పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : ఆరవ అధ్యాయము

శ్రీమద్భాగవతమాహాత్మ్యము

ఆఱవ యధ్యాయము

సప్తాహపారాయణ విధి

శ్రీసనకాదు లిట్లనిరి _:-
నారదమునీంద్రా! యిప్పుడు మేము నీకు సప్తాహశ్రవణ విధి వివరించెదము, వినుము. ఈ విధానము లోకుల సహాయముచేతను, ధనముచేతను సాధ్యమయిన దని తెలియఁబడుచున్నది. మునుముందు దైవజ్ఞులను బిలిచి, ముహూర్తము నడుగవలెను. ఒక వివాహమున కెంత ధనము సేకరింతుమో యంత ధనము సమకూర్పవలెను. కథారంభమునకు, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తికము, మార్గశిరము, ఆషాఢము, శ్రావణము; ఈ యాఱు నెలలు శ్రోతలకు మోక్షకారణములుగా గణింపఁబడుచున్నవి. ఈ మాసములలో భద్ర వ్యతీపాతాది త్యాజ్యకాలములు సర్వప్రకారముల సోఁకకుండఁ జూడవలెను. మఱియుఁ బ్రయత్నపూర్వకముగ దేశదేశాంతరములకు మనుష్యులను బంపి “యీ ప్రదేశమున శ్రీమద్భాగవత సప్తాహము జరగును, గావున బంధువులతో మిత్రులతోఁ బరివారముతో విచ్చేసి భగవత్కథాశ్రవణము చేసి కృతార్థులఁ జేయవలసిన దని యెల్లరకును దెలుప నేర్పాటు చేయవలయును. భగవంతుని కథ యన నేమియో, హరికీర్తన మన నేమియో యెఱుఁగని వారెందఱో కలరు. అందఱు నీ ఘోర మగు సంసార మను పెద్ద సముద్రమును దాఁటి కృతార్థు లగుట ముఖ్యము గదా. కాఁబట్టి శూద్రులకు స్త్రీలకు మున్నగువారి కందఱకును నీ విషయమును దెలియు నట్టులు తగిన యేర్పాటులు గావింపవలెను. ఇతర దేశములందుండు విరక్తులగు వైష్ణవుల సన్నిధికి, భగవద్గుణ నామకీర్తన మం దనురాగము గల పరమ భాగవతులకు వారి సన్నిధాన మత్యంతావసరము. కావున వ్యయ ప్రయాసములకు వెనుకాడక యాహ్వానపత్రములు శ్రద్ధాభక్తి పురస్సరముగాఁ బంపవలెను. నిమంత్రణ పత్రిక వ్రాయుపద్ధతి ”మహానుభావులారా! యీ ప్రదేశమున నీ దినము మొదలుకొని యేడుదినముల వఱకు నపూర్వ రసమయమును బరమ పవిత్రమును బరమ కళ్యాణ ప్రదమును నగు శ్రీమద్భాగవత కథ జరుగును. పరమయోగి వరేణ్యులగు శ్రీ శుకుల ముఖ సుధాద్రవమునఁ గలిసి యత్యంత మాధుర్యమునకు నిలయ మగు శ్రీమద్భాగవతకథామృత రసము నెఱిఁగి యానందింపఁ గల రసిక భావవిదుల రగు తా మమూల్యమును దుర్లభమును నగు నీ సమయమునఁ బ్రేమపూర్వకముగ విచ్చేయఁ గటాక్షింప వలెను. కథ పూర్తి యగునంతవఱకు నుండుటకుఁ దమకే కారణమున నయిన నవకాశము కలుగదేని తుద కొక దిన మయినను దమ పవిత్రపాదధూళిచే నీ ప్రదేశమును బావనము చేసెదరు గాత మని యాశించుచున్నాము. ఇట్టి సమయ మన్నప్పు డంతయు లభించుట దుర్ఘటము గావునఁ దమనింతగాఁ బ్రార్థించితిమి” అని పత్రిక లిఖించి సవినయముగ వారికడకుఁ బంపి యామంత్రితులఁ జేయవలెను. వచ్చిన వారికిఁ దగిన వసతులు సర్వవస్తు సంపన్నముగా నేర్పాటు చేయవలెను.

