శ్రీకృష్ణకర్ణామృతము : ఎంచిన శ్లోకాలు
శ్రీ కృష్ణ కర్ణామృతం ఎంచిన శ్లోకాలు
జొన్నలగడ్డ పతంజలి
జొన్నలగడ్డ పతంజలి
శ్లో.
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం,
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ,
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!
ఈ శ్లోకం ఎక్కడో విన్నట్లున్నది కదా! గాన గంధర్వుడైన మహానుభావుడు ఘంటసాల గారి మధుర గాత్రంలో ఆంధ్రదేశమంతటా మారుమోగిన "పాండురంగమహత్యం" సినిమాలోని "జయ కృష్ణా ముకుందా మురారే" అనే పాట గుర్తుంది కదా? ఆ పాటలో సమయోచితంగా, సందర్భోచితంగా వాడిన శ్లోకమిది.
మరి ఈ శ్లోకానికి మూలమెక్కడుంది?
సంస్కృత సాహిత్యంలో ప్రముఖ స్థానమలంకరించిన శ్రీ కృష్ణుని స్తుతి కావ్యం "శ్రీకృష్ణకర్ణామృతం"లోది ఈ శ్లోకం. కృష్ణభక్తిని మధురంగా గానం చేసే గ్రంధాలలో విశిష్టమైన జయదేవుని "గీత గోవిందమూ", నారాయణ తీర్ధుల "కృష్ణలీలా తరంగిణీ," "క్షేత్రయ్య పదాలూ" వీటి కోవలోకి వచ్చేదే "శ్రీ కృష్ణకర్ణామృతం". ఈ నాలుగు గ్రంధాలూ ఆంధ్రదేశం నాలుగు మూలలా నిన్న మొన్నటి వరకూ పండిత పామరులు చాలామంది నోళ్ళల్లో నానుతూ ఉండేవి. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడా పరిస్థితి లేదు.
శ్రీ కృష్ణ కర్ణామృతం " గ్రంధకర్త లీలాశుకుడు. ఈయనకే "బిల్వమంగళుడు" అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ "శ్రీ కృష్ణకర్ణామృతం" లోనిశ్లోకాలు 14 వ శతాబ్దం నుంచీ ఇతర గ్రంధాలలోనూ, శాసనాలలోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాశుకుడు 11 వ శతాబ్ది నుంచీ 14 వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాశుకుడు జయదేవుడికంటే గూడా ప్రాచీనుడనే చెప్పాలి.
ఈ లీలాశుకుడు ఆంద్ర దేశంవాడనీ, వంగదేశం వాడనీ, మళయాళదేశం వాడనీ రకరకాల వాదాలున్నాయి. అయితే కృష్ణభక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశయాత్రలో కృష్ణానదీతీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణకర్ణామృత గానం విని ఆనందభరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంధం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్యచరితామృతంలో చెప్పబడిఉంది.
లీలాశుకుడు ఏ ప్రాంతం వాడైనాగానీ ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడూ, పండితుడూ, అద్వైత సంప్రదాయంలో అభినివేశమున్నవాడూ అనటంలో సందేహం లేదు. అటువంటి మహావ్యక్తిని "చింతామణి" నాటకం ద్వారా తెలుగువారు తమవాడిని చేసుకున్నారు.. తన తండ్రిగారు చెప్పిన లీలాశుకుడి కధ తనకు ప్రేరణ అని చింతామణి నాటకకర్త కాళ్ళకూరినారాయణరావు గారు చెప్పుకున్నారు.
శ్రీమద్భాగవత ప్రవక్తగా ప్రసిద్ధుడైన శుకుని లాగానే బిల్వమంగళుడు కూడా శ్రీకృష్ణలీలామాధుర్యాన్ని ఆస్వాదించి, అనుభవించి, ఆ పారవశ్యంలో మునిగి శ్రీకృష్ణకర్ణామృతాన్ని మనకందించి లీలాశుకుడనే సార్ధకనామధేయుడయ్యాడు.
ఈ గ్రంధంలోని శ్లోకాలన్నీ "ముక్తక"రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలూ స్వతంత్రంగా సమగ్రమైన అర్ధాన్ని అందిస్తాయన్నమాట. కధకోసం, భావంకోసం ముందు వెనకల శ్లోకాలు చూడక్కర్లేదు. ఈ గ్రంధం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందోవిషయాల సమాహారమని చెప్పవచ్చు. ఇది కేవలం కర్ణామృతమే కాదు. కరణామృతం. అంతః కరణామృతం కూడా. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జెలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు, కుండల వంటి జడపదార్ధాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించటం మరో విశేషం. కృష్ణుడు, గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగానో, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడిగానో మాత్రమే ఈ కావ్యంలో మనకు దర్శనమిస్తాడు.
