాలమున శ్రీ మద్బాగవత వాక్యమును విను పురుషునిపైఁ బ్రసన్నుఁ డయి భగవానుఁడు శ్రీ వైకుంఠధామమునకుఁ గొనిపోవును. ఎవఁడీ భాగవత శ్రీకోశమును బైండి గద్ది యందుంచి విష్ణుభక్తునికి దానము చేయునో, వాఁ డవశ్యము భగవత్సాయుజ్యమును బొందును. దుష్టు డెవఁడు తన యాయువు నం దొక క్షణమయినఁ జిత్తము నేకాగ్రముచేసి శ్రీమద్భాగవతామృతము నందలి యొక కణమయిన రుచిచూడఁడో, వా డా జన్మమున చండాలునికి, గాడిదెకు సముఁడయి వ్యర్థముగ గాలమును గడపిన వాఁడగును. వాఁడో తల్లికిఁ బ్రసవవేదన కలిగించుటకు మాత్రమే పుట్టినవాఁడు. “ఈ శుకశాస్త్రము నం దొక ము క్కయినను వినని పాపాత్ముఁడు బ్రదికి యుండిన పీనుఁగు. భూమికి బరువుచే టయిన యా పశుతుల్యుఁ డగు మానవుఁడు ఛీ! కాల్పనా!” అని యీ ప్రకారము స్వర్గ మందలి దేవతలలోఁ బ్రధాను లయిన యింద్రాదులు పలుకుచుందురు.

సంసారమున శ్రీమద్భాగవతకథ లభించుట మిగులఁ గఠినము. కోట్లకొలఁది జన్మములలో సంపాదించిన పుణ్యము పండిననే యిది లభింపఁగలదు. కావున యోగనిధివి, బుద్ధిమంతుఁడవు నగు నారదమహామునీ! యీ భాగవతకథను బ్రయత్నపూర్వకముగ శ్రవణము చేయవలెను. దీని వినుటకు దినములం దే నియమము లేదు. దీనిని సర్వదా వినుటయే లెస్స. దీనిని సత్యభాషణ, బ్రహ్మచర్య పాలన పూర్వకముగా వినుట శ్రేష్ఠముగాఁ దలంపఁబడుచున్నది. కాని కలియుగమున నది జరుగుట కఠినము. కావున దీనికి శ్రీశుకదేవులవారు దెలిపిన విశేషవిధిఁ దెలిసికొనుట ముఖ్యము. కలియుగము నందుఁ బెక్కుదినముల వరకు చిత్తమును వశ మం దుంచుకొనుట, నియమబద్ధుఁ డయి యుండుట యెట్టి పుణ్యకార్యమునకు దీక్షితుఁ డయి యుండుట కఠినము. కావున నీ సమయమున సప్తాహశ్రవణవిధి కలదు. శ్రద్ధాపూర్వకముగ నెప్పుడయినను శ్రవణము చేయుటచేత, అథవా మాఖమాసమున శ్రవణము చేయుటచేత నెట్టి ఫలము లభించునో, యాఫలము సప్తాహశ్రమణమునఁ గలుగు నని శ్రీశుకమహర్షి దెలిపియున్నాఁడు. మనోనిగ్రహము లేకుండుట, రోగబాహుళ్యము ఆయు వల్ప మగుట, యింకను ననేక దోషములు కలియుగమున సంభవించుట కలదు. గనుకనే సప్తాహశ్రవణవిధాన మేర్పరుపఁబడినది; తపము యోగము సమాధి మున్నగు వానిచేతను లభింపనట్టి ఫలము సర్వాంగ రూపమున సప్తాహశ్రవణముచేత సహజముగానే లభింపగలదు. సప్తాశ్రవణము యజ్ఞముకంటెను నధిక మయినది; వ్రతములకంటెను మించినది. తపముకంటె నెంతో శ్రేష్ఠ మయినది. తీర్థసేవనము కంటెను సదా యతిశయ మయినది. యోగముకంటె నుత్తమ మయినది. అంతదాఁకఁబోనేల? ధ్యాన జ్ఞానములకంటెను మిన్న. ఆహా! దీని విశేష మెంతని వర్ణించెదము? ఇదియో యన్నిటికంటెను నుత్కృష్ట మయినది.

