శ్రీకృష్ణకర్ణామృతము : మున్నుడి
మున్నుడి
“కస్తూరీ తిలకం లలాటఫలకే. . “ శ్లోకంతెలియని వారు లేరు. ఇంతటి అమృత గుళిక ఎక్కడిది? రచించిన వారు ఎవరు? అంటే చాలా మంది చెప్పలేరు. శ్రీకృష్ణకర్ణామృతము అను అద్భుతమైన భక్తి రసాపూర్ణమైన గ్రంథంలో ద్వితీయాశ్వాసంలో ఉన్నది. భాగవతాధార రచనలలో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. శ్రీలీలాశుక యోగీంద్రుల విరచిత మిది, ఇంకొక విశేషం. వీరు మన తెలుగు వారే. కృష్ణానది ఒడ్డున గల శ్రీకాకుళం వాస్తవ్యులు అంటారు.
వీరికి బిల్వమంగళుడు అని మరొక పేరు కలదు. వీరి గురించి వివరాలు ఇదమిద్ధంగా అందుబాటులో లేవు. ప్రజలలో వినబడునవి తలుచుకుందాము.
విద్యా విశిష్ఠత, కవితా పటిమ అధికమే. కాని, చింతామణి అను వేశ్య యందు వీరికి చపలత ఉండెడిది, దానితో తన జ్ఞాన, పాండిత్య, ప్రతిభలు వ్యర్థము చేసుకొనుచుండెను. చింతామణి వీరిని సోమగిరి గురువు వద్దకు పంపెను. మన జాతికి శ్రీకృష్ణకర్ణామృత మను భక్తిరస సాగరమూ లభించెను.
ఈ గ్రంథమున మూడాశ్వాసములు కలవు. ప్రథమాశ్వాసమున కవి శ్రీకృష్ణుని మనోజ్ఞతనూ, సౌందర్యాది విశేషములను వర్ణించెను. కృష్ణసాక్షాత్కారము కొఱకు నిరతిశయ భక్తితో ప్రార్థించెను, మిక్కిలి తపించెను. అంత వీరికి సాక్షాత్కారము లభించెను.
కృష్ణుని శైశవదశ అందు మహాకవికి అత్యంత అనురాగము కలదు. కనుక, ఆ ముగ్ధమోహన మూర్తి వర్ణనలు అల్ప పదములందు అనల్ప రసము, నిబిడ చమత్కారములతో మైమరపించును..
ద్వితీయాశ్వాసమునందు శ్రీకృష్ణుని లీలలు బహువిధముగ మిక్కిలి నైపుణ్యముగా సొబగుగా వర్ణించెను. రాసక్రీడాష్టకము మిగుల రమ్యముగా వర్ణించుటలో వీరి కౌశలము ప్రతిఫలిస్తున్నది.
ఇక, తృతీయాశ్వాసమున శ్రీకృష్ణుని అనేక విధముల చేసిన వర్ణనలు మధురము, సౌకుమార్యములతో మిక్కిలి మధురతరమై, భక్తిరసమున ఓలలాడించును.
సౌజన్యము:
శ్రీకృష్ణకర్ణామృతంలోనుండి ఎంచిన శ్లోకాలు ఎనిమిదింటిని, చక్కని వ్యాఖ్యాలములు వినుకరులతో, నిసర్గ రామణీయమను బ్లాగు నందు వేంకట కణాద గారు అందించిరి. ఆ ఎంచిన శ్లోకాలు ఇక్కడ చదువుకొన గలరు. రుచి చూసారు కదా.
మూలపాఠం, “శ్రీకృష్ణకర్ణామృతము” 331 శ్లోకాలు జాలగూడు తెలుగుభాగవతం,ఆర్గ్ నందు సంపూర్ణంగా ప్రచురించాము. వాటిని ఇక్కడ ఆస్వాదించండి. మీ ఆదరాభిమానాలు మాకు అందించండి.
~ భాగవత గణనాధ్యాయి.
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.