పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : ఐదవ అధ్యాయము

శ్రీమద్భాగవతమాహాత్మ్యము

అయిదవ అధ్యాయము

ధుంధుకారికిఁ బ్రేతయోని ప్రాప్తి దాని విమోచనము

సూతుఁ డి ట్లనియె _:-
శౌనకమునీంద్రా! జనకుఁడు వనమునకుఁ జనిన యనంతర మొకనాఁడు ధుంధుకారి తన తల్లిని బట్టుకొని చెడబాది ”చూపు! డబ్బు ఎక్కడ పెట్టినావో? లేదా యిదే యిప్పుడే నీ పనిచెప్పెద నని బెదిరింప, వాని యాగడమును గని భయపడి, దుఃఖించి, యా రాత్రివేళ పోయి భావిలో దూఁకి ప్రాణములు విడిచెను. ఈ ప్రకారము తలిదండ్రు లిరువురు లేకపోవుటచే, గోకర్ణుఁడు తీర్థయాత్రకై బయలుదేఱెను. అతఁడు యోగనిష్ఠుఁడు కావున నీ ఘటనల కతఁడు పొంగిన వాఁడుకాఁడు; క్రుంగినవాఁడు కాఁడు; ఏలనన, నాతని కెవఁడు మిత్రుఁడు లేఁడు, శత్రువు లేఁడు.

ఇప్పుడు, ధుంధుకారి అయిదుగురు వేశ్యలతో నింటిలోనే యుండఁ జాగెను. వారికి భోగసామగ్రి సమకూర్పవలె ననెడి విచార మాతని బుద్ధిని నశింపఁజేయ, వాఁడు వివిధము లగు క్రూరకర్మములు చేయం బూనెను. ఒకనాఁ డా కులటలు వానిని బెక్కు నగలు తెమ్మని యడిగిరి. వాఁడు కామాంధుఁడు. వానికి, మృత్యువు మాటయే మనస్సునకు రాకుండెను. సరి. వాఁడు వారు కోరిన సొమ్ములు సంపాదించి తెచ్చుటకుఁ గొంప నుండి బయలు దేఱిపోయి, యెక్క డెక్కడనో, విశేషధనమును మ్రుచ్చిలి, మరల నింటికిఁ జేరి, వారలకుఁ గొన్ని మేలి చీరలు నగలు సమర్పించెను. ఇంటిలో దొంగసొత్తు చాలా యుండుట గని రాత్రివేళ నా వెలవెలందులు “వీఁడు నిత్యమూ దొంగతనముఁ జేయుచున్నాఁడు. ఒకప్పుడు తప్పక పట్టుబడక మానఁడు. అంత యీ సొత్తంతయు రాజు హరించితీరును. నిజము వీనికి మరణదండనము తప్పదు. ఈ ప్రకారము వీఁడొకనాఁడు చావవలసినవాఁడే. కాబట్టి, రహస్యముగా వీఁనిని మనమేల మట్టుపెట్టరాదు. వీఁనిపని మనము ముగించిమేని ఈ ధనమైనా మనకు దక్కును. వీనినిఁ జంపి యీ సొత్తతంయుఁ దీసికొని, యెందేని లేచిపోవుద” మని యాలోచన చేసి వారు, నిద్రపోవుచున్న ధుంధుకారిని, త్రాళ్ళతోఁ గాలు జేతులు బంధించి, గొంతున కురుఁబోసి చంపఁ బ్రయత్నించిరి. దీనిచే వాఁడు చావకుండుటచే, వారికిఁ జాలఁ జింత కలిగెను. అంత వారు మండుతున్న నిప్పులు తెచ్చి, వాని మొగము మీఁదఁ బోసిరి. ఈ నిప్పులచే మాడి వాని ప్రాణమెంతో కొట్టుకొని, యా శరీరమును విడిచిపోయెను. తరువాత వాని మృత కళేబరము గోఁతిలో వేసి మన్నుఁ గప్పిరి. వాస్తవమిట్టి కామినులు తఱచుగా నెంతటి ఘోరకృత్యము చేయుటకు వెనుదీయని దుస్సాహసము కలవారుగా నుందురు. వా రీ పని చేసిన జాడ యెవరికినిఁ దెలియదు. లోకు లెవరైనా నడిగిరేని “మా ప్రియతముండు ధనాశచే నీసారి యెక్కడకో పోయి చాలా కాల మయినది. బహుశః ఈ సంవత్సరాది లోపలనే తిరిది రావచ్చు నని సమాధానము చెప్పుచుండిరి. బుద్ధమంతుఁ డెప్పుడును దుష్టస్త్రీలను విశ్వశింపరాదు. వీరిని నమ్మిన మూర్ఖుఁడు, విపత్పరంపర వాగురలనుఁ (ఉచ్చులలోఁ) జిక్కి యవశ్యము దుర్గతి పాలు గాఁక మానఁడు. వీని మాట లమృతము వలెఁ గాముకుల హృదయమున కింపుగూర్చును గాని. హృదయము పదును గల చురకత్తి యంచు వలె వాఁడి కలదై యుండును. బళా! ఈ స్త్రీల కెవఁడు ప్రియుండు