శ్రీకృష్ణలీలామృత మహాసముద్రాన్ని అర్ధవంతమైన సాహిత్యంతో, వినటానికీ, పాడుకోవటానికీ ఇంపైన మధురభక్తికావ్యంగా మలిచిన "శ్రీకృష్ణకర్ణామృతం"లోని కొన్నిశ్లోకాలని ఈ కాలపు పాఠకులకి పరిచయం చేయటానికే ఈ ప్రయత్నం.
శ్లోకం
చిన్తామణి ర్జయతి సోమగిరి ర్గురు ర్మే
శిక్షాగురుశ్చ భగవాన్ శిఖి పింఛమౌళిః
యత్పాదకల్పతరుపల్లవశేఖరేషు
లీలాస్వయంవరరసం లభతే జయశ్రీః
శ్రీకృష్ణకర్ణామృత కావ్య రచనలో, ముందుగా నాకు మార్గదర్శి అయిన చింతామణికీ, నాకు దీక్షాగురువైన సోమగిరికీ నమస్కరిస్తున్నాను. కల్పవృక్షం తన చిగురాకుల కొనలవద్ద శ్రీ లక్ష్మిని అలంకరించుకుని విలాసముగా కనిపిస్తుంది. ఆ కల్పవృక్షం లాంటి పాదాలతో విరాజిల్లుతూ నెమలిపింఛము ధరించి ఉన్న నా శిక్షాగురువైన శ్రీ కృష్ణుడికికూడా ఈ సందర్భముగా నమస్కరిస్తున్నాను.
శ్లోకం
అస్తి స్వస్తరుణీకరాగ్రవిలస త్కల్పప్రసూనాప్లుతం
వస్తు ప్రస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులం
స్రస్తస్రస్తనిరుద్ధనీ వివిలస ద్గోపీసహస్రావృతం
హస్తన్యస్తనతాపవర్గమఖిలో దారం కిశోరాకృతి.
లోకోత్తరమైన ఒక మహత్తర శక్తి వెలుగులు చిందిస్తున్నది. ఆ శక్తి బాలకృష్ణుడనే ఒక పసిబాలుని రూపంలో ఉన్నది. స్వర్గలోకంలోని స్త్రీలు కల్పవృక్షం యొక్క పుష్పాలతో ఆ బాలుడిని ముంచెత్తుతున్నారు. ఆ బాలుడేమో నిరంతరమూ మురళిని వాయిస్తూ దాని మధురనాదంతో అందరికీ ఆనందం పంచుతున్నాడు. మనస్సులలోని శృంగార భావనలవలన తమ వస్త్రాల ముడులు ఊడిపోతున్న అనేకవేలమంది గోపస్త్రీలు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరి ఉంటారు. మహత్తరశక్తివంతుడైన ఆ బాలగోపాలుడు నాకు మోక్షము అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.
శ్లోకం
చాతుర్యైకనిదానసీమ చపలాపాంగచ్ఛటామన్థరం
లావణ్యామృతవీచి లోలితదృశం లక్ష్మీకటాక్షాదృతమ్
కాళిన్దీపులినాంగణ ప్రణయినం కామావతారాంకురం
బాలం నీలమమీ వయం మధురిమ స్వారాజ్య మారాధ్నుమః
గోపాలకృష్ణుడు బాల్యసహజమైన భావనలకూ, యౌవ్వన సహజమైన శృంగారభావనలకూ మూలకారకమైన తత్వాలు రూపుదాల్చినవాడు. ఆయన కళ్ళు ఆయా భావాలని ప్రదర్శించే చంచలమైన చూపులతో మెరిసిపోతుంటాయి. అంతేకాదు. ఆ కళ్ళు లావణ్యమనే అమృతపు అలలతో నిండిన సముద్రాలవంటివి. సాక్షాత్తూ లక్ష్మీదేవి అవతారమైన రాధాదేవి నిరంతరం ఆ గోపాలకృష్ణుడిని సాదరంగా చూస్తూ ఉంటుంది. యమునానది ఒడ్డున ఉన్న ఇసుకతిన్నెలపై తిరుగుతూ ఉండే నీలవర్ణుడైన ఆ గోపాలకృష్ణుని సుందరరూపం చూసి పకాంతలలో శృంగారభావనలు మొలకెత్తుతాయి. ఈ మధురమైన లక్షణాలు కలిగి స్వర్గరాజ్యసుఖాలందించే శృంగారరసస్వరూపుడైన గోపాలకృష్ణుని ఆరాధిస్తాను.