శౌనకుఁడు _:-
సూతా! యిప్పుడు నీవు మిగుల నాశ్చర్య మైన విషయమును జెప్పితివి. అవశ్య మీ భాగవత పురాణము యోగవేత్త యగు బ్రహ్మకును ఆదికారణ మగు శ్రీమన్నారాయణుని నిరూపించును. కాని యిది మోక్షప్రాప్తి యందు జ్ఞానాది సాధనములఁ ద్రోసిరాజని యీ యుగమున వానికంటె నెట్లతిశయము కల దయినది ?

సూతు _:-
శౌనకమునిపుంగవా! శ్రీకృష్ణ భగవానుఁ డీ ధరాధామమును వీడి, స్వీయ నిత్యధామమునకు వేంచేయు నప్పు డుద్దవుఁడు భగవానుని ముఖారవిందమునుండి వెడలిన మకరండ మయిన యేకాదశస్కంధము నందలి జ్ఞానోపదేశమును వినియు నిట్లని యడిగెను.

ఉద్దవుఁడు_:- “గోవిందా! దేవరవా రిప్పుడు భక్తికార్యముల నిర్వర్తించి పరమధామమునకు వేంచేయ సంకల్పించితిరి; కాని మననమున నొక పెనుదిగులు పడినది. అదివిని దేవర వారు దాసుని శాంతుని జేయవలెను. కటాక్షింపుఁడు! యిప్పుడు ఘోర మగు కలికాలము దాఁపుర మయినది. దీని మూలమున మరలఁ బ్రపంచమున ననేకులు దుష్టులు ప్రబలగలరు. వారి సంసర్గమునఁ బెక్కురు సత్పురుషులును నుగ్ర ప్రకృతి గలవారు కాఁగలరు. అంత వారి భారమునఁ గ్రుంగిపోయి గోరూపధారిణి యగు నీ పృథివి నెవరి శరణు చొఱఁగలదు? కమలనయన! నాకు, దేవరవారుగాక దీని రక్షించు దక్షులు మఱెవ్వరు గాన రాలేదు. కావున నో భక్తవత్సల! సాధువుల మీఁదఁ గృపయుంచి దేవరవా రిందుండి పోవలదు. భగవానుఁడా! దేవరవారు నిరాకారులు చిన్మాత్రులు నయ్యు. భక్తులకొఱకు సగుణరూపధారి నగుచుందురు. మరి, భళా! దేవర వారి వియోగమున నా భక్తు లెట్టు లీ సంసారమున నిలువగలరు? నిర్గుణాపాసన మందు యెంతో కష్టము గలదు. అది వారి వలన నయ్యెడి కార్యము కాదు. కావున నా విన్నపమును గుఱించి దేవరచిత్తమునం దొకించుక విచార మొనరింపుఁడు.”

ప్రభాస క్షేత్రమున నుద్దవుఁడు విన్నవించిన యీ వార్తను విని భగవానుఁడు భక్తులకొఱకు నే నేమి వ్యవస్థ చేయఁదగు నని విచారించి యంతట తన శక్తి యంతయు, శ్రీ భాగవతము నందుంచి తా నంతర్ధానుఁ డయి, యీ భాగవతసాగరమునఁ బ్రవేశించెను. కావున నిది భగవానుని సాక్షాచ్చబ్దమయ మూర్తి. దీనిని సేవించిన, శ్రవణము గావించిన, పాఠ మొనరించిన, లేదా దర్శించిన మాత్రముననే మనుష్యుని పాప మంతయు నంత మగును. ఇందుచే దీని సప్తాహశ్రవణ మన్నిటికంటె నధిక మయినదిగా నెంచఁబడుచున్నది. కలియుగమునఁ దక్కిన యితర సాధనము లన్నిటిని విడిచి. యిదియే ప్రధాన మయినదిగాఁ దెలుపఁబడినది. కలికాలమున నిదియే, దుఃఖమును, దారిద్ర్యమును దౌర్భాగ్యమును, దైన్యమును, బాపములను దుడిచి పెట్టఁజాలిన ధర్మము. కామక్రోధాది శత్రువుల గెలువఁజాలిన నుపాయ యిదియే. కాకున్నచో, భగవంతుని యీ మాయను గడకు ద్రోవ, దేవతలకును దరము గాదు. ఇంక మనుష్యు లెట్లు దీని నిర్జింపఁగలరు? ఆ కారణమున దీనినుండి తప్పించుకొనుటకు సప్తాహశ్రవణ విధాన మేర్పఱుపఁబడినది.

