పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : సహృదయులకు స్వాగతం

సహృదయులకు స్వాగతం

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

గుడులుకట్టించె కంచర్ల గోపరాజు
రాగములుకూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతిచెప్పె బమ్మెర పోతరాజు
రాజులీమువ్వురును భక్తిరాజ్యమునకు”

అన్నట్లు గోపన్న కొండల్లో బండల్లో రాముడికి గుళ్లు కట్టిస్తే - పోతన తెలుగుగుండెల్లో కృష్ణుడి గుళ్లు కట్టించాడు.
త్యాగరాజు తన తంబురా తీగలమీద ”రఘుకుల తిలకుణ్ణి” ఊరేగిస్తే - పోతరాజు తన ”బాల రసాలసాల” మృదుపల్లవ “శయ్యలమీద” యదుకుల తిలకుణ్ణి ”ఉయ్యాలలూగించాడు”.
రాజుకాని రాజు - రాజ్యంలేని రాజు - రాజభోగాలు ఆశించని కవిరాజు - ఆడంబరాలకూ, అహంకారాలకూ త్రోసిరాజు - మన బమ్మెర పోతరాజు.
భాగవతాన్ని భూమిలో పూడ్చి పెట్టినా ”బాలరసాలసాల” యై పైకిలేచింది. పోతన్న భాగవతం ఎప్పుడు చూచినా - ”అప్పుడు తీసిన వెన్న”. అందుకే దాన్ని వదలిపోలేడు చిన్నికిష్టన్న.
బమ్మెరవారి పద్యాలు –

పాలుతాగిన లేగ దూడల్లాగా పరుగులు తీస్తాయి.
వెన్నెల్లో ఆడుకునే కన్నెపిల్లల్లాగా గంతులు వేస్తాయి.
లలితరసాల పల్లవాల్లాగా మెత్తమెత్తగా చిత్తానికి హత్తుకుంటాయి.
నిర్మల మందాకినీ వీచికలై - జలజల ప్రవహిస్తాయి.
మందార మకరందాలై - చవులూరిస్తాయి.

