పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : తొలి పలుకు

తొలిపలుకు

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

బమ్మెరపోతన వ్రాసిన శ్రీ మహాభాగవతం తెలుగు వారి దైనందిన జీవనంతో పెనవేసుకొనిపోయిన కావ్యం. నిరీహుడై, నిస్సంగుడై భక్తిభావముతో రామునికోసం కావ్యరచన చేసిన ఆ మహానీయుడు పడుపుకూటిని ఆశించక అభిమానంతో రాచరికాన్ని ఎదురించి నిరాడంబరుడై జీవయాత్రను సాగించినాడు. తాను నమ్మినది అనగలిగిన ధైర్యశాలి అతడు. ఒకరి మెప్పుకోసం కావ్యం వ్రాసినవాడు కాడతడు. భగవంతుని నమ్మి ఆయన మహిమలను మధురనాదాలతో రమణీయ అర్థాలతో, సుందరమైన భాషలో మహాకావ్యంగా మలచి మనకు అందించినాడు. పోతన భాగవతంతో పరిచయం అందమైన తెలుగు భాషతో పరిచయం.

బమ్మెరపోతన పంచశతి జయంతి ఉత్సవ సందర్భంగా సాహిత్య అకాడమీ, ఆయన భాగవతాన్ని పరిశీలించి వ్రాసిన వ్యాసాలను కొన్నింటిని ఎంపికచేసి సంకలనంగా ప్రచురించాలని నిశ్చయించింది. పలు దృక్కోణాలతో వీరి సాహిత్యాన్ని ఈ వ్యాసాలలో విద్వాంసులు పర్యాలోచన చేసినారు. వీనిలో కొన్ని వ్యాసాలు ఇంతవరకు వివిధ పత్రికలలో పుస్తకాలలో ప్రచురించబడ్డాయి. అయితే వాటిలో పోతన కావ్య పరిచయాన్ని సామాన్యులకూ, పండితులకూ కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసాల ఎంపిక జరిగింది.

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ) గారి సంపాదకత్వంలో ఈ వ్యాస కదంబం వెలువడుతున్నది. శ్రీ శాస్త్రిగారు ఉత్తమకవులు, సహృదయమనస్కులు. వ్యాసాలను ఎన్నుకొనడంలో ఆయన తమ ప్రతిభా పాండిత్యాలను సర్వత్రా వినియోగించుకొని ఈ సంపుటిని విద్వాంసులకూ, విమర్శకులకూ, సామాన్యులకూ, ప్రయోజనకరంగా తీర్చిదిద్దినారు. పోతనగారి కవితా శక్తికి ప్రతీకలుగా ఉన్న చక్కని పద్యాలనుకూడా ఈ సంకలనంలో అక్కడక్కడా చేర్చి ఈ ”పోతన వైజయంతిక”ను వెలువరించినారు.

ఈ సంపుటిలోని వ్యాసాలను రచించిన మనీషులకు మా కృతజ్ఞతలు. మా సాహిత్య అకాడమీ కోరికమేరకు ఈ వ్యాస సంకలనాన్ని ఏర్చికూర్చి మాకు సహకరించిన శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారికి మా ధన్యవాదాలు, అభివందనాలు.

హైదరాబాదు
1983.
ఇరివెంటి కృష్ణమూర్తి
కార్యదర్శి
ఆంధ్రసాహిత్య అకాడమీ.