సూతుఁడు_:- శౌనకమునీంద్రా! సనకాదిమునీశ్వరు లీ ప్రకారము సప్తాహశ్రవణమును వ్యాఖ్యానము చేసిన సమయమున, నా సభలో నొక మహాద్భుతము పొడమెను. దానిని నేను మీకు వినిపించెద, వినుఁడు. అక్కడ కకస్మాత్తుగాఁ దారుణావస్థను బొందిన తన యిద్దలు కొడుకులను వెంటఁబెట్టుకొని విశుద్ధ ప్రేమస్వరూపిణి యగు భక్తి మాటిమాటికి "శ్రీకృష్ణ! గోవింద! హరే! మురారే! హేనాథ! నారాయణ! వాసుదేవ!” యనునవి మున్నుగా భగవన్నామముల నుచ్చారణ చేయుచుఁ బ్రత్యక్ష మయ్యెను. ఆ సభ యందున్న వారందఱు భాగవత పరమతత్త్వము, శ్రీభగవానుని కంఠహారము, నగు సుందర వేషధారిణి, భక్తిరాణి విచ్చేయుట గని యబ్బురపడి యీ మునుల సభలోని కీమె యెట్లు వచ్చె నని యోజింపఁజాగిరి. అంత సనకాదులు ఈ భక్తిదేవి కథా ప్రభావముచేతనే యిక్కడఁ బ్రకట మయిన దని చెప్పిరి. వారి యీ వచనముల నాలించి, భక్తి తన పుత్రులతోఁగూడి యత్యంత వినమ్రురా లయి సనత్కుమారునితో భక్తి "కలియుగమున నేను నష్టప్రాయ నైతిని. తాము కథామృతముతో నన్ను దడిపి మరలఁ బురికొనఁ జేసితిరి. తాము నన్నిప్పు డెక్కడ నుండు మని నియమించెదరు?” అని యడుగ సనకాదు లా మాటలు విని యా భక్తితో, “నీవు భక్తులకు భగవత్స్వరూప ప్రదానము చేయుదానవు. అనన్య ప్రేమ సంపాదన మొనరించుదానవు, సంసార రోగమును నిర్మూలము గావించుదానవు. కావున నీవు ధైర్యము బూని నిత్యము నిరంతరము విష్ణుభక్తుల హృదయమున నివాసము చేయుచుండుము. ఈ కలియుగదోషము తన ప్రభావము సర్వప్రపంచముపైఁ బఱపెను గాని యందు నీ మీఁద వీని దృష్టి యైనను పడఁజాలదు.” అని యీ ప్రకారము వారి యాజ్ఞను బొంది, భక్తి వెంటనే భగవద్భక్తుల హృదయము నందుఁ జేరి విరాజమాన మయ్యెను. శౌనకముని నాథా ఎవరి హృదయమున శ్రీ హరిభక్తి ఒకటి మాత్రము నివాసము చేయునో, వారు శుష్కదరిద్రు లయినను ముజ్జగము లందు మిగుల ధన్యులు. ఏలననఁగా నీ భక్తి పాశబద్ధుఁ డయి శ్రీహరియుఁ దన శ్రీవైకుంఠధామమును విడిచి, వారి హృదయము లందు స్థిర నివాసము చేయును. భూలోకమున నీ భాగవతము సాక్షాత్తు పరమాత్మ విగ్రహము. మేము దీని మహిమ నెంతని వర్ణింపఁ గలము. దీని నాశ్రయించి, దీనిని వినిపించుటచేతనే విన్నవారు వినిపించినవారు వీ రుభయులు శ్రీకృష్ణ భగవానుని సామ్యమును బొందఁగలరు. కాన దీనిని విడిచి యన్య ధర్మములతో నేమి ప్రయోజనము?