ఈ భాగవత సప్తాహశ్రవణ మే ప్రదేశమునఁ జేయవలయు ననఁగా శ్రీ గంగా యమునాది పుణ్యతీర్థము లుండు తావునఁ గాని, శ్రీ బృందావనము, నైమిశారణ్యము మున్నగు పుణ్యవనము లందుఁ గాని, లేదా తనయింటి యందే కాని జరుగుట యుక్త మని పెద్దల మతము. శ్రీభాగవతకథ జరగు స్థలము విశాలమైనదిగా నుండవలెను. ఆ ప్రదేశమును జక్కఁగా గోమయముతో నలికి, రంగవల్లులు తీర్చి, తోరణములు కట్టి యలంకరింపవలెను. గృహ మందలి సామగ్రుల నెల్ల నా ప్రదేశము నందుండి తీసి లోన నెక్కడనో నొక మూల జాగ్రత్త చేసికొనవలెను. అయిదు దినాలకు ముందుగానే కథ వినువారు కూర్చుండుటకుఁ దగిన యాసనము లనేకములు సేకరించి యుంచవలెను. ఎత్తుగా నొకమండపము నేర్పాటు చేయవలెను. అరఁటిచెట్లు పోకమ్రాకులతో దాని నలంకరింప వలెను. పూలు, పండ్లు, పచ్చని యాకు జొంపముల తోరణములు కట్టవలెను. వివిధము లగు వితానములు (చాందిని) కట్టవలెను. ఆ మండపమున కుపరిభాగమున సప్తలోకములఁ గల్పించి ముందుగానే యచట నుచితములగు నాసనము లేర్పాటుచేసి విరక్తులగు బ్రహ్మణుల ననునయించి యందాసీనులఁ జేయవలెను. దీనికంటె వేఱుగా వక్త కొక పెద్ద వ్యాసపీఠమును నిర్మింపవలెను. వక్త యుత్తరముఖముగా నున్న వినువారు తూర్పు మొగముగాను, చెప్పు నతఁడు తూర్పు మొగమైన వినువా రుత్తర ముఖముగాఁ గూర్చుండ వలెను, అథవావక్తకు శ్రోతలకు నడుమ తూర్పుదిశ రావలెను. దేశకాలగతు లెఱిఁగిన మహానుభావులు శ్రోతల కీ నియమమును విధించిరి. వేదశాస్త్రములను స్పష్టముగా వ్యాఖ్యానము చేయ సమర్ధుఁడును, వివిధము లగు దృష్టాంతముల నీయఁ గలవాఁడును, వివేకియు, నత్యంత నిస్పృహుఁడును నగు నీ దృగ్వికర్త విష్ణుభక్తుఁడగు బ్రాహ్మణుఁడు వక్తగా నుండఁ దగును. అనేక మత, మతాంతర వ్యామోహమునఁ దగుల్కొనిన వాఁడును, స్త్రీ లంపటుఁడును, నాస్తిక వాదమును సమర్థించువాఁడును, వాఁడెంత పండితుఁడే కానీ యట్టివానిని శ్రీమద్భాగవతమునకు వక్తగా నేర్పాటు చేయరాదు. వక్త దగ్గఱ వారికి సహాయముగా నట్టివాఁడే యొక విద్వాంసుఁ డుండ వలెను. అతఁడును సర్వసంశయముల నివారించుటకు సమర్థుఁడును, లోకులకుఁ జక్కఁగ దెలియఁజెప్పఁ గల కౌశల్యము గలవాఁడుగ నుండవలెను.

వ్రతమును పూర్తిగ నిర్వహించు వక్త, కథారంభమున కొకదినము ముందు క్షురకర్మము చేయించుకొన వలెను. శ్రోత లరుణోదయవేళకు అనఁగా సూర్యోదయమునకు రెండు గడియలు ముందుగా శౌచము నివర్తించుకొని శాస్తోక్తవిధి ననుసరించి చక్కఁగా స్నాన మొనరించి, సంధ్యాది నిత్యకర్మముల సంక్షేపముగా నెఱవేర్చుకొని కథ కెట్టి విఘ్నములు రాకుండుటకు గణేశ్వరుని బూజింపవలెను. తదనంతరము, పితృగుణమునకుఁ దర్పణము గావించి పూర్వపాపముల శుద్ధికై ప్రాయశ్చిత్తము చేసికొని, యొక మండలము గల్పించి, యందు శ్రీహరిని స్థాపింపవలెను. వెండియు శ్రీకృష్ణభగవాను నుద్దేశించి మంత్రోచ్చారణ పూర్వకముగఁ గ్రమముగ షోడశోపచార విధిగఁ బూజసలిపి, యావలఁ బ్రదక్షిణ నమస్కారములు సమర్పించి. “కరుణానిధానా! నేను సంసార సముద్రమున మునిఁగి యున్నాను. కడు దీనుఁడను. కర్మమోహ మనెడి మొసలి నన్నుఁ బట్టుకొనినది. తాము నన్నీ సంసార సాగరమునుండి యుద్ధరింపుఁడు” అని స్తుతింపవలెను. అటుపిమ్మట ధూపదీపాది సామగ్రులతో శ్రీమద్భాగవత కోశమునకును మిగుల నుత్సాహముతోఁ బ్రీతిపూర్వకముగ విధివిధానము ననుసరించి పూజ చేయవలెను. ఆవల శ్రీకోశమున కెదురుగ నారికేళము నునిచి, నమస్కరించి, ప్రసన్న చిత్తమున నిట్లని స్తుతి గావింప వలెను. "శ్రీమద్భాగవతరూపమున సాక్షాత్ శ్రీకృష్ణచంద్రుఁ డగు దేవరయే విరాజమాను లయి యున్నారు. నాథా! దాసుఁ డీ భవసాగరమునుండి విడుమర గావించుటకు మిమ్ము శరణు జొచ్చినాఁడు. దాసుని యీ మనోరథమును దా మెట్టి విఘ్న బాధలు లేకుండ సాంగోపాంగముగాఁ బూర్తిచేయ వలెను. కేశవా! దేవరవారికి వీఁడు దాసుఁడు.”