తదనంతర మావేశ్య లా ధుంధుకారి సొత్తంతయుఁ దీసికొని గుడిసెమీద దెబ్బకొట్టి, యందుండి లేచిపోయిరి. వారికిట్టి మగ లెంతమంది యయిరో యేమిగురుతు? ధుంధుకారి తాను జేసిన కుకృత్యములచే భయంకరమగు ప్రేత మయ్యెను. వాఁడు సుడిగాలి రూపమున దశదిశలు ద్రిమ్మరుచు శీతాతపములకుఁ క్రాఁగి, యాకలిదప్పుల కలమటించుచు “అయ్యో! దేవుఁడా! ఆయ్యో దేవుఁడా! యని యజచుచుండెను. కాని వానికెందును నెట్టి యాశ్రయమును జిక్కినది కాదు. కొంతకాలము గడచిన పిమ్మట, గోకర్ణుండు ధుంధుకారి చంపబడినవార్త, లోకుల వలనఁ దెలిసి, వాఁడు దిక్కుమాలిన వాఁడగుట యోజించి, గయకుఁబోయి వానికి శ్రాద్ధము పెట్టెను, తా నెక్క డెక్కడకుఁ బోయనో యక్క డక్కడ వానిపై శ్రాద్ధ క్రియలు చేయుచుండెను.

ఈ ప్రకారము గోకర్ణుడు తీర్థయాత్రల సేవించి తిరిగి తన నగరమునకు వచ్చి, యెవరికిఁ గానరాకుండ రాత్రివేళ సూటిగాఁ బోయి తనయింటి ముంగిలిలో బరుండఁబోయెను. అక్కడ తన సోదరుఁడు పరుండుట చూచి యర్ధరాత్రివేళ ధుంధుకారి, యత్యంత వికటరూపముతోఁ గానవచ్చెను. వాఁ డొకప్పుడు (ఒక్కొక్కమారు) గోదురుకప్పవలెను, ఒకసారి యేనుఁగువలెను, నొకతడవ దున్నవలెను, ఒకపరి యింద్రునివలెను. ఒకమాఱు అగ్నివలెను గనంబడెను. తుదకు వాఁడు మనుష్యాకారమునం దోఁచెను. ఈ విపరీతావస్థలనుఁ దిలకించి, గోకర్ణుం డిది యేదో దుర్గతిపాలయిన జీవియని గ్రహించెను. ఇట్లు నిశ్చయపఱుచుకొని గోకర్ణుండు ధైర్యముతో వాని నిట్లని యడిగెను.

“ఏమి అన్నా! నీ వెవఁడవు? రాత్రి సమయమున నిట్టి భయానకరూపముల నేల చూపుచుంటివి? నీ కీ దశ యెట్లు గలిగినది? మాకుఁ జెప్పు. నీవు ప్రేతవా? పిశాచివా! లేక యెవఁడ వయినా రాక్షసుఁడవా?” యని గోకర్ణుం డడిగెను.