”అమ్మా! ఏదయినా పద్యం చెప్పమ్మా” అంటే - “అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ...” అంటూ మొదలు పెడుతుంది బంగారుతల్లి.
”అన్నా! ఏదన్నా మంచి పద్యం చెప్పరా” అంటే - “సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడు....” అంటూ ప్రారంభిస్తాడు మహా పండితుడులాగా.
”నాన్నగారూ! మీరేమయినా చదవండి” అంటే చాలు - ”నల్లనివాడు పద్మనయంబులవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు......” అని సాగిస్తాడు ఆయనగారు.
“తాతయ్యా! నా కేదయినా పద్యం నేర్పవూ” అనటమే ఆలస్యం - ”చేతు లారంగ శివుని పూజింపడేని, నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని......” అని చేతులు తిప్పుతాడు పాపం.
“అక్కయ్యా! నువ్వేదయినా ఒక చక్కని పద్యం పాడవే” అనగానే - ”మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే మదనములకు......” అని పాటకచ్చేరీ ప్రారంభమౌతుంది.
అమ్మమ్మ దగ్గరకెళ్లి ”నీ కేమయినా పద్యాలు వచ్చునా” అంటే ”రాకేం నాయనా! విను” అని ”ఓయమ్మ నీకుమారుడు మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా......” అంటూ కూనిరాగాలు సాగతీస్తుంది.
”చెల్లీ! నీకు వచ్చిన ఒక చిన్ని పద్యం వినిపించమ్మా” అంటే - ”పెద్దదే వచ్చు” అని - ”తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేత బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి......” అంటూ గుక్కపడుతుంది.
”ఒరే తమ్ముడూ! ఏదీ ఒక కమ్మని పద్యం......” అంటూండగానే వాడు గొంతెత్తి ”బాలరసాలసాల నవపల్లవ కోమల...” అని గడగడ అప్పజెబుతాడు తడబడకుండా.
అయ్యవారిని కదిలిస్తే - “అలవైకుంఠపురంబులో నగరిలో......”
పిల్లవాణ్ణి కదిలిస్తే – “ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు......”
ఏమిటీ ఇంద్రజాలం! ఇల్లంతా భాగవతమే! ఇంటింటా భాగోతమే! ఏమిటీ విశేషం! “ఇందుగలడందులేడని సందేహము వలదు” అన్నట్లు సర్వత్రా పోతన్నగారే - ఇళ్ళల్లో - గుళ్ళల్లో - బళల్లో - అంతటా బమ్మెరవారి కమ్మతెమ్మెరలే! ఏమిటో ఈ చిత్రం - కలయో! వైష్ణవమాయమో......
పోతన్నగారు మనలో ఎంతగా కలిసిపోయారు! మనసులో, మాటలో, పాటలో, పద్యంలో, నుడికారాలలో, ఆచారాలలో, వెలుగులా. వెన్నెలలా. మలయమారుతంలా కలసిపోయారు. తెలుగువారి నిత్యజీవితాలలో, నిండుగుండెలలో, ఉచ్ఛ్వాసనిశ్వాసాలలో ఆయన నిండి ఉన్నాడు. కూర్చుండి ఉన్నాడు.
ఉదయభానుని కిరణాలలో - యదుకిశోరుని మృదుచరణాలలో, చల్లలమ్మే గొల్లభామల్లో - విల్లుపట్టిన సత్యభామల్లో, కుచేలుని అటుకుల్లో – కనక చేలుని కిటుకుల్లో, వల్లవాంగనల వలపుల్లో - పిల్లనగ్రోవి పిలుపుల్లో ఆయన కనిపిస్తాడు, వినిపిస్తాడు, ”ఆహా” అనిపిస్తాడు.
కదలే హలాలలో - కదంతొక్కే కలాలలో - పండివంగిన పొలాలలో - ప్రవహించే జలాలలో – పల్లెసీమలో - చందమామలో - పారిజాత పుప్వుల్లో - పసిపాపల నవ్వుల్లో - నాగలి చాళ్లలో - విరహిణి కన్నీళ్లలో సహజ పాండిత్యుని, మహనీయమూర్తి కన్నుల విందు చేస్తుంటుంది. ఆయన కవిత్వ మహత్వం అంతటిది. ఆయన భాగవత ప్రభావం అటువంటిది. ఆయన పురాకృతసుకృతం అంత గొప్పది.
భాగవతం విప్పితే చాలు - పుటలు తిప్పితే చాలు –
“నీకున్ మొక్కెద త్రుంపవే భవలతల్
నిత్యానుకంపానిధీ” అంటూనో –
”రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!” - అంటూనో.
”ఒక సూర్యుండు సమస్తజీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక” అంటూనో.
“కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ” అంటూనో –
”తృప్తింబొందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కబడునే!” అంటూనో –
“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో” అనుకుంటూనో –
”కారేరాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరీ?” అంటూనో –
”వీరెవ్వరు శ్రీ కృష్ణులు గారా! ఎన్నడును వెన్నగాన రటగదా” అంటూనో –
“నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును తాపసమందార! నాకు దయసేయగదే!” అంటూనో -
“అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి తావుమన్న! రమ్మన్న!” అంటూనో –
”వనితా! ఏమి తపంబు చేసె నొకో ఈ వంశంబు వంశంబులోన్” అంటూనో –
కుంతీదేవిగా, గజేంద్రుడుగా, ఆచార్య భీష్ముడుగా, ప్రహ్లాదుడుగా, వామనమూర్తిగా, రుక్మిణీకన్యగా, బలిచక్రవర్తిగా, యశోదమ్మగా, మాలాకారుడు సుదాముడుగా, రంతిదేవుడుగా, వ్రేపల్లె గోపికగా వేషాలు మార్చి, గొంతులు మార్చి పోతన్నగారు మనకు దర్శనమిస్తూనే ఉంటారు. భాగవత పాత్రలతో ఆయన తాదాత్మ్య మటువంటిది.. –
సహజ పాండిత్యులవారి సహజసుందర శయ్యా సౌభాగ్యంతో ఉయ్యాలలూగే ఈ తియ్యని పద్యాల ఒయ్యారం గమనించండి -

పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్
జంద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుడి
ప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకుఁ, గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే 
యించెన్ మూడు తురంగ మేథములు దేవేంద్రప్రభావంబునన్.