ఈ ప్రకారము దీనములగు వచనము లాడి, యావల వక్తను బూజింపవలెను. అతని సుందర వస్త్రాభరణములతో భూషితు నొనరించునది. మణి పూజ యయిన పిమ్మట నిట్లని స్తుతింపవలెను. శుకస్వరూపుల రగు దేవరవారు జ్ఞానదానమునఁ బ్రవీణులరు. సర్వ శాస్త్రపారంగతులరు. కృపతో నీ కథనుఁ బ్రకాశిత మొనరించి నా యజ్ఞానము బోఁగొట్టుఁడు. ఆవల స్వకల్యాణార్థ మాతని సన్నిధి నియమ గ్రహణ మొనర్చి, సప్తాహమగువరకు యథాశక్తి నియమపాలనము గావింపవలెను. కథలో నడుమ విఘ్నము కలుగకుండుట ముఖ్యము. గాన, నయిదుగురు బ్రాహ్మణులచే ద్వాదశాక్షర మంత్రమును జపము చేయించవలెను. పిమ్మట బ్రాహ్మణులను, విష్ణుభక్తులను, కీర్తిన చేయువారలను నమస్కరించి పూజించి వారి యనుజ్ఞవడసి తానును నాసనమునఁ గూర్చుండవలెను. ఏ పురుషుఁడు లోకచింత, సంపత్తి, ధనము గృహపుత్రాదిక చింత విడిచి, శుద్ధాంతఃకణముతో కేవల కథ యందే ధ్యాన ముంచునో వాని కీ శ్రవణమున నుత్తమోత్తమ ఫలము లభించును.

బుద్ధిమంతుఁ డగు వక్త సూర్యోదయమునుండి కథ నారంభము చేసి, మూఁడున్నర జాములవఱకు మధ్యమ స్వరముతో లెస్సగాఁ గథను జెప్పవలెను. రెండు జాము లప్పుడు రెండు ఘడియలు కథను నిలుపవలెను. ఆ సమయమున కథాప్రసంగానుసారము భాగవతులయు, భగవంతునియు గుణకీర్తనము గావింపవలెను. వ్యర్థ ప్రసంగము చేయరాదు. కథా సమయమున మలమూత్ర వేగమును నాపుటకు స్వల్పాహారమును తీసికొనవలెను. శక్తి కలదేని యేడుదినములు నిరాహారిగా నుండి కథ వినునది. లేదా కేవలము నేయి లేక పాలు త్రాగి సుఖ పూర్వకముగ శ్రవణము చేయ వచ్చును. కాదా పండ్లుతిని లేక యొక పూఁట సాపాటు చేయునది. ఏ నియమము లెట్లు చేయుమన్నను, వానిని కథాశ్రవణము కొఱకేనని గ్రహింపవలె నని తాత్పర్యము, కథాశ్రవణమునకు సహాయక మగునేని యుపవాసము కంటె భోజనము చేయుటే మంచిదని నేను దలఁచుచున్నాను. ఉపవాసమువలన శ్రవణమున బాధ కలుగునేని యా యుపవాసము వలన నేమి ప్రయోజనము?