సూతుం డిట్లనియె – గోర్ణుం డీ ప్రకారమడుగ, వాఁడు మాటిమటికి భోరున నేడువఁజాగెను. వానికి మాటలాడ శక్తి లేదయ్యెను. ఆ కారణమున కేవలము సైగలు చేయఁగా గోకర్ణుండు దోసిటిలో జలము తీసికొని నభిమంత్రించి వాని మీందఁ జల్లెను. దీనిచే వానికి భాపమొకింత శమనమయి వాం డీ ప్రకారము చెప్పం సాగెను

ప్రేత:- “నేను నీ సోదరుండ నగు ధుంధుకారిని, నేను స్వయంకృతాపరాధము చేతనే నా బ్రహ్మణత్వమును పోఁగొట్టుకొంటిని. నేనుఁ జేసిన దృష్కృత్యముల లెక్కింప నెవరితరము. నేను మహత్తర మగు నజ్ఞానమున మునిఁగిపోతిని. ఆ కారణమున నేను లోకులనుఁ జాల హింస పెట్టితిని, అంతమునం గులట లగు చెడిపెల చేతులలోఁ జిక్కి దుర్మరణము పాలయితిని. ఆ కారణమున నిప్పు డీ ప్రేతయోని యందుం బడి యీ దుర్దశ మనుభవించవలసిన వాఁడ నయితిని, ఇప్పుడు దైవాధీనమున, కర్మఫలోదయ మగుటచే, నేను గేవల వాయు భక్షణచే జీవించుచున్నాను. అన్నా! నీవు దయాసముద్రుఁడవు. ఇప్పుడే ప్రకారముగ నయిన వెంటనే నన్నీ ప్రేతయోని నుండి ముక్తుని చేయుము అని గోడు గోడున నేడ్చెను. అప్పుడు గోకర్ణుఁడు ధుంధుకారి వృత్తాంత మంతయు విని వానితో నిట్లనియె.

గోకర్ణుడు:- “అన్నా! ఇది ఎంతో వింతగా నున్నది. నేను నీ కొఱకు విధిపూర్వకముగ గయలో పిండప్రధానము చేసితిని. అట్లు చేసినను నీవు ప్రేతయోనినుండి యేల ముక్తుడవు కావైతివి? గయాశ్రాద్ధము చేతను నీకు ముక్తి కలుగనిచో, నింక దీనికేమి యుపాయము లేదు. మంచిది! నీ విప్పు డరవిడిచి చెప్పు! నన్నేమి చేయమనెదెవు.”

ప్రేత:- “సోదరా! నా విముక్తి నూఱు గయాశ్రాద్ధము లొనరించినను నగునది కాదు. ఇప్పుడే, నీవు దీని కేదైనా వేఱొక యుపాయ మాలోచింపుము.”

ప్రేత యాడిన మాటల నాలించి, గోకర్ణుఁ డాశ్చర్య చకితుండయి:- “నూఱు గయాశ్రాద్ధములవలనను నీకు ముక్తి కలుగదేని, ఇంక నీకు ముక్తి యసంభవమే. మంచిది. ఇంక నిర్భయుండవై నీవు నీ స్థానమున యుండుము నేను విచారించి, నీ ముక్తికొఱకు వేఱొక యుపాయము చేసెదను.” అని చెప్పెను.