శ్లోకం
బర్హోత్తంసవిలాస కున్తలభరం మాధుర్య మగ్నాననం
ప్రోన్నీలన్నవయౌవనం ప్రవిలసద్వేణు ప్రణాదామృతం
ఆపీనస్తన కుట్మలాభిరభితో గోపీభి రారాధితం
జ్యోతి శ్చేతసి న శ్చకాస్తు జగతా మేకాభిరామాద్భుతమ్
అన్నిలోకాల్లోని మనోహరములైన వస్తువులకంటే మనోహరమైనదీ, ఆశ్చర్యకరమైన పదార్ధములన్నిటికంటే ఆశ్చర్యకరమైనదీ గోపాలకృష్ణుని దివ్య తేజస్సు. ఆయన శిరస్సులో నెమలిపింఛము అలంకారంగా ఉంటుంది. ఆయన వయస్సు బట్టి బాలుడే అయినా సౌందర్యంలో పడుచువారి లక్షణాలు కనిపిస్తాయి .మాధుర్యాన్ని వెలువరించే ఆయన ముఖంనుండి వీనులవిందైన మురళీనాదం వెలువడుతూ ఉంటుంది. బలమైన స్థనములు కలిగిన ప్రౌఢగోపకాంతలు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి తేజోరూపుడైన బాలగోపాలుని రూపం ఎప్పుడూ మా మనస్సులలో ప్రకాశించాలని కోరుకుంటున్నాను.
శ్లోకం
మధురతరస్మితామృతవిముగ్ధముఖామ్బురుహం
మదశిఖిపింఛలాంఛిత మనోజ్ఞకచప్రచయమ్
విషయవిషామిషగ్రసనగృధ్నుని చేతసి మే
విపులవిలోచనం కిమపిధామ చ కాస్తి చిరమ్
దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే బాలకృష్ణుని ముఖం మధురమైన చిరునవ్వు అనే అమృత మకరందము వల్ల మరింత శోభాయమానంగా ఉంది. తలలో పింఛము ధరించిన ఆ తేజోమూర్తికి విశాలమైన కళ్ళు మరింత అందాన్నిస్తున్నాయి. ఆ బాలకృష్ణుని సందర్శనం లౌకిక సుఖాలగురించిన కోరికలనే విషాన్ని హరించే శక్తి కలిగి ఉంది. అందువల్ల అందరూ ఆయన సందర్శనం కోసం ఆరాటపడతారు. నేనుకూడా అటువంటి ఆశతోనే ఆయన దివ్యతేజాన్ని గానం చేయటానికి పూనుకున్నాను.
శ్లోకం
ముకులాయమాననయనామ్బుజం విభోర్
మురళీనినాదమకరందనిర్భరమ్
ముకురాయమాణమృదుగండమండలం
ముఖపంకజం మనసి మే విజృంభతామ్
సర్వలోకనాధుడైన ఆ గోపాలకృష్ణుని ముఖం పద్మంలాగా అందంగా ఉండి చూసేవారికి ఆనందం కలిగిస్తున్నది. మధురమైన మురళీరవమనే తేనె ఆ పద్మాలలో నిండిఉంది. తామరమొగ్గలవంటి రెండు కళ్ళూ, అద్దాలవంటి మృదువైన చెక్కిళ్ళూ, ఆ బాలకృష్ణుని ముఖపద్మంలో ప్రకాశిస్తున్నాయి. అటువంటి బాలకృష్ణుని అందమైన ముఖం ఎల్లప్పుడూ నా మనస్సులో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను.
శ్లోకం
కమనీయకిశోరముగ్ధమూర్తేః
కలవేణుక్వణితాదృతాననేందోః
మమ వాచి విజృంభతాం మురారే
ర్మధురిమ్ణః కణికాపి కాపి కాపి.
నందగోకులంలోని బాలకృష్ణుడు సాక్షాత్తూ మురాసురుని సంహరించిన శ్రీమన్నారాయణుడే. అమాయకంగా కనిపించే ఆ బాలకృష్ణుని సుందరవదనం చంద్రునిలాగా మనోహరంగా ఉండి చూసే వాళ్లకి మళ్ళీ మళ్ళీ చూడాలని కోర్కె కలిగిస్తున్నది. అవ్యక్తమదురమైన వేణునాదాన్ని వెలువరించే ఆ చిన్నికృష్ణుడిని అందరూ ఆదరిస్తారు.
మాధుర్యమూర్తి అయిన ఆ బాలకృష్ణుని కమ్మదనంలో అణువంతైనా నా ఈ స్తుతి కావ్యం లోకి ప్రసరిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. .
శ్లోకం
మదశిఖండి శిఖండ విభూషణం
మదన మంథరముగ్ధ ముఖామ్బుజమ్
వ్రజవధూ నయనాంజన రంజితం
విజయతాం మమ వాంగ్మయ జీవితమ్
నేను రచిస్తున్న శ్రీకృష్ణ కర్ణామృతం అనే ఈ కావ్యానికి శ్రీకృష్ణ భగవానుడే మూలము. నెమలిపింఛం శిరోలంకారంగా ఉన్న ఆ శ్రీకృష్ణుడే ఈ కావ్యానికి ఆత్మ గా ప్రకాశిస్తాడు. ఆయన ముఖం శృంగారభావనలతో పద్మంలాగా సుందరంగా ఉంటుంది. రేపల్లెలోని సుందరీమణుల కళ్ళలోని కాటుక ఆయన శరీరానికి అంటుకుని శోభనిస్తున్నది. అటువంటి శ్రీకృష్ణభగవానుడి తత్వము నా కావ్యంలో విశిష్టరూపంతో ప్రకాశించాలని కోరుకుంటున్నాను.