నారదా! నియమముగా సప్తాహశ్రవణము చేయువా రే నియమములఁ బాలింపవలెనో వినుము. విష్ణుమంత్రదీక్ష గ్రహింపనివాఁడు, హృదయమున భగవంతుని యెడ భక్తి లేని వాఁడు, యీ కథ వినుట కధికారి కాఁడు. నియమముతోఁ గథ వినువాఁడు బ్రహ్మచర్యవ్రత మనుష్ఠింపవలెను. నేలమీఁదఁ బరుండవలెను. నిత్య ప్రతికథ ముగిసిన పిమ్మట పత్రభోజనము (ఉత్తరదేశీయులు పాత్రభోజకులు) చేయవలెను. పప్పు, తేనె, నూనె, బలువైన యన్నము, భావదూషిత పదార్థములు, పాసిన యన్నము సర్వదా త్యజింపవలెను. కామము, క్రోధము, మదము, మానము, మత్సరము, లోభము, దంభము, మోహము, ద్వేషము, తన కడకుఁ జేరనీయనే చేరనీయ రాదు. వేదములను, వైష్ణవులను, బ్రాహ్మణులను, గురువులను, గోసేవకులను, స్త్రీలను, రాజును, మహాపురుషులను నిందచేయఁ గూడదు. నియమపూర్వకముగఁ గథ వినువారు. రజస్వలయైన స్త్రీతో, అంత్యజుల (చండాలాదులు)తో, మ్లేచ్చుల (గోభక్షకుల)తో, పతితులతో, గాయత్రీహీను లగు ద్విజులతో, బ్రాహ్మణుల ద్వేషించువారితో, వేదముల నాదరింపని వారితో మాటలాడరాదు. సర్వదా సత్యము, శౌచము, దయ, మౌనము, సరళత, వినయము, ఉదారత కలిగి యుండవలెను. ధనహీనులు, క్షయరోగులు, మఱియే యితర రోగములచే నైన బీడింపబడువారలు, అదృష్టహీనులు, పాపులు, పుత్రహీనులు, ముముక్షువు లీ కథ వినుటకు విశేషాధికారులు, రజోదర్శనము నిలిచిపోయిన స్త్రీలు, ఒకటియే సంతానము కలిగినవారు, గర్భస్రావము కలిగినవారు, వంధ్యలు (గొడ్రాలు), సంతానము కలిగి పోవువారు, గర్భస్రావము గలవా రవశ్య మీ కథ వినవలెను. ఇట్టి వారందఱు విధిపూర్వకముగఁ గథ వినినచో నక్షయఫలప్రాప్తి కలవారు కాఁగలరు. అనుత్తమ మగు నీ కథ కోట్ల యజ్ఞముల ఫలము నిచ్చు ప్రభావము కలది.

ఈ ప్రకార మీ వ్రతవిధులు ననుష్ఠించి, పిమ్మట యుద్యాపనము (వ్రతాదులను సమాప్తి చేయుట) చేయవలెను. దీనివలన విశేషఫలము నొందవలె ననెడి యిచ్చ గలవారు జన్మాష్టమీ వ్రతమునకు సమానముగానే యీ కథావ్రతమునకు నుద్యాపనము చేయునది. కాని భగవానున కకించిన భక్తులగు వారి కుద్యాపన చేయవలె ననెడి బదనాయము లేదు. వారు శ్రవణముతోనే పవిత్రు లయ్యెదరు. ఏలనన వారు విష్ణుపరాయణులు; వారెట్టి ఫలము నాశింపరు.

ఈ ప్రకారము సప్తాహము సమాప్తము కాఁగానే, శ్రోత లత్యంత భక్తిపూర్వకముగా, శ్రీకోశమునకు, వక్తకుఁ బూజచేయవలెను. అనంతరము వక్త, శ్రోతలకుఁ బ్రసాదము, తులసి ప్రసాదరూప మగు మాలల నీయవలెను. పిమ్మట నెల్లవారును, మృదంగ, తాలములు పూని మనోహర ధ్వనితో చక్కఁగ హరికీర్తనము గావింపవలెను. మఱియు జయజయధ్వానములు, నమస్కార ధ్వనులు శంఖారావములు గావింపఁజేసి, బ్రాహ్మణులకు యాచకులకు ధనము, నన్నము నిడవలెను. ఇది యయిన మఱుసటి దినము, శ్రోత విరక్తుఁ డయ్యెనేని, కర్మమునకు శాంతికై గీతాపారాయణము చేయునది. గృహస్తుఁ డయ్యె నేని హవనము చేయవలెను. ఆ హోమ క్రియ యందు దశమస్కంధములోని యొక్కొక్క శ్లోకమును బఠించి విధిపూర్వకముగ క్షీర, మధు, ఘృత, తిలాది సామాగ్రులతో నాహుతి చేయవలెను. అథవా, ఏకాగ్రచిత్తముతో గాయత్రీమంత్రముతో హవనము చేయించవలెను. ఏలనన వాస్తవముగ నీ మహాపురాణము గాయత్రీ స్వరూపమే. హోమము చేయించుటకు శక్తిచాలనిచో, తత్ఫలప్రాప్తికై బ్రాహ్మణులకు హవనద్రవ్యములను గొంత యీయవలెను. వెండియు, ననేక విఘ్నములు నివర్తించుటకును, విధి యందు న్యూనాధికత లుండునేని యా దోషములు శాంతించుటకును, విష్ణుసహస్రనామ పారాయణము చేయవలెను. దానితో సమస్త కర్మములు సఫలము లగును. ఏలననఁగా నేదియు నింతకు మించినది లేదు.