గోకర్ణుని మాట ప్రకారము ధుంధుకారి యందుండి తన స్థానమునకు వెడలిపోయెను. ఇక్కడ గోకర్ణుండు రాత్రి యంతయు నాలోచించుచునే యుండెను గాని, యతని కేమియు నుపాయము తోఁచినదికాదు. ప్రాతఃకాలము కాగానే యాతఁడు వచ్చిన సమాచారము లోకులకుఁ దెలిసి, ప్రేమ వశులయి, యతనినిఁ జూడ నెల్లరు వచ్చిరి. అప్పుడు గోకర్ణుం డా రాత్రి జరిగిన వృత్తాంతమంతయు వారలకు వినిపించెను. ఆ వచ్చినవారిలో, విద్వాంసులు, యోగనిష్ఠులు, జ్ఞానులు, వేదజ్ఞులు గలరు. వారును టెక్కు శాస్త్రములు పరిశోధించిరి కాని, వారికిని ధుంధుకారికి ముక్తి యెట్లు లభించునది యుపాయము దొరికినది కాదు. అంత వారందఱును. సూర్యనారాయణ మూర్తి ఈ విషయమునకై యేమి చేయునో యదియ చేయనగు నని, నిశ్చయము చేసికొనిరి. ఆకారణమున, గోకర్ణుఁడు తన తపోబలమున, సూర్యగమనము నడ్డగించి “భగవానుఁడా! నీవు సర్వలోక పాక్షిని నేను నీకు నమస్కారము చేయుచున్నాను. నీవు నాకు కృపచేసి ధుంధుకారి ముక్తి సాధనమును తెలుపు” మని ప్రార్థన చేసెను. అది విని సూర్యభగవానుడు దూరమందుండి, స్పష్టముగఁ దెలియ నగు మాటలతో “శ్రీమద్భాగవతమువలన ముక్తికలుగఁ గలదు. కావున దానికై నీవు సప్తాహపారాయణ మొనరింపు“ మని చెప్పెను. సూర్యభగవానుఁ డానతిచ్చిన, ధర్మమయ మగు నీ సూక్తుల నక్కడ నున్న వారందఱు వినిరి. అప్పు డెల్లఱును ప్రయత్నపూర్వకముగ “దీనినే చేయుఁడు. కావుట కీ సాధనము చాల సరళమయినది.” అని యేక వాక్యముగఁ బలికిరి. అందుచేత, గోకర్ణుడును నదియే విశ్చయించుకొని కధ వినిపించుటకు సన్నద్ధుఁ డయ్యెను. కథాసమాచారము నెఱిఁగి చుట్టుపట్టుల దేశములనుండి, గ్రామములనుండి యనేకులు వినుటకు రాఁసాగిరి. పెక్కురు పిచ్చుకుంటులు (కుంటివారు, బిచ్చమెత్తుకొనువారు), గ్రుఁడ్డివారు, ముదుసలివారు, మందబుద్ధులును దమతమ పాపములు నివృత్తి ననెడి యుద్దేశముతో నక్కడకు వచ్చి చేరిరి. ఈ ప్రకార మచ్చుట, దేవతలు చూచి యాశ్చర్య పడందగిన గుంపు చేరినది. గోకర్ణుఁడు వ్యాసగద్దెపైఁ గూర్చుండి కథ చెప్పుఁబూనెను. అప్పుడు ప్రేతయును నక్కడకు వచ్చి కూర్చుండుటకుఁ జోటు నచ్చటచ్చటఁ వెదకఁ జొచ్చెను. ఇంతలో నేడు కణుపులుగల వెదురొకటి సూటిగాఁ దాని దృష్టిలోఁ బడెను. దాని యుడుగున బెజ్జములోఁ దూఱి, యా కథను వినుటకయి యందుఁ గూర్చొండెను. వాయు రూపమున నుండుటచే నది వెలుపల నెక్కడనుఁ గూర్చుండఁ జాలని కారణమున వెదురులోఁ దూఱెను.