రాజఁట ధర్మజుండు! సురరాజ సుతుండట ధన్వి! శాత్రవో 
ద్వేకమైన గాండివము విల్లఁట! సారథి సర్వభద్ర సం 
యోకుఁడైన చక్రియట! యుగ్రగధాధరుఁడైన భీముఁ డ
య్యాజికిఁ దోడు వచ్చునట! యాపద గల్గు టిదేమి చోద్యమో! - - -

రాజఁట ధర్మజుండు! సురరాజ సుతుండట ధన్వి! శాత్రవో 
ద్వేకమైన గాండివము విల్లఁట! సారథి సర్వభద్ర సం 
యోకుఁడైన చక్రియట! యుగ్రగధాధరుఁడైన భీముఁ డ
య్యాజికిఁ దోడు వచ్చునట! యాపద గల్గు టిదేమి చోద్యమో

మృదుమధుర పదబంధాలతో ముద్దులు మూటగడుతూ దిద్దితీర్చినట్లున్న ఈ అందాల కందాలను సందర్శించండి – శ్రీశుకుడు పరీక్షిత్తుతో అంటాడు.

చిత్రంబులు త్రైలోక్య ప 
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన 
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.

శౌనకాదిమహర్షులు సూతమహర్షితో అంటారు –

పానములు దురిత లతా 
లానములు నిత్యమంగప్రాభవ సం 
జీనములు లక్ష్మీ సం 
భానములు వాసుదేవ ద సేవనముల్. 

కన్న తండ్రి హిరణ్యకశిపుడు చిన్నికొడుకు ప్రహ్లాదునితో అంటాడు –

నుదిన సంతోషణములు 
నితశ్రమ తాపదుఃఖ సంశోషణముల్ 
యుల సంభాషణములు 
కులకును కర్ణయుగళ ద్భూషణముల్. 

వామనమూర్తి బలిచక్రవర్తిని ప్రశంసిస్తూ అంటున్నాడు –

నుదిన సంతోషణములు 
నితశ్రమ తాపదుఃఖ సంశోషణముల్ 
యుల సంభాషణములు 
కులకును కర్ణయుగళ ద్భూషణముల్.

బమ్మెరవారి కవిత్వం ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకోటానికి సహజసుకుమారమైన ఆయన సంభాషణాత్మకశైలి కారణం. విదురుడు పాండవుల పంచలో పడివున్న ధృతరాష్ట్రనితో అంటున్నాడు –

పుట్టందుండవు! పెద్దవాడవు! మహాభోగంబులా లేవు; నీ 
ట్టెల్లెం జెడిపోయె; దుస్సహ జరాభారంబు పైఁ గప్పె నీ 
చుట్టా లెల్లను బోయి; రాలు మగఁడున్, శోకంబునన్. మగ్నులై 
ట్టా! దాయల పంచనుండఁదగవే! కౌరవ్యవంశాగ్రణీ! 

బిడ్డలకు బుద్ధి సెప్పని 
గ్రుడ్డికిఁ బిండఁబిదె వండికొనిపొండిదె పై 
డ్డాఁ డని భీముం డొర 
గొడ్డఘు లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా!

హిరణ్యకశిపుడు. కొడుకును లాలిస్తూ అడుగుతున్నాడు –

నిన్నున్ మెచ్చరు నీతి పాఠ్యమహిమన్ నీ తోడి దైత్యార్భకుల్ 
న్నారన్నియుఁ జెప్పనేర్తురుగదా గ్రంథార్థముల్ దక్షులై; 
న్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌదంచున్ మహావాంఛతో 
నున్నాడన్ ననుఁగన్నతండ్రి! భవదీయోత్కర్షమున్ జూపవే!

చోద్యం బయ్యెడి నింతకాలమరిగెన్; శోధించి యేమేమి సం 
వేద్యాంశంబులు చెప్పిరో గురువు లేవెంటం బఠింపించిరో; 
విద్యాసార మెఱుంగఁ గోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులోఁ 
ద్యమ్మొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా!

ద్రౌపది పుత్రఘాతియైన అశ్వత్థామతో అంటున్నది. -

భూసురుఁడవు! బుద్ధిదయా 
భాసురుఁడవు! శుద్ద వీరట సందోహా 
గ్రేరుఁడవు! శిశుమారణ 
మాసురకృత్యంబు ధర్మగునే తండ్రీ!