దీనికిఁ బిమ్మటఁ బన్నిద్దఱు బ్రాహ్మణులకు క్షీరము, మధువు మున్నగు మంచి మంచి పదార్థములతో భోజనము పెట్టవలెను. వ్రతపూర్తికయి గో, సువర్ణ దానములు చేయవలెను. సమర్థత యుండినచో, మూఁడు తులముల బంగారుతో నొక సింహాసనము చేయించి, దానిమీఁద చక్కని యక్షరములలో వ్రాసిన శ్రీమద్భాగవత కోశము నునిచి, దాని కావాహనాది వివిధోపచారములు సమర్పించి, జితేంద్రియుఁ డగు నాచార్యుని వస్త్ర, భూషణ, గంధాదులతోఁ బూజ సలిపి, సదక్షిణముగ శ్రీకోశమును సమర్పింపవలెను. ఇట్టు లొనరించిన బుద్ధిమంతుఁ డగు దాత, జన్మ మరణ బంధమునుండి ముక్తుఁ డగును. సప్తాహపారాయణము సర్వపాపముల నివర్తింపఁ జేయును. దీని నీ ప్రకారము చక్కగా నాచరించిన, మంగళమయ మగు నీ భాగవత పురాణ మభీష్ట ఫలముల నొసఁగును. ధర్మ, అర్థ, కామ, మోక్షము లనెడి చతుర్విధ పురుషార్థసిద్ధి కిది సాధన మగును. ఇందు సందియ మిసుమంతయు లేదు.” అని మఱియు

సనకాదు లిట్లనిరి:-
నారదా! యీ ప్రకారము నీ కీ సప్తహశ్రవణవిధిని సమగ్రముగ వినిచితిమి. ఇంక మఱేమి వినఁగోరెదవు? ఈ శ్రీమద్ భాగవతమో భుక్తిముక్తులు రెంటిని హస్తగత మొనరించును.”

సూతుఁడిట్లనియె _:-
“శౌనకమునిపుంగవా! యీ ప్రకార మానతిచ్చి, సనకాదు లొక యేడు దినముల వఱకు, విధిపూర్వకముగఁ సర్వపాప ప్రణాశినియు, పరమపవిత్రయు, భుక్తిముక్తి ప్రదాత్రియు నగు నీ భాగవతకథను వినిపించిరి. సమస్త ప్రాణులు నియమపూర్వకముగ దీనిని శ్రవణము చేసిరి. దీని యనంతరము వారు విధిపురస్సరముగ భగవానుఁ డగు పురుషోత్తముని స్తుతిగావించిరి. దీనిచే జ్ఞాన వైరాగ్య భక్తులకు మిగులఁ బుష్టి కలిగి తత్క్షణము తరుణత్వమును బడసి యెల్లర చిత్తముల నాకర్షింపఁ దొడఁగెను. తన మనోరథము సిద్ధించుటచే నారద మహర్షియు మిగులఁ బ్రసన్నుఁ డయ్యెను. ఆయనకు శరీర మంతయు రోమాంచ కంచుకిత మయ్యెను. దేవర్షి పరమానంద పూర్ణుఁ డయ్యెను. ఈ ప్రకారము కథాశ్రవణ మొనరించి, భగవత్ప్రియుఁ డగు నారదుఁడు చేతులు జోడించి ప్రేమగద్గద వాణితో సనకాదుల కిట్లని విన్నవించెను.

“నేను బరమధన్యుఁడను; దాము కరుణించి నన్ను మిగుల ననుగ్రహించితిరి. నేఁడు, నాకు సమస్త పాపనివారకుఁ డగు శ్రీహరి ప్రాప్తి కలిగెను. తపోధనులరగు మునీశ్వరగణములారా! సమస్త ధర్మములలో శ్రీమద్భాగవతశ్రవణమే శ్రేష్ఠ మయిన దని నా యభిప్రాయము. ఏల నందురా! దీనిచేతనే సాక్షాత్ వైకుంఠవిహారి యగు శ్రీకృష్ణ పరమాత్మను జేర వచ్చును”.