గోకర్ణుఁ డొక వైష్ణవ బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా నియమించుకొని ప్రథమస్కంధమునుండియె స్పష్ట మయిన స్వరముతోఁ గథను వినిపింపఁ దొడంగెను. సాయంకాలమునకుం గథ నిలుపంగానే, యొక వింత విషయము జరిగెను. అక్కడ సభాసదులు చూచుచు నుండంగనే, వెదురు కణుపాకటి, పటపట యను ధ్వనితో బగిలిపోయను. ఈ ప్రకారము రెండవ దినము సాయంకాలము, మఱియొక కణుపు పగిలెను. మూఁడవనాడు. మూఁడవ కణువు, ఈ విధముగా, నేడవ దినమున నేడవ కణువు పగిలి ధుంధుగారి, ద్వాదశస్కంధములు వినుటచేఁ బవిత్రుఁడయి, ప్రేతయోని నుండి ముక్తుఁడయి దివ్యరూపమును ధరించి, యల్లర సమక్షమునఁ బ్రకట మయ్యను నీలమేఘమునకు సాటి యయిన శ్యామశరీరము, పీతాంబరము. తులసిమాలలతో, సుశోభితుఁ డయి యుండెను. శిరమున మనోహర మకుటము, కర్ణములు గమనీయ కుండలములు ధగధగ మెఱయుచుండెను. వెంటనే వాఁడు తన సోదరుఁ డగు గోకర్ణునకుఁ బ్రణామ మొనరించి “అన్నా! నన్ను నీవు కృపచే ప్రేత నయి యుండి పడుతున్న యాతనలనుండి ముక్తుని గావించితిని. ఈ ప్రేతపీడా వినాశక మగు శ్రీమద్భాగవతకథ ధన్య మయినది. అట్లే శ్రీకృష్ణచంద్రుని వరమధామమును బ్రాపించట జేయు దీని సప్తాహ పారాయణమును ధన్య మయినది. సప్తాహశ్రవణ యోగము లభించి నంతనే, సమస్త పాపములను నిక నీ భాగవత కథ తత్క్షణమే మనల నాశమొనరించునని, తరతరలాడి లేచిపోవును. ఏ ప్రకార మగ్ని ఎట్టి పచ్చి కట్టెలను, చిన్న పెద్ద కట్టెలనుఁ గాల్చి వేయునో, యట్టులే సప్తాహశ్రవణము, ప్రాఁత క్రొఁత్త పాపములను, చిన్న పెద్ద పాపముల నన్నిటిని భస్మము చేసివైచును. విద్వాంసులు దేవతల సభలో నీ భారతవర్షమున నే పురుషుఁడు శ్రీమద్భాగవత కథను వినఁడో, వాని జీవనము వ్యర్ధమయిన“ దని పలికిరి. బళీ! మోహవశమున, లాలన పాలనము లొనరించి యనిత్యమగు నీ శరీరమును కండలు పెంచి బలిపించి, శ్రీమర్భాగవత కథ విననిచో, దీనివలన నేమి లాభము? ఈ శరీరమను కొంపకు ఎముకల కాధార స్తంభములు, నరములు నాడు లనెడి రజ్జువులచే బంధించి, రక్తమాంసములచేఁ బూతపూసి, చర్మముతోఁ గప్పి యుండఁబడినది. దీని ప్రతి యంగమునుండి మలము వెలువడుచుండును. ఏలనన నిది మలమూత్ర భాండము. ముసలితనమునకు శోకమునకుఁ గారణ మగుట నిది పరిణామమున దుఃఖమయమే. రోగముల కిది నిత్యనివాసము. ఇది నిరంతరం మేదియా యొక కోరికచేఁ పీడింపఁ బడుచునే యుండును. ఎప్పుడును. దీనికిఁ దృప్తి లేదు. దీని మోసికొని తిరుగుటయు నొకు భారమే. దీని రోమరోమమున దోషము నిండియుండును. ఇది నశించిపోవుట కొకక్షణము పట్టదు. తుదకు దీనిని పూడ్చిపెట్టిన, పురుఁగులగును, ఏమయిన మృగములు దినినఁ బెంట యగును, నిప్పులో గాల్చిన బూడిద యగును. దీని గతి యీ మూఁడు విధములని సిద్ధాంతమైనది. ఇట్టి యస్థిరమగు శరీరముతో, మనుష్యుఁ డవినాశియగు ఫలము నొసఁగు కార్యమేల చేయఁబూనఁడు? ప్రొద్దుటి ఝామున వండిన యన్నము, మావటివేళకు బాచిపోవును. అట్టి యన్న రసముతోఁ బోషింపఁబడిన యీ దేహము యొక్క శాశ్వత మేమి?