ద్రేకంబున రారు! శస్త్రధరులై యుద్దావనిన్ లేరు! కిం 
చిద్రోహంబును నీకుఁ జేయరు! బలోత్సేకంబుతోఁ జీఁకటిన్ 
ద్రాకారులఁ బిన్న పాపల రణప్రౌఢక్రియాహీనులన్ 
నిద్రాసక్తుల సంహరింపనకటా! నీచేతు లెట్లాడెనో!

“అసురేంద్రుండు పదత్రయం బడుగ నీయల్పంబు నీ నేర్చునే!” అన్న బలితో వామనుడు -

గొడుగో! జన్నిదమో! కమండలువొ! నాకున్ ముంజియో! దండమో! 
డు గేనెక్కడ! భూములెక్కడ! కరుల్ వామాక్షు లశ్వంబు లె
క్కడ! నిత్యోచితకర్మమెక్కడ! మదాకాంక్షామితంబైన మూఁ 
డుగుల్ మేరయ తోవ కిచ్చుటది! బ్రహ్మాండంబు నా పాలికిన్. 

తన సందేశాన్ని నందనందనునికి అందించి ఆయనను కొనివచ్చిన అగ్ని ద్యోతనునితో రుక్మిణి తన కృతజ్ఞత ప్రకటిస్తూ పలుకుతుంది

జాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముంజెప్పి; నన్ 
నిలువంబెట్టితి; నీకృపన్ బ్రతికితిన్; నీయంత పుణ్యాత్మకుల్
రే? దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింపగానేర, నం 
లిఁ గావించెద భూసురాన్వయమణీ! ద్బంధుచింతామణీ!