సూతుఁ డిట్లనియె _:-
“శౌనకమునీంద్రా! వైష్ణవ శ్రేష్ఠుఁ డగు శ్రీనారదుఁ డిట్లనుచుండఁగనే, యందందు గ్రుమ్మరుచు యోగీశ్వరుఁ డగు శ్రీశుకు లక్కడకు వేంచేసిరి. వ్యాసనందనుఁ డగు శ్రీ శుకభగవానుని వయస్సు పదునాఱేఁడులుగ దోఁచుచుండును. వా రాత్మలాభముతోడనే దనివి చెందెదరు. వారెట్టి లౌకికాలౌకిక పదార్థముల వాంఛించువారు కారు. ఆయన జ్ఞాన మనెడి మహార్ణవమునకు సాక్షాత్ పూర్ణచంద్రుఁడే. వారు సరిగా కథాసమాప్తి సమయమున కక్కడకు విచ్చేసిరి. ఆ సమయమునను వారు మెల్లమెల్లగ శ్రీమద్భాగవతపాఠము చేయుచుండిరి. పరమతేజస్వి యగు శ్రీ శుకదేవునిఁ జూడఁగనే, సభలో నున్నవారంద ఱొకపెట్టున లేచి నిలఁబడి, వారి నొక యున్నతాసనమున వేంచేయఁజేసిరి. తరువాత నారదమహర్షి వారికిఁ బ్రేమపూర్వకముగఁ బూజగావించిరి. ఈ ప్రకారము వారు శాంతముగ వేంచేసి ”స్పష్ట మగు నా మాటను వినుఁ” డనుచు శ్రీశుకదేవుఁ డిట్లనియె:

"రస మర్మజ్ఞులు, భక్తి భావభరితాంతఃకరణుల రగు నో భక్తజనులారా! యీ శ్రీమద్భాగవతము వేదకల్ప వృక్షమునఁ బండిన పండు. శ్రీ శుకదేవుఁ డనెడి చిలుక ముక్కు సంబంధమున బరమానందమయ సుధారసమునఁ బరిపూర్ణమైనది. ఇది యంతయు మధురాతిమధురమైన రసమే. ఈ ఫలమునందు, తొక్క టెంక, మున్నగు వదలవలసినవి కొంచెమైనను లేవు. శరీరమున నెంతవఱకుఁ జేతనత్వ ముండునో, యెంతదనుకఁ బ్రపంచము లయము గాకుండునో, యంత దాఁక దివ్యమగు నీ భగవద్రసమును సారెసారెకు నిరంతరము పానము చేయుఁడు. దీనికొఱకు స్వర్గమునకుఁ బోవలసిన పని లేదు. ఇదిగో యీ భూమి మీఁదనే సులభముగ లభించును. ఈ శ్రీమద్భాగవత మహాపురాణము, నా జనకుఁడు, మహామునియుడు నైన శ్రీకృష్ణద్వైపాయన వ్యాసభగవానుఁడు రచించెను. దీనియం దా నిష్కపట పరమధర్మము నిరూపింపఁ బడినది. ఇందు మోక్షపర్యంత మెట్టి వస్తువు నందును కామనా గంధము లేశమయినను లేదు. ఆ పరమధర్మ మనన్యము, విశుద్ధము నగు భగత్ప్రేమ. ఎవని హృదయము విశుద్ధము, మత్సరహీనము నయి యుండునో యట్టి సత్పురుషుల కెఱుఁగ యోగ్యమయిన యా వస్తువు (భగవానుఁ డగు శ్రీకృష్ణపరబ్రహ్మము) నిరూపింపఁ బడినది. ఇది యాధ్యాత్మి కాదిదైవి కాధిభౌతికము లనెడి తాపత్రయమును నిర్మూలించునదియు, బరమ కల్యాణదాయియు నై యున్నది. దీని నాశ్రయించువారికి విలంబముగ ఫలమిచ్చు నితర సాధనలు వేనితోడను, శాస్త్రములతోడను నావశ్యము లేదు. ఏ సత్పురుషుఁడైనను తన యనేక జన్మముల సుకృతముల పరిపాక మయిననే యీమహాపురాణము నిచ్చ చేయును. ఆ సజ్జనుని హృదయము భగవానుఁడే స్వయముగా నా క్షణముననే ప్రవేశించి విరాజమానుఁ డగును. మరల నందుండి తొలఁగిపోవఁడు. ఈ శ్రీమద్భాగవతము పురాణములకుఁ దిలకము. వైష్ణవుల ధనము. ఇందుఁ బరమహంసలకు వలయు విశుద్ధ జ్ఞానమే వర్ణింపఁబడినది. జ్ఞాన భక్తివైరాగ్య భక్తి సహిత నివృత్తి మార్గమే యిందు ప్రకాశిత మయినది. ఏ పురుషుఁడు దీనిని భక్తి పూర్వకముగ శ్రవణ, పాఠ, మననములు చేయునో, వాఁడు ముక్తుఁ డగును. ఈ రసము స్వర్గలోకములో లేదు. సత్యలోకములో లేదు. కైలాసమున లేదు. వైకుంఠమునను లేదు. కావున భాగ్యశాలురగు శ్రోతలారా! మీరు దీని నాపోవఁ గ్రోలుఁడు. దీని నే ప్రకారముగను విడువవలదు. విడువవలదు.