ఈ లోకమున సప్తాహశ్రవణము చేయుటచే భగవత్ప్రాప్తి శీఘ్రమే కలుగఁ గలదు. ఆ కారణమున సమస్త విధ దోషముల నివర్తింపఁజేయ నిది యొకటియ సాధనము. ఎవఁడు భగవత్కథ వినఁడో వాఁడు, జలమందలి బుద్భుదమువలెను, జీవులలో దోమవలెను మరణించుటకే జన్మించిన వాఁడు. దీని ప్రభావమున జడమయి, యెండిన వెదురు కణువులు (ముడులు) పగిలిపోఁజాలెనో, యట్టి భాగవతకథ శ్రవణము చేయుటచేఁ జంత్త మందలి ముడులు విడిపోవుట యేమంత గొప్ప విషయము? సప్తాహశ్రవణముచే మనుష్యుని హృదయ గ్రంథులు విడిపోవును. అనఁగా వానికి గల దేహాత్మబుద్ధి సదా దూరమయి పోవఁగలదు. వాని సర్వ సంచయములు చిన్నాభిన్నము లగును. సమస్త కర్మములు క్షీణించిపోవును. భగవత్కథా రూప మయిన తీర్థము సంసారజంబాలము (బురద)ను గడిగివేయుటలో మిగుల సమర్ధ మయినది. హృదయమున నిది యెప్పుడు విలుచునో మనుష్యునకు ముక్తి నిశ్చయమే యని తెలియవలెనని విద్వాంసులు నానడి,” అని ధుంధుకారి యీ విషయ మంతయుఁ చెప్పుచుండెను. ఇంతలో వానికొఱకు, శ్రీవైకుంఠవాసులగు పార్షదులతో నొక విమానము దిగెను. దానిచే నలుగడల మండలాకారముగఁ ప్రకాశము వ్యాపించెను. అక్కడ నెల్లవారి సమీపముననే ధుంధుకారి యా విమానము నధిరోహించెను. అప్పు డా విమానము మీఁద వచ్చిన పార్షదులం గాంచి, గోకర్ణుఁ డిట్లని యడిగెను.

గోకరుడు:- భగవత్ప్రియులరగు పార్షదులారా! ఇక్కడ మా శ్రోత లనేకు లుండిరి కదా, వీరి కందఱి కీ విమానముతోనే పెక్కు విమానముల నేల కొనిరాలేదు? ఇక్కడ నున్న వారందఱు సమానముగానే కథ వినుట మేము చూచుచున్నాము. ఫలము నంద భేద మేల కలిగినది.”

భగవత్సేవకు లిట్లనిరి:- “ఓ మానవ! ఈ ఫలమునకుఁ గారణము, వీరి శ్రవణ మందలి భేదమే. శ్రవణమో, వీరందఱు సమానముగాఁ జేసియుండుట నిజమే. కాని, వీరట్లు మననము చేయలేరు. దీనిచే నొకసారియే శ్రవణము సేసినప్పటికిని, దాని ఫలము నందు భేదము కలిగినది. ఈ ప్రేత యేడు దినముల వఱుకు నిరాహారి యై శ్రవణము చేయుచుండెను, విన్న దానిని స్థిరచిత్తముతో లెస్సగా మనన నిధిధ్వాసనములుఁ గూడఁ జేయుచుండెను. చూడు! దృఢముగా విజ్ఞానము, వ్యర్ధమై పోవును. ఈ ప్రకారము ధ్యాసముంచక పోవుటచే శ్రవణమునకు, సందేహముచే మంత్రమునకు, చిత్త మటునిటు చలించుటచే జపమునకు నేమియు ఫల ముండఁబోదు. విష్ణుభక్తులు లేని దేశము నాశమగును; కుపాత్రుఁడగు బ్రాహ్మణునిచే; జేయించిన శ్రాద్ధము వ్యర్థమయిపోవును; శ్రోత్రియుండు కాని బ్రాహ్మణున కిచ్చిన దానముల కెట్టి ఫలమును కలుగదు. అనాచారముచే కులము నాశమగును. గురుని వచనము లందు విశ్వాస ముంచి, తన యందు దీనుఁడ ననెడి భావన కలిగి, మనో దోషముల యెడఁ గనుగలిగి, కథ యందు దృఢనిష్ట వహించి యీ కధ వినినఁ, బూర్ణఫలము లభింపంగలదు. మరల శ్రవణము చేయింపుము. అది ముగిసినంతనే యెల్ల వారికి శ్రీవైకుంఠవాసము లభింపఁగలదు. భగవానుఁడు స్వయముగా వేంచేసి నిన్ను గోలోకధామమునకుఁ దీసికొని పోవఁగలఁడు,”

అని యీ ప్రకారము చెప్పి, యా పార్షదులందఱు హరికీర్తనము చేయుచు ధుంధుకారిని విమానముమీఁద నుంచుకొని వైకుంఠలోకమునకుఁ బోయిరి.