పోతన చిరంజీవి. ఆయన భాగవతం మృత్యుంజయం. తెలుగువారు అదృష్టవంతులు.
ఆయిదువందల వసంతాలు గడచిపోయినా బమ్మెరవారి భాగవత బాలరసాల నవపల్లవాలు వసివాడలేదు. కసుగందలేదు. భాగవతంకోసమే పోతన్న గారు పుట్టారు: పోతన్నగారి కోసమే పూర్వకవులెవ్వరూ ముట్టుకొనకుండా భాగవతాన్ని యట్టిపెట్టారు.
తనకు వ్యాసులవారి భాగవతం ప్రాప్తించటం తన పురాకృత సుకృత విశేషం అన్నారు పోతన్నగారు; మనకు పోతన్నగారి భాగవతం లభించటం మన జన్మజన్మాల పుణ్యవిశేషం.
ఏవంవిధమైన బమ్మెరపోతన్నగారి భాగవతాన్ని ప్రశంసిస్తూ ప్రముఖులు వ్రాసిన వ్యాసాలన్నిటినీ ఒక సంపుటంగా ఏర్చికూర్చే సదవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తిగారు నాకు కలిగించారు. నా శక్తికొలదీ ప్రయత్నించి ఈవిధంగా ఈ సారస్వత సంపుటాన్ని సంసిద్ధం చేశాను.
ఈ సందర్భంలో తమ గ్రంథాలయాలలోని ఆంధ్రసాహిత్య పరిషత్తు పత్రికలనూ, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలనూ, భారతి, పరిశోధన, ఆంధ్రజ్యోతి, తెలుగువాణి, తెలుగు విద్యార్ధి ఇత్యాది పత్రికలనూ అందించి నాకు సహకరించినందుకు రాజమండ్రి ”గౌతమీ గ్రంథాలయం” అధినేతలకూ, వేటపాలెం సారస్వతకేతనం అధినేతలకూ నా సాధువాదాలు..
సారవంతాలయిన తమ వ్యాసాలతో ఈ సారస్వత సంపుటానికి సొంపు సంపాదించిపెట్టిన వ్యాసరచయితలందరికీ నా అభివాదాలు.
ఈ సత్కార్యానికి నన్ను ప్రోత్సహించిన సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికీ, కార్యదర్శి ఇరివెంటి కృష్ణమూర్తిగారికి నా ధన్యవాదాలు.
ఈ సారస్వత వ్యాస సంపుటికి ”భాగవత వైజయంతిక” అని పేరు పెట్టటం జరిగింది. విజయపతాకను ”వైజయంతి” అంటారు. విష్ణుమూర్తి మెడలోని విరిదండనూ ”వైజయంతి” అనే అంటారు. త్రిలోకాధినాథుడైన దేవేంద్రుని సౌధాన్నికూడా ”వైజయంతి” అని పిలుస్తారు.
పోతనకవీంద్రుని కవితా సామ్రాజ్యానికి ఎత్తిన జయపతాక కనుక ఇది “భాగవత వైజయంతిక.”
భక్తిసుగంధాలు విరజిమ్మే సూక్తి సుమనస్సులతో కూర్చిన మాల కనుక ఇది ”భాగవత వైజయంతిక”.
ఎందరెందరో కవి పండితుల సహకారంతో స్వరూపం ధరించిన సహజ పాండిత్యుని పోతన కవీంద్రుని యశస్సౌధం కనుక ఇది ”భాగవత వైజయంతిక”.
రండి! దయచేయండి! మా స్వాగతం అందుకోండి! ఈ భాగవత వైజయంతిక లో ప్రవేశించండి. ఎందరో కవులు, పండితులు, కళా ప్రపూర్ణులు, విమర్శకులు ఏకత్ర సమావేశమై సాహిత్య గోష్టి జరుపుతున్నారు.
కొందరు పోతన్న గారి జన్మస్థలాన్నీ కాలాన్నీ కృతులనూ సమీక్షిస్తుంటే కొందరు ఆయనగారి భాగవత వైశిష్ట్యాన్ని ఉగ్గడిస్తున్నారు.
కొందరు సహజ పాండిత్యుల శయ్యాసౌభాగ్యాన్ని వెల్లడిస్తుంటే కొందరు ఆయన అనల్ప కవితాశిల్పాన్ని గొంతెత్తి చాటుతున్నారు.
కొందరు పోతన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తుంటే కొందరు ఆయనగారి భక్తిసామ్రాజ్య వైభవాన్ని ప్రస్తుతిస్తున్నారు.
కొందరు పోతరాజుగారి లోకజ్ఞతకు అద్దంపడుతుంటే కొందరు బమ్మెర వారి కమ్మతెమ్మెరలకు గవాక్షాలు తెరుస్తున్నారు.
కొందరు ఇతర మహాకవులతో పోతన్న గారిని పోల్చి చూస్తుంటే కొందరు ఆయన సజీవ పాత్ర చిత్రణాన్ని కొనియాడుతున్నారు.
కొందరు బమ్మెరవారి బాలకృష్ణులై అభినయిస్తుంటే కొందరు ఆయన కవిత్వ పటుత్వాన్ని పరామర్శిస్తున్నారు.
కొందరు పోతనగారి కవితోన్మీలనాన్ని అభినందిస్తుంటే కొందరు ఆయన శృంగార రసపోషణాన్ని విశ్లేషిస్తున్నారు.
కొందరు పోతరాజుగారి వ్యాజస్తుతినీ వ్యంగ్యవైభవాన్నీ వివరిస్తుంటే కొందరు ఆయన స్త్రీ పాత్రలను చిత్రీకరిస్తున్నారు.
కొందరు ఆంధ్ర మహాభాగవతంలోని రసానుభూతిని. ప్రస్తరిస్తుంటే కొందరు సహజ పాండిత్యులవారి సరదాలను ప్రకటిస్తున్నారు.
కొందరు ఆంధ్ర మహాభాగవతకర్త అనువాద వైఖరిని విశదీకరిస్తుంటే కొందరు ఆ మహాకవి కథాకథనశిల్పాన్ని ప్రశంసిస్తున్నారు.
కొందరు పోతనామాత్యుని అభేదదృష్టిని అభివర్ణించి పాఠపరిశీలనానికి ఉపక్రమిస్తే కొందరు పోతనగారి తాత్విక చింతను పేర్కొన్నారు.
కొందరు పోతన కవీంద్రుని సామాజిక భక్తిని నిరూపించితే కొందరు మహాకవి పోతనను మన కనులముందు సాక్షాత్కరింపజేశారు.
కొందరు పోతన స్వప్నచర్చను చేస్తే కొందరు పోతన పద్యాలను పర్యాలోకనం చేశారు.
ఎందరో మహానుభావులు ఈ విధంగా పుష్పాంజలులూ కవితాంజలులూ మౌక్తికమాలలూ సహజ పాండిత్యులకు సమర్పించుతున్నారు. ఈ వైజయంతికను విజయవంతం చెయ్యటానికి సహృదయులందరికీ హృదయపూర్వక స్వాగతం.
సంపాదకుడు.