సూతుఁడిట్లనియె _:-
శ్రీశుకదేవుఁ డీవిధముగఁ జెప్పుచునే యుండెను. ఇంతలో సభామధ్యమున ప్రహ్లాద, బలి, యుద్ధవార్జునాది పార్షదులతో సాక్షాత్ శ్రీహరి సాక్షాత్కరించెను. అప్పుడు దేవర్షి నారదుఁడు భగవానుని తద్భక్తులను యథావిధిగాఁ బూజసల్పెను. భగవంతుఁడు ప్రసన్నుఁడగుట చూచి, దేవర్షి, వారి విశాల దివ్య సింహాసనమున నాసీనుఁ గావించి. యా ప్రభుని సమక్షమున సంకీర్తనము చేయఁజాగెను. ఆ కీర్తన చూచుటకుఁ బార్వతీ సహితుఁడయి మహాదేవుఁడును, బ్రహ్మయును విచ్చేసిరి. అంతఁ గీర్తన మారంభ మయ్యెను. ప్రహ్లాదుఁడు, చంచలగతి యయిన కారణమునఁ గరతాళము వేయుచుండెను. ఉద్ధవుఁడు మంజీర మెత్తుకొనెను. నారదముని వీణ వాయించుచుండెను. గానవిద్యాకుశులుఁ డయిన నర్జునుఁడు రాగాలాపనము చేసెను. ఇంద్రుఁడు మృదంగము వాయింప నారంభించెను. సనకాదులు నడుమనడుమ జయజయధ్వనులు చేయుచుండిరి. వీరందఱకు; ముందు నిలిచి శుకుఁడు వివిధాభినయముల సరసభావ ప్రకటనము చేయుచుండెను. వీరందఱకు నడుమ జ్ఞాన వైరాగ్య భక్తులు నటుల వలె నాట్యము చేయఁ సాగిరి. ఇట్టి యలౌకిక కీర్తనను చూచి భగవానుఁడు ప్రసన్నుఁ డయి ”మీ కథాకీర్తనములు నా కత్యంత సంతోషదాయకము లయ్యెను. మీ భక్తి భావమే నన్ను మీ వశము గావించెను. కావున నన్ను మీరు వరము నడుగుఁడు. అని యాడిన భగవంతుని వచనములను విని యెల్లరు మిగుల నానందమగ్ను లయి ప్రేమార్ద్రచిత్తుములతో భగవానునితో నిట్లని విన్నవించిరి. ”భవిష్యత్ కాలమునందును యెక్కడ సప్తాహకథ జరగునో, యక్క డక్కడ దేవర యీ భక్తులతో సన్నిధి కటాక్షింపవలె నని మా యభిలాష. మా యీ యాశ పూర్తిచేయవలెను” అని ప్రార్థింప, భగవానుఁడు ”తథాస్తు” అని యంతర్థానుఁ డయ్యెను.

తదనంతరము, నారదమహర్షి భగవానుని భగవత్పాదుల నుద్దేశించి ప్రణామ మర్పించి, యావల శ్రీశుక బ్రహ్మము మున్నగు తపస్వులకును నమస్కరించెను. కథామృతమును బానము చేయుటచే నెల్లరకు నమితానందము కలిగెను. వారి మోహ మంతయు నాశమయ్యెను. తరువాత నందఱును వారి వారి స్థానములకుఁ దరలి పోయిరి. ఆ సమయమున శ్రీ శుకదేవుఁడు భక్తిని యామె పుత్రులతోఁ దన శాస్త్రమున స్థాపించెను. శ్రీ భాగవతమును సేవించుటచేత శ్రీహరి వైష్ణవుల హృదయము లందు విచ్చేసి సన్నిధి కటాక్షించును. దరిద్రము చేతను, దుఃఖజ్వరము చేతను బీడితు లగు జనులును, మాయా పిశాచికి వశమయిన వారును, సంసార సముద్రమున మునిఁగిన వారును నగు వారి కల్యాణమునకే శ్రీమద్భాగవతము గర్జనము చేయుచుండును.