శ్రావణమాసమున గోకర్ణుఁడు, మరల సప్తాహక్రమము ననుసరించి కథ వినిపించెను. ఆ శ్రోత లందఱు మరల వినిరి. నారదా! ఈ సారి కథ సమాప్తమయిన పిమ్మట నేమి జరిగినదో వినుము, అక్కడ కనేక విమానములతో భక్తులతో భగవానుఁడు వేంచేసెను, అప్పు డన్ని ప్రక్కల జయజయ ధ్వనులు, నమస్కార నినాదములు నిండిపోయెను. భగవానుఁడు సంతోషించి, పాంచజన్యమునుఁ బూరించెను. గోకర్ణుని గాఢాలింగనము చేసికొని సారూప్యము నొసంగెను. దీనికిఁ బిమ్మట భగవానుడు తక్కుఁ గల శ్రోతులనందఱను మేఘము వలె శ్యామవర్ణము గలవారిగాను, పీతాంబరధారులుగాను, కిరీటకుండలాది భూషితులుగాను గావించెను. ఆ గ్రామమండలి కుక్కలు, చండాలులు మున్నుగాగల జీవుల నన్నిటిని గోకర్ణుని కృపచే విమానములమీఁద నధిరోహింపఁ జేసి. వైకుంఠధామమునకుఁ బంపెను. ఈ ప్రకారము భక్తవత్సలుఁడగు శ్రీకృష్ణ భగవానుఁడు, వారి కధాశ్రవణమందుఁ బ్రసన్నుఁ డయి గోకర్ణుని తనతోఁ దీసికొని, గోపబాలకులకుఁ బ్రియమైన గోలోకధామమునకు వేంచేసెను. పూర్వకాలమున నయోధ్యవాసులు శ్రీరామప్రభునితో సాకేతధామమునకుఁ జనిన విధముగా, శ్రీకృష్ణ భగవానుఁడు వీరి నెల్ల గొప్పగొప్ప యోగులకును దుర్లభమైన గోలోకధామమునకుఁ గొనిపోయెను, సూర్యచంద్రులకును సిద్దులకును దుర్గమ మయిన లోకమునకు శ్రీమద్భాగవత శ్రవణము చేతనే వారు పోవఁగలిగిరి,

నారదా! సప్తాహయజ్ఞమునఁ గథా శ్రవణము చేయుటచే నెట్టి యుజ్ఝ్వల ఫలము గలుగునో దానిని గుఱించి మేమేమి నీకుఁ జెప్పుదుము? ఓహొ! ఎవరు తమ కర్ణపుటముల, గోకర్ణుని కథలోని యొక యక్షరమును బానము చేయుదురో వారు మరల మాతృగర్భమునకు రారు. వాతాంబు పర్ణాశనులై, (గాలి, నీరు, ఆకులు తిను వారై) శరీరమును శుష్కిపఁజేసి, బహు కాలము వఱకుఁ జేయు ఘోరతపస్సు చేతను, యోగాభ్యాసము చేతను బొందజేయు గతి, సప్తాహశ్రవణముచేత సహజముగానే లభింపఁగలదు. పరమ పవిత్రమగు నీ యితిహాసమును చిత్రకూట పర్వతము మీఁద విరాజమానుఁడైన శాండిల్య మహాముని బ్రహ్మానందమున మగ్నుడయి పఠింపజేయుచుండును. ఈ కథ మహాపవిత్ర మైనది. శ్రాద్ధకాలమున దీనిని బఠించినచోఁ బితృదేవతల కతిశయ మగు తృప్తి కలుగును, నిత్యము వఠించినవాడు జన్మ మరణ చక్రమునఁ దగుల్కొనఁడు.