అంత శౌనకమహాముని యిట్లనియె: “సూతా! మాకొక సందేహము కలదు. దానిని పోఁగొట్టువలెను. శ్రీశుకమహర్షి పరీక్షిత్తునకును, గోకర్ణుఁడు ధుంధుకారికిని, సనకాదులు శ్రీనారదమునికిని నేయే సమయమున నీ గ్రంథమును వినిపించిరి.”

సూతుఁ డిట్లనియె_:- “శ్రీకృష్ణ భగవానుఁడు స్వధామమునకు వేంచేసిన తరువాతఁ గలియుగమున ముప్పది సంవత్సరముల కించుక యధికముగాఁ గడచిన పిమ్మట వచ్చిన భాద్రపద మాసమున శుక్లపక్ష నవమితిథి నాఁడు శ్రీశుకమహర్షి శ్రీమద్భాగవతకథ నారంభము చేసెను. శ్రీపరీక్షిన్మహారాజు కథ వినిన తర్వాత రెండువందల సంవత్సరములు కడచిన పిమ్మట ఆషాఢమాసమున శుక్లనవమికి గోకర్ణుఁ డీకథను వినిపించెను. ఇది జరిగిన యనంతరము కలియుగమున మూఁడు నూఱులేఁడులు గడచిన పిమ్మట కార్తిక శుక్లనవమినుండి సనకాదు లీ కథ నారంభము చేసిరి. అనఘా! శౌనకముని పుంగవా! నీ వడిగిన దానికెల్ల నే నుత్తర మొసఁగితిని. ఈ కలి యుగమున సంసార రోగము నున్మూలించెడి పరమౌషధ మీ భాగవతకథ.”

సాధుజనులారా! తా మాదరపూర్వకముగ నీ కథామృతమును బానము చేయుఁడు. ఇది శ్రీకృష్ణున కత్యంత ప్రియమయినది. సమస్త పాపముల నాశము చేయునది. ముక్తికిఁ బ్రధానకారణ మైనది, భక్తివర్ధక మైనది. లోకమునఁ గల్యాణకరము లగు నితర సాధనల విచారించుటచేతను, తీర్థముల సేవించుటచేతను నేమికాఁగలదు? చేతులందుఁ బాశములు ధరించి యున్న తన కింకరులను జూచి యమధర్మరాజు ”చూడుఁడు! భగవానుని కథా వార్తలందు మత్తు లయిన వారికి దూరముగా నుండుఁడు. నే నితరుల దండింపఁగలవాఁడనే కాని వైష్ణవులను దండింపఁ గాదు”. అని వారి చెవిలో రహస్యముగాఁ జెప్పెను. అపారమగు నీ సంసారమున విషయ విషమున వ్యాకులతఁ జెందినవారలారా! అరక్షణమయిన నీ భాగవతక థానుపమ సుధారసమును బానము చేయుదురేని శాంతి లభింపఁగలదు. మీ రితర కుత్సిత కథలతోఁ గూడిన కుమార్గములం దేల వ్యర్థముగాఁ ద్రిమ్మరెదరు? ఈ కథ చెవినిబడినంతనె ముక్తి చేకూరును. దీనికిఁ బరీక్షిత్తే ప్రత్యక్ష ప్రమాణము. శ్రీశుకదేవుఁడు ప్రేమరస ప్రవాహమున నీదులాడుచు నీ కథను జెప్పెను. ఇది యెవని కంఠముతో సంబంధము కల దగునో వాఁడు శ్రీవైకుంఠమునకు స్వామి యగును. శౌనకమునీశ్వరా! సర్వశాస్త్రములను బరిశోధించి యీ పరమగుహ్య రహస్యమును మీకు వినిపించితిని. సమస్త శాస్త్ర సిద్ధాంతములలోని సారమిది. ప్రపంచమున నీ శ్రీశుకశాస్త్రమునకు మించి యధిక పవిత్రమయిన దింకొక వస్తువు లేదు. కావున తాము పరమానందప్రాప్తి కొఱకీ ద్వాదశస్కంధ రూపరసమును బానము చేయుఁడు. ఏ పురుషుఁడు నియమపూర్వకముగ దీనిని భక్తి భావముతో వినునో, విశుద్ధు లగు వైష్ణవుల సన్నిధిలో వినిపించునో, యీ యిరువు రే విధిని పూర్తిగాఁ బాలించిన కారణమున యథార్థ ఫలమును బడయఁగలరు. వారి కీ మూఁడులోకములలో నసాధ్య మేదియు నుండఁ బోదు.

ఇది పద్మపురాణాంతర్గత శ్రీ భాగవత మహాత్యము అను ఉపాఖ్యానము సంపూర్ణం.

ఓం నమో భగవతే వాసుదేవాయః